ఇదంతా ఎవరు చెప్పారు - అసలు వాళ్ళ దగ్గరికి నిన్నెవరు తీసుకెళ్ళారు ....'
సురేష్ ఇబ్బందిగా చూశాడు ..... మాట్లాడలేదు. 'చెప్పు' గద్దించాడు ఇన్ స్పెక్టర్.
'చెబితే సంపుతాం అన్నారు' బెదురుగా చూశాడు. 'మరేం ఫరవాలేదు. నిన్నెవరూ ఏం చేయలేరు. పోలీసులు దగ్గరుండగా ఎవరేం చేయలేరు.....' వరమ్మ ఏడుస్తూ సెప్పరా' ఇదంతా ఎప్పుడు జరిగిందిరా ..... ఎవరు సెప్పారు యిదంతా నీకు."
"కిట్టప్ప.... ఆడు చెప్పాడు. డబ్బు సంపాయించేందుకు ఉపాయం. స్కూలు ఫీజు కట్టడానికి ఆరోజు డబ్బిచ్చినప్పుడు అడిగితె సేప్పాడు. ఇంట్లో డబ్బు నేదు. అయ్య డబ్బియ్యడు. నీవు తెచ్చేది మనకు సాలడం లేదు - నేనూ సంపాదిద్దామని ఆశపడ్డా."
"కిట్టప్పా .... వాడేవాడు , నీ దోస్తా .... ఎక్కడుంటాడు '
'మా ఇంటి దగ్గరే సాబ్.... ఆడు ఈ మధ్య సేడిపోయాడు. డబ్బు లట్టుకొచ్చి యిట్టం వచ్చినట్టు ఖర్చు పెడ్తున్నాడు. అడి అమ్మ అడిగితె కధలు సెపుతున్నాడు. బూట్లు, వాచీ, మంచి బట్ట లేసు దర్జాగా తిరగతన్నడు. ఆడితో స్నేహం వద్దని సెప్పా యీడికి. ఆ ఎదవ ఈడ్నీ ముంచాడు. నా కొంప దీశాడు' ఏడుస్తూ అంది వరమ్మ.
'యిడీ మధ్య ఓ నూరు రూపాయలట్టకొచ్చి యిస్తే ఎంటనే అడిగితే ఎవడో డబ్బున్న యిడితో సదివేవాడు నోట్సు రాసిపెడితే యిచ్చాడన్నాడు. ఇంకోరోజు యింటికి సామాను పట్టుకొచ్చాడు.... దుకాణంలో సాయంత్రం పద్దులు రాస్తే యిచ్చారన్నారు. ఏదీ నా బాబు నా కట్టం సూడలేక కట్టబడి సంపాయించి తెచ్చాడనుకున్నాను. అంతే బాబు అంతకంటే యింకేం డబ్బులు నాకీయలేదు.'
"ఏరా, ఎన్నాళ్ళుగా చేస్తున్నావు.... ఎన్నిసార్లు యిచ్చావు పేకట్లు ?' రెండేసార్లు సార్....మూడోసారి "మీ పోలీసులొచ్చి పట్టుకున్నారు...." గిల్టీగా చూశాడు.
"ఈడు కొత్తగా మొదలెట్టాడు.... అనుభవం లేక దొరికిపోయాడు. ఈడియట్ .' 'బాబూ....మీకెలా దొరికాడు యిడు' వరమ్మ భయంగా అడిగింది.
