Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 36


    "మరి...శ్రీధర్?" శారద ఆరాటంగా అడిగింది.
    "అవును. నా కథ యింకా ముగియలేదు. తరువాత నా కథ కాస్త మలుపు తిరిగింది. శ్రీధర్ మెడిసిన్ లో నాకు రెండేళ్ళు సీనియర్. కాలేజీలో మామూలు పరిచయం స్నేహంగా ఏడాదికి మారింది. మరో ఏడాదిలో స్నేహం ప్రేమగా మారింది. శ్రీధర్ నాగురించి అంతా విన్నాడు. అతనికి కొన్ని మంచి ఆదర్శాలున్నాయి. పిచ్చి ఆదర్శాలు అన్నవాళ్ళూ వున్నారు. అతను ఒక వితంతువుని వివాహం ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం ఒక వితంతు స్త్రీ పరితప్త హృదయం గ్రహించాక ఏర్పరచుకున్నది. ఆమె ఎవరోకాదు. అతని చెల్లెలు! పెళ్ళయిన ఆర్నెల్లకి భర్తని కోల్పోయిన ఆ అభాగిని కన్నీటిని చూసి చలించి తీసుకున్న నిర్ణయం అది. ఆఖరి సంవత్సరంలో తన ప్రేమ బయటపెట్టి వివాహం చేసుకుంటానన్నాడు.
    "తెల్లబోయాను. "నేను వివాహితురాలిని శ్రీధర్!" అన్నాను నిర్జీవంగా.
    "తెలుసు." అన్నాడు నిర్లిప్తంగా నవ్వుతూ.
    "బిడ్డతల్లిని!"
    "అదీ తెలుసు." చిరునగవుతో అంటున్న శ్రీధర్ ని నమ్మలేనట్టు చూశాను.
    అతని ఔదార్యానికీ, సంస్కారానికీ కదిలిపోయాను. స్త్రీ పురుషుల సంబంధం మీదే ఏహ్యత విరక్తి పుట్టిన నాకు శ్రీధర్ తో పరిచయమయ్యాక గాని, అతని ప్రేమానురాగాలు చవిచూచాక స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అన్నది ఎంత ఔన్నత్యంగా ఉండగలదో తెలిసింది.
    అతనితో వివాహం అయ్యాకే - ఇష్టమయిన చోట స్త్రీ పురుష సంబంధంలో స్వర్గం చవి చూడవచ్చని అర్ధం చేసుకొన్నాను...
    "శారదా! శ్రీధర్ దేవుడు. అలాంటి మనుషులు ఇంకెవరన్నా వున్నారో లేదొ నాకు తెలియదు. శ్రీధర్ లా ప్రతీ పురుషుడు ఆలోచించితే స్త్రీల కన్నీటి కథలే ఉండవు. భర్త పోతే, భర్త వదిలితే జీవచ్చవంలా బతికే స్త్రీలను శ్రీధర్ లా చేపట్టగలిగిన వ్యక్తులు నూటికి ఒకరయినా ఉంటే కొందరి స్త్రీల కన్నీరయినా తుడవవచ్చు.
    అతని సహృదయతకి సంస్కారానికి నేనే కాదు. అందరూ అబ్బుర పడ్డారు.
    నాన్నగారయితే కన్నీళ్ళతో అతన్ని గుండెలకి హత్తుకున్నారు.
    నేను కన్నీటితో అతని పాదాలని అభిషేకం చేశాను.
    మా అత్తమామలు వివాహానికి వచ్చి నిండు మనసుతో ఆశీర్వదించారు.
    "పాపని మేం చూచుకుంటాం. మా దగ్గిర అలవాటేగా. కొత్తలో మీ మధ్య పాప వుండడం మంచిది కాదు. అతను ఏమన్నా అనుకోవచ్చు." అన్నారు అమ్మ, నాన్న.
    పాపని వదిలిపెట్టాలని లేకపోయినా అమ్మ నాన్నల మాటలో నిజం వుందనిపించి కొత్తకాపురానికి వంటరిగా వెళ్ళాను.
    నన్ను చూస్తూనే "పాప ఏది?" అన్నాడు శ్రీధర్.
    "ఇంట్లో వుంచేశాను, అమ్మవాళ్ళు చూస్తామన్నారు."
