"అందుకే గదరా నేను సంపాదిస్తున్నా ....అమ్మకి సాయం చేస్తున్నా .'
'మరి నాకు చెప్పరా....' ఆశగా అడిగాడు.
"అరేయ్ ఇది అందరూ చేసేది కాదు , రాగస్యంగా సెయ్యాలి. ఎవరికీ చెప్పేది కాదు. నీవల్ల కాదులే ....'
భయంగా చూశాడు సురేష్ - 'మరి నీవెలా సేస్తున్నావు - మీ అమ్మ నిన్ను అడగదా డబ్బెక్కడదని ' అనుమానంగా చూశాడు.
'ఏంటిరా అడిగేది .... అడిగితే ఏదో సెపుతా , తిండికి లేనోళ్ళకి డబ్బు కళ్ళ బడగానే నోరు మూత పడ్తది' నిర్లక్ష్యంగా అన్నాడు.
"అరేయ్, ఈ బూట్లూ , వాచీ, మంచి బట్టలు అన్నీ చూసి అడగరా ఎవరూ -'
'అమ్మ మొదట్లో నిలేసింది - నే గట్టిగా చెప్పా ఏదన్నా అంటే ఇంట్లోంచి పోతాననగానే ఇంకేటంటది? అయ్య అయితే ఓ నూరు రూపాయలు చేతిలో పడగానే నోరు మూసుకు చల్లగా జారుకుంటాడు ....'
'అరె, ఆ పనేటి సెప్పరా, సేయగలనో లేదో సూస్తా..... వరేయ్ ఈ పరీక్షలయిపొతే కాలేజీలో సదవాలనుంది . డబ్బు కావాలి గదరా .... నేకపోతే ఏదన్నా ఉద్యోగం సూసుకోవాలిరా....'
"ఏట్రా నీ పదోక్లాసు సదూకి ఏం ఉద్యోగం సేస్తావురా ' హేళనగా అన్నాడు.
'మా అమ్మ పనిచేసే బ్యాంకు మేనేజరు గారిని అమ్మ బతిమాలిడితే అటెండరు ఉద్యోగం యిప్పిస్తాలే అన్నాడట.'
'పోరా అటెండరు అంటే ఏంట్రా, బంట్రోతు ఉద్యోగంగా.... ఎటోస్తుందిరా ...' హేళనగా నవ్వాడు.
'మరందుకే చెప్పరా.... నీవు చేసే పని నాకూ యిప్పించారా '
'సరేలే,రేపు ఓ చోటికి తీసి కేడతాలే , వరేయ్ ఈ సంగతి ఎక్కడా నోరిప్పావంటే అంతే, అసలు మీ అమ్మకే కాదు ఎవరి దగ్గరా మాట్లాడవద్దు. అలా అయితేనే నే తీసుకుపోతా ' బెదిరిస్తూ అన్నాడు. సురేష్ తలూపాడు.
* * * *
వారం పదిరోజుల తరువాత, ఆరోజు వంట్లో బాగుండక జ్వరం మాత్ర వేసుకుని వరమ్మ పడుకుంది. పదకొండు గంటల వేళ పక్కింటి అవ్వ వచ్చి లేపి గాభరాగా 'వరాలు.... వరాలు.... పోలీసులు మీ సురేష్ ని పట్టుకుని లాక్కోచ్చారే .....నిన్నడుగుతుండరు. బయటికి రాయే బేగి....." ఒగరుస్తూ భయంగా అంది. వరమ్మ కళ్లిప్పి .... అవ్వ అన్నది అర్ధం కాక అయోమయంగా చూసింది. 'పోలీసులే సురేష్ ని పట్టుకుని వచ్చారు....' మళ్ళీ అంది. వరమ్మ దిగ్గున లేచి బయటికి ఒక్క ఉదుటున వచ్చింది. ఒక పోలీసు సురేష్ చేతికి బేడీలు వేసి పట్టుకుంటే ఇన్ స్పెక్టరు లాఠీ ఊపుతూ వరమ్మ బయటికి రాగానే 'వీడు నీకోడుకేనా ?" అడిగాడు అధికారికంగా - వరమ్మ బిక్కచచ్చిపోయి తలూపుతూ 'ఏటిబాబూ ఏటయింది.... ఏం చేశావురా ....' తల దించుకుని ఏడుస్తున్న కొడుకు దగ్గరికి వెళ్ళి గాభరాగా అడిగింది. "బాబూ ఇన్ స్పెక్టరు బాబూ, ఈడెం సేసాడు బాబూ ఎందుకు పట్టుకున్నారు .... ఏటిరా సురేషూ చెప్పవెందిరా....' కొడుకు భుజాలు పట్టుకు గుంజుతూ అడిగింది . 'నాకేటి తెలియదే అమ్మా ....నేనేం చేయ్యనేదే' అన్నాడు సురేష్.
