"పరిష్కరించుకోవాలి అని చెప్పావ్! బాగానే ఉంది. దాని పరిష్కార మార్గమేమిటో అదీ చెప్పు." ప్రమద అడిగింది.
"ఆయా సమస్యలనిబట్టి పరిష్కారాలు ఉంటాయ్. బాధల్లో నిబ్బరంగా నిలబడి ఎదిరించగల శక్తి అలవరచుకొని ఆత్మవిశ్వాసం తెచ్చుకొంటే పరిష్కారానికి మార్గం అదే వస్తుంది. ఏదైనా చేస్తారు... చెయ్యగలం కూడా. అన్నిటికి మనోధైర్యం ముఖ్యం. దీనికి ముందు మనం చేయాల్సింది ఒకటుంది" వందనాదేవి అంది.
"అదేమిటి?" ప్రమద అడిగింది.
"అదేమిటో నీవు చెప్పు. నీతోపాటు మేమూ చేస్తాం" రాణి అంది.
"అందరితోపాటు నేను "సై" యేనేవ్" సుందర సుకుమారి సై అంది.
"అందరు ఒక మాటమీద ఉన్నందుకు చాలా సంతోషం. ముందుగా మనలాంటి యువతులందరు ఒక స్థిర నిర్ణయానికి రావాలి... ఆ మాట మీద నిలబడాలి... కాళ్ళు చచ్చుపడినట్టు కూలబడకూడదు మధ్యలో."
"అలాగే" అన్నారు ముగ్గురు.
"గుడ్! కట్నం తీసుకునేవాడ్ని మనం పెళ్ళాడకూడదు. పెళ్ళి కాకపోతే జీవితాంతం బ్రహ్మచారిణిగానైనా ఉండిపోవాలి గాని మధ్యలో పెద్దవాళ్ళు చెప్పారంటూ మనసు మార్చుకోరాదు. మనం ఇదో ఉద్యమంగా తీసుకొని మనలాంటి మరో పదిమంది ఆడపిల్లలకు మార్గం చూపాలి. పదిమంది ఎప్పుడైతే కలుస్తారో పాతికమందిగా పెరిగిపోతారు. పాతికమంది ఎప్పుడైపోతారో వంద సంఖ్యలోకి వెళ్ళిపోతారు. ఆ దెబ్బతో మన ఉద్యమం ఊపందుకుంటుంది. ముందు వరకట్నం పిశాచాన్ని పారదోలగలిగితే మిగతా పిశాచాలు వాటంతటవే వాళ్ళకి బుద్ధి చెబుతాయ్. ఏమంటారు!" వందన అడిగింది.
"ఈ ఉద్యమంలో మాటలే కాదు. కొన్ని పాటలు కూడా మనం చేర్చాలి. పాడటానికి బాగుంటే నలుగురి నోట్లో నానుతుంటాయ్. ఉదాహరణకి...
"నీళ్ళు దాహం తీరుస్తాయని అనుకుంటే చాలదు
నీళ్ళు చల్లగా ఉంటాయని మురిసిపోకు
నిలువునా ముంచేయటం నీళ్ళకి మాత్రమే తెలుసు
తడిగుడ్డతో గొంతు కోయడం కూడ నీళ్ళకే తెలుసు
అలాగే
నిప్పు వెచ్చడం ఇస్తుందని మురిసిపోకు
నిలువునా కాల్చి దహింపజేసేది నిప్పే
అది నీ పాలిట ముమ్మాటికి ముప్పే."
సుందర సుకుమారి పాటలా పాడింది.
"కవిత్వం మానేసి పాటలెప్పుడు నేర్చుకున్నావే తల్లీ!" అడిగింది ప్రమద.
"అది కవిత్వం మానెయ్యదు. ఇప్పుడు కొత్తగా పాటలు మొదలుపెట్టింది. ఇప్పుడు మన్ని ఎడా పెడా వాయిస్తుందేవ్! అటు పాట, ఇటు కవిత. బాప్ రే బాప్" అంటూ రాణి భయం నటించింది.
"విషయం వదిలేసి మధ్యలో ఈ పాటల గోలేమిటే?" వందన విసుక్కొంది.
"నాదేంలేదు... సుందర సుకుమారి అడ్డం తగిలింది. నా వరకు నేను చెబుతున్నాను. నీమాటే నా మాట... నీ బాటే నా బాట" అంది రాణి.
"చేతిలో చెయ్యి వేస్తున్నాను...మాట ఇస్తున్నాను. నీ మాట... రాణి మాట... నా మాట" అంది ప్రమద.
ఎవరకి వారు చేతల్లో విషయం కార్యరూపం దాల్చకపోయినా చెప్పుకొన్న మాటలకే ఆనందపడిపోయి సంతోషంగా ముఖ ముఖాలు చూసుకున్నారు.
"ఇందాకేమిటే! నా పాటల్ని వెక్కిరించారా! నేను కవితలే కాదు పాటలు కూడా పాడగలను. మళ్ళీ మాట్లాడితే "ఇంటికి దీపం ఇల్లాలే అయితే కరెంట్ పెట్టించుకోవడం దేనికి?" అంటూ తమాషాగా మాటలు కూడా చెప్పగలను. మనం ఆవేశంగా మాట్లాడుకొన్నా నిజాల్నే మాట్లాడుకొన్నాం. మార్పు మంచిదే. కాని మనంకూడా కాస్త విశాల హృదయంతో ఆలోచిస్తే ఒక అమ్మాయిలోని లోపము... ఒక ఇంటాయన పనితనము కవిత ద్వారా వినిపించగలను. వినిపించమంటారా! వింటారా?" సుందర సుకుమారి అడిగింది.
"వినక ఛస్తామా! వినిపించు" అంది రాణి.
"వినిపించి చావు. వింటాము" అంది ప్రమద.
కవిత విషయానికొస్తే ఎవరి వెక్కిరింతలు... ఎవరి వేళాకోళాలు పట్టించుకోదు సుందర సుకుమారి. ఒక కవిత చదివి పారేసింది.
"ఇల్లు చూసి
ఇల్లాలిని చూడనక్కర లేదనుకోండి
ఇల్లు సర్దింది ఇల్లాలే అని ఏముంది?
ఇంటి గలాయన కావొచ్చు కదా!"