కోయల కాళ్ళకు రెక్కలు వచ్చాయి. వారు కింది గూడెపు అడవిలో వాలారు. చెట్ల చాటున, పొదల చాటున నక్కారు. అంతా గప్ చుప్. ఎక్కడా సవ్వడిలేదు. ఒక్క మాటలేదు. ఒక్క పలుకులేదు. పొంచిపట్టాలి పిట్టను. అది వారికి తెలుసు. అందుకే నిశ్శబ్దం. సమ్మయ్య కర్ర అక్కడే వేసి కదిలాడు. పిల్లను తేవడానికి పోతున్నాడు. సాయుధుడుగా పోరాదు. నిరాయుధుడుగానే వెళ్ళాలి. సమ్మయ్య పిల్లి అడుగులు వేస్తూ దూరాడు గూడెంలో. తరువాత ఒక గుడిసెలో దూరాడు. అది ఒక ముసలవ్వ గుడిసె-గూడు. సమ్మయ్యను చూచి చకితురాలైంది ఆమె. ఆమె కడువృద్ధు. వెంట్రుకలు వెండి దారాలు. ముఖాన ముసలితనంతో వచ్చిన ముడతలు. ఎక్కడో లోతున ఉన్న కళ్ళు "ఏమొ వచ్చినవు?" అడిగిందామె.
"పెట్ట కోసం"
"ఏ పెట్ట?"
"సింగి"
"సింగన్న కోసమా?"
"అవు"
ఆమె కళ్ళు వెలిగాయి. ముడతలు పడిన ముఖంలో సైతం ఆనందం కనిపించింది. ఎన్ని జ్ఞాపకాలు మసలాయో ఆమె మనసులో? ఎందరికి దాంపత్యాలు కూర్చిందో? ఎందరిలా వచ్చారో? ఎందరికి అప్పగించిందో పిల్లలను. ఇది మరొక అవకాశం. మంచిపని, మనసులను కూర్చేపని, అందుకే ఆమెకు ఆనందం అందుకే ఆమె కళ్ళు వెలిగాయి.
"చూచుకున్నారా?"
"చూచుకున్నారు"
"వస్తదా? పట్టుక రావాల్నా!"
"వస్తది"
"మంది బాగా వచ్చిన్రా?"
"వచ్చినరు."
"సరైతే" అని చేయిచాచింది.
సమ్మయ్య సంతోషించాడు. సగం పని ముగిసింది. పిల్లను అడవి వైపు తేవడమే కష్టం. తరువాత పని అంతా సుళువే. అందుకు అంగీకరించింది ముసలవ్వ. మొలలోంచి రూపాయి తీసి ముసలవ్వ చేతిలో వేశాడు. అది ఊరబొట్టు. ముసలవ్వ నవ్వింది. లేచింది. జాగ్రత్తగా ఉండమని చెప్పి కదిలింది.
ముసలవ్వ గూడెంలోకి, సమ్మయ్య అడవిలోకి వెళ్ళిపోయారు. ముసలవ్వ సింగిని వెదుకుతూ బయలుదేరింది. ఒక గుడిసెలో పట్టుకుంది. పిలిచింది. చెప్పింది. "సింగన్న వచ్చిండు వస్తవా?" -సింగి గుండె దడదడలాడింది. గుబ గుబ లాడింది. ఒక కాలు ముందుకు లాగుతుంటే ఒక కాలు వెనక్కు లాగింది. ఒక వైపు తన సింగన్న - రెండవ వైపు తలిదండ్రులు. ఒక్కసారి తనబాల్యం, తాను తిరిగిన ప్రదేశాలూ, ఎక్కిన చెట్లు, ఆడుకున్న అమ్మాయిలు మనసులో మసలారు. క్షణంలో అంతా - మాయం అయినారు. సింగన్న ఆమె గుండెలో నిండిపోయాడు. అటే పడింది అడుగు. అనుసరించింది ముసలవ్వను.
అడుగు తడబడింది.
అయినా వేగంగా సాగింది.
