Previous Page Next Page 
జన్మభూమి పేజి 37

    తరువాత వారంరోజులకి వూర్లో ఆడవాళ్ళు ఎవరైతే వూరగాయలు పచ్చళ్ళు, పొడులు, వడియాలు, అప్పడాలు అవి తయారుచేశారో అందరినీ ఒక బస్సులో ఎక్కించుకుని రాజేశ్వరి విజయవాడ వెళ్ళింది. దానికి ముందురోజే రంగా, వాసు ఊర్లో నలుగురైదుగురు కుర్రాళ్ళు సామానంతా లారీలో వేసుకుని విజయవాడ వెళ్ళి ఎగ్జిబిషన్ లో స్టాల్స్ ఏర్పాట్లు చేశారు. ఆ రోజు ఆ వూరి ఆడవాళ్ళందరూ జీవితంలో గర్వపడే రోజు. తాము తయారుచేసినవి తాము అమ్ముకుని డబ్బు సంపాదించుకోవడంలోని ఆనందం, తృప్తి, గర్వం అందరి మొహాలలో కనిపించింది. ఊరగాయల సీజను అవడంతో ధర మామూలు మార్కెట్ లో దొరికే సీసాలకంటే తక్కువ ధరకి దొరకడంతో గిరాకీ బాగా పెరిగింది. హాట్ కేక్స్ లా అమ్ముడయిపోయాయి. ఈనాటి స్త్రీలంతా ఉద్యోగస్థులు, విడి కాపురాలు, ఇంట్లో ఊరగాయలు పెట్టేందుకు సలహాలు ఇచ్చేవారు కాని వారంతా ఆ తిప్పలు పడలేక ఊరగాయలు కొనుక్కునే రోజులు అవడంతో పది నుంచి సాయంత్రం ఆరుదాకా సాగిన అమ్మకంలో ఏదో ఒకటి రెండు సీసాలు, ప్యాకెట్లు తప్ప అన్నీ అమ్ముడయిపోయాయి. రాజేశ్వరి పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని సంబరపడిపోయింది. ఆడవాళ్ళయితే ఒకటే సంబరపడ్డారు.
    మర్నాడు అందరూ కల్సి లెక్కలు చూసేపని వాసు మీద పెట్టారు. సరుకు ఖర్చు, అమ్మకం, లాభం అంతా లెక్కలు కట్టి అన్ని ఖర్చులు పోగా పద్దెనిమిది వేలు లాభం వచ్చిందని తేల్చాడు. అంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఈ ప్రోత్సాహంతో ఇంకా ఎండాకాలం ముగియలేదు కనుక మరోసారి ఇంకా ఎక్కువగా మళ్ళీ ఇవన్నీ తయారుచేసి ఇంకోసారి అమ్మకానికి పెట్టాలని అంతా నిర్ణయించారు. ఇక్కడ అయ్యాక ఈసారి హైదరాబాదు, విశాఖపట్నం లాంటి సిటీలకి పంపాలని నిర్ణయించారు. రెండోసారి అమ్మకాలు అయ్యాక అందరికీ లాభాలు లెక్కకట్టి పంచుతానని రాజేశ్వరి చెప్పింది.
                                                       *    *    *
    ఎస్కార్డ్ కంపెనీ నుంచి ట్రాక్టరు, కంబైన్డ్ హార్ ఎస్టర్ మిషన్లు వచ్చాయి. డిమాన్ స్టేషన్ కి ఇద్దరు వచ్చారు. "వాసూ! నీవూ, నీ ఫ్రెండ్స్ అందరూ ఇవి బాగా చూడండి - ఎప్పుడన్నా ఇవి వాడే అవసరం పడచ్చు. చిన్న చిన్న రిపేర్లు మనమే చేసుకోవాలి. అవన్నీ వివరాలు అడిగి తెల్సుకోండి. మీ కుర్రకారు ఇద్దరు ముగ్గురు ఇవి ఆపరేట్ చేయడం నేర్చుకుంటే మనకు ప్రాబ్లమ్ వుండదు..." వాసూ సంతోషంగా అంగీకరించాడు.
