Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 36


    "హాయిగా ఉండేవారా? చూడండి వందనాదేవిగారు! మీ స్పీచ్ ఇలానే సాగిందంటే ఇక్కడ ఉన్న దిండ్లు... దుప్పట్లు... సుందరి సుకుమారి బామ్మగారు చేసి ఇచ్చిన పిండివంటలు ఎగిరివచ్చి మీ ముఖాన పడతాయ్. ప్లేటు ఫిరాయించండి... మర్యాదగా ఉంటుంది" ప్రమద చెప్పింది.


    "నా పిండి వంటల జోలికి వెళ్ళావంటే నాలుగుతుకుతాను జాగ్రత్తే ప్రమదావని!" సుందర సుకుమారి వార్నింగ్ ఇచ్చింది.


    "వందన చెప్పేది వినకుండ మధ్యలో నీ గోలేంటే? ఊ... కానివ్వవే వందనా!" రాణి అంది.


    "సోదరీ మణులారా! తొందరపాటు తగదు. సాంతం విని తీర్పు ఇవ్వండి. పూర్వం వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి చాలా తేడా ఉంది. అలా ఎందుకు ఉంది? ఆ మార్పు ఎక్కడ వచ్చింది? అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఇస్తూ నేను మాట్లాడుతూంటే మీరు అడ్డు తగిలారు."


    "ఇంకా తగలం కానివ్" అంది రాణి.


    "ఈ కాలంలో యువతికి ఇరవైయేళ్ళు దాటితే గాని పెళ్ళి చేయడం లేదు. ప్రతివాళ్ళకి బైట ప్రపంచం తెలుసు. కాస్త స్వేచ్చ... కాస్త వ్రాయడం తెలిసి ఉండటంవల్ల వ్యక్తిత్వం కూడ వాళ్ళల్లో మెండు దండిగ ఉంది. దాంతో పెళ్ళికాగానే తనంత వయసు మగవాడు అనే భర్త...అత్తవారింట్లోని మరికొందరు ఏదో అన్నారని తమ వ్యక్తిత్వానికి దెబ్బ అనుకొంటు దేనికీ రాజీ పడలేక ఒదిగి ఉండలేక..."


    వందన మాటలకి ప్రమద అడ్డం వచ్చింది.


    "అబ్జక్షన్...అబ్జక్షన్... ఎందుకు రాజీపడాలి? ఎందుకు రాజీగా ఉండాలి? భర్తతో సమానంగా చదివింది...భర్తతో సమానంగా వాదిస్తోంది. మరికొన్ని చోట్ల వరకట్నంతో భర్తని కొంటున్నది. అలాంటప్పుడు ఎందుకు మాట పడాలి? ఎందుకు తగ్గుండాలి?"


    "ఈ ప్రశ్నకి సమాధానం నాకు తోచింది నేను చెబుతాను." అంటు రాణి అడ్డు తగిలి తనకి తోచింది చెప్పింది. "ఇదింకా పురుషాధిక్యత ప్రపంచమే వేదిక లెక్కి ఉపన్యసించడం వరకే. తనవరకు వచ్చేసరికి పతిదేముడు తన ప్రతాపం సతిమీద చూపుతుంటాడు. ఓ పక్క స్త్రీలు తన వ్యక్తిత్వం దెబ్బతింటుందని బాధ పడుతుంటే పురుషుల్లో కించిత్ మార్పులేక...మార్పురాక..."


    "వాళ్ళల్లో మార్పులేదంటావా రాణీ!" ప్రమద అడిగింది.


    "లేదు లేదని నొక్కి వక్కాణించి మరీ చెబుతున్నాను. ఈ మగాళ్ళకి వెన్నముక... వో వ్యక్తిత్వం ఉంటే ఆడపిల్లలకి కట్నాల బాధలు ఉండవు...కిరసనాయిల్ చావులు ఉండవు."


    "చూడమ్మా రాణి! చాలా బాగా చెప్పావు కానీ నా మాట కూడ విను. భార్యపై కిరసనాయిల్ పోసి తగలెట్టేది భర్త ఒక్కడే కాదు అతని వెనుక అత్త...ఆడబడుచు ఉంటారు. స్త్రీకి స్త్రీయే శత్రువు ఇక్కడ... అతని పాత్ర చాలా తక్కువ." ప్రమద అంది.


