Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 36

    అంటూ దీక్ష క్షణకాలం ఆగింది.

    అందరికి అప్పుడు గుర్తుకు వచ్చింది సగంలో ఆగిపోయిన ఆ కథ. 'అరె ఎలా మరిచి పోయాము?' ఎవరికి వారే అనుకున్నారు.

    వాళ్ళు అంతగా మరచిపోయేటట్లు చేసింది దీక్ష.

    అలా కథ చెప్పటం యిలా ప్రదర్శన మొదలు ఆ వెంటనే స్పీచ్ చకచక ఒకదాని వెంట ఒకటి జరిగిపోతుంటే ఇంకా ఆలోచించటానికి టైము ఎక్కడ?

    దీక్ష మొదటి నుంచీ గొప్ప సస్పెన్సుని క్రియేట్ చేస్తున్నది. ఇప్పుడు చేసింది. అది యింకా వాళ్ళెవరూ గుర్తించలేదు.

    దీక్ష చెప్పబోయే అమ్మాయి కథ వినటానికి అందరూ కుతూహలం చూపించారు.

    అందరి ముఖాలలోని క్యూరియాసిటీ చూసి దీక్ష తృప్తిగా నిట్టూర్పు విడిచింది.


                       - 17 -

    దీక్ష నెమ్మదిగా పెదవి కదిపింది.

    "నేను చెప్పిన అనగనగా ఓ అమ్మాయి. మా అందరిలో ఒకమ్మాయి. ఇప్పుడా అమ్మాయి ఏం చేస్తున్నది? పెళ్ళి చేసుకుందా, ఉద్యోగం చేస్తున్నదా, హాయిగా వుందా, విచారంగా వుందా ఇలా ఎన్నో అనుమానాలు ఇప్పటికే మీకు వచ్చి వేధిస్తుంటాయి అవునా? మీలో అనుమానం ప్రవేశపెట్టిన నేనే ఆ అనుమాన పిశాచాన్ని కూడా పారదోలాలి. అది న్యాయం.

    అనగనగా ఓ అమ్మాయి ఇప్పుడు మీ కళ్ళ ఎదుట స్టేజీ మీద వుంది. అమ్మాయి కింకా పెళ్ళికాలేదు. "మీరు నాకు పెళ్ళి చేయనక్కర లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నా బతుకు నేను బతకగలను అంది." దాంతో యింట్లో గోల అయింది, అమ్మాయి ఇంట్లోంచి బైటికి వచ్చేసింది. ఇంట్లోంచి బైటికి రాగానే సరికాదు. ఎన్నో వడిదుడుకులు ఒంటరిగా తట్టుకోవాలి.

    ఒక్కసారి గతంలోకి వెళితే.... మీ ముందు వున్న ఈ అమ్మాయిలందరు నాతోపాటు చదువుకున్నారు, చదువుతోపాటు కరాటే, జూడో నేర్చుకున్నారు. ఈ విద్యలో కూడా అందరం ప్రావీణ్యం సంపాదించాము. సంగీతం, నాట్యము, పరుగుల రాణి పి.టి. ఉషలాగా మరికొన్ని విద్యలలోకి ఆడపిల్లలంతా ముందుకు వస్తుంటే కరాటే నేర్చుకోటంలో తప్పేమిటి? ఇదీ ఒక విద్య. స్త్రీ పురుషులు యిద్దరూ నేర్చుకోగలిగిన విద్య. విద్య. ఆత్మరక్షణకి అపాయంలో తప్పించుకోటానికి, ఆరోగ్యానికి అన్ని విధాల మంచి విద్య.

    ఈ రోజుల్లో ఆడవాళ్ళకి స్వేచ్చా స్వాతంత్ర్యాలు వున్నాయి. పనికి వొచ్చే విద్య నేర్చుకుంటే ఎవరూ తప్పుపట్టరు. చదువు ఒక్కటే కాకుండా ఎన్నో ఆటల్లో పోటీల్లో మరెన్నో విద్యల్లో పాల్గొంటున్నారు. అంట్లుతోమటం, బట్టలుతకటం, కుట్లు, అల్లికలు, రంగవల్లులు తీర్చిదిద్దటం, వండివార్చటం అన్నింటిలో నిపుణత సాధించిన స్త్రీలు, కత్తిపట్టి డాక్టరు, కలంపట్టి రైటరు, చేతులు తిప్పి నాట్యం, చేతులు వుపయోగించి కరాటే సమానంగా అభ్యసించ గల స్టేజీలో వున్నారు.

    మనదేశంలో ఇంకా స్త్రీలు నేర్చుకునే విషయంలో కరాటే పూర్తి వృద్ధి చెందలేదు. ఎందుకంటే ఈ పవిత్ర భారతదేశంలో స్త్రీ మానప్రాణ రక్షణకి ఢోకాలేదని అనుకోవటం, ఆ భ్రమలో వుండటం ఇది ఎంతమాత్రం నిజం కాదు. ఈ కాలంలో దాదాపు ప్రతి యింట్లో ఆడపిల్లా చదువుకుంటున్నది.ఎక్కువమంది స్త్రీలు దేనికో దానికి బజార్లకి వెళ్ళవలసి వస్తున్నది. కొందరు ఉద్యోగాలు చేయక తప్పటం లేదు. ఇది అందరికి చాలా తెలిసిందే.

    ఓపక్క వరకట్నం చావులు. మరోపక్క రౌడీమూక దుశ్చర్యలు, వేరొకపక్క కామాంధులు, స్త్రీల పాలిట ఈ కీచకులు చాలక రాక్షస రక్షకభటులు చాటుమాటు భక్షణ వ్యవహారం. ప్రస్తుత పరిస్థితులలో ఆపదలో స్త్రీ తననుతానే రక్షించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బస్సులో కానీండి రోడ్డుమీద కానీండి ఒక అమ్మాయిని ఏ తుంటరి వేధిస్తుంటే అసహాయురాలైన ఆ అబలని అందరూ వినోదంగా చూస్తారు.

    కారణం!

    ఆడది కాబట్టి అబల కాబట్టి. అదే స్త్రీ  సబల అయి ఎదురు తిరిగితే తోక ముడుస్తుంది ఆ పశువు. కనుక ప్రస్తుత పరిస్థితులలో ప్రతి స్త్రీ సబలగా మారటం ముఖ్యం, తప్పనిసరి అవసరం. సబలగా మారాలంటే వుత్త ధైర్యం చాలదు. ధైర్యానికి మెలుకువ చాకచక్యము బలము తోడు కావాలి. ఇవన్నీ తోడు కావాలంటే నేర్చి వుండాలి ఒక విద్య.

 Previous Page Next Page