ఆమె నా వేపు కృతజ్ఞతగా చూసి గ్లాసు అందుకుంటూ "థాంక్స్" చెప్పి మొత్తం నీళ్ళు తాగేసింది.
"ఇంకా కావాలా?"
"ఉహూఁ"
"నాయర్ ! ఐదు నిముషాలు ఆగి రెండు టీలు తీసుకురా!" నాయర్ ని కేక వేసి చెప్పాను.
ఆమె చెప్పటం మొదలు పెట్టింది-
"నేను బి.ఏ. పూర్తి చేశాను. నాన్నగారు రిటైర్ కావటం, ఆ తర్వాత మూడు నెలలకే పెరాల్ సీస్ రావటం, మంచాన పడటం జరిగింది. నా అదృష్టం కొద్దీ రావ్ అండ్ రావ్ కంపెనీలో టైపిస్టు ఉద్యోగం దొరికింది. తరచు డాక్టర్ సుధీర్, రావుగారు కల్సుకుంటూ వుండేవారు. రావుగారు సుధీర్ గారి ఇంటికి ఏవేవో ఇచ్చి నన్ను పంపిస్తూ వుండేవారు. మొదట్లో నాకేమీ తెలియదు. దాదాపు ఎనిమిది నెలల క్రితం రావుగారు, సుధీర్ గారూ చాటుగా ఓ దొంగా బిజినెస్ లో పార్టనర్స్ అని అనుకోకుండా నేను వినటం జరిగింది.
ఆఫీసు వదిలిపెట్టిం తర్వాత టైపు చేయవలసిన కాగితాలు మిగిలివుంటే నేను లోపలే వుండిపోయాను. అది తెలియని రావుగారు, సుధీర్ వస్తే వాళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకోవటం నేను వినటం జరిగింది. వాళ్లకి తెలియకుండా అక్కడనుంచి వచ్చేద్దామనుకున్నా. కానీ వారికంట పడనేపడ్డాను. వాళ్ళు నన్ను అనుమానించారు. ప్రాణం తీయబోయారు. అప్పుడు మా ఇంటి పరిస్థితి చెప్పి కాళ్ళా వేళ్ళా పడ్డాను. నాకు ప్రాణంమీద తీపి లేదు- కానీ మావాళ్ళు రెండు పూటలా కడుపుకింత తిండి తినాలంటే నా జీవితమే ఆధారం అని చెప్పాను.
వాళ్లు కొద్దిసేపు చర్చించుకున్నారు. వాళ్లు చెప్పే చిన్న చిన్న పనులు నేను చేయాలి. అలా చేస్తే నా జోలికి రారు. నా ప్రాణం తీయరు. పనిచేసినప్పుడల్లా వేరే పారితోషికం ఘనంగా ఇస్తారు. నా వల్ల ఈ విషయం ఏ మాత్రం బయటికి వచ్చినా నా పని ఫినిష్ చేసేముందు నా కళ్ళ ఎదుట మా ఇంట్లో అందరినీ చిత్రవధ చేసి ఆ తర్వాత నన్ను ఎన్ని విధాల చంపొచ్చో అన్ని విధాలా చంపుతామని చెప్పారు. ఇదేగాక నా నోటితో చెప్పలేను. అంత అసభ్యవిషయాలతో బెదిరించారు.
వాళ్లు చెప్పే పనులు చేయటానికి ఒప్పుకున్నాను. నా వాళ్ళ జోలికి, నా శరీరం జోలికి రాకూడదని కండిషన్ పెట్టాను. వాళ్ళు ఆమోదించారు. నేను నేరస్తురాలినయ్యాను. నాకు తెలుసు నేను చేసేపని మంచిది కాదని. ఎప్పటికైనా ఇది ప్రమాదమే. పాపం పండక మానదు అని నాకు తెలుసు. వాళ్ళ మనిషినని పూర్తిగా నమ్మకంగా వాళ్ళు చెప్పేపని చేసేదాన్ని. లోలోపల మాత్రం సమయం రాకపోతుందా అని నా జాగ్రత్తకోసం ఎన్నో విషయాలు వాళ్ళవి నా డైరీలో భద్రపరిచాను. వాళ్ళ రహస్యాలు చాలా నాకు తెలుసు.
దీప్తి చెపుతుంటే మధ్యలో అడ్డుతగిలి అన్నాను.
"నాకు తెలుసు దీప్తీ! నీవు చాలా తెలివికలదానివి. నీ చురుకు చూపులు ఈ విషయం చెపుతుంటాయి."
దీప్తి ఏదో అనబోయింది. నాయర్ టీ తీసుకురావడంతో మౌనం వహించాము.
టీ తాగిన తరువాత దీప్తి మళ్ళీ చెప్పటం మొదలు పెట్టింది.
"వన్ మినిట్!" అంటూ లేచి వెళ్ళి అర్జున్ కి ఫోన్ చేశాను. అర్జంట్ గా రమ్మని.
