సూర్యోదయం కాక మునుపే అరవిచ్చిన పూవులన్నీ సేకరించి మాలలుగా తీర్చి కూర్చి తోరణాలుగా వేలాడదీస్తున్నారు. దేశంలోని ఎక్కడెక్కడి పూలు అయోధ్యా నగరానికి చేరుకుంటున్నాయి.
పూలతోపాటే ఫలాలూ వస్తున్నాయి. అరటి ఆకులు విస్తారంగా వస్తున్నాయి. ఎక్కడెక్కడి మగ్గాల్లోనో తయారైన అరుదైన జరీ పంచెలు, పట్టు వస్త్రాలు అన్నీ అయోధ్యా నగరానికి చేరుకుంటున్నాయి.
ఆంధ్ర ప్రదేశం మొదటినుంచీ నేత పనితనంలో మొదటనే ఎన్నదగిన స్థానంలో ఉంటున్నది. చిన్ని పెట్టె, అరచేతిలో ఉంచదగినంత చిన్ని పెట్టెలో మడిచిపెట్టి అందివ్వగల మంచి నేతచీర నేయగల నేర్పరితనం ఆంధ్రుల సొత్తు.
యజ్ఞ సమయంలో అయోధ్య రాణులు ముగ్గురు కౌసల్యా, సుమిత్ర, కైకేయి దరించడానికి అనువైన చీరలు ఆంధ్రదేశం నుంచే వచ్చాయి. అలాగే దశరధమహారాజు కట్టుకునే పట్టు పుట్టాలు కూడా ఆంధ్రదేశం నుంచే వచ్చాయి.
ఏయే ప్రాంతాలలో ఏయే వస్తువులు విస్తారంగా పండుతాయో అక్కడి నుంచి వాటిని తెప్పించి భారీగా తెప్పించమని మంత్రి సుమంత్రులవారు ఆజ్ఞాపించారు. వ్యవసాయిక విషయాలను పరిశీలించే మంత్రి ఆయా ఉద్యోగులను సమావేశపరిచి దేనికీ లోటు లేకుండా అన్నీ పుష్కలంగా లభించేలా సేకరించమని ముదలకించారు.
యాగం నెల రోజులకు ప్రారంభమవుతుందనే విషయం వశిష్టులవారు, విభాండక మహర్షి, రోమ పాదులవారు మరికొందరు జ్యోతిష్యవేత్తలు కలిసి ప్రకటించగానే ఆ విషయం వార్తాహరుల ద్వారా, గూఢాచారుల ద్వారా, ఇతర ప్రాంతాలకు చేరకముందే పిల్ల వాయువులే మంద మందంగా వీస్తూ, పల్లెపల్లెలో ఆగి ఆగి, ఇంటింటి వద్దా మోగి మోగి, వార్తానందంతో తూగి తూగి, అందరికీ అందజేయాలనే తపనతో వేగి వేగి, ఉత్సాహంతో ఊగి ఊగి, నిలువలేక కదలలేక, నడక మందగించి సాగిపోయారు.
ఎక్కడెక్కడి జనం అయోధ్యకు అభిముఖంగా సాగివస్తున్నవి.
అజనాభ దేశంలోని మునులు, ఋషులు, తపస్వులూ, యోగులూ, సిద్ధులూ, సాధువులు అందరూ అయోధ్యకు సాగి వస్తున్నారు.
వశిష్టులు, విశ్వామిత్రులు, స్వయంగా నిర్దేశిస్తూ యాగాన్ని జరిపిస్తున్నారానీ, ఋష్యశృంగమహర్షి ఆ యాగానికి బ్రహ్మగా నిర్వహిస్తారనీ తెలియగానే ముని వాటికలన్నీ ఖాళీ చేసి సతీ సుత శిష్యసమేతంగా తరలి వచ్చారు.
నెలరోజుల నుంచీ వచ్చే జనంతో, ఋత్విక్కులతో, మహర్షులతో, కళాకారులతో అయోధ్య పుర వీధులు మారుమోగిపోతున్నాయి. ధర్మసత్రాలు చాలడం లేదు. అతిథులకు వసతి కల్పించడం తమ జన్మ భాగ్యంగా భావించి అందరూ వచ్చినవారికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి ఇల్లూ ఒక ధర్మశాలగా మారిపోతున్నా వచ్చేవారికి వసతులు చాలడం లేదు. నగరంలోని విశాలమైన మైదానాల్లో గుడారాలు ఏర్పాటుచేసి అక్కడే భోజన భాజనాది కార్యక్రమాలకు అన్ని వసతులూ కల్పిస్తున్నారు రాజోద్యోగులు. అవీ చాలడం లేదు.
