Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 37


    ఊరేగింపు వీరయ్యగారింటికి చేరింది.

 

    ఊరేగింపు తీయడం ఈ రాజ్యంలో నిషేధం. అయినా దాన్ని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేకపోయింది.

 

    సయ్యద్ జమాల్ అమీను కుటుంబ సహితంగా పలాయనం చిత్తగించాడని ప్రజలు రఘుకు తెలియజేశారు. ఒక పీడ విరగడైపోయినందుకు సంతోషించారు జనం.

 

    ఆ సాయంకాలం గుడికి వెళ్ళాడు నాగేశ్. మున్సిఫ్ హత్య జరిగిన్నాటి నుంచీ అక్కడికి వెళ్ళలేదతను. మసక చీకట్లో రుక్మిణిని కలుసుకున్నాడు. రుక్మిణి ప్రసాదం పెట్టింది. గభాల్న నోట్లో వేసుకుని చాలా బాగుందన్నాడు.

 

    "కండ్ల కద్దుకొమ్మంటే అడ్డుకోవులే" అన్నది రుక్మిణి.

 

    "నిన్ను అద్దుకొమ్మంటే అద్దుకుంట."

 

    "ఛీ, పో ఎప్పుడు కొంటెమాటలే" అని విదిలించింది.

 

    ఇద్దరూ మంటపంలో కూర్చున్నారు. పక్కన పళ్ళెంలో ప్రమిద మండుతూంది.

 

    "ఎందుకు మనను చూసి ఇట్ల మండుతది" అని చేతితో దాన్ని ఆర్పివేశాడు నాగేశ్.

 

    రుక్మిణి దూరంగా జరిగి "ప్రసాదం యాడిదో ఎరికేనా?" అని అడిగింది.

 

    "యాడిదైతే నా కెందుకు? నువ్వు పెట్టినవని తిన్న."

 

    "తిట్లకాదు రఘువచిండని కొబ్బరికాయ కొట్టిన".

 

    కళ్ళు పెద్దవి చేసుకొని జవాబుకోసం నాగేశ్ ను చూడసాగింది. ఆశించిన ఉత్సాహం కనిపించలేదు నాగేశ్ లో.

 

    "నేను పోయ్యొస్తే ఇట్లనే కొడ్తావా!"

 

    రుక్మిణి గుండెల్లో పిడుగుల వాన కురిసింది. "నువ్వెందుకు పోతవ్?"

 

    "రుక్మిణీ! నువ్వు పిచ్చిదానివి. రఘు కాబట్టి పోయిమళ్ళీ వచ్చిండు. నేను పోవటమే మళ్ళ రావటం ఉండదు. అప్పుడు నువ్వు..."

 

    నోరు మూసేసింది రుక్మిణి. "అట్లనకు" గొంతు జీరపోయింది. "నేను సావిత్రిని నువ్వు యాడికి పోయినా తీసుకొస్త."

 

    నాగేశ్ ఆశ్చర్యపోయాడు. ఆవిడ దగ్గరికి జరిగాడు. ఆవిడ దూరం జరిగింది. అతడు ఇంకా జరిగాడు. ఆవిడ లేచి నుంచుంది. అతడు నుంచున్నాడు.

 

    ఒకరి ఎదురుగా ఒకరు.

 

    క్షణం గడిచింది.

 

    "రుక్మిణీ, నేనూ పోతాను. అందుకు సిద్ధంగా ఉండు" అన్నాడు.

 

    ఆవిడ కన్నీరు రాల్చింది.

 

    రిరుక్కున వెనకకు తిరిగి వెళ్ళిపోయింది.

 

    చూస్తూ ఉండిపోయాడతను ఒక్క క్షణం.

 

    పక్కకు చూస్తే పళ్ళెం కనిపించింది.

 

    "రుక్మిణి!" అతడు పిలిచాడు.

 

    ఆమె వెనక్కు తిరిగి చూచింది.

 

    కళ్ళలో ఇంకా నీరుంది.

 

    అతడు ముందుకు నడిచి పళ్ళెం అందించాడు.

 

    ఆమె అందుకుంది.

 

    వెళ్ళిపోయింది.


                                        7


    అడవిలో అందాలు పూశాయి. అది పూలు తురుముకుంది. అలంకరించుకుంది. సింగారించుకుంది. పూలతో మండింది. పూలతో నిండింది. ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి గుట్ట పూసింది. పూతతో అడవి పూలగోడగా తోచింది. చెట్లు, ఒకటా రెండా! వందలు, వేలు, లక్షలు పూశాయి. దాచుకుంటాయా చెట్లు? రాల్చసాగాయి. దారంలేని దండలు కట్టసాగాయి. రాలిన పూలు రంగవల్లులైనాయి. రాళ్ళమీద, బండలమీదా ముగ్గులు తీర్చాయి.