'ఈమధ్య ఈ మందుల దందా జోరుగా సాగుతోంది అని పోలీసులు నిఘా ఎక్కువ చేశారు. ఈడు కిళ్ళీ కొట్టుకాడ బెదురు చూపులు చూస్తూ తచ్చాడుతుంటే మఫ్టీలో ఉన్న పోలీసు కంటపడ్డాడు. ఆడికి అనుమానం వచ్చి దూరం వెళ్ళి చాటుగా నిలబడి చూస్తుంటే వీడు ఎవరూ లేకుండా చూసి, పెకట్టు అందించి చటుక్కున డబ్బులు జేబులో కుక్కుకోవడం చూసి అనుమానం వచ్చి గబగబ వెళ్ళి పట్టుకున్నాడు.... ఆ కిళ్ళీ కొట్టువాడు ఎవరో వచ్చి పేకట్టు తీసి కెడతారని బుకాయించాడు. వాడ్ని తన్ని స్టేషన్ కి ఇద్దరినీ లాక్కొచ్చాడు.... ఈ దందాలో నీ వాటా ఉందా అని తేల్చుకోడానికి యీడ్నీ ఇంటికి తీసుకొచ్చా..... పద, నీవూ జీపెక్కు పోలీసు స్టేషను లో జరిగినదంతా చెప్పాలి.... ఆ కిట్టు గాడిని పట్టుకుంటాం .... వీళ్ళ ద్వారా అసలు వాళ్ళెవరో కనిపెట్టాలి. పదండి జీపెక్కండి ' ఇన్ స్పెక్టర్ కదిలాడు.
గుమ్మంలో పోలీసులని చూసి దొంగ చూపులు చూస్తూ భయంగా నక్కాడు నర్సయ్య. ఇంట్లోకి రాకుండా. మొగుడు కంట పడగానే వరమ్మ శివాలెత్తిందానిలా ముందుకు ఉరికి మొగుడు జుత్తు లంకించుకుని 'సూడరా , సూడు నీవల్ల నీ తాగుడు వల్ల నీ కొడుకు జైలుకి ఎలతన్నాడు... బిడ్డ మొగం సూడరా.... అడి బతుకులో నిప్పులు పోశావురా.... థూ.... ఏం జన్మరా ..... సావరా ఎందులోనన్నాపడి ....' అలుపు వచ్చేవరకు తిట్టింది వగురుస్తూ ..... 'బాబూ! ఇన్ స్పెక్టరు బాబూ, ఈపాలికి దయసూడు బాబు. ఇదిగో ఇలాంటి తాగుబోతు ఎదవలు మొగుళ్ళయితే నాలాంటి ఆడోళ్ళు ఏం చేస్తారు. ఈడిలాంటి బిడ్డలు ఏమవుతారు. డబ్బులోస్తాయని ఆశపడి పాడు పనులక్లి దిగితే అన్నెం పున్నెం ఎరగని యిడిదా తప్పు. ఈ తాగుబోతు సచ్చినోడిని జైల్లో ఏయండి బాబూ బతికిపోతాను -' తలబాదుకుంటూ ఏడ్చింది. ఇన్ స్పెక్టర్ సానుభూతిగా చూశాడు. నాలుగు డబ్బులోస్తాయని ఆశగా తెలిసీ తెలియకుండా ఇలాంటి వాటిలో ఇరుక్కుని, ఈ దందాలో పీకల దాకా కూరుకుపోయిన వాళ్ళెందరినో పట్టుకుంటారు. కాని ఏం లాభం ... అసలు వాళ్ళు బయటపడరు. చిన్న చేపలే వలలో పడతాయి. అన్నదీ పోలీసులకీ తెలుసు. కాని న్యాయం, చట్టం ...వీటికి అతీతంగా తనలాంటి వాళ్ళెం చేయగలరు. 'పదమ్మా సేప్పెదేదో పోలీసు స్టేషను దగ్గర పెద్ద సారుకు జెప్పు, అయ్యా మొదటిసారని చెప్పి వేడుకో..... ఏం జరుగుతుందో చూద్దాం. పద జీపెక్కి.... పదరా....' ఈసారి ఇన్ స్పెక్టర్ గొంతులో కాటిన్యత స్థానే సానుభూతి కనపించింది. ఇలాంటి పిల్లలు ఎందరో బలి అయిపొతున్నారన్న బాధా వుంది ఆ గొంతులో.
***