    శ్రీధర్ నా వంక సూటిగా చూసి "విజయా! ఇదేనా నీవు నన్ను అర్ధం చేసుకొన్నది. పాప లేకుండా, పాపని వదిలి నిన్ను రమ్మనేటంత హీనుడిలా కనిపిస్తున్నానా! ఓ తల్లి హృదయాన్ని ఆ మాత్రం అర్ధం చేసుకోలేని పాషాణాన్నా! పాప లేకుండా నీవు నా దగ్గిర సుఖంగా బతకగలవని నేను నమ్మగలనా! నీవు నన్ను ఎంత తక్కువ అంచనా వేశావు? బాధగా అన్నాడు.
    ఈ ఒక్క ఉదాహరణ చాలు అతని ఔన్నత్యాన్ని చెప్పేందుకు.
    "శ్రీధర్!" అన్నాను సంతోషంగా అతని గుండెల మీద వ్రాలిపోయి. "శ్రీ-నీవు దేముడివి. మనిషివి కావు." కళ్ళనీరు తిరుగుతుండగా కృతజ్ఞతతో అంతకంటే నోట మాట రాలేదు.
    "పిచ్చీ! ఈ రోజునించి పాపకి నేను తండ్రిని, పాప కెప్పుడు నేను తండ్రి కానని చెప్పకు. పద. వెళ్ళి తీసుకొద్దాం" అంటూ అప్పటి కప్పుడు టాక్సీ ఎక్కి బయలుదేరదీశాడు.
    శారదా! ఆ రోజునించి ఈ రోజువరకు మా రెండేళ్ళ బాబుకి ఏడేళ్ళ పాపకి శ్రీధర్ తండ్రి. యిద్దరికీ తేడా చూపించినట్లు నేనెప్పుడూ గమనించలేదు. ఈ రోజు నాకంటే అదృష్టవంతురాలయిన స్త్రీ ఎవరూ వుండరు. మనసిచ్చి పుచ్చుకునే భర్త - ముత్యాలలాంటి పిల్లలు - యింత కంటే స్త్రీకి ఏమీ అక్కరలేదు. ఇవిలేని స్త్రీ ఎంత చదువుకున్నా ఎంత గొప్ప ఉద్యోగం చేసినా - భర్త ఎన్ని వేలు ఆర్జించినా ఎంత దౌర్భాగ్యురాలో నా అనుభవ పాఠం వల్ల తెలుసుకున్నాను. అంచేతే ఏ స్త్రీ అయినా భర్త ఆదరాభిమానాలకి లోటయి హింస అనుభవిస్తూందంటే నా ప్రాణం గిలగిల లాడుతుంది. లోకాన్నంతనీ బాగుచెయ్యలేం. కాని నా చేతిలో ఉన్న సాయం ఏ ఒక్క స్త్రీ కయినా చేయగలిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది ..."
    'డాక్టరుగారూ, మీరెంత అదృష్టవంతులు. మీ లాంటి అదృష్టం అందరికీ పడ్తుందన్న భరోసా వుంటే ఏ స్త్రీ తెలిసి తెలిసి నరకంలో మగ్గదు. ఆ నరకంలోంచి పైకి రావడానికి చేయూతనిచ్చే శ్రీధర్ లాంటి పురుషుల అవసరం ఎంతైనా వుంది.
    ఈనాడు కాకపోయినా వచ్చే శకానికైనా అలాంటి హృదయ వైశాల్యం - సంస్కారం కనపరుస్తారని ఆశిద్దాం. భార్య చనిపోతే భర్త పెళ్ళిచేసుకున్నట్టే భార్యకీ ఆ హక్కు ఉందని భర్తకి దూరం అయిన స్త్రీకి పాపిష్టి స్త్రీ కాదని ఈ సమాజం గుర్తించితే మంచిరోజు వస్తుందని ఆశిద్దాం.
    అవును శారదా, మహిళా సంవత్సరాలు - మహిళాభ్యుదయాలు - యివన్నీ కబుర్లు తప్ప ఓ స్త్రీ కాపురాన్ని సరిదిద్దగలవా? ఈ చట్టాలు, సంస్కరణలు స్త్రీకి ఏ విధంగా చేయూత నిస్తున్నాయి. ఇటు పై తరగతి, అటు కింద తరగతిని ఈ సమస్యలు ఏం బాధించవు. ఎటొచ్చి మనలాంటి వాళ్ళమే సమాజపు సాంప్రదాయాలనించి తెంచుకుని బయటపడలేక, పడితే పరువు తక్కువ అనుకుంటూ - భర్తని కాదంటే ఈ మాత్రపు బతుకూ వుండదేమోనన్న భయంతో నరకంలో మగ్గుతున్న స్త్రీలు ఎందరో ఈనాటికీ వున్నారు.

 Previous Page Next Page