Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 36


    వీరయ్యగారు ఆ ఉదయం జిల్లా కేంద్రానికి వెళ్ళారు. రఘు ఉండవలసిన స్థలాలన్నీ గాలించారు. ఎక్కడా కనిపించలేదు. వారి గుండె దడదడలాడింది. మొహతమీమ్ ఇంటికి వెళ్ళారు. మొహతమీమ్ వారిని ఇంట్లోకే రానివ్వలేదు. మిగతా ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో నాయకుల దగ్గరికి పరిగెత్తారు. ఆ వార్త విని నాయకులు చకితులైనారు. ఎంత ఘోరం! అసలు ఏం చేశారో రఘును? వారిలో ఆతురత, సంచలనం బయలుదేరింది. జిల్లా కేంద్రం మొత్తం కదిలింది. కలకలం చెలరేగింది. ఈ దెబ్బతో ఏదో ఒకటి సాధించాలనుకున్నారు నాయకులు. ప్రభుత్వాన్ని హడలగొట్టాలనుకున్నారు.   

 

    ముసల్మానులలో వున్న చీలికలను కప్పిపుచ్చడానికి హిందువులను బలి ఇస్తున్నారన్నది ఒక పక్షం. ఇది చాలా అన్యాయమనీ దీన్ని గురించి ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవాలని తీర్మానించింది ఒక పక్షం. జాగీర్దార్ల దౌర్జన్యాలూ, అక్రమాలూ మితిమీరి పోతున్నాయనీ, జాగీర్లు వశపరచుకోవాలనీ ప్రభుత్వానికి విన్నవించింది ఒక పక్షం. మొత్తం మీద ఒక దుమారం లేచింది. టెలిగ్రాములు, అర్జీలు అందాయి ప్రభుత్వానికి.

 

    హైద్రాబాదులో కూడా సంచలనం బయలుదేరింది. రాజకీయ పక్షాలన్నీ కదిలాయి. విషయం బాబెహుకుమత్ దాకా పోయింది. ఈ చిన్న విషయం చిలికి చిలికి గాలివాన అవుతుందని భయపడ్డది మంత్రిమండలి. జాగీర్దారును మందలించింది. గుర్రప్పందాలకు బొంబాయి వెళుతున్న జాగీర్దారు తాసిల్దారును గట్టిగా మందలిస్తూ ఒక ఉత్తరం రాసి వెళ్ళిపోయాడు.

 

    బాబెహుకూమత్ (మంత్రి మండలి) సదర్ నాజమ్ పోలీస్ (ఐ.జి.పి)కు విచారణ జరపాల్సిందని ఉత్తరువు జారీచేస్తూ జాగీరు అధికారాల్లో అవసరమైన జోక్యం వరకూ పోకుండా విచారణ జరుపాలని ఆదేశించారు. సదర్ నాజమ్ జిల్లా కేంద్రంలో దిగేవరకు మొహతమీమ్ ప్రాణాలు పైపైనే పోయాయి. నాజమ్ మొహతమీమ్ ను పిలిపించాడు. అనేక ప్రశ్నలు వేశాడు. నానా చివాట్లు పెట్టాడు. తలవంచుకొని అన్నీ విన్నాడు. వచ్చేశాడు. జిల్లా న్యాయాధికారి రఘును కోర్టులో ప్రవేశపెట్టవలసిందని ఉత్తరువు జారీచేశాడు.

 

