Previous Page Next Page 
మగబుద్ధి పేజి 36


    "దీనికే ఇంత భయపడితే రేపు మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోకపోతే ఏం చేస్తాం?" ఆమె టాపిక్ మార్చిందని గ్రహించి అతనూ ఆ ట్రాన్స్ లోంచి బయటపడి అడిగాడు.

 

    ఆమె మౌనంగా వుండిపోయింది ఏదో ఆలోచిస్తున్నట్టు.

 

    "నాకంటే అలాంటి సమస్య లేదు. ఎందుకంటే నేను అనాధను" అతను నవ్వుతూనే అన్నా ఆ మాటల వెనుక వున్న విషాదం ఆమెను సూటిగా తాకింది.

 

    "ఇప్పటివరకు నువ్వు అనాధవి కావచ్చు ఇకనుంచి కావు. కంటికి రెప్పలా నిన్ను కాపాడే నేనున్నాను" రజని ఎంతో ప్రేమతో అతని రెండు చేతుల్నీ తీసుకుని ఒళ్ళో వేసుకుంది.  

 

    ఆ మాటలకు అతను కందిపోయాడు. అన్ని రోజులూ జీవితంలో పేరుకుపోయిన ఒంటరితనాన్ని రజని మంత్రం వేసి తీసేసినట్టయింది.

 

    "నేను మొదట అడిగిన దానికి జవాబు చెప్పలేదు నువ్వు. మన పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటారా?" అని అడిగాడు మళ్ళీ. రజని కోటీశ్వరుడి కూతురు కాబట్టి తనకు దక్కకుండా పోతుందేమోనన్న భయం అతని మనసులో ముసుగు దొంగలా వుంది.  

 

    "తప్పకుండా ఒప్పుకుంటారు. ఆయన మనసు తెలుసు నాకు. ఆయన ఎప్పుడూ నా ఇష్టాన్ని కాదనరు. నేను ఫలానా వ్యక్తిని పెళ్ళి చేసుకుంటానంటే ఆ వ్యక్తిని గురించి ఏమీ తెలుసుకోకుండా వెంటనే ఓకే అనేస్తారు. ఆయనకు నామీదున్న ఇష్టమే కాదు, ఆయన వ్యక్తిత్వం అలాంటిది."  

 

    అతను కుదుటపడ్డాడు. అయినా ఇంకా అనుమానమే!

 

    "నాలాంటి అనాధను. చేసుకోవడానికి ఇష్టపడతారా?"

 

    "ఇష్టపడతారు. తన పెళ్ళి తన ఇష్టం అనుకునే వ్యక్తి ఆయన" గొప్పగా చెప్పింది ఆమె.

 

    మళ్ళీ ఆమే అంది "శంకలన్నీ మానేయ్! మనం హనీమూన్ ఎక్కడికెళదాం? నాన్నగారు అప్పుడప్పుడు అనేవారు "నీకు పెళ్ళి జరిగాక హనీమూన్ యూరప్ కి పంపిస్తానమ్మా" అని. కానీ నాకు ఇష్టం లేదు. ప్రేమించే పతి చెంతనుండగా యూరప్ ఎందుకు? చిన్న పల్లెటూరయినా అద్భుతంగా వుంటుంది. ప్రేమలో వున్న గొప్పతనమే అదేననుకుంటా."

 

    "కరెక్ట్! ప్రేమించబడడం కన్నా ప్రేమించడమే గొప్ప అనుభూతి. అందుకేననుకుంటా నీ విషయంలో నేనే మొదట ప్రారంభించాను. డాబా గదిలో... ఆ వుక్కలో, ఆ మురికి ప్రదేశంలో వున్నా ఇంతకాలం నా కళ్ళ ముందు ఇంద్రధనసుల్ని తిప్పింది ప్రేమే. నీ గురించి ఆలోచిస్తుంటే కాలం తెలిసేది కాదు" నరేష్ ఏదో లోకంలో వుండి మాట్లాడినట్టు ఎక్కడో చూస్తూ చెప్పాడు.

 

    "అవును నరేష్!"

 

    కాసేపు వాళ్ళిద్దరి మధ్య మౌనం.

 

    అతను ఆ గాఢత్వంలోంచి తేరుకున్నాడు. వాతావరణాన్ని తేలిక పరచడానికి "ఇంతకీ మన పెళ్ళి ఎప్పుడు?" అని అడిగాడు.

 

    "నువ్వు నీ దొంగబుద్ధిని సో కాల్డ్ మగబుద్ధిని మానుకున్నాక" నవ్వుతూ చెప్పింది రజని.

 

    అతను అర్థం కానట్టు ఆమెవేపు చూశాడు.

 

    "అర్థం కాలేదా? నేను మనం కలుసుకున్న ప్రతిసారీ గమనిస్తున్నాను. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఆటోమేటిక్ గా నీ తల అటువేపుకి తిరిగిపోతోంది. దట్ ఈజ్ వెరీ బేడ్ హేబిట్" ఆమె ఇంకా నవ్వుతూనే వుంది.

