Previous Page Next Page 
జన్మభూమి పేజి 36

    "ఎవరికోసం యిస్తాడు. ఆయన పొలం కూడా మొత్తం కిందకే వస్తుందిగా."
    "అది నిజమేకాని, అంత డబ్బుపెట్టి కొన్న ట్రాక్టరు మనకి వూరికే వాడుకోడానికి ఇస్తాడంటావా."
    "డీజిల్ ఖర్చు, డ్రైవరును మనం పెట్టుకుంటామంటే ఆమాత్రం ఇవ్వడేంటి, పిలిచి అడుగుదామా" రంగా అన్నాడు.
    "నేను ఫోనులో మాట్లాడతానులే. డ్రైవర్ సంగతి కూడా అతనినే చూడమందాము. ఈ ట్రాక్టరు, హార్ వెస్టింగ్ మిషను వగైరాలు మీరు చూడాలి అంటూ పని అప్పచెపుదాం. అతన్ని ఇన్వాల్స్ చెయ్యకపోతే ఫీల్ అవచ్చు. ఆ ట్రాక్టర్లు, కావాల్సిన డీజిల్, రిపేర్లు అవి అన్నీ అతన్ని చూడమంటాను" అన్నారు కేశవరావు.  
    మామయ్య ప్రతిచిన్న విషయం ఎంతజాగ్రత్తగా ఆలోచిస్తాడు. ఎవర్ని నొప్పించకుండా నిర్లక్ష్యం చేసినట్లుండకుండా అందర్నీ కలుపుకుపోవాలనే ఆయన తత్వం రంగాకి రోజురోజుకి అయనపట్ల గౌరవాన్ని పెంచుతుంది.
    కేశవరావు యింటికి వెళ్ళి మాట్లాడగానే "మీరు ట్రాక్టరు, హార్ వెస్టింగ్ మిషను కొంటున్నట్టున్నారుగా, మళ్ళీ నాదెందుకు?" అంటూ మొదట్లో కాస్త ముభావంగా మాట్లాడాడు చౌదరి.
    "మొత్తం ఎనిమిదివందలపాతిక ఎకరాలకి ఒక ట్రాక్టరు ఎలా సరిపోతుంది. మీది వుందని ఒకటే ఆర్డరు చేశాం. చౌదరిగారూ యీ ట్రాక్టర్ల వ్యవహారం నాకేం తెలియదు. మీ హెల్ప్ కావాలి నాకు, మీరు చాలారోజులబట్టి వాడుతున్నారుగా. మరి ఈ పని మీరే చూడాలి. కంపెనీ నుంచి ట్రాక్టరు, హార్ వెస్టింగ్ మిషను తీసుకుని వచ్చినప్పుడు మీరు అదంతా చూసి ఎలా పనిచేస్తాయో చూడాలి. డ్రైవర్ బాధ్యత మీదే. ఇంకో డ్రైవర్ని మాట్లాడాలి. మీలాంటివారు పూనుకోకపోతే నా ఒక్కడివల్ల ఎలా అవుతుందండి. వ్యవసాయపు పనులు నాకేం తెలుసు చెప్పండి. మరి మీరున్నారనే యిదంతా నెత్తిన వేసుకున్నాను" అనగానే చౌదరిగారు దిగివచ్చి "ఆ - ఆ -అట్టాగే, అట్టాగేలెండి- చూస్తా. కంపెనీ మనిషి వచ్చినప్పుడు నా దగ్గిరకి పంపించండి" అంటూ మాట్లాడాడు. ఒక్కక్షణం ఆగి "మరి ఈ హార్ వేస్టర్ యివన్నీ బ్యాంకు లోన్లమీదే కొంటున్నారా"
    "ఆ సంగతి మనం ముందే అనుకున్నాం గదా - మీ ట్రాక్టరు కాక ఇంకో ట్రాక్టరు, హారెస్టర్ కొంత పని సుళువయి, కూలీ వాళ్ళ ఖర్చులు కలిసిరావడం ఒక రోజులో అయ్యేపని ఒక గంటలో అవుతుంది. అంచేత కావాలని నిర్ణయించుకున్నాంగా అందరం కల్సి.
    "ఆరోజు మీటింగుకి నేను రాలేదులెండి. మరి యీ అప్పులు ఎట్టా తీరుస్తారు. ఎవరు తీరుస్తారు."