సింగిని చూచాడు ఒక కోయ గూడెపు కోయ. "పెట్ట వచ్చింది" అని కేక పెట్టాడు. అదే కేక అందరి నోళ్ళలోంచి వెళ్ళింది.
"పెట్ట వచ్చింది."
"ఒహోయ్ ఒహో"
"ఒహోయ్ ఒహో"
క్షణంలో కేకలు కేరింతలు. నక్కిన జనం అంతా బయటపడ్డారు. అరుపులు పెడబొబ్బలు, కలవరం, కల్లోలం. దాడి సాగింది. ఎవరి మీదికి? సింగి మీదికి. బెదిరిన లేడిలా పరిగెత్తింది. పరిగెత్తాల కాదు. అదొక లాంఛనం. ఆమె పరిగెత్తాలి. వెంబడించాడు సింగన్న. ఇక్కడ అరుపులు, కేకలు, పెడబొబ్బలు. అడవి అదరిపోతూంది.
ముందు సింగి.
వెనుక సింగన్న.
సింగన్న సింగిని పట్టుకున్నాడు. భుజంమీద వేసుకున్నాడు.
"ఒహోయ్ ఒహోయ్, హోయ్ హోయ్"
"ఒహోయ్ ఒహోయ్, హోయ్ హోయ్"
ఆ పదాల మధ్య, ఆ అరుపుల మధ్య, సింగిని తీసుకొని అడవిలో దూరాడు. ఆమెను హరించాడు. గుండె ఎన్నడో దోచుకున్నాడు. ఇప్పుడు ఆమెను దోచుకున్నాడు.
ముసలవ్వ బోసినోటితో కిలకిలా నవ్వింది. గబగబా గూడెంలో దూరింది.
కోయగూడెం వారి కేకలు విన్నారు కింది గూడెంవారు.
"ఒహ్హోహ్ ఓహ్. పెట్టపాయె, పాయె" అని ఉరికాడు ఒకడు కర్రతో. ఆ కేక ప్రతిధ్వనించింది. అందరి నోట వినిపించింది. కర్రలు బరిశెలు చేతబూని ఒకరి వెంట ఒకడు - ఒకడు - ఇద్దరు, ముగ్గురు, పది, ఇరవై, గూడెం సాంతం ఉరికింది.
"ఏది పెట్ట యాడబోయె" అని కేకలు వేస్తూ కోయగూడెం వారి మీద విరుచుకు పడింది.
"పెట్ట యాడనే, పుంజేస్కపాయె" అని తలపడ్డారు కోయగూడెం కోయలు.
కర్రలు కలిశాయి.
బరిశెలు లేచాయి.
బల్లాలు మెరిశాయి.
టక టక మని కొట్టుకున్నారు. నిన్నటిదాకా మిత్రులు. క్షణంలో శత్రువులైపోయారు. పోరుసాగింది. యుద్ధం సాగింది. సమరం సాగింది. జబ్బలు చరచారు. దెబ్బలు కొట్టుకున్నారు. అంతా నటన. అంతా ఆట. అనాదిగా వస్తూందీ ఆచారం. అందుకోసం పాటించాలి. ఎందుకు యుద్ధం. పిల్లాపాయె, పిల్లావాడూ పాయె. పిల్లవాడు వచ్చాడు.పిల్లను తన్నుకుపోయాడు. కావలసిందే జరిగింది. ఎవనికి ఎవతె పెళ్ళామో ఎక్కడో రాసి పెట్టి వుంది అంతే, ఆ మాటలతో రాజీ కుదిరింది. జగడం తెగింది. సమయం ముగిసింది. ఎక్కడి దొంగలక్కడ గప్ చుప్ సాంబార్ బుడ్డి. ఎక్కడివారు అక్కడికి చేరారు. ముగిసింది. ఎక్కడి దొంగలక్కడ గప్ చుప్ సాంబార్ బుడ్డి. ఎక్కడివారు అక్కడికి చేరారు.
క్రింది గూడెంలో ప్రశాంతత ఏర్పడింది.
