Previous Page Next Page 
రుధిర మందారం పేజి 37

    జేబులోంచి చిల్లర తీసి ముష్టివాడి చేతిలో వేసినట్టు వేశాను. అతను దండాలు పెట్టి వెళ్ళిపోయాడు.
    నేను ముందుకు సాగాను.
                                          34
    సడన్ బ్రేక్ తో స్కూటర్ ని నడిరోడ్డు మీద ఆపాను. దీప్తి నా ఎదురుకుండా పరుగెత్తుకు వస్తున్నది.
    రాత్రి పదిగంటలు అది చిన్న వీధి కావటంతో వీధి నిర్మానుష్యంగానే వుందని చెప్పవచ్చు.
    లైట్ల వెలుగులో దీప్తిని గుర్తుపట్టాను.
    నాలుగంగల్లో వగరుస్తూ దీప్తి నా దగ్గరకు వచ్చింది. "ప్లీజ్! వాళ్ళెవరో నన్ను చంపటానికి నా వెనుకపడ్డారు. నన్ను రక్షించండి" అంది. యీ మాట కూడా ఓపిక కూడ దీసుకుని ఆయాస పడుతూ చెప్పింది.
    దీప్తి తీరు మరో రెండు నిమిషాలు ఆగితే ఫెయింట్ అయి పడిపోయేటట్లు వుంది.
    "క్విక్, స్కూటర్ ఎక్కు" అన్నాను.
    దీప్తి ఆలోచించలేదు. స్కూటర్ ఎక్కి కూర్చుంది.
    స్కూటర్ ని గిర్రున వెనక్కి తిప్పి అక్కడనుంచి ముందుకు దూసుకుపోయాను. ఇరువురు వ్యక్తులు పరుగున రావటం నా కళ్ళపడింది.
    గట్టిగా రొప్పుతూ దీప్తి నామీద వాలిపోయి నన్ను గట్టిగా పట్టుకుంది. నేను ఎవరు ఎక్కడికి తీసుకెళుతున్నాను అనే చిన్న ఆలోచన కూడా దీప్తి అప్పుడు చేసే స్థితిలో లేదు.
    ఓ స్నేహితుడిని కలుసుకొని అది దగ్గర దారని అటు రావటం నిజంగా దీప్తి అదృష్టం. నేను అటు రాకపోతే..."
    ఆపై నేను ఆలోచించదల్చుకోలేదు.
    సరాసరి దీప్తితో ఇంటికి వచ్చాను.
    స్కూటర్ ఆపి "దిగు" అన్నాను రెక్క పుచ్చుకొని.
    దీప్తి అంతవరకూ ఆలోచిస్తున్నదేమో అప్పుడు తెలివి తెచ్చుకుంది.
    "ఎక్కడికి వచ్చాము!" అంది.
    "మా ఇంటికి"
    "థాంక్స్ ఆపదలో ఆడుకున్నారు. ఓ రిక్షాలిపిస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను.
    "అలాగే టీ తీసుకుని వెళుదువు గాని. నేనే మీ ఇంటిదాకా వచ్చి దిగబెడతాను. నాయర్" అంటూ గట్టిగా కేక వేశాను.
    "అతను పరుగెత్తుకుంటూ వచ్చాడు." అతనితో ఏం చేయవలసిందీ చెప్పాను.
    "నీకు నమ్మకం అయితే లోపలికివచ్చి టీ తాగి వెళ్ళవచ్చు. మగవాళ్ళంతా మృగాలు కాదు" అంటూ ముందుకు అడుగు వేసాను.
    దీప్తి ఏమనుకుందో మారు మాట్లాడకుండా లోపలికి నా వెనుకనే వచ్చింది. సోఫాలో కూర్చోమంటే కూర్చుంది. నాయర్ కూల్ డ్రింక్ ఇస్తే రెండుగుక్కల్లో తాగింది. నా కనుసైగ గ్రహించి నాయర్ వెళ్ళిపోయాడు.
    దీప్తి తనంతట తానుగా ఓ కాకమ్మ కధ చెప్పింది.
    నేను దీప్తి పక్కకివెళ్ళి కూర్చున్నాను. నన్ను అనుమానంగా చూచి దీప్తి పక్కకు జరిగింది.
