నరేష్ ఆమె మాటలను సీరియస్ గా తీసుకోలేదు. ఏ ఆడపిల్లకైనా ఆ మాత్రం ఈర్ష్య వుంటుందనుకున్నాడు. రజని చూస్తుండగా మరో ఆడపిల్లవేపు తల తిప్పకూడదని, అనవసరమైన కాంప్లిమెంట్ లు చేయకూడదని మాత్రం నిశ్చయించుకున్నాడు.
అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడమే జీవితంలో అతను చేసిన పెద్ద పొరబాటు.
సరళ, విమల, సబిత హోటల్ గౌతమ్ లో కూర్చుని రజనీ కోసం పావుగంట నుంచి వెయిట్ చేస్తున్నారు.
ఆ రోజు సరళ బర్త్ డే! ఆ సందర్భంగా సరళ తన మిత్రురాళ్ళకు చిన్న టీ పార్టీ ఇస్తోంది.
రజనీ కోసం చూస్తూ ముగ్గురూ కబుర్లలో పడ్డారు.
సాయంకాలం ఆరుగంటలు కావడంతో అప్పుడు హోటల్ లో లైట్లు వెలిగాయి. బీచ్ రోడ్డులోని ఓ స్టార్ హోటల్ ఆ సాయంకాలం పూట బిజీగా వుంది. ఫారినర్స్ కూడా బాగానే వున్నారు.
* * * * *
సరళ వాళ్ళు తమకు ప్రత్యేకంగా కేటాయించిన గదిలో కూర్చున్నారు. ముందు పక్క డోర్ లేకపోవడం వల్ల సముద్రం, బీచ్ లో తిరగాడుతున్న మనుషులు కూడా కనిపిస్తున్నారు.
అప్పుడే రజని కారు హోటల్ ఆవరణలోకి ప్రవేశించింది. ఆమెను గేట్ దగ్గర దించి, కారును పార్క్ చేయడానికి వెళ్ళాడు డ్రయివర్.
రజని రూమ్ లోకి వచ్చి "సారీ సరళా! జస్ట్ అరగంట లేటైంది" అంది. ఆమె నరేష్ ఆఫీసుకెళ్ళి అతనితో పార్టీ విషయం చెప్పి వచ్చింది. దాంతో ఆలస్యమైంది.
"దట్సాల్ రైట్! రాణీగారు రాకపోవడంవల్ల పార్టీ మొదలుకాలేదు. ఈ రోజు బర్త్ డే కనుక మీరంతా మీ కిష్టమైన ఐటమ్స్ తినచ్చు" చెప్పింది సరళ.
రజని రావడంతో వాళ్ళల్లో వుత్సాహం మొదలయింది.
"ఓకే! అలా అయితే నాకు బ్రహ్మాండమైన ఐస్ క్రీమ్" తన ఛాయిస్ చెప్పింది విమల.
"గ్రాంటెడ్" అని సరళ వెయిటర్ ను పిలిచింది.
తమకు కావాల్సినవి ఆర్డర్ ఇచ్చారు.
"రజనీ! అటు చూడు. ఆ సర్దార్ మనవేపు ఎంత ఆబగా చూస్తున్నాడో" అంది సరళ ఏదో రహస్యం చెబుతున్నట్లు.
అందరూ తలలు తిప్పి అటు చూశారు.
హాల్లో కూర్చుని టిఫిన్ చేస్తున్న సర్దార్ ఆడపిల్లలంతా తనవేపు చూడడంతో గిల్టీగా ఫీలై తల దించుకున్నాడు.
"మగాళ్ళకున్న జబ్బే అది అలా దొంగచాటుగా చూసి, ఏం ఆనందం పొందుతారో నాకర్థం గాదు" చిరాకుగా అంది సబిత.
"మగవాడి సహజ లక్షణం అది. తల నెరిసిన తాతయ్య దగ్గర్నుంచి, ఇంకా పాలుకూడా మరిచిపోని పాపాయి వరకూ ఎదురుపడ్డ ఆడపిల్లవైపు చూడడం సర్వసాధారణం. ఇందులో ఎక్స్ సెప్షన్ లేదు" సిద్ధాంతీకరించింది సరళ.