సింగి వెళ్ళిపోయింది. ఏనాటికైనా వెళ్ళిపోవాల్సిందే. అయినా క్రింది గూడెం చిన్నిబోయింది. బోసిగా ఉంది. శూన్యంగా ఉంది. కోయగూడెం శూన్యాన్ని నింపుకుంది. పొంగిపోయింది. పగలబడి నవ్వింది. అవును వధువు వచ్చింది ఆ గూడేనికి. ఆనందపడితేనేం! ఆటలాడితేనేం?
సింగి గూడేనికి వచ్చింది. కోడలుగా వచ్చింది. సమ్మయ్య ఇంటికి వచ్చింది. అక్కడ ఆడదిక్కులేదు. అయితేనేం గూడెపు ఆడజనమంతా సమ్మయ్య ఇంటికి చేరారు. సింగికి తలంటి పోశారు. అలంకరణ చేశారు. సింగన్నకు అప్పగించారు. తప్పుకున్నారు.
ఎదిరి చూచింది ఆ రేయికోసమే సింగన్న. అది ఆలస్యంగా వచ్చింది. దూరం నుంచి వచ్చింది. భారంగా వచ్చింది. అయినా వచ్చింది. అంతేచాలు అతనికి. అది తన గూడు. రేయి, ప్రశాంతత, ఏకాంతం. తాను, తన ముందు సింగి. ఇంకేం కావాలతనికి? అదే పదివేలు.
సింగి, తన సింగి మెరిసిపోతూంది. ఆ కండ్లు, అవి బుసలు కొడుతున్నాయి. తాను కాటేశాడు. సింగి తనలో ఉంది. ఒడిలో ఉంది. ఎదలో ఉంది. బాహుబంధంలో ఉంది. స్వర్గాలు దిగివచ్చాయి. నందనవనాలు వెలిశాయి. సాంతం వసంతం అక్కడే చేరింది.
రేయి గడిచిపోతూంది. జారిపోతూంది. అతడు రేయిని బందించాలనుకున్నాడు. సూర్యుని శిక్షించాలనుకున్నాడు. ఆ రేయి, తనరేయి అలాగే వుండాలనుకున్నాడు. అమాయకుడు! తమస్సును ఎవడు నిలిపాడు? ఉషస్సును ఎవదు ఆపాడు?
తూర్పున మోదుగులు పూశాయి.
రాత్రి నిన్నటిరాత్రి అయింది. ఉదయం ఉరికి వచ్చింది. జంటగా బయలుదేరారు సింగి సింగన్న అడవికి. అందంలోనికి ఆనందంలోనికి. ఒక చెట్టు కింద కూర్చున్నారు. ముచ్చట్లాడారు. ఒక చెట్టు కింద మేను వాల్చారు. ఒక చెట్టుకాయలు తిన్నారు. ఒక గుంటలో నీరు త్రాగారు. తాము కూర్చుండిన బండలు చూచారు. ఎక్కిన చెట్టును చూచారు. ఆడిన ముచ్చట్లు తలచుకున్నారు. నెమరు వేసుకున్నారు.
పగలు మాత్రం ఎంతసేపు! పశ్చిమాన పగడాలు పరుచుకున్నాయి. జంట జతగా గూడెం చేరింది. సింగి వండింది. సింగన్న తిన్నాడు. రాత్రి గొంగళి పరచింది. అది మాత్రం ఎంతసేపు? అది లేచిపోయింది. తెల్లవారింది. సూర్యుడు పాకుడు బండను పట్టుకుని పాకుతున్నాడు. కింద గూడెం గూడెం కోయగూడెం మీద విరుచుకుపడింది. ఈ తడవ యుద్ధానికి కాదు. సంప్రదింపులకు తెచ్చుకోడానికి సమరం. తీసికెళ్ళడానికి సంప్రదింపులు. రెండు గూడాలు కూడాయి. కూర్చున్నాయి. సమ్మయ్య ఇచ్చిన పొగాకుతో చుట్టలు చుట్టుకున్నారు. ధుమ ధుమ లాడుతూ కాల్చుకున్నారు. భుగ భుగ పొగలు వదిలారు. కలిసింది మాటలకే. అయినా కయ్యానికి దిగారు.