అప్పుడిక నగర బహి ప్రదేశాల్లో సుందరంగా పెంచిన ఉద్యానాల్లో వసతులు కల్పించసాగారు. మహర్షులకూ వారి శిష్యులకు తగిన తాత్కాలిక వసతి గృహాలు నిర్మితమవుతున్నాయి.
అవన్నీ పూర్తయి కాకముందే పుణ్యాహవచనం జరిపించి వాటిలో మహర్షులకూ అర్ఘ్యపాద్యాదులూ సమర్పించి సాదరంగా ఆహ్వానించి విడిది చేస్తున్నారు.
అంతఃపురంలోని మహాసనంలో అరవై ఘడియలూ వంటావార్పూ సాగిపోతూనే ఉన్నది. బళ్ళతో సంభారాలు. వంట కట్టెలతో ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉన్నాయి. జిహ్వకో రుచి. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతపు వంటకాలు ఇష్టం. వారికి తగినట్టుగా వారు మెచ్చేట్టు ఆయా వంటకాలు తయారు చేస్తున్నారు.
కొందరికి కొత్త కొత్త వంటకాలపై మోజు. అలాంటి వారికి ఆయా రకాలు తయారుచేసి వడ్డిస్తున్నారు. పెద్దల సంరంభాలకు అంతు లేదు. పిల్లల ఉత్సాహాలకి అడ్డు లేదు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా వినోద కార్యక్రమాలు సాగిపోతున్నాయి.
వైశాఖ జ్యేష్ట మాసాల్లో ఎండలు మండిపోతుంటాయి. కానీ ఇనకుల తిలకుడిగా శ్రీమహావిష్ణువు అయోధ్యలో రఘువంశంలో జన్మించనున్నాడనీ, ఆయన అనుజులుగా శ్రీవారి శంఖం, చక్రం, శ్రీవారి శేషపానుపూ అవతరించనున్నాయనీ, ఇక ఈ త్రేతాయుగంలో రాక్షస బాధ ఉండనే ఉండదనీ, ప్రజలంతా సుఖ శాంతులతో జీవిస్తారనీ తెలిసిన సూర్యుడు తన చండ ప్రచండ కిరణాలలో వేడిని తానే తగ్గించుకుంటూ, మబ్బు చాటున వెలుగుతూ వాడిని క్రమబద్ధం చేసుకుంటూ వేసవి పగలు కూడా వెన్నెల రేయి అనిపించేలా చేస్తున్నాడా అన్నట్టున్నాయి పగళ్ళు.
అందువల్ల పగటికీ రేయికీ పెద్దగా తేడా తెలియటం లేదు. రత్న దీపాలు, తైల దీపాలూ అఖండంగా వెలుగుతూ చల్లని వెలుగును వెదజల్లుతున్నాయి. నృత్య, గాన, కథా విశేషాలతో రాత్రుళ్ళు, విందు భోజనాలతో పగళ్ళూ, గడిచిపోతూ కాలం తెలీకుండా చేస్తున్నాయి.
ఎక్కడ చూసినా ఆనందం. ఎక్కడ చూసినా ఉత్సాహం. ఎటు చూసినా విందు వినోదాలు. అటు మామూలు జనంలోనూ, ఇటు రాజాంతఃపురంలోనూ రాజ్యోద్యోగులలోనూ సందడే సందడి.
వీధులు దాటి విను వీధులన్నీ సుస్వర పూరితమై, వేదనాదాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. నాలుగు వేదాల్లోనూ పండితులైన బ్రాహ్మణోత్తములు ఉదాత్త మదాత్త స్వరాలతో వేద పఠనం చేస్తున్నారు. ఆ మధుర నాదం సుమధుర సంగీతంలా అంతటా వ్యాపిస్తున్నది.
యాగానికి కావలసిన ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అయోధ్యలో అణువణువూ శ్రీమన్నారాయణమూర్తి ఆగమనానికి వలసిన రీతిలో అందచందాలు సంతరించుకున్నది. ప్రతి అణువూ పరమాత్ముడి పద నృత్యంతో పునీతం కావడానికి తొందర పడుతున్నది.
ఋష్యశృంగుల వారు రాబోయే శుభ ఘడియ రానేవచ్చింది.
25
మిధిలా నగర రాజాంతఃపురంలో జనకరాజర్షి ప్రాతఃకాలం నుంచీ ఎవరికోసమో ఎదురు తెన్నులు చూస్తున్నాడు.