Previous Page Next Page 
మధుపం పేజి 36

                                           తప్పెవరిది?


    'అమ్మా! డబ్బు లీయే , ఇయాల పరీక్ష ఫీజు కట్టడానికి ఆఖరి రోజే, ఇయాల యిస్తానన్నావుగా , బేగి యియ్యి" స్కూలు యూనిఫాం వేసుకుని చిన్న అర్ధం ముందు నిలబడి తలదువ్వుకుంటూ అన్నాడు సురేష్.
    వీధి గుమ్మం తుడిచి కల్లాపిజల్లి రెండు ముగ్గు గీతలు వేసి, అంట్ల గిన్నెలు తోముకుంటున్న వరమ్మ "రెండు నిమిషాలు అగరా నాయనా, ఈ గిన్నెలు రెండు కడిగేసి యిస్తాను" తోమిన గిన్నెలు లోపలికి తీసికెళ్ళి పోయి దగ్గిర పెట్టి కొంగుతో చేతులు తుడుచుకుని ట్రంకు పెట్టె దగ్గర కెళ్ళి మూత తీసింది. బట్టల కింద దాచిన చిన్న పర్సు చేతికి అందలేదు. గబగబ బట్టలు లాగి కిందా మీదా వెతికి "సురేషూ' కేకేపెడ్తూ , పెట్టె బోర్లించి వెతుకుతూ, 'అరేయ్ డబ్బు లేవిరా, పెట్టిలో పెట్టా గదరా నిన్న సాయంత్రం , ఏవిరా అగపడవు' ఏడుపు గొంతుతో అంటూ కొడుకు వంక వెర్రి మొక మేసుకు చూస్తూ అంది. సురేషు తెల్లపోయాడు. 'ఈ పెట్టెలోనే పెట్టావా ?" తనూ వెతుకుతూ అన్నాడు. ;నిన్న సునీతమ్మ ని బతిమిలాడి అడ్వాన్స్ అట్టుకొచ్చి ఇదిగోరా ఈ చిన్న పర్సులో ఎట్టి బట్టల అడుగున దాచి పెట్టారా ....' ఎడుస్తున్నదల్లా చటుక్కున ఆగిపోయి శివంగిలా ఒక్క ఒదుటున గుడిసె బయట అరుగు మీద నులక మంచంలో పడుకున్న మొగుడి దగ్గర కెళ్ళి కుదిపి కుదిపి లేపి, లాగి పడేసింది కింద. 'దొంగ సచ్చినోడా! ఆడదాన్ని కట్టబడి పాచిపన్లు చేసి నాలుగు డబ్బులు తెచ్చి పిల్లాడిని సదివించుకుంటున్నారా.... నీ జిమ్మడ , పరీచ్చకనీ దాచిన డబ్బులట్టి కెళ్ళి తాగడానికి సేతులు ఎట్టా వచ్చాయి రా.....' మొగుడ్ని దబదబ బాది, తన తల బాదుకుని 'సావనైనా సావవు..... పాపిష్టడా....' వరమ్మ కింద కూలబడి మొగుడి జుట్టు పట్టుకుని గుంజి తిట్లకి లంకించుకుంది. మత్తులో పడున్న నర్సయ్య కళ్లిప్పాడు. 'ఏటే , పొద్దుగాల ఏందే నీ గోల, ఏటే శివాలేత్తిందా , నన్నే కొడతావా?' తూలిపోతూ లేచి నిలబడి వరమ్మ జుత్తు పట్టుకుని వంచి వీపు మీద  ధభి ధభి గుద్దాడు. 'నన్నే కోడతావే' హూంకరించాడు. వరమ్మ భద్రకాళిలా లేచి జుత్తు విడిపించుకుని 'ఏవిరా డబ్బు లేయిరా, పిల్లాడి పరీచ్చ కోసం తెచ్చి పెట్టా దొంగానాయలా , పెట్టెలో డబ్బేమయింది .... నా డబ్బు నాకీయి" నర్శయ్య చేయి గుంజుతూ అరిచింది. నర్శయ్య విసురుగా వరమ్మ చేయి తీసేసి 'ఏ డబ్బులు .....నాకేటి తెల్వదు..... నే తీయలేదు ' కోపంగా అన్నాడు. 'తీయకపోతే పీకల దాకా తాగడానికి డబ్బు లేడనించి వచ్చాయిరా . నిన్న సాయంకాలం డబ్బు తెచ్చి కూరల దుకాణానికి ఎల్లగా సూచీ కాజేసి పీకల దాకా తాగొచ్చినావు. పిల్లగాడి పరీచ్చకి ఎలా కట్టాలి..... ' ఏడుస్తూ అంది. సురేషు బిక్కమోగం పెట్టుకుని 'అమ్మా, మరేట్టాగే , యియాల ఆఖరిరోజు  డబ్బు కట్టడానికి. లేకపోతే పరీచ్చకి కూర్చోనీయరె ..... ఏడుపు గొంతుతో అన్నాడు. 'ఏం సెయ్యనురా నాయనా, మాష్టరు గారికి సెప్పరా.... రేపు కడ్తానని ....ఎలాగైనా పట్టుకొచ్చి యిస్తారా...."
    "మాస్టారేం సేస్తారు, ఆఫీసులో కట్టాలి. ఆఫీసులో వప్పుకోరే ..... ఫైనుతో కట్టే ఆఖరి రోజు ఇయాల ' అంటూ నర్సయ్య వంక కోపంగా చూసి "నీవీయవు డబ్బులు, అమ్మ కష్టపడి పనిచేసి తెచ్చింది కాజేస్తావా? తూ.... నే పరీక్ష ఎలా రాయాలి..." అన్నాడు చీదరింపుగా. "పోరా, ఎదవా, నీవీ పరీచ్చ రాసి కలక్ టరు వయిపోతావా ఏందిరా , పదో క్లాసు చదివితే ఏం ఉద్యోగాలు రావు. సుబ్రంగా మేస్త్రీ పని నేర్చుకో అని సెపితే ఇన్నావా, మీ అమ్మాకి కొడుకును కలక్ టరు చెయ్యాలని ఆశ. దాని మాట యినుకున్నావంటే రెంటికి చెడ్డ రేవడిరా నీ బతుకు, రేపటి కాడనుండి నా ఎంటరా పని నేర్ఫ్హుకుందు'గాని ....'
    "నోరుముయ్యరా తాగుబోతు నాయాలా.... సుబ్రంగా సడుకునే పిల్లాడిని ఆడకూతురు కట్టపడి సదివిస్తుందనే గానం లేకుండా పిల్లాడి పరీచ్చ డబ్బు లట్టుకు పోయి తాగినోడివి, నీవసలు మడిసివట్రా , ఏం జన్మరా, ఎందులో అన్నా పడి సస్తే బతికిపోతాను' మెటికలు విరిచి శాపనార్ధాలు పెడ్తూ తలబాదుకుంది . 'అమ్మా మరెట్టాగే , పరీక్ష రాయనీయరే ...' ఏడుపు గొంతుతో అన్నాడు . 'ఈ పూటకి ఏదో చెప్పరా నాయనా, రేపు తెచ్చిస్తాగా , మా నాయనా ఎల్లరా' బతిమిలాడి కొడుకుని పంపింది వరమ్మ .
    