    "స్టాప్! స్టాప్! నీవు చెప్పింది సరైంది కాదు. కట్న కానుకల విషయం వచ్చేసరికి "నాదేంలేదు...మా పెద్దవాళ్ళని సంప్రదించండి." అనే ఈ పురుష పుంగవుడికి వ్యక్తిత్వం ఎక్కడ ఉందే? అసలెక్కడ్నించి వస్తుంది? పెళ్ళివరకు పెద్దలమీద భారం వేసే ఈ ప్రబుద్ధుడు పెళ్ళయిన మరుక్షణం పెళ్ళాంమీద మాత్రం పెత్తనం చెలాయించడానికి తన స్వంత నిర్ణయం తీసుకుంటాడు. పెళ్ళాం విషయంలో వాడు ఆడింది ఆట పాడింది పాట. కాదంటారా! ఔనంటారా!"


    "ఎంతమాత్రం కాదనను." రాణి అంది.


    "నేను కూడా కాదనను. దీనికి పరిష్కార మార్గం ఏది వందనా?" ప్రమద అడిగింది.


    "ఏది? ఎక్కడ ఉంది? అంటే ఎవరూ తీసుకొచ్చి మన కళ్ళముందు తెచ్చి మన దోసిట్లో పెట్టరు. మనమే చూసుకోవాలి. స్త్రీల సమస్యలు...బానిసత్వం...అన్యాయానికి ఆహుతి కావడం... అన్నది తరతరాల నుంచి మళ్ళీ మాట్లాడితే యుగ యుగాలనుంచి ఉంది. మన సమస్యలకి పరిష్కారం...మనకి జరుగుతున్న దురన్యాయాలకి ఆనాడు పురుషులే నడుంబిగించి ఎదుర్కొన్నారు. వారిలో రాజారామోహన్ రాయ్...కందుకూరి వీరేశలింగం పంతులుగారు...వగైరా వగైరా... ఇలాంటి ఎందరో మహాపురుషులు... మహానుభావులు ఉన్నారు. మరి ఇప్పుడు...?"


    "భూతద్దం పెట్టి ముల్లోకాలు గాలించినా అలాంటి మహానుభావులు లేరు." ముల్లోకాలు చుట్టి వచ్చినదానిలా చెప్పింది రాణి.


    "కనుక ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏమిటి?" ప్రమద అంది.


    "దీనికంత తలబద్దలు కొట్టుకొని చావాలా? నన్నడిగితే ముప్పొద్దులా మనకి కావాల్సింది హాయిగా తిని...సినిమాలు... షికార్లు... పుస్తకాలు... ఆపై మధ్య మధ్య ఇలా యాత్రలు చేస్తూ పెళ్ళిమాట పెట్టకపోతే సరి. అప్పుడు దేశంలో ఉన్న ఈ మగ మహారాజులు పెళ్ళిళ్ళు కాక లబ్బుమని గోలపెట్టి "కట్నాలు అడగము...కిరసనాయిలు కొనము...భార్యకి మాతోపాటు సమాన హక్కులు ఇస్తాము..." అంటూ వీధిన పడతారు. ఎలా వుంది నేను చెప్పింది" సుందర సుకుమారి అడిగింది.


    "వినటానికి చాలా బాగుంది తల్లీ! గోధుమ హల్వాలా స్మూత్ గా నాలుకమీద పెట్టుకుంటే జారిపోయేలా ఉంది" వందన అంది.


    "నాకు తోచింది చెప్పాను సరే__నీ అభిప్రాయం చెప్పు అని బాదం హల్వాలా ఉంటుందేమో చూస్తాను." సుందర సుకుమారి సుందరంగ పలికింది.


    "ఏ హల్వాలాగాను ఉండదు. బాగా కారంగా ఉండే మిరపకాయ బజ్జిలాగ ఉంటుంది. సరేనా! మనమిప్పుడు ఎదిగిన ఆడపిల్లలం మనకంటు ఓ వ్యక్తిత్వం ఉంది. ఈ తరం యువతులం. స్వేచ్చ కోరుతున్నవాళ్ళం. ఇప్పుడు చదువు...ఉద్యోగాలు... ఇంటా బయట ఎన్నో సమస్యలు...ఇవన్నీ కూడా మనకి మనమే చూసుకోవాలి. ధైర్యంగ ఎదుర్కోవాలి. ఏ మహానుభావుడో పుట్టాలి...మన సమస్యలని పరిష్కరించాలి... అనుకోవడం మనచేతగాని తనమే. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి..."

 Previous Page Next Page