    "దీప్తీ! నీ విషయం మొత్తం నాకు తెలుసు. నీవు భయపడనవసరం లేదు. నేనే బ్రహ్మశాస్త్రిని. నేను ఎవరో నీకు తెలియక తికమక పడుతున్నావ్ కదూ...!" అంటూ నేను సి.ఐ.డీ. నని ఆరోజు అద్దెపుస్తకాల షాపులో చెమిటి ఆయనగా నటించి రుధిరమందారం కోడ్ ని వినటం. షాక్ నవలా రచయిత రాసిన తతిమ్మా నవలలు చదివి నేను పరిశోధనలోకి దిగటం అంతకుక్రితమే వకరోజు ఫాన్సీషాపులో నేను ఆమెని చూసి అనుమానపడటం. ఆంటీకి యీ రకం గాజుమాత్రమే కావాలి అని అడగటం అంతా పూసగుచ్చినట్లు చెప్పాను.
    నే చెప్పింది విని ఆమె ఆశ్చర్యపోయింది.
    "దీప్తీ! నీవు నేరస్తురాలివి కాదని బలవంతంగా ఆ ముఠా నిన్ను నేరస్తురాలిని చేసిందని నేను గాఢంగా  నమ్ముతున్నాను. నీవు నిర్దోషివైతే డోంట్ వర్రీ నిన్ను నేను రక్షించుకుంటాను" ఆమె చేతిని నా చేతిలోకి తీసుకుని అన్నాను.
    ఆమె ఒక్కసారిగా భోరుమంది.
    ఆమెని ఓదార్చేపని నేనెంతమాత్రం చెయ్యలేదు. ఎంత ఏడిస్తే అంతగా మనసులో బరువు దిగిపోతుందని నాకు తెలుసు.
    దీప్తి చెయ్యి మౌనంగా నిమురుతూ వుండిపోయాడు. అలా బేలగా గుండె పగిలేలా ఏడుస్తున్న దీప్తిని నా కౌగిట్లోకి లాక్కుని హృదయానికి హతుకుని "దీప్తీ! నీకు నే వున్నాను. డోంట్ వర్రీ అన్నీ నేనే చూసుకుంటాను" అని చెప్పాలనిపించింది.
    నాది వన్ సైడ్ లవ్. ప్రప్రధమంగా ఆ సాయంత్రం అందాల సుందరి దీప్తిని చూసి ఆ అందం నన్ను అయిస్ కాంతంలా ఆకర్షిస్తుంటే ఆమెతోపాటు ఫాన్సీ షాపులో అడుగుపెట్టాను. అక్కడ జరిగిన గాజుల సంఘటనతో ఆమెపై అనుమానం మొదలయింది. ఆ తర్వాత ఎన్నో జరిగాయి. మోసగత్తె అనుకున్నాడు. ఆ ఇంటి పరిస్థితి చూసింతర్వాత ఆమెను నయానో, భయానో ఓ ముఠా వారి పనులకు వాడుకుంటున్నదని గ్రహించాను. వాళ్ళ బారి నుంచి ఆమెను రక్షించాలి అనుకున్నాను నేను. ఆమెను ఇష్టపడుతున్నాను. ఆమె స్థితి తెలియదు. ఇప్పుడే నన్ను చూసి నా గురించి పూర్తిగా తెలుసుకున్న దీప్తి నన్ను ప్రేమించాలి కదా!
    ఆమె ఏడుపు కొద్ది సేపట్లో ఆగిపోయింది.
    నా ఆలోచన ఆగి పోయింది.
    "దీప్తీ! నేను సి.ఐ.డి. నే కాదు - నీ శ్రేయోభిలాషిని. నీవు పూర్తి నిజం చెపితే రక్షించగలుగుతాను" అన్నాను.
    ఆమె ఏమనుకుందో "మొదటినుంచీ చెబుతాను" అంది.
    "గుడ్, నువ్వు అందమైన అమ్మాయివే కాదు - మంచి అమ్మాయివి కూడా" ఆమె చేతిని నా చేతికి తీసుకుని ప్రేమగా నిమురుతూ అన్నాను.
    ఆమె నా చేతిలోంచి తన చేతిని లాక్కోలేదు గానీ చిరుకోపంతో చురుక్కుమనేలా చూసింది.
    భుజాలు ఎగరేసి వూరుకున్నాను.
    ఆమె తల వంచుకుని నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టింది.
    "వన్ మినిట్!" అని లేచివెళ్ళి ఫ్రిజ్ లోంచి అయిస్ వాటర్ తెచ్చి ఇచ్చాను.

 Previous Page Next Page