పరిమళరావును రాయమంటే బంధుమిత్రు లెవ్వరికీ ఉత్తరాలు రాయలేదు.
దివ్యహారతి తనే అందరికీ ఈ శుభవార్త లెటర్స్ ద్వారా తెలియజేసింది.
ప్రతిరోజూ లేచింది మొదలు ఆఫీసుకి వెళ్ళేవరకు తిరిగి ఆఫీసు నుంచి వచ్చిం తర్వాత చెరో పని చేసుకొనేవాళ్ళు అన్నిటా సమానమై పోయేసరికి పని పాటలు చేసుకొనే విషయంలో కూడా భార్య భర్త లిరువురు సమాన స్థాయికి ఎదిగారు.
అప్పటికి__
ఒక్కో ఇంట్లో పురుషాహంకారం ప్రదర్శించే భర్త, స్త్రీ అహంకారం ప్రదర్శించి భార్య లేకపోలేదు. పరిమళరావు, దివ్యహారతి సంసారం లాగా ఆనందకరంగా, ఆదర్శంగా అన్ని సంసారాలు లేవు. కలచక్రంతోపాటు సంసారాలూ గిర్రున తిరుగుతున్నాయంతే.
పరిమళరావు నెల తప్పింతర్వాత అతనిచేత తక్కువ పని చేయిస్తూ తాను ఎక్కువ పనిచేస్తూ అతని రెస్ట్ ఇవ్వగలిగింది దివ్యహారతి.
"ఇద్దరి పనులూ నువ్వొక్కదానివే చేసి అలిసిపోతున్నావ్ హా... రతి" అంటూ తెగ బాధపడిపోయేవాడు పరిమళరావు.
"నేనేమీ అలిసిపోవడంలేదు. నేను ప్రెగ్నెంట్ గా వున్నప్పుడు మీరు నన్ను కూర్చోపెట్టి ఎన్ని పనులు చేసేవారు? అసలు కాలు కింద పెట్టనిచ్చేవారా?" అంటూ తన విషయం గుర్తుచేసేది దివ్యహారతి.
వాళ్ళది ప్రేమవివాహం. పైగా పాలూ-నీళ్ళలా కలిసిపోయిన దంపతులు. వాళ్ళ పనులు వాళ్ళకి ముచ్చటగాను ఉంటాయ్ తియ్యగాను ఉంటాయ్.
అలా...అలా...రోజులు గడిచిపోయాయ్.
నెలలు నిండిన పరిమళరావు ఓ అర్దరాత్రి పండంటి మగబిడ్డను కన్నాడు.
దివ్యహారతి ఆ పసివాడ్ని చూసి ఎంతో సంతోషించింది.
పెళ్ళయి ఎనిమిదేళ్ళ తర్వాత గొడ్డుమోతువాడు అనిపించుకోకుండా మొత్తానికి ఒక మగబిడ్డకి తండ్రయ్యాడు పరిమళరావు.
ఇదంతా ఆ దంపతుల అదృష్టం.
* * * *
సాహితీ (రంగ) వనంలో కొత్తపత్రికలు రావటం, నాలుక్కాలాల పాటు నిలబడలేక పోవటం, ఆనాడు ఈనాడు జరుగుతున్నదే.
మాతృస్వామిక వ్యవస్థ, పిత్రుస్వామిక వ్యవస్థ దరిమిలా సర్వసమాన స్వామిక వ్యవస్థలు వరుసక్రమంగా వచ్చిపోయాయి.
యుగాలు మారాయి.
తరాలెన్నో తరిగిపోయాయి.
ఆడ-మగ రూపురేఖలు మారలేదుగాని సృష్టి మారిపోయింది. స్త్రీలతో సమానంగా పురుషులు పెద్దమనుషులయి పెళ్ళయి పిల్లల్ని కనేస్తున్నారు.
మారందల్లా పత్రికలు మాత్రమే.
"ఆంద్రతేజం" వారపత్రిక నాలుగు సీరియల్స్ అద్బుతమైన శీర్షికలతో సర్క్యులేషన్ పెంచుకుంటూ పోతుంటే అలాంటిదే మరొక వారపత్రిక "ఆంధ్రవైభవం" చూస్తూ చూస్తూ ఊరుకోలేక ఆరు సీరియల్స్-అరడజను కధలు, కుట్లు-కూనిరాగాలు, అంట్లు-ముట్లు అంటు-సొంటు అంటూ నానా చెత్త శీర్షికలు పాఠకులను తనవేపుకు తిప్పుకుంది.