 

    ఆమె ఏ విషయాన్ని అయినా సీరియస్ గా చెప్పదని, చాలా లైట్ గానే చెప్పినా ఎదుటి వ్యక్తి దానిని తూచా తప్పకుండా ఆచరించాలని ఆమె కోరుకుంటుందని అతనికి తెలీదు.

 

    అతనూ హాయిగా నవ్వేసి "అది దురలవాటు కాదు. మగవాడి అలవాటు" అని అన్నాడు.

 

    "కావచ్చు నువ్వు అందర్లాంటి మగవాడివి. కావని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ప్రేమించాను."

 

    కాసేపాగి ఆమె మళ్ళీ చెప్పింది "మగవాడిలో ఏ దుర్గుణాన్ని అయినా భరించగలనేమో గానీ ఈ విషయాన్ని మాత్రం టాలరేట్ చేయలేను. ఇప్పటివరకు నేను ఆదర్శ పురుషులని అనుకునేవారు ఇద్దరే ఇద్దరు. ఒకరు శ్రీరామచంద్రుడయితే, మరొకరు నాన్న."

 

    నరేష్ కు ఆమె కొత్తగా కనిపిస్తోంది.

 

    "నావాడు నాకే కావాలి. మరో ఆడపిల్లవేపు చూసినా నేను భరించలేను. అది బహుశా నా బలహీనత కావచ్చు, నా ఆదర్శం కావచ్చు, నా సెంటిమెంట్ కావచ్చు. నాకు కావలసింది నువు మరో ఆడపిల్లవేపు చూడకుండా వుండడమే కాదు, మరో అమ్మాయి గురించి ఏ క్షణమైనా ఆలోచించకూడదు. ఆ ఔన్నత్యాన్ని నువ్వు సాధించాలి."

 

    అంతా విన్నాక అతనన్నాడు "ఎదురుపడ్డ ఆడపిల్లను చూడకుండా ఉండడం ఎవడి తరమూ కాదు."

 

    మగవాడికున్న ఆ బుద్ధిని అతను తప్పుగా భావించడం లేదు. సర్వ సాధారణం అనుకుంటున్నాడు. అందునా అది మగవాడి సహజ లక్షణమని కూడా అతని గట్టి నమ్మకం.

 

    "ఏ మగాడూ లేడనకు. చెప్పాగా మా నాన్న వున్నారని. ఆయన ఏకపత్నీవ్రతుడని గర్వంగా చెప్పగలను. మా అమ్మ ఎప్పుడూ వ్రతాలూ, పూజలతోనే గడుపుతుంది. నా తరువాత పిల్లలు పుట్టకపోవడానికి కారణం మా అమ్మ వ్రతాలేనని, మరో కుటుంబ నియంత్రణ పధ్ధతి అవలంభించాల్సిన అవసరం లేకపోయిందని నాన్న అప్పుడప్పుడూ జోక్ చేస్తుంటారు కూడా. అంత డబ్బులున్నా ఆయన మరో ఆడపిల్లను దగ్గరకు రానివ్వలేదు. మా కంపెనీల్లో పనిచేసే స్టెనోల పేర్లు కూడా తెలియవు నాన్నకు. మా బంగళాలో వున్న ఔట్ హౌస్ కు ఆఫీసు పనుల మీద ఎంతోమంది స్త్రీలు వస్తుంటారు. అయినా నాన్న హద్దు మీరలేదు. మా అమ్మ ఎన్నో వ్రతాలు పుణ్యం కోసం చేస్తే నాన్న పురుషార్థం కోసం ఏకపత్నీవ్రతం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు" ఆమె ఆగింది.

 

    నరేష్ శ్రద్ధగా వింటున్నాడు.

 

    ఆమె మళ్ళీ ప్రారంభించింది "ఆడపిల్ల కనిపిస్తే యావగా చూసే మగవాడు సమయమూ, సందర్భమూ కలిసొస్తే అంతకంటే ముందుకు పోడని నమ్మకం ఏమిటి? అందువల్లే ఆడపిల్ల కనిపిస్తే ఆమెను తినేసేటట్టు చూసే మగవాళ్ళంటే అసహ్యం నాకు. మీరు అనాధ అయినా, మీ దగ్గర చిల్లిగవ్వ లేకపోయినా మిమ్మల్ని ప్రేమించాను. మరో ఆడపిల్లవేపు కన్నెత్తి చూడని సుగుణం వుంటే చాలు నాకు. ఆడపిల్ల కనిపిస్తే గుటకలు మింగే వంకర బుద్ధి లేకుంటే అదే పదివేలు. మీకు ఆ దొంగబుద్ధి లేదని విశ్వసిస్తున్నాను నన్నెప్పుడూ డిసప్పాయింట్ చేయకండి"  

 Previous Page Next Page