ప్రతి అర ఘడియకూ ఎవరో ఒకరు వేగం వచ్చి ప్రధాన వేగుకు సమాచారం అందించి వెళుతున్నారు. అతడు సహాయ మంత్రికి విషయం విన్నవించుకుంటున్నాడు. అతడు మంత్రికి ఆ మంత్రి శిరః ప్రధానికీ వర్తమానం తెలియజేస్తున్నారు. ఆయన ఘడియ ఘడియకూ మహారాజుకు నివేదిస్తున్నాడు.
రాజర్షి అయిన జనకుడు వ్యగ్రత చెందకుండా స్థిర చిత్తంతో శాంత భావంతో వింటూ తలూపి తిరిగి నిరీక్షిస్తున్నాడు.
మిథిలా నగర పొలిమేరకు రానే వచ్చాడు. యింతటి నిరీక్షణకూ కారణభూతుడైన ఆ మహర్షి. ఆయన రాక అంచెలంచెలుగా జనకుడికి క్షణాలమీద నివేదించబడింది. వెంటనే కదిలాడు జనకుడు.
ఆయన వెంట మంత్రి, పురోహిత, సేనానాయక, దండనాధ, పుర ప్రముఖులు, మహా రాణీ, దాస దాసీ జనం అంతా కదిలారు. నగరికి నగరే కదిలి వచ్చినట్లయింది.
మహా రాజోచితమైన ఆ స్వాగతానికి ఆ మహర్షి ఎంతో సంతోషించాడు. పాద్యం సమర్పించాడు.
జనక రాజర్షి అర్ఘ్యం అందించాడు. ఆ పైన తడిసిన ఆ మహర్షి పాదాలను తన ఉత్తరీయంతో అద్దాడు జనక రాజర్షి. ఈ సేవలతో ఆ మహర్షి మరీ సంతోషించాడు.
'బ్రహ్మర్షీ! తమరు వస్తున్నట్లుగా తమ శిష్యులు నివేదించిన క్షణం నుంచీ తమ రాక కోసం తనవంతు కనులు చేసుకుని నిరీక్షిస్తున్నాము. తమరు మా పొలిమేరలోకి రాగానే యదార్ధమైన స్వాగతం సమర్పించుకోవాలన్నది నా కోరిక! అలాగే తమరిని యధావిధిగా ఆర్చించి ఆహ్వానం పలుకుతున్నాం. తమరి రాకతో మా మిధిలా నగరమే తరించింది. మా జన్మ తమ పాదదర్శనం తోనే ధన్యమైంది' అన్నాడు జనకుడు.
'రాజర్షి సత్తమా!' నిండు గుండెతో పిలిచాడు ఆ మహర్షి. 'ఇది వినయానికే వినయం నేర్పించే తమ వినమ్ర వచనం. అంతేగానీ ఈ అజనాభదేశంలో, రాజ లోకంలో నీ వంటి నిర్మల జీవనుడు లేడు. మహర్షి లోకంలో నీవంటి మహిమాన్వితులు అరుదు! అందుకే నీవు రాజర్షివయ్యావు! ప్రజా పాలన కేవలం ప్రజాసేవకే తప్ప, ప్రజల చేత సేవలందడానికి కాదు. రాజరికంతో వచ్చే అట్టహాసాలతో- ఆడంబరాలతో, డాంబికాలతో, మిధ్యా గౌరవాలతో జీవించడమూ కాదు అని విశ్వసించే ప్రజా పాలకుడివి నువ్వు! నువ్వు ఆదర్శమూర్తివి! నీ ఆతిథ్యం పొందడం మా అదృష్టం' అన్నాడు.
జనకుడు అంజలి ఘంటించాడు.
'మౌని కులాలంకారా! మహానుభావా! గాధినందనా! తమ వచనం తమకు మాపై గల అవ్యాజాను రాగాలకు గుర్తు! తమ చిత్తం మా భాగ్యోదయం. అర్ధించినా ఎవరి అంతఃపురంలోనూ అడుగిడని తమరు తమకై తాము దయచేయడం, ఈ జనకుడి జీవితంలో ఏదో మహత్తర శుభ సూచకంగా భావిస్తున్నాను. తమరు మా అంతఃపురానికి దయచేయవలసిందిగా, మేం యధావిధిగా చేసే సేవలు స్వీకరించవలసిందిగా అభ్యర్ధిస్తున్నాం'.
విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. జనకుడు దారితీయగా ఆయన వెంట విశ్వామిత్రుడు కదిలాడు. వారిని అనుసరించి మంత్రులూ, పురోహితులూ, దండనాధులూ నడిచారు.
విశ్వామిత్రుడు అంతఃపురం ప్రవేశించాడు. జనకుడు విశ్వామిత్రుడు ఇద్దరే నిలిచారు. అందరూ వెలుపలికి వెళ్ళిపోయారు.
'జనక రాజర్షీ! లోక కంటకుడైన రావణాసురుడి బాధల నుండి సమస్త మానవాళిని, దేవతలనూ రక్షించడానికి దశ కంఠుడిని శిక్షించడానికి శ్రీమన్నారాయణుడు అయోధ్యా నగరిలో అవతరించనున్న విషయం అన్ని లోకాల్లోనూ తెలిసిన విషయమే!
దశరధుడితో ఋష్యశృంగమహర్షి త్వరలోనే పుత్రకామేష్టి చేయిస్తున్నాడు. ఆ యాగంతో తృప్తి చెందిన దేవతలు స్వాహవధూవల్లభుడి ద్వారా యాగ ఫలాన్ని అందించనున్నారు. తత్ఫలితంగా శ్రీమన్నారాయణమూర్తి అయోధ్యలో నరుడిగా జన్మిస్తాడు'.
విశ్వామిత్రుడి మాటలు విని, మంత్రం విన్నవాడిలా తలూపాడు జనకుడు. ఈ విషయం తనకూ తెలిసిందన్న సూచనగా ఆయన తలూపగానే విశ్వామిత్రమహర్షి మళ్ళీ అన్నాడు.
గత యుగాల్లో, కాలాల్లో శ్రీమహావిష్ణువు ఎన్నో అవతారాలు ధరించాడు. వాటికీ, ఈనాటి అవతారానికీ ఎంతో వ్యత్యాసం ఉంది. శ్రీమన్నారాయణుడు నరుడిగా జన్మించి ఒక ఆదర్శ మానవుడిగా జీవించనున్నాడు.
మరి అన్ని సంవత్సరాలు శ్రీమహాలక్ష్మి స్వామివారి వియోగాన్ని భరిస్తూ వైకుంఠంలో ఉండగలదా. ఊహూ! అందుకే ఆమె భూలోకంలో మానవ కాంతగా జన్మించనున్నది. కానీ ఆ తల్లి గర్భావాస క్లేశం అనుభవించరాదు. అందుకే అయోనిజగా అవతరించనున్నది!
జనకుడు ఉత్కంఠతో వినసాగాడు.
అయోధ్యాధీశుడితో వియ్యమందదగిన రాజ వంశంలో ఆ తల్లి వెలుస్తుంది. వియ్యానికయినా, కయ్యానికయినా సమాన స్థాయి కావాలి కదా!'
శిరస్సు ఊపాడు జనకుడు.
బ్రహ్మర్షి విశ్వామిత్రుడంతటి వాడు విషయాన్ని వివరిస్తూ ఉంటే మధ్యలో మాటలు కలపడం జనకుడి లాంటి రాజర్షికైనా తగదు కదా!
'రఘువంశం పునీతం కాబోతున్నది. పుత్రులు లేరు లేరని వగచిన దశరధుడికి కోరిక కూడా తీరబోతున్నది. మానవజన్మ ఎత్తనున్న శ్రీమహావిష్ణువు అందరు మానవుల లాగానే పెళ్ళి, సంసారం, సంతానం అనే అనేక బాంధవ్యాలకు బందీ కానున్నాడు. ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేయతగిన భాగ్యశాలి ఎవరా అన్నది సమస్త లోకాల్లోనూ చర్చనీయాంశమయింది'.
విశ్వామిత్రుడు చెపుతున్న మాటలు వింటున్నాడు జనకుడు.
'నేను గాయత్రిని దర్శించిన ఋషిననీ మీకు తెలుసు. ఆ తల్లి దయవలన నాకు ఆ వంశమేదో! ఆ పునీత రాజ్యమేదో తెలిసింది!' అన్నాడు విశ్వామిత్రుడు చిరునవ్వుతో.