'నోరు మూయరా రాస్కెల్, ఏం చెయ్యలేదట..... ఏం చెయ్యకాపోతే నిన్ను బెడీలేసి తీసుకురావటం సరదాకి అనుకున్నావా ' లాఠీతో సురేష్ గడ్డం ఎత్తి కఠినంగా అన్నాడు.
'ఏటి బాబూ దొంగతనం సేసాడా , స్కూల్లో ఏదన్నా దొంగిలించాడా సెప్పండి బాబూ ' దండం పెడుతూ ఏడుపు గొంతుతో అంది. 'చిన్న దొంగతనం అయితే రెండు తగిలించి భయపెట్టి వదిలేసేవారం..... నీ కొడుకు పెద్ద కేడీ అయిపోయాడు. ద్రగ్గులు సప్లయ్ చేసే బ్రోకరు అయిపోయాడు ...' హేళనగా అన్నాడు. వరమ్మకి ఏం అర్ధం కాక తెల్లపోయి చూసింది. 'ఏటలా చూస్తావు..... అర్ధం కాలేదా ? నీ కొడుకు మత్తు మందులు సప్లయ్ చేస్తున్నాడు..... డబ్బు లార్జిస్తున్నాడు..... నీకు తెలవకుండానే వుందా? నీ కొడుకు నీకు డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వడం లేదా .... చెప్పరా వెధవా .... పట్టుమని పదహారేళ్ళు లేవు. డ్రగ్గు రాకెట్ లో చేరిపోయి పనిచేస్తున్నావా? ఎప్పటినుంచి చేస్తున్నావు చెప్పరా రాస్కెల్ .....నోరిప్పు .... లేదంటే మక్కెలిరాగదంతా, ఏవమ్మా..... కొడుకు స్కూలు కేడుతున్నాడో ... మత్తు మందులు సప్లయ్ చేస్తూ తిరుగుతున్నాడో చూసుకోవద్దా..... పిల్లాడి దగ్గర డబ్బు లార్జించి తెస్తున్నాడని సంబరపడి గమ్మునూరుకున్నావా .... పిల్లాడి దగ్గర డబ్బు లెక్కడి నుండి వస్తున్నాయని అడగద్దా..... ఇద్దరూ పదండి పోలీస్ స్టేషన్ కి .... అక్కడ చెబుదురు గాని కధలు - పద జీపెక్కండి . "బాబూ , ఇన్ స్పెక్టరు బాబూ మీరేటంటున్నారు. నా కొడుకు మత్తు మందులు ఇవ్వడమేంటి, ఆడు స్కూల్లో సదూతాడు. మేష్టర్లందరూ చెపుతారు అడగండి కావలిస్తే , గాని నీతిలేని పనులు సేసేవొళ్ళం గాదు. సురేష్ మంచి కుర్రాడు, ఆడికి ఆ తాగుబోతు తండ్రి బుద్దులు రాలేదు. కష్టపడి సదూకుంటున్నాడు. మీరేవరనుకుని యిడ్నీ పట్టుకున్నారో" గట్టిగా అంది.