తన నాన్న గుర్తొచ్చాడు రజనీకి. "అలా అనకు. అందరూ అలాంటివాళ్ళే వుంటారనుకోకు. ఎక్కువ శాతంమందికి ఆ దొంగబుద్ధి వున్నా నిజాయితీగా వున్న వాళ్ళు కూడా వున్నారు" అంది ఆమె.
"పురుషులలోనే పుణ్య పురుషులు వేరయా అన్నట్లు" చెప్పింది విమల.
"కానీ ఈ కాలంలో పుణ్యపురుషులు లేరనే నా నమ్మకం" దృఢంగా చెప్పింది సరళ.
"మగవాళ్ళమీద ఇంత నమ్మకం లేని పిల్లవి, రేపు అలాంటి పురుషుల్లోనే ఒకర్ని సెలక్ట్ చేసుకుని పెళ్ళి చేసుకోవాలి కదా! మగవాళ్ళంతా వెధవలని తెలిసి, ఓ వెధవతో జీవితం ఎలా పంచుకుంటావు?" అడిగింది సబిత సరళను.
"అదే బెస్ట్! మగవాడి మీద ఈ విషయంలో ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ ఉండకూడదు. నాకు లేవు. సమయమూ, సందర్భమూ కలిసొస్తే ఆడపిల్ల పిలిస్తే, ఆమె చెంతకు చేరకుండా వుండే మగవాడు ఈ ప్రపంచంలో వుండడు. అందుకే నేను జీవితంలో ప్రత్యేకించి మగవాడి విషయంలో డిసప్పాయింట్ కాను. మగవాళ్ళమీద నమ్మకం పెంచుకున్న వాళ్ళే డిసప్పాయింట్ అవుతారు. మనం కట్టుకున్న వాడికి మరో ఆడపిల్లతో స్నేహం చేసే సమయమూ, సందర్భమూ దొరక్కుండా ఉంటే చాలు" చెప్పింది సరళ నవ్వుతూ.
"అందర్నీ ఒకచోట కట్టేయడం దారుణం సరూ!" అంది రజని. ఆమెకు నరేష్ గుర్తొచ్చాడు అతనూ అందరిలాంటివాడే అనుకోవడం ఆమెను బాధిస్తోంది. ఆ బాధ కలిగితే ఆమె భరించదు. నరేష్ ఒక్కడే అలాంటివారు కాదని అందరికీ చెప్పాలనిపించింది ఆమెకు.
అందుకే తనే చెప్పింది "అందరూ అలాంటివారంటే నేను ఒప్పుకోను సరూ! నరేష్ ని ఉదాహరణకు తీసుకుందాం. అతను ఈ విషయంలో అందరిలా సమయమూ, సందర్భమూ వస్తే కూడా మరో ఆడపిల్లను చేరదీయడు. నరేష్ విషయంలో నీకేమైనా అభ్యంతరం వుందా?"
"నో - నరేష్ అలాంటి గొప్పవాడంటే నాకూ ఆనందమే. అయితే అతను అందులో ఎక్స్ సెప్షన్ అంటే ఒప్పుకోను. ఏ మగాడయినా ఈ విషయంలో ఒక్కటే. ఉదాహరణకు ఈ హోటల్ మేనేజర్ దగ్గర్నుంచి, సర్వర్ వరకూ ఓ ఆడపిల్ల చిటికేసి పిలిస్తే రాకుండా వుండడు" సరళ అంది.
"అందరి విషయంలోనూ నాకు తెలియదుగానీ, నరేష్ మాత్రం నిజాయితీపరుడు. అవకాశం తన ముంగిటకు వచ్చినా ఖాతరు చేయడు" ఎంతో నమ్మకంగా చెప్పింది రజని. నరేష్ అంత గొప్పవాడని అనుకోవడం ఆమెకు థ్రిల్లింగ్ గా వుంది.
"అలా అని నిరూపిస్తావా?" సరళ వెంటనే అడిగింది.