Previous Page
రుధిర మందారం పేజి 39

    "ఇప్పుడు మనం చేయవలసింది?" అర్జున్ అడిగాడు.
    "చెపుతాను. టైము లేదు. వెంటనే మనం రంగంలోకి దిగాలి...అంటూ అప్పటికప్పుడు నేను వేసిన పధకం వివరించటం మొదలుపెట్టాను.
    అర్జున్ చాలా శ్రద్ధగా వింటూ మధ్యలో ప్రశ్నలు వేస్తున్నాడు.
    దీప్తి కూడా చాలా శ్రద్ధగా వింటూ వుండిపోయింది.
    గంట తర్వాత ముగ్గురం లేచాము.
                                         36
    నా ప్లాను సక్సెస్ అయిన సందర్భంలో నాకు ముఖ్యమైన వాళ్ళకి టీ పార్టీ ఇచ్చాను.
    బాగుంది, జీడిపప్పు పకోడి రసగుల్లా కట్ లెట్ టీ తాగి వాళ్ళకి టీ పార్టీ ఇచ్చాను.
    "అందరి ఫలహారాలూ పూర్తి అయ్యాయి. ఇంక కథ కానియ్యి మిత్రమా!" ఓ మిత్రుడు అన్నాడు.
    "నిజంగా జరిగిన కథ ఇది." అన్నాడు.
    "పోనీ అది చెప్పు."
    "జరిగిందంతా వివరంగా చక్కగా ఒక్కటే, శ్యామలరావుని హత్యచేసి అతని ఇంటిలో పడేశారని అనుకున్నాం కదా! అది శ్యామలరావు శవం కాదు. శ్యామలరావు అవతలి ముఠాలో చేరాడు. ఆ విషయం బయట పడకుండా ఉండటానికి ఆ ముఠా వాళ్ళ ప్లాను అది ఎవరినో అదే ఎత్తు, లావు వున్న వాళ్ళని చంపి ఇంట్లో పడేశారు. ఇప్పుడు అతను రూడా పట్టుబడ్డాడు. ఈ రెండు ముఠాల వాళ్ళకి మన శత్రుదేశాలతో సంబంధాలున్నాయి. ఇంత పెద్ద ముఠాల వాళ్ళని పట్టుకోవాలంటే చాలా శ్రమించాలి. ఎన్నో హత్యలు జరగాలి. నానాగోల కావాలి. కాని అదేమీ జరగకుండా అందరినీ పట్టేశామంటే కారణం ఓ అందాల సుందరి నాకంట పడటం..." అంటూ ఆగాను.
    "ఎవరా అందాల సుందరి!" దీప్తి గురించి తెలియనివారు అరిచారు.
    దీప్తిని పిలిచాను దగ్గరకు రమ్మని.
    దీప్తి తడబడు అడుగులతో కలహంసలా నా దగ్గిరకు నడిచి వచ్చి నా పక్కన నుంచుని అందరికీ నమస్కారం పెట్టింది.
    "ఈమె నేను చెప్పిన అందాల సుందరి ముద్దు పేరు బన్నీ, అసలు పేరు గుంటూరు చాంతాడంత వుంటుందని వాళ్ళ నాన్నగారు చెప్పారు. చాంతాడుకి చివర రెండే అక్షరాలూ వున్నాయి. అది దీప్తి..." అన్నాను.
    సరదాగా ఎవరో అడిగారు. "మరి రుధిర మందారం ఎవరు?"
    "అది సీక్రెట్ కోడ్" చెప్పాడు.
    ఓ గంట తర్వాత అందరూ సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు.
    "ఇప్పుడు యేం చేద్దాం!" ఆంటీ అందరూ వెళ్ళిం తరువాత అడిగింది.
    ఇంక ముసుగులో గుద్దులాట దేనికని డైరెక్టుగా రంగంలోకి దిగాను.
    "ఆంటీ! పెళ్ళి కూతురు నాకు నచ్చింది. మరి పెళ్ళికూతురుకి నేను నచ్చానో లేదో తెలియదు. ఆ విషయం కనుక్కుని నీ చేతుల మీద నా పెళ్ళి చేయవచ్చు. గ్రీన్ సిగ్నల్ అనగా మ్యారేజి సిగ్నల్ ఇచ్చేశాను. ఇంక నీ ఇష్టం" వినయంగా అన్నాను.
    "ఏమ్మా! మా వాడు అలా అంటున్నాడేమిటి! ఆంటీ దీప్తిని అడిగింది.
    "నాకేం తెలుసండీ! పెళ్ళి కూతురుని ఇష్టపడినప్పుడు పెళ్ళి కొడుకు మగవాడు కాబట్టి ఓ అడుగు ముందుకు వేసి ధైర్యంగా ఆ పిల్ల ఎవరో చెప్పాలి." దీప్తి అంది.
    "ఇంతేనా ఇంకేం లేదా?" ఆంటీ అమాయకంగా అడిగింది.
    "ఉహు."
    "పెళ్ళి కూతురు ఎవరో తెలుసుకోవాలని నీకు లేదా?"
    "ఉంటేమాత్రం ఎలా తెలుస్తుంది ఎవరూ చెప్పందే!" గడుసుగా అంది దీప్తి.
    "ఇందాక ఎవరూ చూడకుండా పెళ్ళి కూతురు మా వాడి చేతిని గట్టిగా గిచ్చి పెట్టింది."
    ఆంటీ అనంగానే దీప్తి ముఖం సిగ్గుతో వాలిపోయింది.
    "మా వాడు ఇష్టమేనా?" ఆంటీ ఆమె భుజం మీద చేయి వేసి అడిగింది.
    "తొందరగా చెప్పమ్మా వదినా! వాడి పెళ్ళి తరువాత నేను రెడీగా వున్నాను" అర్జున్ అన్నాడు.
    దీప్తి దోసిట్లో ముఖం దాచుకుంది.
    ఆంటీ కనుసైగ చూసి ఆంటీతో సహా అందరూ బయటికి వెళ్ళిపోయారు.
    ముఖం మీద నుంచి దీప్తి చేతులను తొలిగిస్తూ "ఇదంతా సిగ్గేనా!" మృదువుగా అడిగాను.
    "అందరూ ఉండగా ఇదేం పని?" ఆమె ఓ అడుగు వెనక్కు వేస్తూ నెమ్మదిగా అడిగింది.
    "చుట్టూ చూసి మాట్లాడు."
    దీప్తి చూసింది.
    ఎవరూ లేకపోవటంతో ఆమె అక్కడ నుంచి పారిపోవబోయింది. చటుక్కున చేయి అందుకుని దగ్గరకు తీసుకుని నుదుటి మీద మృదువుగా ముద్దు పెట్టుకున్నాను.
    "విజయ్! ఇది కల కాదు కదా!"
    "కాదు."
    "నాకింత అదృష్టం నమ్మబుద్ది కావటం లేదు."
    "నన్ను నమ్ముతున్నావు కదా!"
    "ఆ..."
    "అయితే ఇది కూడా నమ్ము. ఈ ముద్దు గుర్తుపెట్టుకో."
    "ఇంత ఆత్రం పనికి రాదు." ఆమె నవ్వుతూ అంది.
    "నిజమే. ఆంటీ ఆశీర్వాదం పొందుదాం పద" అన్నాడు. ఆమె నా చేయి పట్టుకుంది.
    దీప్తి నేను చేయి చేయి కలుపుకుని అడుగు ముందుకు వేశాము.
                                      * THE END *   
            

 Previous Page