                                        *    *    *    *
    "సురేష్.... అగరా.... ఏట్రా పిలుస్తుంటే పలకవేమిట్రా.....' వగరుస్తూ వచ్చాడు కిట్టప్ప. 'ఏట్రా ఎటయింది ఏడుస్తున్నావు ' తనని చూసి చొక్కా చేత్తో కల్లు తుడుచుకుంటున్న సురేష్ ని చూసి అన్నాడు. ఏం లేదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు. అయినా కళ్ళనీళ్ళు మళ్ళీ నిండాయి. ఏవయింది. మీ అయ్య తిట్టాడా, కొట్టడా ...' ఆరాటంగా అడిగాడు. 'నా పరీక్ష ఫీజ దొంగతనంగా తీసుకుపోయి తాగేశాడురా మా నాన్న, పాపం మా అమ్మ ఎవరినో బతిమిలాడి తెచ్చి పెట్టెలో దాచి పెట్టింది. పట్టుకుపోయాడు. ఇయాల ఆఖరిరోజు ఫీజు కట్టడానికి, నేను పరీక్ష రాయడానికి లేదురా . మా అమ్మ ఎలాగన్నా రేపు తెచ్చిస్తానంది. సార్ ఒప్పుకుంటారో లేదో ' దిగులుగా చెప్పుకొచ్చాడు.
    "అరేయ్ ....ఏడవుకురా ...... నా దగ్గర డబ్బుంది , నేనిస్తా .... యియాల కట్టేయ్ , రేపు మీ అమ్మ తెచ్చిచ్చాక ఇద్దూ గానీలే ....' భుజం మీద చేయ్యేసాడు. 'నీకాడ ఎక్కడిదిరా అంత డబ్బు' ఆశ్చర్యంగా చూశాడు సురేష్.... ' మీ అయ్యా మా అయ్య కధ ఒకటే గదరా.... ఇద్దరూ తాగి తందనాలు అడతారు డబ్బు లట్టుకుపోయి...' అనుమానంగా చూశాడు. 'పదరా ఆయన్నీ తరువాత, స్కూలు టైమయింది. ముందు ఫీజు కట్టేయ్ ' సురేష్ చేయి పట్టి లక్కేళ్ళాడు కిట్టప్ప.
    