 

    గాలి, మెల్లని గాలి, కమ్మనిగాలి ఊపుతూంది చెట్లను, ఊయల లూగుతున్నాయి చెట్లు. ఆడుతున్నాయి చెట్లు. పూలచెట్లు తలలు ఊపుతున్నాయి. తలిరుబోళ్ళను మించుతున్నాయి. సోయగాలు ఒలికిస్తున్నాయి. నృత్యం చేస్తున్నాయి. నాట్యం చేస్తున్నాయి. గండు తుమ్మెదలు గుంపులుగా పాడుతున్నాయి. వెదుళ్ళకు రంధ్రాలు చేస్తున్నాయి. వేణువులుగా మారుస్తున్నాయి. పిల్లగాలి వాటిలోకి దూరుతుంది. వేణుగానం ఆలపిస్తుంది. కోకిలమ్మలు ఊరుకోగలవా? అవీ పాడుతున్నాయి. కుహూ కుహూ అని రాగాలు ఆలపిస్తున్నాయి.

 

    అడవి అందాలు చిమ్ముతూంది. విందులు కడుపుతూంది. కోయదొరల, దొరసానుల గుండెల్లో కోట్ల వసంతాలు మొలిచాయి. వారికిప్పుడు పనిలేదు. వసంతపు సంతలను దోచుకోవడమే పని. ఇప్పచెట్లు విరగపూసాయి. రాలిన పూల రాసులు గంపలకు ఎత్తడం, తేవడం, సారాయి కాచడం, అదేపని. ఇప్ప సారాయి తాగపనిలేదు. ఇప్పచెట్ల కిందవుంటే చాలు మత్తు వచ్చేస్తుంది. కోయలది ఆ ఉన్మత్త జగత్తు. ఇక వారి జీవితమే మత్తు.

 

    ఆ మత్తులో సింగి గుర్తుకు వచ్చింది సింగన్నకు. అడవిలో నిప్పు లుమిసే మోదుగు చెట్టుకింద, బండ మీద, కొలని ప్రక్క కూర్చున్నాడు. సింగి కావాలనుకున్నాడు. కింది గూడెం పోదామనుకున్నాడు. కింది గూడెం పోతాడు. సింగి కనిపిస్తుంది. తనను చూస్తుంది. కిలకిలా నవ్వుతుంది. తనతో తిరుగుతుంది. చుక్కలను చూపుతుంది. లెక్క పెట్టమంటుంది. తనను మండిస్తుంది. తరవాత...? తరవాత అంతా శూన్యం. ఆ శూన్యాన్ని సింగితో నింపాలనుకున్నాడు. సింగిని తెచ్చుకోవాలనుకున్నాడు. నిశ్చయించుకున్నాడు. ఈ వసంతం వట్టిపోరాదనుకున్నాడు. బయలుదేరాడు గూడేనికి. చేరుకున్నాడు గూడెం. అయ్యతో చెప్పాడు. సింగిని తెచ్చుకుంటానన్నాడు. సమ్మయ్య కేమీ ఆశ్చర్యం కలుగలేదు. కలగాల్సిన పనీలేదు. పరువం వచ్చింది. పడుచువాడు పడుచుదాన్ని తెచ్చుకుంటా నంటున్నాడు. అది సాధారణం. అతి సాధారణం. మగపిట్ట ఆడపిట్టను వెతుక్కుంటూపోయింది. చూచింది. వలచింది. తెచ్చుకుంటానంటూంది. వింత ఏం? కోయ దొరలూ పక్షులే. వారికి మతాల్లేవు. కులాల్లేవు. కలవాడు లేడు. లేనివాడు లేడు. అంతా మనుషులే. అంతా దొరలే. అంతా కోయలే. ఏ పడుచునైనా లాక్కురావచ్చు. ఏ పడుచువాడైనా అక్కడ నిర్బంధంలేదు. బంధంలేదు. అడ్డులేదు. గోడలు లేనేలేవు. కాని బలం కావాలి. పిల్లని గెలిచి తెచ్చుకోవాలి. అందును గురించే ఆలోచించాడు సమ్మయ్య. కిందిగూడెం మీద విరుచుకు పడాలి. గెలవాలి. సింగిని తేవాలి. ఓడితే సింగి దక్కదు. ఓడరాదు. సింగిని తేవాలి. సింగన్నకు కట్టాలి. కోడలు రావాలి. ఆడది రావాలె ఇంటికి, ఎన్నాళ్ళు పెరుగుతాడు బుడుతడు ఆయమ్మ దగ్గర, కోడలే పెంచుతుంది. కొంప బాగుచేస్తుంది. ఇలాంటివే మరెన్నో ఆలోచనలు వచ్చాయి. కాని చిన్నవాడు. చిన్నయ్య మనసులో మెదిలాడు. చుట్ట చుట్టుకున్నాడు. కాల్చుకున్నాడు. లేచాడు. చిన్నయ్య పెరుగుతున్న ఇంటికి వెళ్ళాడు. పాకుతూ వచ్చాడు చిన్నయ్య. మీద పడ్డాడు. ఎత్తుకున్నాడు. ముద్దులు కురిపించాడు. ఆయమ్మకు చెప్పాడు - కొడుకు కోడలును తెచ్చుకుంటానన్నాడని. ఆయమ్మ మురిసిపోయింది. వచ్చేసి సింగన్నకు పెళ్ళామే కాదు గూడేనికి కోడలు!