    "ఎవరేమిటి, మనం- అంతా కల్సి సహకారసేద్యం చేస్తున్నప్పుడు అప్పులు, ఖర్చులు, లాభాలు అన్నీ ఎకరాల నిష్పత్తిలోనే వుంటాయని ముందే అనుకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అడుగుతారేమిటి" కేశవరావుకి కాస్త చిరాకు అన్పించింది ఆయన ధోరణి.
    "మరి నా ట్రాక్టరు వాడతానన్నారు" మరి అది పెట్టుబడి పెట్టింది నేను గదా - నాకేం లాభం వుంటుంది మరి-" ఆఖరికి మనసులోమాట అనేసాడు. అతని లేకి బుద్ధికి చాలా అసహ్యం అన్పించింది కేశవరావుకి.
    "మీరిచ్చింది అయితే మీరే వుంచుకోండి. మేం కావాలంటే మరొకటి కొంటాం. లేదంటే మీరు అమ్మితే సగం ధరకి కొంటాం. చౌదరిగారూ... వూరంతా కలిసి ఒక మంచి పని చేయాలని ముందుకు వస్తున్న తరుణంలో మీలాంటి వున్నవారు ఇంత చిన్న విషయానికి బయటపడిపోవడం బాగాలేదు. వూరికోసం ఈమాత్రం చెయ్యలేరా. సరే, ఎవరి సహాయమూ ఊరికే వద్దు - మీ ట్రాక్టరుకి ఎంత ధర కావాలో తరువాత కబురు పంపండి. మాకు నచ్చితే కొంటాం" విసురుగా అని లేచిపోయాడు కేశవరావు. ఆయనకి కోపం వచ్చిందని గుర్తించగానే "అబ్బే అదికాదులెండి. ఊరికే అడిగాను. మరి బోలెడు డబ్బు పోసి కొన్నానుగా" అని వెకిలి నవ్వు నవ్వాడు. అవును మీరెందుకు నష్టపోవటం, అందుకే డబ్బు యిస్తాం- వద్దంటే ఇంకోటి మేమే కొంటాం-" అని ఇంక మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయారు.
    "దొంగ వెధవ. అంతడబ్బుంది - ట్రాక్టరు కి డీసెల్, డ్రైవర్ ఖర్చు పెట్టుకుంటానన్నా ఇవ్వడానికి ఏడుస్తున్నాడు. అంకుల్ ఆ వెధవని ఎందుకడగడం, ఇన్ని లక్షలు ఖర్చు పెడ్తున్నాం. మరొకటి కోనేద్దాం-" వాసు అన్నాడు.
    ఆయన ఒక్కక్షణం ఆలోచించి- కొనచ్చు, ఈ కారణంగా పంతాలు పట్టింపులు పెరిగి, పార్టీలు ఏర్పడి మనం అనుకున్న లక్ష్యం సాధించడానికి అవరోధం అవచ్చు అని ఆలోచిస్తున్నాను.
    "ఎప్పుడూ ఈ చౌదరి ఇంతే అంకుల్. వూరంతటిలోకి డబ్బున్న వాడినని అహంకారం. వాళ్ళబ్బాయిని చిన్నప్పుడు మాతో ఆడనిచ్చేవాడు కాదు. కాని డబ్బు మీకున్నదానిలో ఎన్నోవంతన్నది వాడికి అర్థమయినట్టు లేదు" ఎర్రబడ్డ కేశవరావు మొహం చూసి ఆయన హర్ట్ అయ్యారన్నది గుర్తించి అన్నాడు వాసు.
    "ఆ మాత్రం ఇంగితం ఉన్నవాడు ఇలా మాట్లాడడు. వదిలేయ్ అలాంటివాళ్ళని. ఇతని వరస చూస్తే ముందు ముందు మనకి ప్రాబ్లమ్ అవుతాడేమోననిపిస్తూంది. ఈ ఏడాది పంట అవనీ, మనతో కల్సి రాకపోతే మళ్ళీ ఏడాది నుంచి అతని భూమి మనతో కలుపుకోవద్దు."