                                           *    *    *    *    
    'కిట్టప్ప , థాంక్స్ రా, నీవిచ్చావు గనక టైముకి ఫీజు కట్టేసాను, లేకపోతే ఈ ఏడాది పోయేది - అమ్మ యిచ్చాక రేపు ఇచ్చేస్తారా డబ్బు ' 'పర్లేదు లేరా, యిద్దూవుగాని' నిర్లక్ష్యంగా అన్నాడు.
    'కిట్టప్పా , నీడగ్గిర అంత డబ్బెక్కడిదిరా ... మీ అయ్య కూడా ఇంట్లో డబ్బీయడు . తాగి తగలేస్తాడు గదరా ' ఆమాయకంగా అడిగాడు సురేష్.
    'డబ్బుదెం ఉందిరా అదే వస్తది. తెలివి వుండాలి కాస్త సంపాదించడానికి ' తలెగరేసి గర్వంగా అన్నాడు.
    'సంపాయించావా... ఎలారా ....ప్లీజ్ నాకూ చెప్పరా..... మా అమ్మ చాలా కట్ట పడుతుంది డబ్బుకి, చెప్పరా ' ఆశగా అడిగాడు.
    "ఫోరా , నీవుత్త పిరికి గోడ్డువి. ధైర్యం వుండాలిరా , హుషారుండాలీ సంపాదించడానికి' కాలరేగరేస్తూ ఫోజు కొట్టాడు.
    "ఫ్లీజ్ , నేనూ చేస్తారా, ఏంపనో చెబితే నేనూ బాగా చేస్తా..... నాకాడ బట్టలన్నీ చిరిగిపోయి , జోళ్ళు తెగిపోయాయి. ఆమ్మ దగ్గర డబ్బు తినడానికే చాలదు. అయ్య రూపాయివ్వడు సరిగదా అమ్మని తన్ని పట్టుకుపోతాడు. నీకు తెలుసుగదరా ఇంటి సంగతి....మీ అయ్యా అంతే గదా ...'

 Previous Page Next Page