    హెడ్మాస్టరుగారి అబ్బాయి ఇద్దరు ముగ్గురు యువకులని చేర్చాడు. మిషన్లు ఎలా ఆపరేట్ చెయ్యాలో, భూమి దున్నడానికి, కోత కోయడానికి, పంట నూర్పిడికి ఏ ఏ ఎటాచ్ మెంట్లు చెయ్యాలో, గంటకి ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది. ఒక గంటలో ఎన్ని ఎకరాలలో పంట కోత చేయగలదో, నూర్పిడి చేయగలదో, ఏ పార్టు ఎలా అతకాలి, ఎలా విడదీయాలి, చిన్న చిన్న రిపేర్లు వస్తే ఏంచెయ్యాలి అన్నీ విశదంగా వివరించి డిమాన్ స్ట్రేట్ చేసి చూపుతూ వివరించారు కంపెనీ మనుషులు. కేశవరావుగారు కుతూహలంగా విన్నారు.  
    కంపెనీ బ్రోచర్లు చూసి పార్టులు గుర్తు పెట్టుకున్నారు. వాసుతోపాటు మిగిలిన ముగ్గురూ స్కూటర్ నడపడం వచ్చినవారు. ముందు వాసూ ఎక్కి కంపెనీ మనిషి చెప్పిన ప్రకారం నడిపించాడు. అమరూ తలో అరగంట ప్రాక్టీసు చేశారు. రబీ పంట కోతకి సిద్ధంగా వుంది. కంపెనీవారు ఒక ఎకరం పంట కోసి చూపారు. అంతా వచ్చి గంటకూడా పట్టలేదు. అలాగే నూర్పిడి, ధాన్యం, పొల్లు దేనికది వేరుచేసి, బస్తాలలోకి ఎక్కించడం అంతా ఎకరానికి గంట సమయం పట్టింది. ఊర్లో వున్న రైతులు, పిల్లలు, పెద్దలు అంతా మిషన్లు పనిచేస్తుంటే వింతగా చూసారు. ఎకరం గంటలో అయిపోవడం చూసి విస్తుపోయారు. చప్పట్లు కొట్టి తమ ఆనందం వ్యక్తంచేశారు. వాసూ, స్నేహితులు అంతా తలో పరికరం ఆపరేట్ చేసి చూశాక ఫరవాలేదు తాము చేయగలమన్న నమ్మకం కల్గింది వారికి. కేశవరావుకి అదంతా చూసి థ్రిల్లింగా ఫీలయ్యారు.
    "సార్, మీకు కావలిస్తే మా మనిషి యింకోరోజు వుంటాడు ఇక్కడ. దగ్గిరుండి వీళ్ళకి తర్ఫీదు యిస్తాడు. అతనికి ఒకరోజు బేటాయివ్వండి" అన్నాడు సూపర్ వైజర్.
    "గుడ్! అలా అయితే మరీ మంచిది. మా పిల్లలకి మరింత కాన్ఫిడెన్స్ వస్తుంది. అతన్ని వుండనీయండి ఒకరోజు" అని చెప్పి కంపెనీకి ఇవ్వవలసిన బాలన్స్ డబ్బు చెక్ యిచ్చి పంపారు. వాసూ, స్నేహితులకి పిల్లలకి కొత్త ఆటబొమ్మ దొరికినట్టు ఆరోజంతా ఖాళీగా వున్న పొలాలన్నీ దున్నేశారు సరదాగా...
    "అంకుల్! యింక మీరు వీటికోసం మనుషుల్ని పెట్టక్కరలేదు. వీటి సంగతి మేం చూసుకోగలం. మాకు వదిలేయండి వీటి సంగతి" మర్నాడు అందరూ వచ్చి భరోసా యిచ్చేశారు కేశవరావుకి.