'అలాగ.... ఇన్నాళ్ళు సక్కా సదివేడేమో ....డబ్బు రుచి మరిగి దందాలోకి దిగాడు స్కూలు బ్యాగులో పెట్టుకుని మత్తుమందు పేకట్లు ఇచ్చి రమ్మన్న చోటికి చేర్చి డబ్బు తీసుకుంటున్నాడు. రెడ్ హ్యాండేడ్ గా పట్టుకున్నాం. చెప్పరా ..... ఎంత డబ్బిస్తారురా పెకట్టు యిచ్చినందుకు ... ప్యాంట్ జేబులో చెయ్యి పెట్టి రెండొందల రూపాయల నోట్లు తీసి వరమ్మ కళ్ళ ముందు ఆడించాడు. వరమ్మ అయోమయంగా చూసింది. తరువాత సురేష్ వంక అపనమ్మకంగా చూసింది . 'ఏటిరా ...... ఈ బాబు సెప్పింది నిజమా ....' అపనమ్మకంగా , అయోమయంగా అడిగింది.
సురేష్ భోరున ఏడవడం మొదలుపెట్టాడు. 'నాకు తెలవదే అమ్మా - ఒక పెకట్టు ఆళ్ళు చెప్పిన చోట యిస్తే వంద, రెండొందలు ఇస్తామన్నారు. ఆ పేకట్లో ఎటుందో నాకు తెలవదు ....' అమాయకంగా అన్నాడు. వరమ్మ తెల్లబోతూ చూసింది. 'ఎవరొచ్చి ఇచ్చారు పేకెట్లు, ఎక్కడిమ్మన్నారు....' ఆరాటంగా అడిగాడు ఇనస్పెక్టర్. 'అసలు నిన్ను వాళ్ళెలా తీసుకున్నారు. నిన్ను వాళ్ళ దగ్గర కెవరు తీసుకెళ్ళారు'. సురేష్ బెదురుగా చూశాడు. 'ఆళ్ళేవరో నాకు తెలవదు - నాకాడి కొచ్చి ఒక పేకెట్టు యిచ్చి - ఆ కిళ్ళి కొట్టుకాడ ఇవ్వాలి - యిచ్చే ముందు 'స్వీట్ సిక్స్ టీన్' అనాలి - అపుడా కొట్టువాడు పేకట్టు తీసుకుని డబ్బిస్తాడు. నీకు పేకెట్టు యిచ్చే వాడొచ్చి నీ వయసెంత అంటే ' స్వీట్ సిక్స్ టీన్' అనాలి. అది నీ కోడ్ వర్డ్. అది సేపితేనే పేకట్టు యిస్తారు. డబ్బిస్తారు. ఈ కోడ్ వర్డ్ ఎవరికీ చెప్పకూడదు. చెపితే తల తెగుతుంది. పోలీసులు పట్టుకెళ్ళి జైల్ల పెడతారు. నీ దగ్గరికొచ్చి నీ వయసెంత అంటే ఆ మాట గుర్తు చెప్పాలి."
"పేకట్లో ఏటుంది అని నీవడగనేదా?' ఇన్ స్పెక్టర్ అడిగాడు.
'అడిగా ... అది నీకనవసరం. తెల్సుకోనక్కరలేదు' అన్నాడు . బ్రౌన్ పేపరు నాలుగు పుస్తకాలు కలిపిన ప్యాకెట్టు సైజు యిచ్చి రావడం తప్ప నోరు విప్పకూడదు. ఎవరితోనయినా చెపితే చస్తావు అని బెదిరించారు. ఆ పాకెట్టు లో ఎటుందో నాకు తెలీదు. చిన్న పని చేస్తే రెండొందలిస్తామన్నారు అని వప్పుకున్నా వెళ్ళి కొట్టుకాడ ఎవరూ లేనప్పుడు , ఎవరూ చూడనపుడు గబుక్కున ఇవ్వాలి.... ఎవరన్నా వస్తే చాక్లెట్లు ఒకటి కొనాలి. ఎవరూ ఏం అనుమాన పడకుండా .... కిళ్ళీ కొట్టువాడు అడిగిన కోడ్ వర్డ్ తప్ప మరేం మాట్లాడకుండా వెళ్ళాలి. డబ్బులు తీసుకోడం కూడా ఎవరూ చూడనపుడు చటుక్కున తీసి జేబులో పెట్టుకోవాలి అని చెప్పాడు' వెక్కుతూ అన్నాడు.