Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 37

    అది కరాటే.

    వీళ్ళలో కొందరు కరాటే స్త్రీలకు మాత్రమే నేర్పటానికి కరాటే స్కూలు తెరిచారు. అవి దేశంలో వివిధ చోట్ల వున్నాయి. ముఖ్యంగా నా సహచరులు స్త్రీలకే నేర్పటం ఆ పని ఈ మధ్యనే చేయటంవల్ల ఇంకా దేశ వ్యాప్తంగా అందరికి తెలియదు. కరాటే స్కూలు అనండి లేక శిక్షణాలయం అనండి, చాలా మందికి తెలిసింది ఒకటుంది.

    బుడకోయ్ కరాటే ట్రయినింగ్ స్కూలు. 17. యం.వేణు గోపాల అవెన్యూస్టర్ టాంకురోడ్, చట్ ఫట్, మద్రాసు-600003.

    అలా కరాటే శిక్షణాలయం ఒకటి ప్రత్యేకంగా స్త్రీలకోసం నేను మీ అందరి సహకారంతో ఆశీస్సులతో తెరవాలనుకుంటున్నాను. ఇప్పటికి పూర్తిగా విషయం మీకు అర్ధమయే వుంటుంది. నేను పాంప్లెట్లు విచిత్ర రీతులలో రాసిన మాటలతో పంచటం, ఇప్పుడు మీ ముందు ప్రదర్శన, మీ ఎదుట నిలిచి ఈ నా స్పీచ్ అన్నీ కూడా అందు నిమిత్తమే.

    ఈ కాలంలో సూది మొదలు ప్రింటింగ్ మిషన్ల వరకు ప్రాపగాండ వింత వింత పబ్లిసిటి. ఇది మీ అందరికి తెలిసిందే. నేను అదే మార్గం ఎన్నుకున్నాను. పాంప్లెట్లలో రాతలు మీకు కాస్త చిరాకు గాని, భయంగాని కలిగించి వుంటే క్షమించమని అడుగుతున్నాను.

    ఇంక, విషయానికి వస్తే, ణ గురించి పెద్దగా చెప్పుకోవలసింది ఏమీలేదు. నా వాళ్ళంటూ వున్నారు. కాని దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం ఒంటరిదాన్ని, నే చదివిన బి.యస్సీ.తో ఏ చిన్న జాబ్ రాలేదు. లంచం, పలుకుబడీ రికమండేషన్ లాంటి ఉత్తర దక్షిణ ధృవాలు నాకు అందుబాటులో లేకపోవటమే. ఈ పరిస్థితులలో నేనేం చేయాలి!

    చదువుకున్నాను. ఉద్యోగం రాలేదు. చదువుకుంటున్న రోజుల్లోనే కరాటే జూడో నేర్చుకోటం మొదలుపెట్టాను. చిన్నతనం నుంచీ నేర్చుకోటంవల్ల ఈ విద్యలో కొంతవరకు నిపుణత సాధించాను. అయితేగియితే ఇహ ఈ విద్య నన్ను బతికించాలి అనుకున్న నేను నిరాశలోంచి బైటపడి ఆశామార్గం వేపు దృష్టి సారిస్తూ కరాటే స్కూలు తెరుస్తున్నాను.

    లావుపాటి వాళ్ళు కాస్త వయసు మళ్ళిన వాళ్ళు కరాటే నేర్చుకోటానికి కొంచెం ఎక్కువ శ్రమపడాలి. శరీరం పాము మెలికలు తిరగటం, ఎటుపడితే అటు వంగటం, బొంగరంలా గిర్రున తిరగటం, స్ప్రింగ్ లా పైకి లేవటం లాంటివి ఇప్పటిలో అసాధ్యమే అయినా కరాటేలోని కొన్ని పట్లు నేర్చుకోవచ్చు. ఆత్మరక్షణకి ఎంతో కొంత వుపయోగించుకుని తనని తాను కాపాడుకోవచ్చు. ఎలా అంటే దౌర్జన్యంగా మీదకి వచ్చేవాడికి కరాటే జూడోలాంటి విద్యలు రాకపోతే వీళ్ళు పట్టే ఒక్క పట్టు చాలు శతృవు తోక ముడవటానికి, అలా అన్నమాట.

    ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితి వేపు పయనిస్తున్నది. పాప భీతి నశించింది. గల్ఫ్ దేశాలకు అమ్మాయిలను అమ్మే వాళ్ళు తయారయారు. అమ్మాయిలని బలవంతానా ఎత్తుకెళ్ళి వ్యభిచార గృహాలకి అమ్ముతున్నారు. చదువుకున్న స్త్రీ కూడా కొన్ని వేధింపులకి గురి అవుతున్నది. ఈ పరిస్థితులలో ప్రతి స్త్రీ కరాటే నేర్చుకోటం మంచిది. ఈ విద్య టైపు నేర్చుకోటం లాంటిది కాకపోవచ్చు. అయినా ఆపదలో ఆదుకునేది.

    కరాటే స్కూలు నేను ఈ వూళ్ళో తెరుస్తున్నాను. నేను ఒక్కదాన్నే దానిని నిర్వహిస్తాను. మీలో ఎవరికైనా కరాటే నేర్చుకోవాలని వుంటే, మీ పిల్లలకి నేర్పించాలని వుంటే మీరు, మీ పిల్లలు నా శిక్షణాలయంలో చేరవచ్చు. రోజూ ఒక గంట కలం క్లాసు వుంటుంది. బోధన ఎలాగు! ఎప్పుడు! ఏమేం చేయాలి! అన్నది చేరే ముందు వివరిస్తాను.

    ఆత్మరక్షణకి నేను నేర్చిన ఈ విద్య నాకు అన్నం పెట్టగలదనే ఆశతో ఈ స్కూలు తెరిచాను. అప్పనంగా డబ్బు సంపాదించాలని నేనీ కబుర్లు చెప్పటం లేదు. ఇంత ఇమ్మని కూడా నేను మిమ్మల్ని కోరటం లేదు. ఒక నెల రోజులు నా వద్దకొచ్చి కరాటే నేర్చుకోండి. మీకు నచ్చితే నేర్చుకోవాలన్న కోరిక మీకుంటే మీ యిష్టమొచ్చినంత ఎంతో కొంత డబ్బు ఇద్దురుగాని, మీ శక్త్యానుసారం ఎంత యిచ్చినా సంతోషమే. దీనిలో బలవంతం లేదు. మీరు ఈ నెలరోజులు నేర్చుకుని ఓ వేళ మీకు నచ్చకపోతే నేర్చుకోటం విరమించుకోవచ్చు. పైసా యివ్వనక్కరలేదు. మా ప్రదర్శన చూశారు. నేను చెప్పింది విన్నారు. ఫైనల్ నిర్ణయం మీది. మీ యిష్టం మీరెలా చేసినా అది సంతోషమే. 

 Previous Page Next Page