అర్జున్ వచ్చే లోపల దీప్తి మొత్తం చెపితే మా పని వేగిరం పూర్తి అవుతుంది. వెంటనే రంగంలోకి దిగటానికి వీలు కలుగుతుంది.
35
"చెప్పనా?" ఆమె అడిగింది.
"నీదే ఆలశ్యం" నవ్వుతూ అన్నాను.
ఆమె మళ్ళీ చెప్పటం మొదలు పెట్టింది.
"నవలలు రాసే చాటు రచయిత శ్యామలరావు. అంతవరకూ నాకు తెలుసు. నవలలో కోడ్ వుంటుందని తెలుసు. అయితే అదెలాంటి రహస్య విషయమో మాత్రం నాకు బొత్తిగా తెలియదు. ఆ రోజు కంకణం లాంటి గాజులో లెటర్ పెట్టి ఫ్యాన్సీ షాపులో ఇచ్చాను. అది ఆ షాపులో అతను మరొక అమ్మాయికి అందిస్తాడు. అలాగే షాక్ నవల వుందనుకోండి. దానిలో రహస్య సమాచారం ఎలా చేర్చేది అలాంటి మరో ముఠాతో వాళ్లకి మాత్రమే తెలుసు. వీళ్ళు వాళ్ళని చూడరు. వాళ్ళు వీళ్ళని చూడరు. నవల ద్వారా అందే సమాచారంతో పనులు చేస్తుంటారు. అంతవరకూ నేను గ్రహించ గలిగాను. నవల తయారు చేయటానికి వాళ్ళకి సొంతవి ప్రింటింగ్ మిషన్లు కూడా వున్నాయి."
"షాక్ నవలని "రుధిర మందారం" కోడ్ చెప్పి ఎప్పుడైతే మీరు తీసుకు వెళ్ళారో అప్పుడు వాళ్ళకి అద్దె పుస్తకాల షాపు అతని మీద, నా మీద అనుమానం వచ్చింది. నన్ను అనుమానిస్తే చంపేయండి అన్నాను ధైర్యంగా. అతను ఎదురు తిరిగాడు. నా కళ్ళముందే హత్య చేశారు. ఆ తర్వాత సుధీర్ గారు, రావుగారు, శ్యామలరావుని పిలిచి షాక్ నవల గురించి పోట్లాడారు. దానిలో కోడ్ పెట్టటం మర్చిపోయానన్నాడు శ్యామలరావు. ఏదో దాస్తున్నావు నిన్ను దీనికోసం నియమించాము. అలాంటప్పుడు ఎలా మర్చిపోతావు? పైగా అవతల వాళ్ళు ఎవరూ చెప్పకుండా ముఖ్య విషయం తెలిసిపోయింది. అంటూ ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత మామూలుగానే వున్నారు. మళ్ళీ వారం తర్వాత ఏం జరిగిందో తెలియదు. శ్యామలరావు భార్య హత్య చేయబడ్డారు. అయితే శ్యామలరావుని హత్య చేసింది సుధీర్ వాళ్ళు కాదనుకుంటాను. వీళ్ళు ఆ విషయంలో గడబిడ పడుతున్నారు.
ఈరోజు నా అంతట నేను వాళ్ళ స్థావరానికి వెళ్లాను. ఎప్పుడయితే రంగరాజు శ్యామలరావుల హత్యలు జరిగి ఆ విషయం బైటికి వచ్చిందో అప్పుడు వీళ్ళు అన్ని పనులు మానేసి చేతులు కట్టుకుని వుండిపోయారు. నా రాక వాళ్ళకి తెలియదు. నే వెళ్ళేసరికి నా గురించి మాట్లాడుకుంటున్నారు. చాటుగా వుండి వింటున్నాను. నా మీద కూడా అనుమానం వుంది వాళ్ళకి కనుక హత్య చేసి పారేసి మన ముఠాలో పనులు చేయటానికి కొత్త వాళ్ళని తీసుకుందామని రావుగారు, పిల్లది బాగుంటుంది. మరో హత్యచేసి గోల పడటం దేనికి! గల్ఫ్ దేశానికి అమ్మేద్దాము. వాళ్ళు వాడుకున్నాన్నాళ్ళు వాడుకుని కైమా చేసుకుంటారు. అని సుధీర్ గారు అనుకుంటున్నారు. నేను మెల్లగా ఇవతలికి వచ్చాను. నేను రావటం ఎవరూ చూడలేదనుకున్నాను. నన్ను చంపటానికి నా వెనుకనే మనుషులు రావటం చూసి కాళ్ళకి బుద్ధి చెప్పాను.
నేను వాళ్ళని చూసుకోకపోయినట్లయితే నా ప్రాణం అప్పుడే హరీ అనేది. వెంట్రుక వాసిలో మృత్యువు తప్పింది.
అంతవరకూ చెప్పి ఆ విషయం గుర్తుకు రావటంతో దీప్తి కొద్దిసేపు ఆగింది.
అర్జున్ బూట్లు టకటక లాడించుకుంటూ లోపలికి వచ్చాడు.
పరస్పరం పరిచయం చేశాను.