"దీనినిబట్టి ఇల్లు సర్దటం ఇల్లాలే కాదు. ఇంటిగలాయన కూడా చేస్తాడు అని అర్థం. ఒక్కొక్క ఇంట్లో అట్లాంటి మంచి ఇంటాయన కూడా ఉన్నారు. ఇలా మంచి మగవాళ్ళు నూటికో కోటికో ఒక్కొరే ఉన్నట్టు... నూటికో కోటికో మంచి ఆడపిల్ల లేదు. అలాంటి పెళ్ళికావల్సిన ఆడపిల్ల మీద ఈ కవిత చదువుతాను వినండి."
"తల్లిని చూశాం కదా
పిల్లని చూడనక్కర లేదనుకోకండి
తల్లి తల్లే... పిల్ల పిల్లే
ఉల్లికి మల్లె పుట్టకపోవచ్చు
చల్లని తల్లికి చెల్లని పిల్ల పుట్టొచ్చు కదా!"
సుందర సుకుమారి కవిత చదివంగానే "ఇలాంటి కవితలు మా ముందు చదివావంటే తిండి తిననివ్వకుండా మాడబెట్టి చంపేస్తాం. ఇప్పుడే కదా మనలాంటి ఆడపిల్లల తరఫున ఉద్యమం లేవదీద్దామనుకొన్నాం. మగవాళ్ళు వంట జేస్తారు... ఇల్లు సర్దుతారు... అది మంచిది కాదు అని మనమే చెబితే మన ఉద్యమం మొదట్లోనే నీరుగారి పోవడమే కాకుండా నలుగురు ముఖాన నవ్వుతారు" అంటూ సన్నగా చీవాట్లు పెట్టింది వందనాదేవి.
"సరదా ఎక్కువయిపోయి నాలుగు గోడల మధ్యనే వున్నాం కదా... నలుగురికి వినిపించదు గదా అని ఏదో నోటికొచ్చింది చెప్పాను. ఇట్టాంటప్పుడు ఇంకఅట్టాంటివి చదవను లేవే" అంది సుందరి సుకుమారి.
"ఒకటి గుర్తుంచుకోవే సుందరీ! భగవంతుడు మనిషికి గొంతు ఇచ్చింది మాట్లాడటానికే గాని పోట్లాడటానికి కాదు. అలానే భగవంతుడు మనకి నోరు ఇచ్చింది..."
"నన్నడిగితే తినటానికని చెబుతాను" వెంటనే అంది సుందర సుకుమారి.
"నేను సీరియస్ గా చెబుతుంటే మధ్యలో నవ్విస్తా వేమిటి?" చిరుకోపంతో కోప్పడింది వందన.
రాణి, ప్రమద ఫక్కున నవ్వేశారు.
మళ్ళీ నలుగురు తేలికపడ్డ మనసులతో హస్తాలు కలుపుకొని ఒకే మాటమీద ఉంటామని భీషణ ప్రతిజ్ఞలు చేశారు.
"చేతులు కలిసిన శుభవేళ పాటలు పాడను పనిమాల" అంటూ సుందర సుకుమారి రాగయుక్తంగా ఆలపించింది.
ఆ మాటకి... ఆ పాటకి... రాగయుక్తంగా పాడిన ఆ తీరుకి ముగ్గురు పడి పడి నవ్వారు.
16
"సుందరీ! సుందరీ!"
బాత్ రూంలోంచి నీళ్ళ శబ్దం వినవస్తోందిగాని సుందర సుకుమారి మాత్రం పిలిచినా పలకలేదు.
"ఓ సుందర సుకుమారీ! తొందరగా స్నానంచేసి రావే తల్లీ! స్నానం చేయడం ఓ గంట... పాటలు పాడటం మరోగంట. అంతంతసేపు జలకాలాడకూడదే అమ్మా! సబ్బుతోపాటు నీ ఒళ్ళుకూడా అరిగిపోతుంది. ఊరెళ్ళిన తర్వాత మీ బామ్మేమో నన్ను తిడుతుంది."
వందనాదేవి బాత్ రూమ్ దగ్గర నుంచుని మాట్లాడుతుంటే రూంలో ఓ పక్కగా నుంచుని బట్టలు వేసుకుంటున్న సుందర సుకుమారి కిలకిల నవ్వుతూ-" నేను బాత్ రూములోంచి వచ్చేశానే! చూడలేదా? పాపం తలుపు దగ్గర నుంచొని అదేపనిగా గొణుగుతున్నావు" నవ్వాపి అడిగింది.
"బాత్ రూములోంచి ఊడిపడ్డావా తల్లీ! రూములోంచి బయటికి రావడం నేను చూడలేదులే! నీళ్ళ చప్పుడు వినిపిస్తుంటే ఇంకా నీవు లోపల్నుంచి రాలేదనుకున్నాను. నా ధ్యాసంతా తొందరగా స్నానం చేద్దామని బాత్ రూం మీదే ఉండటంతో నీవొచ్చింది చూసుకోలేదు" అంది వందన.
"ఇప్పుడు చూశావ్ కదా! వెళ్ళి స్నానంచెయ్" జాకెట్ హుక్స్ పెట్టుకుంటూ చెప్పింది సుందర సుకుమారి.
"స్నానం పూర్తయ్యింది కదా! పంపెందుకు తిప్పొచ్చావ్?" అడిగింది వందన.
"ఫ్రీగావస్తే ఫినాయిల్ తాగమన్నాడొక మహానుభావుడు. తేరగా వస్తే పారబొయ్యి నీళ్ళు... అనిపించి పంపు ఫుల్ గా తిప్పొచ్చాను" సుందర సుకుమారి చెప్పింది.
"నీ ముఖంలాగా వుంది. నీకప్పుడప్పుడు పైత్యం ప్రకోసిస్తూ ఉంటుంది. అర్థంలేని పనులు చేసి దానికో పేరు పెడతావ్"
"వేసిన అక్షింతలు చాలు. నల్లాలో నీళ్లు చల్లగా కారిపోతున్నాయ్ వెళ్ళు...వెళ్ళు... వెళ్ళి స్నానం చేసిరా" అంది సుందర సుకుమారి.
"టవలు...పెట్టికోట్...బ్రాసరీ తీసుకుని బాత్ రూములోకి వెళితే తలుపు బిగించుకుంది వందనాదేవి.
"వందన బాత్ రూమ్ లో దూరింది. రాణి, ప్రమద తలుపు దగ్గరకేసి ఎక్కడికో వెళ్ళారు. ఇప్పుడిక్కడ నేనొక్కదాన్నే వున్నాను. నాకు ఇష్టమొచ్చినన్ని పాటలు పాడుకుంటాను. ఈ అందం...ఈ మంచం... ఈ దిండు దుప్పట్లు ఏవీ వద్దనవుకదా! పాడేస్తావ్...అదేమిటబ్బా! ఏదో ఒక పాట పాడదాం అనుకుంటే సమయానికి ఒక్కపాటా రావడం లేదేమిటి? పాట రాకపోతే కూనిరాగమో, ఖూనీ రాగమో ఏదో ఒకటి తీస్తాను. ఇప్పుడు నన్నెవరు అడ్డుకుంటారు?" అలా అనుకున్న సుందర సుకుమారి అద్దంలో తన ప్రతిబింబాన్ని వివిధ కోణాలలోంచి చూసుకుంటూ...