    "ఆర్ యూ ష్యూర్. మీరు మేనేజ్ చెయ్యగలరా! అడ్డదిడ్డంగా వాడి రిపేరుకి తెచ్చేస్తారని నా భయం."
    "ఆ భయం వద్దు. చిన్న చిన్న రిపేర్లు కూడా నేర్చుకున్నాం." నలుగురూ నమ్మకంగా భరోసా యిచ్చారు.
    "సో ది ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్... కాని, మీరందరూ జీతాలు అడుగుతారు" భయం నటించారు.
    "అంకుల్ వుయ్ ఆర్ నాట్ సో మాన్" అన్నాడు వాసు.
    మిగతావాళ్ళు "అంకుల్ మీరు మా వూరికోసం యింత చేస్తున్నారు. మేం మా కోసం ఈ మాత్రం చెయ్యలేమా. నలుగురం వున్నాం. ఎవరికైనా పనులున్నప్పుడు ఒకరు రాకపోతే ఒకరం వుంటాం. అందులో సంవత్సరం అంతా పని వుండదు గదా. రెండు పంటలపుడు, దున్నేటప్పుడు, కోతలప్పుడు గదా పని ఎక్కువ వుండేది. మేం నలుగురం మాలో మేం ఈ పని పంచుకుంటాం" అని చెప్పారు.
    కేశవరావు సంతోషంగా అందరి భుజం తట్టి షేక్ హాండ్ ఇచ్చారు. "ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్" అన్నారు.
    మర్నాడు పంట రెడీగా వున్న రబీ పంట అంతా కోరలు ఆరంభించి నాలుగు రోజులలో పంట మార్పిడితో సహా పనులు అవగానే, అన్ని భూములు వరసప్రకారం దున్నడం ప్రారంభించేసారు వంతులు వేసుకుని.
    "కొత్త బిచ్చగాడు పొద్దెరగడట. యిలా వుంది వీళ్ళ వ్యవహారం. కోతికి కొబ్బరికాయ దొరికినట్లుంది వీళ్ళకి" రంగా నవ్వుతూ అన్నాడు.
    "చూడండి. ఆ ఉత్సాహంతో రోడ్లు, ఇళ్ళు అన్నీ దున్ని పారేస్తారేమో" రాజేశ్వరి హాస్యంగా అంది.
    తొలకరి వానలు పడడం తరువాయి విత్తనాలు నాటేయవచ్చు."
    ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా అగ్రికల్చర్ ఆఫీసర్ కృష్ణమూర్తి వచ్చి నమస్కారం చేశాడు.
    "హలో. మీ గురించే అనుకుంటున్నాను. మీ నుంచి ఉత్తరం ఏంలేదు. క్రిందటి నెలలోనే వస్తానన్నారు గదా."
    "అవునండి. రిటైరై రెండు నెలలయింది. కాని పెన్షన్, ప్రావిడెంట్ ఫండు ఆ లెక్కలవి తేల్చుకుని డబ్బు ముట్టేసరికి ఆలస్యం అయింది. మరి పెన్షన్ ఏర్పాట్లు చేసుకోకపోతే తరువాత కష్టం అవుతుంది. అంచేత కాస్త ఆలస్యం అయింది. ఎలాగో పంటలు వేయడానికి ఇంకా టైముంది గదా. అంచేత రాయలేదు.
    "సరే, మరి మీరు వచ్చారు. విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేస్తారో, ఎరువులు ఆ వ్యవహారాలన్నీ మా రంగాతో కల్సి చూడండి. ఇంక పొలం పనులన్నీ మీదే భారం. మీరు జాయినింగ్ రిపోర్టు రాసి రంగాకి యివ్వండి. ఈరోజు తారీఖుతో. ఫ్యామిలీతో వచ్చారా. యిల్లది ఎక్కడ చూసుకున్నాడు."
    "ఫ్యామిలీ ఇంకా తీసుకురాలేదు. ముందు ఇల్లు ఏదన్నా దొరికంగానే..." నసిగాడు.

 Previous Page Next Page