 

    ఆ మాట ఆ నోటా ఈ నోటా గూడెమంతా పాకింది. ఆ రాత్రి గూడెం సాంతం సమ్మయ్య ఇంట్లో చేరింది. సింగిని గురించి చర్చ సాగింది. సింగన్నను గురించి మాటలు సాగేయి. ఆమోదం తెలిపారంతా. చెట్లు తలలూపాయి. చుక్కలు మిలమిలా మెరిశాయి. ఇంకేం! ఆనందం! ఇక ఆనందం చిందులు తొక్కాలి. సమ్మయ్య గూడేనికి విందు చేయాలి. చేయాలి. చేయకుంటే ఎలా? రేపు గూడెమంతా అతనితో కదలాలి. కింది గూడేన్ని గెలవాలి.సమ్మయ్య ఇంట్లోంచి సారాయి వచ్చింది. కోళ్ళు తెగాయి. వెదురు బియ్యం ఉడికాయి.

 

    "సింగేమో సింగన్నకు నచ్చింది,
    ఊరికో కోడలమ్మ వస్తుంది"

 

    పాటలు, పకపకలు, విక వికలు, ఎన్నో, ఎందరో, ఏమో? ఏమో? అదొక పర్వం అదొక పండుగ. అదొక ఉత్సవం. మనసులు నిండేయి. మనషులు పొంగారు. అడుగురు పడ్డాయి. అడుగులు కలిశాయి. ఆటలు సాగేయి. జంటగా ఎగిరారు. ఒంటరిగా ఎగిరారు. మూకగా ఎగిరారు. మూగగా ఎగిరారు. వారిని చూచింది. అగ్గి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. భగ భగా మండింది. వెలుగులు చీకట్లు. చీకట్లు వెలుగులు, వేసటలేని ఆట. బాసటలేని పాట. చూచీ చూచీ కళ్ళు మూసుకున్నాయి చుక్కలు. చూడాలని ఆరాటపడి వచ్చాడు సూర్యుడు. పాపం చూడలేకపోయాడు. ఆట నిలిచింది. పాట నిలిచింది. మూక చెదిరింది. గూళ్ళకు చేరింది. కాని రాగాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి మత్తులో. మనసులో ఆటలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.

 

    గూడెం మత్తులో ఉంది.

 

    జనం నిద్రలో ఉంది.

 

    అంతా చుప్ చాప్, నిశ్శబ్దం. ఎక్కడా అలికిడి లేదు. ఎక్కడా కదలికలేదు. గాలి సవ్వడి తప్ప శబ్దంలేదు. గువ్వల అరుపులు తప్ప మాటలేదు.

 

    ఎంతసేపా నిద్ర? ఎంతసేపా మత్తు? అడవి బిడ్డ ఆదమరచి నిద్రపోడు. అనుక్షణం అప్రమత్తుడుగానే ఉంటాడు. అది అడవి, ఏక్షణం, ఏమికానుందో! ఏది రానుందో! ఏమి ఎరుక? కర్తవ్యం మరువడు కోయ, తెలుసు తాను ఎప్పుడు లేవాలో. అందుకే లేచింది గూడెం..కలకలం లేచింది. అందరూ కదిలారు. బల్లెలూ బరిశెలు కర్రలు తుపాకులతో కదిలింది గూడెం దండయాత్రకు - కాదు కాదు - ప్రేమయాత్రకు.

 Previous Page Next Page