"లలలా లలలా...లులులూ...లులులూ..." అని కూనిరాగం తీస్తుండగా సుందర సుకుమారి చూపులు డ్రస్సింగ్ టేబుల్ మీద మడతపెట్టి ఉంచిన కాగితంమీద పడ్డాయ్.
సుందర సుకుమారి కూనిరాగం తియ్యడాన్ని ఆపుజేసి ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుంది. మడతవిప్పి చూసింది. అదో లెటర్ లా కానరావడంతో గబగబా చదివింది.
ప్రియమైన వందనాదేవికి__
ప్రేమతో__
నీ చరణారవిందుడు వ్రాయునది. నేనెవరన్నది తర్వాత తెలుసుకొందువుగాని. ముఖ్యముగా వ్రాయునది ఏమంటే ప్రమద, రాణిలను తెలివిగా నేను కిడ్నాప్ చేసి ఇక్కడ నా రూములో బంధించాను...
ఆ లెటర్ ఇంకా చాలా పెద్దదే వుంది. ఆ నాలుగు మాటలే చదివిన సుందర సుకుమారికి కాళ్ళు చేతులు ఆడలేదు. గబగబా బాత్ రూము దగ్గరికి పరుగుదీసింది. దబదబా బాత్ రూము తలుపు బాదుతూ "వందనా! వందనా! తొందరగా బయటికి రావే" అంటూ అరచినట్టే పిలిచింది సుందర సుకుమారి.
బాత్ రూము లోపల వున్న వందనాదేవికి సుందర సుకుమారి పిలుపులు వినిపించాయ్. తలుపుమీద దరువులా వినిపించాయి.
కాని__
"ఇందాక అదేమో సరీగ అరగంట స్నానం చేసింది. బాత్ రూములోంచి బయటికి వచ్చి స్నానం అయిందని నాతో చెప్పక తమాషా చూస్తూ ఊరుకుంది. ఇప్పుడేమో ఏదో కొంప మునిగినట్టు...తలుపులు విరిగేలా బాదుతూ పిలుస్తున్నది. నేనెక్కువసేపు స్నానం చెయ్యకుండా వుండటానికి...నన్ను ఆట పట్టించటానికి ఇదో ఎత్తు. అమ్మా! సుందర సుకుమారి! నిన్ను నమ్ముతానటే!" లోపల చల్లటి నీళ్ళతో స్నానం చేస్తూ సరదాగా అనుకుంది వందనాదేవి.
సుందర సుకుమారి మరింత గట్టిగా తలుపులు తట్టి "నిజంగానే కొంప మునిగింది. తలుపు తియ్యవే" అంటూ అరచిమరీ చెప్పింది. ఐదు నిముషాలాగి బాత్ రూము తలుపు తీసుకొని తాపీగా బయటికి వస్తూ "ఎవరి కొంప? ఎక్కడ మునిగింది?" నవ్వుతూ అడిగింది వందన.
"ఎవరికొంపో మునిగితే కొంపమునిగేట్టు ఎందుకు అరుస్తాను. మునిగింది మన కొంపే" అంది సుందర సుకుమారి.
"మునగటానికి ఇక్కడ మనకి కొంప ఉంటేకదా! ఓహో...మనం ఉండే రూమ్ మునిగిందా? నీళ్ళల్లో మునిగిందా...? నిప్పుల్లో మునిగిందా!"
ఆ సమయంలో సుందర సుకుమారి మొహం చూడలేదు వందన. అందుకే నవ్వుతూ అడిగింది.
"ప్లీజ్...ఇది నవ్వులాటకి సమయంకాదే వందనా!"
"పోనీ ఏడుపులాటకి సమయమంటే సుందరమ్మా!"
"చాలా ఘోరం జరిగింది"
"ప్రక్కనే నేరం కూడా జరిగుండాలే" ఎందుకంటే ఘోరం...నేరం ప్రాస కుదురుతుంది."
"నా గుండె దడదడ__నా కాళ్ళు గజగజ వణుకుతున్నాయి."
"బహుశ చలిజ్వరం అయ్యుంటుంది"
అంతవరకు సుందర సుకుమారి వైపు చూడకుండా మాట్లాడ్తున్న వందన ఎందుకో తలఎత్తి చూసింది. నిజంగానే సుందరి మొహం పాలిపోయి వుంది.
సుందరి అబద్ధం చెప్పటం లేదన్నది గ్రహించుకుంది వందన.
అంతేకాదు_
సుందర సుకుమారి చేతిలో ఏదో కాగితం ఉండటం కూడా చూసింది.
"ఏమిటే ఆ కాగితం?" అంటూ సుందరి దగ్గరకు వచ్చింది వందన.
"ఇది కాగితంకాదు బాంబ్__బాంబులాంటి లెటర్. నీకే రాశారు చదువ్"
"నాకెవర్రాస్తారు?" అంది వందన.
"నీకే రాశారు. ఇదిగో చదివి చూడు" అంటూ వందన చేతిలో ఆ లెటర్ పెట్టింది సుందర సుకుమారి.
వందనాదేవి ఆశ్చర్యంగా ఆ లెటర్ చదవసాగింది. పైకే చదవటం వల్ల సుందరి కూడా వింటూండిపోయింది.
ప్రియమైన వందనాదేవికి__
ప్రేమతో నీ చరణారవిందుడు వ్రాయునది. నేను ఎవరన్నది తర్వాత తెలుసుకుందువుగాని- ముఖ్యముగా వ్రాయునది ఏమంటే నీ స్నేహితురాళ్ళు ప్రమద, రాణిలను తెలివిగా నేనే కిడ్నాప్ చేసి ఇక్కడ నా రూములో బంధించాను.
నీవు, నీ రూమ్ లో వున్న లడ్డు సుందరి అనుకోటం...మీ స్నేహితురాళ్ళు మిమ్మల్ని తమాషాగా ఏడిపించటానికి ఎక్కడో దాక్కున్నారని__అందుకే ధైర్యంగా ఉన్నావు. అదేమీ కాదు...వాళ్ళు నా దగ్గర వున్నారు.
నా ప్రియవందనా! వాళ్ళిద్దరూ క్షేమంగా మళ్ళీ నీ దగ్గరకు చేరాలంటే నీవు నేను చెప్పినట్లు వినాలి. ఈ లెటర్ కింద ఎడ్రస్ రాస్తున్నాను. ఆ ఎడ్రస్ కి నీవు ఒంటరిగా చక్కగా అలంకరించుకునిరా. నా సమక్షంలో ఓ గంట హాయిగా గడిపి ఆపై తిరిగి వెళ్ళిపోదువుగాని. ఇంక నీ అవసరం నాకు ఉండదు.
ఈ విషయం మన మధ్యనే ఉండిపోతుంది. నా మాట కాదన్నా... పోలీసులకి ఈ విషయం చెప్పి సహాయం తీసుకున్నా...నీ స్నేహితురాళ్ళని నీవు ఈ జన్మలో చూడలేవు. ఆపై నీ ఇష్టం. నీ చర్యలని అనుక్షణం కనిపెడుతూనే వుంటాను. అతి తెలివి ప్రదర్శించకు.