                                 *    *    *
    ఎండలు ముదిరాయి. ఇంట్లో ఎంత ఎయిర్ కండిషన్ వున్నా ఆ ఎండలు అలవాటు పోయి రాజేశ్వరికి, కేశవరావుకి ఇబ్బందే అనిపించింది. పెంకుటిల్లు, ఫాల్స్ సీలింగ్ వుండి చాలా చల్లగానే వున్నా ఆమాత్రం వేడి కూడా భరించలేకపోయేవారు. ఎండ ముదిరాక ఆస్పత్రిలో ఎక్కువసేపు కూర్చోలేకపోయేవారు, శ్యామల ఆయనని బలవంతంగా తాను చూసుకుంటాను అవసరం వస్తే పిలుస్తానని పదకొండు గంటలకల్లా పంపేసేది ఇంటికి. ఎండాకాలం గనక ఉదయం ఎనిమిది గంటలకే ఆస్పత్రి తెరిచి పదకొండుకి వెళ్ళేవారు. మధ్యాహ్నం ఎంతో అవసరం అయితే తప్ప వెళ్ళేవారు కాదు.
    ఎండాకాలం - ఆడవాళ్ళందరూ ఊరగాయాల హడావిడిలో పడ్డారు. తోటల నుంచి మంచి పుల్లని కాయలను రంగా బేరం ఆడి తెప్పించాడు. ఆవకాయ, మాగాయ, తొక్కు పచ్చడి రకరకాల ఊరగాయల తయారీలో ఉదయం పది నించి వంటి గంట వరకు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరువరకు బ్యాచిలు బ్యాచులుగా ఆడవాళ్ళు ఊరగాయలు పట్టి సీసాలలో ప్యాక్ చేశారు. మొదటి ప్రయత్నంగా నూరు కేజీలు చొప్పున అన్నిరకాల ఊరగాయలు పట్టారు. కిలో అరకిలో సీసాల్లో ప్యాక్ చేసారు. ఏ పేరు మీద అమ్మాలన్న తర్జన భర్జన అయ్యి చాలా రోజులు జరిగాక "హోమ్ మేడ్" అన్న పేరు రాజేశ్వరికి తట్టింది. ఇంటి ఊరగాయలంత రుచికరంగా ఉంటాయి అన్న అర్థం వచ్చేందుకు ఆ పేరు కేశవరావుగారు కూడా మెచ్చుకున్నారు. పొలాల గట్లమ్మట పెరిగిన గుమ్మడికాయలు అందరి పొలాల నుంచి తెచ్చి పడేశారు.    
    అవన్నీ గుమ్మడి వడియాలు, ఉల్లి వడియాలు, బియ్యం పిండి, సగ్గుబియ్యం వడియాలు, రకరకాల పొడులు, కంది పొడి, నువ్వుల పొడి, కారం పొడి, ధనియాల పొడి, గోంగూర, మిరపకాయ, చింతకాయ పచ్చళ్ళు అన్నీ ప్యాకెట్లు తయారయ్యాయి. తయారు చెయ్యడం ఒక ఎత్తు అవి అమ్మడం మరో ఎత్తు. రాజేశ్వరి, కేశవరావుగారు ఒకరోజు ముందుగా కలక్టర్ గారికి ఫోను చేసి విజయవాడ వెళ్ళి కల్సుకున్నారు. ఇవన్నీ కాటేజ్ యిండస్ట్రీ కిందకి వస్తాయి.
    ఇవి దుకాణాలలో సేల్ ఆర్ రిటర్న్ బేసిస్ మీద కొంత పర్సంటు దుకాణం వారికి యిచ్చి పెట్టుకుని ఆయన ఇచ్చిన సలహా రాజేశ్వరికి అంత నచ్చలేదు. షాపుల్లో అమ్మకాలు ఎప్పుడు అవుతాయి. ఎప్పుడు డబ్బు చేతికి వస్తుంది. ఈ పద్ధతి లాభంలేదు. కేవలం తమ ప్రొడక్ట్స్ సేల్ ఏర్పాటుచేస్తే అన్న ఆలోచన వచ్చింది. ఆయన వెంటనే అంగీకరించి పెరేడ్ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ పెట్టుకోడానికి పర్మిట్ తీసుకుని - రాజేశ్వరికి కావాల్సిన సహాయ సహకారాలు అందించమని కింద అధికారులకి ఆదేశించారు.

 Previous Page Next Page