నా కడుపు నింపుకోటానికి నేనీ మాటలు చెప్పటం లేదు. కాని... నా కాళ్ళమీద నేను నిలబడటానికి మీ సాయం కావాలని వినమ్రంగా కోరుతున్నాను. మీ మీ ఆశీస్సులని పొందాలని ఆశిస్తున్నాను. చివరగా ఈ నాలుగు మాటలు చెప్పి ముగిస్తాను....."
అంటూ దీక్ష సుదీర్ఘ ఉపన్యాసం తరువాత తన ఎడ్రస్ యిస్తూ ముగింపు మాటలు చెప్పింది.
స్టేజీ మీద వున్న అమ్మాయిలని క్లుప్తంగా పరిచయం చేసింది. తను పిలవగానే శ్రమ అనుకోక ఆయా వూళ్ళనుంచి వచ్చి ఈ ప్రదర్శనలో ఉచితంగా పాల్గొని తనకి సహకరించిన స్నేహితురాళ్ళు సహచరులకి కృతజ్ఞతలు చెప్పింది.
ఈ తతంగం అంతా పూర్తి అయిన తరువాత సభ ముగించినట్లు చెపుతూ వచ్చిన అందరికి వినమ్రంగా ముకుళిత హస్తాలతో నమస్కారం పెట్టింది దీక్ష.
అందరూ లేచారు. కొందరు దీక్ష దగ్గరకు వచ్చి వెళ్ళొస్తామమ్మా! ప్రదర్శన బాగుంది లాంటి మాటలు మాట్లాడి శలవు తీసుకున్నారు. కరాటే నేర్చుకోవటానికి వస్తామని మా పిల్లలని, పంపిస్తామని గాని వాళ్ళలో ఒక్కరూ చెప్పలేదు.
అంతా వెళ్ళిపోయారు.
దీక్ష, దీక్ష సహచరులు మిగిలారు.
అంతా వచ్చారు, చూశారు, విన్నారు, వెళ్ళారు. ఈ ప్రదర్శనగాని ఈ స్పీచ్ గాని ఎవరిని కదిలించినట్లు కనపడలేదు. రెస్పాన్స్ కూడా రాలేదు. అయితే ఏ గోల లేకుండా చక్కగా చూశారు విన్నారు. అదొక్కటే ప్రస్తుతానికి జరిగిన మేలు. తలో రాయి విసరకుండా వెళ్ళటం కూడా మేలే. పెళ్ళికో పేరంటానికో వచ్చి వెళ్ళినట్లు వచ్చి వెళ్ళారు.
దీక్ష తాను చేయగలిగిన ప్రయత్నం శక్త్యానుసారం చేసింది.
ఫలితం తర్వాత.
దీక్ష మానవ మాత్రురాలు. అందరిలాగా ఆశాజీవి.
దీక్ష ఆశ నమ్మకం ఫలితం...!
ఏమో!
అది నిర్ణయించాల్సింది కాలం.
- 18 -
దీక్ష ఆలోచిస్తూ కూర్చుంది.
నమ్మకాలు వేరు. అవి ఫలించడం వేరు. దీక్ష కూడా ఆశాజీవే. రేపటి రోజు వచ్చే మంచి కాలంకోసం ఏదో చేసింది. ఆగింది ఎదురుచూస్తూ.
దీక్ష కరాటే ప్రదర్శన ఇచ్చి సరిగా అయిదు రోజులు అయింది. ఒక్కరంటే ఒక్కరు నేర్చుకోటానికి రాలేదు సరికదా ఎవరూ యింటికి వచ్చి మాట్లాడిన పాపాన కూడా పోలేదు. ఆ చూసిన వాళ్ళలో ఒక్కరికి నచ్చినా, నేర్చుకోవాలని వున్నా వచ్చి మాట్లాడి వెళ్ళేవారు. అది జరగలేదు.
దీక్షకి ఇల్లుకూడా చౌకలో మంచిది పెద్దది దొరికింది. ఇంటి వెనుక పెరడు చిన్నది. ఇంటికి అటూయిటూ స్థలం తక్కువ. ఇంటి చుట్టూ ప్రహరీ గోడలు వున్నాయి. ఆరు గదుల యిల్లు మంచి వరండా వున్నాయి.
ఆ యింటి ఓనరు కామరాజు కొడుక్కి పట్నంలో ఉద్యోగం. అయితే భార్య లేనందున పట్నంలో కొడుకు, కోడలు దగ్గర వుంటున్నాడు. ఒక గదిలో ఆయన సామానులు వున్నాయి. మరోగదిలో యింటికి కాపలాగా ముసలి భార్యా భర్తని వుంచాడు. మిగిలిన నాలుగు గదులు ఖాళీగా వున్నాయి.
తను చేయబోతున్న పని చెప్పి వుండటానికి రెండు గదులు అద్దెకి కావాలంది దీక్ష. ఆ పిల్ల మాట మన్నన తెరవబోయే కరాటే శిక్షణాలయం అన్నీ తెలుసుకుని ఆయనెంతో సంతోషించాడు. కారు చౌకగా రెండు గదులు అద్దెకి ఇవ్వటమే గాక అవసరమైతే మిగతా రెండు గదులు కూడా వాడుకోమన్నాడు.
ఆ యింటి కోడలి ద్వారా పరిచయము. ఇంటి ఓనర్ ఉదార బుద్ధితో ఈ వూళ్ళో ఈ యింట్లో చేరగలిగింది దీక్ష. ఇంటి పక్కలనే ఆనుకుని యిల్లు లేవు. అయినా దీక్షకి ఇరుగు పొరుగు పనికిమాలిన కాలక్షేపం అక్కరలేదు. తోడుగా ఓ దంపతులున్నారు. దీక్షకి పెద్దగా సామానులు లేవు. ఉన్నంతలో నాలుగైదు చిన్న శాల్తీలు మంచివి వున్నాయి. చాలాకొద్దిగా వంట సామాను.