అది చూసి...
"ఆంధ్రవైభవం" వారపత్రిక అల్లల్లాడిపోయి గబగబ క్రొత్త శీర్షికలు పెట్టింది. "మీరూ మీ సంసారం, స్వీట్ మీట్ వంటలశీర్షిక,వైద్యం పెరటి నైవేద్యంలాంటి వాటితో సర్క్యులేషన్ పెంచిపారేసింది.
ఓప్రక్క "ఆంధ్రతేజం" సచిత్ర వారపత్రిక మరోవేపు "ఆంధ్రవైభవం" సచిత్ర వారపత్రిక పోటాపోటీగా అడ్డదార్లు తొక్కుతుంటే పిల్ల పత్రికలు చూస్తూ వూరుకున్నాయి.
బరిలోకి దిగి కుస్తీ పట్టేటంత శక్తి పిల్లపత్రికలకి లేవు.
ఆంధ్రతేజం ఓ రచయితచేత "హీరో" అన్న పేరుతో సీరియల్ ప్రచురించటం మొదలుపెట్టేసారికి కుట్టరానిచోట తేలు కుట్టినట్టయింది.
"ఆంధ్రవైభవం"కి వెంటనే అంట్లగిన్నెలు తోముకుంటున్న అప్పలనరసమ్మణి ఆఫీసుకి అర్జంటుగా పిలిపించి "హీరోయిన్" అనే టైటిల్ తో పాఠకులు అదిరిపోయేలా శత్రుపత్రిక బెదిరిపోయేలా ఓ సీరియల్ రాయమని కోరింది.
ఆ...యా...పత్రికలలో ఇలాంటివె పోటాపోటీగా మరికొన్ని సీరియల్స్ శీర్షికలూ రాసాగాయి.
సాహితీ రంగంలో యీ విధమైన అపరిశుభ్ర అనారోగ్యపోటీ ఎప్పుడూ వున్నదే.
"ప్రయోగం" అనే సచిత్ర వారపత్రిక కొత్తగా ఒకటి విడుదల అయింది.
"ప్రయోగం" ఎడిటర్ పేరు బి.పి.రావ్.
ఒక్కసారి తెరవెనక్కి వెళితే...
బి.పి.రావ్ పూర్తిపేరు బొబ్బాకుల పిచ్చేస్వరరావు. ఆ తండ్రికి ఒక్కడే కొడుకు. చదువుసంధ్యలు పెద్దగా అబ్బలేదుగాని చౌకబారు సాహిత్యం చదవటం మాత్రం బాగానే అబ్బింది.
అప్పుడే...
తను మాత్రం ఎందుకు రాయకూడదు! నాలుగు కాగితాలు ఖరాబు చేసి పారేస్తే తానూ ఓ రైటర్ ణి అయిపోతాను కదా! అన్న ఆలోచన వచ్చింది.
మహిత్యమనే దురద పట్టుకుంటే కలంపుల్లతో గోక్కోవటం ఒక్కటే మార్గం అని సాహితీ ప్రియులందరికీ తెలిసిన సత్యమే.
బొబ్బాకుల పిచ్చేశ్వరరావు బి.పి.రావ్ పేరుతో కథలు, కవితలు విమర్శలూ ఒకటేమిటి నానా చెత్త రాసి అన్ని పత్రికలకూ పంపించాడు.
అదేం పాపమో ఒక్కపత్రికా అతగాడి రచనలు వేసుకోలేదు. ఉత్తరాల శీర్షికలో మాత్రం బి.పి.రావ్ పేరుతో ఎప్పుడయినా ఒక లేటర్ పడుతుండేది.
అదయినా__
విమర్శిస్తే లెటర్ పడేదికాదు. బాగుంది....అద్భుతం...పరమాద్భుతం....ఎడిడర్ అంటే మీరే...అంటూ లెటర్ రాస్తే ప్రచురణకి నోచుకొనేది.
బి.పి. రావ్ కి బిపీ పెరగటం తప్పించి రైటర్ గా అతనికి పేరు రాలేదు.