మనుష్యులలో పరివర్తన రావాలిగాని ఈ చట్టాలు ఏం చేస్తాయి. ప్రతీదీ యెవరో చెయ్యాలి, యే ప్రభుత్వమో చెప్పాలి అనుకుంటూ కూర్చోకుండా మానని మనమే బాగుచేసుకోవాలి. మనబతుకు మనం చక్కదిద్దుకోవాలి. నీ కాపురం నీవు చక్కదిద్దుకోవాలి. దానికి సామ దాన బేధ దండోపాయాలు ఉపయోగించాలి. సత్యంగా పని సానుకూలపడితే సంతోషమే. లేనపుడు భార్య అయినంత మాత్రాన బానిసలా పడివుండదు - వుండనక్కర లేదన్న పాఠం నీ భర్తలాంటి వాళ్ళకి నేర్పాలి.
భార్యని హింసించే హక్కులేదు తమకి. అలా హింసిస్తే సహిస్తూ పడివుండే రోజులు పోయాయని అలాంటి మగవాళ్ళకి తెలియచెప్పాలి నీలాంటివాళ్ళు.
శారద అంగీకార సూచకంగా తల ఆడించింది.
విజయ భోజనం పూర్తిచేసి చేయి కడుక్కు వచ్చింది. ఈజీ చెయిరులో అలసటగా వ్రాలింది.
"ఒక్క సందేహం మిగిలిపోయింది యింకా." శారద నవ్వుతూ అంది.
"చంపావు ఇంకా ఏం మిగిలింది? నన్ను పడుకోనీయవా" విజయ కళ్ళు విప్పి నవ్వుతూ అంది.
"ప్రకాష్ గారి సంగతి మీరేం చెప్పలేదు. తరువాత ఏమయ్యారు ఆయన!" శారద కుతూహలంగా అడిగింది.
"అవునవును. ప్రకాష్ కేం నిక్షేపంలా వున్నాడు. అయితే ఈసారి రివర్స్ గేమ్ ఆడుతున్నాడు. అర్ధంకాలేదా. మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడులే. పిల్లనిచ్చేవాళ్ళు లేక, ప్రతీ వాళ్ళు మొదటి భార్య ఎందుకు వెళ్ళిపోయిందని అని అడిగి మానుకున్నారు. ఆఖరికి ఓ తలమాసినవాడు పిల్లనిచ్చి తల కడుక్కున్నాడు. లేనింటి పిల్లఅయి తేనేం మొగుడ్ని ఎలా కంట్రోలులో పెట్టిందోగాని కొంగున ముడేసుకుంది. ఇప్పుడామె కూర్చోమంటే కూర్చుంటాడుట. నించోమంటే నించునే స్థితికి దిగజారాడట.
ఆమధ్య మా అత్తగారు బాధపడ్తూ చెప్పారు. అలాంటి మగవాళ్ళందరూ ఆఖరికి అలాగే తయారవుతారులే. ఆ పెళ్ళాంకూడా పోతుందేమోనని భయం అనుకుంటా.
"ఏం యింకేం సందేహాలు లేనట్టేనా?" విజయ నవ్వి కళ్ళు మూసుకుంది.
* * *
ఉదయమే ఊరినుంచి వచ్చిన శివరామ్ గుమ్మానికి తాళం ప్రత్యక్షమవడంతో ఆశ్చర్యపోయాడు. ఇంత పొద్దునే శారద ఏమయినట్టు? ఎక్కడకి వెళ్ళింది? ఆలోచన తోచక మామూలుగా ఏ బజారుకన్నా వెడితే శారద పక్కింట్లో తాళం యివ్వడం గుర్తువచ్చి పక్కింటికి వెళ్ళాడు.
పక్కింటాయన కాఫీ తాగుతూ పేపరు చదువుతున్న వాడల్లా శివరామ్ ని చూసి "ఓహో, వచ్చారా...." అన్నాడు.
"శారద తాళం మీ కిచ్చిందాండీ. యింత పొద్దునే ఎక్కడికి వెళ్ళింది." అన్నాడు.
ఆయన ఒకసారి కళ్ళజోడులోంచి శివరామ్ ని పరికిస్తూ "తాళం ఇచ్చింది అమ్మాయి. కాని ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మూడురోజులక్రితం తాళం ఇచ్చి వెళ్ళింది. బహుశా వూరు వెళ్ళినట్లుంది" అన్నాడు ఆయన అదోలా.
శివరామ్ ఆశ్చర్యపోయి "ఊరు వెళ్ళిందా? ఎక్కడకి?-అన్నాడు.
"తెలియదు. చూడండి మిస్టర్ శివరామ్. ఒకమాట చెపితే ఏం అనుకోరుగదా." అన్నారాయన. అంటూ వీధి లోకి చూసి ఆటో ఆగి వుండడం చూసి బైట ఆటో వున్నట్టుంది. ముందు ఇంటికి వెళ్ళండి, తరువాత మాట్లాడుదాం" అంటూ లోపలికివెళ్ళి తాళం తెచ్చి ఇచ్చాడు.
ఆయన మాటలకి అర్ధం బోధపడక శివరామ్ ఆశ్చర్యపోతూనే తాళం తీసుకు వెళ్ళాడు.
ఈ శారద ఎక్కడికి వెళ్ళింది. వద్దన్నా పుట్టింటికి వెళ్ళిందేమో. రాణీ, పని పట్టాలి. కసిగా, కోపంగా పళ్ళు కొరికాడు. అసలే ప్రయాణపు బడలికతో చిరాకుగా వున్న అతనికి యింటికి వచ్చేసరికి శారద లేకపోవడంతో తిక్కగా వుంది. వంటింట్లోకి కాఫీ కాచుకోవాలని వెళ్ళాడు. పాలు లేవు. పనిమనిషన్నా వస్తే బాగుండును. ఈ శారద కెంత ధైర్యం. తన కిష్టంలేదని చెప్పినా వెడుతుందా! కానీ ... ఎదురుగాలేని శారదని ఏం చెయ్యలేక కోపంకొద్ది బాల్చీల కొద్దినీళ్ళు కసిగా దిమ్మరించుకున్నాడు.
తలుపులు తీసి వుండడం చూసి పనిమనిషి లోపలికి వచ్చి "మీరాబాబూ, అమ్మగారొచ్చినారేమో అనుకున్నాను. బాబో. ఎంత గోరం జరిగిపోయేది! కాస్తంతలో తప్పిపోనాదిగాని-అమ్మబాబోయి అమ్మగా రెంత సాహసం సేసినారో తెలుసా బాబూ." వస్తూనే శివరమ్ ని చూసి గుండెల మీద చేతులు వేసుకుని అప్పలమ్మ మొదలుపెట్టింది.
శివరామ్ చకితుడయ్యాడు. తెల్లపోతూ - ఏమిటి-ఏం చేసిందమ్మగారు." గాభరాగా అడిగాడు.
"మీరటు ఎల్లగానే, అమ్మగారు యిసం మింగారు బాబూ! అదృష్టం బాగుండబట్టి సమయానికి సాకలాడు సూసి యిరుగు పోరుగుని కేకెట్టాడు. ఆసుపత్రికి తీసికెళ్ళాం. ఆ దేముడు సల్లగా సూడబట్టి గండం గడిచి బతికి బయట పడ్డా రమ్మగోరు. లేదంటే ఎంత ఘోరం జరిగిపోను..." అప్పలమ్మ వాగ్దోరణి సాగుతూనే వుంది.