    ఉత్తరువు చూచాడు మొహతమీమ్. నాజిమ్ చీవాట్లు తలచుకున్నాడు. పత్రికలలో వార్తలు జ్ఞాపకం వచ్చేయి. తల గిరగిరా తిరిగిపోయింది. కండ్లు చీకట్లు కమ్మాయి. కాళ్ళకింద భూమి జారిపోతున్నట్లనిపించింది. రఘు గుర్తుకు వచ్చాడు. సౌమ్యమూర్తి! ఎంత మంచివాడు. ఎంత హింసించాడు తాను! తన కోసం! తాసిల్దారు కోసం! డబ్బుకోసం. క్షణిక సౌఖ్యంకోసం. అతనిమీద లేనిపోని ఆరోపణలు వేశాడు! ఎన్ని బాధలు పెట్టాడు! ఎంత పాపం చేశాడు తాను! అల్లా తనను శిక్షించకపోడు. శిక్షించాల్సిందే, దాన్ని తప్పుకోడానికి వీల్లేదు. ఒక దేవదూతను బాధపెట్టాడు తాను. తనకు ముక్తిలేదు, ఏం చేయాలి? ఆలోచన! ఆవేదన! బాధ! దుఃఖం! అమాంతంగా వచ్చిన ఆలోచన! రఘును క్షమాభిక్ష కోరాలి. అతడు తనను క్షమించాలి. అంతే తనకు కావలసింది. ఈ అధికారం, ఈ దర్పం, ఈ గౌరవం ఏదీ అక్కరలేదు తనకు. వెంటనే ఆస్పత్రికి పరిగెత్తాడు.

 

    ఆస్పత్రిలో మంచంమీదపడి ఉన్నాడు రఘు. బాగా నీరసించి పోయాడు. వంటినిండా దెబ్బల గుర్తులు, వళ్ళంతా కమిలిపోయింది. గోళ్ళలోంచి కారిన రక్తం పేరుకుపోయింది. అప్పుడే స్పృహ వచ్చింది అతనికి. అయినా ముఖంలో స్థయిర్యం ఉంది. సౌమ్యత ఉంది. అతన్ని చూచి అధికారి హృదయం ద్రవించింది. మంచం ప్రక్కన కూర్చున్నాడు. తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు. తాసిల్దారు మాట విని గడ్డి తిన్నానన్నాడు. తనను క్షమించవలసిందని వేడుకున్నాడు. తల్లిని చిన్న పిల్లవాడు బ్రతిమిలాడుతున్నట్లు బ్రతిమాలుకున్నాడు.

 

    అతని గొంతు జీరపోయింది.

 

    రఘు హృదయం పులకరించింది.

 

    అతడు చిరునవ్వు నవ్వాడు.

 

    అది అనేక బాకుల రూపంలో అధికారి గుండెను చీల్చింది. రఘు తన మీద ప్రతీకారం తీసుకుంటాడనుకున్నాడు. తనను నాశనంచేసి విజయగర్వంతో నవ్వుతాడనుకున్నాడు. అలా జరగలేదు. ఆ చిరునవ్వులోని ప్రసన్నత అతన్ని కాల్చివేసింది.

 

    "రఘు మహరాజ్! ఆప్ ఇన్సాన్ నహీ పరిప్తెహో! మీరు మానవులుకారు, దేవతలు! నా జిందగీలో ఇటువంటి మనిషిని చూడలేదు. అల్లాదయ ఉన్నది. నువ్వు బాగైనవు. నేను సైతాన్ను మారాజ్ సైతాన్ను. ముఝే మాఫ్ నహీఁ కర్నా. నన్ను క్షమించవద్దు. రఘూ, క్షమించవద్దు. సజా* దో రఘూ సజాదో, కోర్టులో ఉన్నది ఉన్నట్లు చెప్పు. చేసింది అనుభవిస్త. చెప్పు రఘూ! చెప్పు."

 

    అధికారి పోలీసు అధికారి. భారీ మనిషి, డ్రెస్సులో ఉన్నాడు. కళ్ళవెంట ధారాపాతంగా కన్నీరు ప్రవహిస్తూంది. రఘు గుండె ద్రవించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. రాక్షసునిలో ఒక మనిషి ఉంటాడు అనుకున్నాడు.

 

    జనం వస్తున్న అలికిడి వినిపిస్తే జేబురుమాలుతో కళ్ళు తుడుచుకొని రఘు కాళ్ళకు చేతులానించి వెళ్ళిపోయాడు అధికారి.

 

    రఘు ఒడలు పులకరించింది.

 

    వచ్చింది వీరయ్యగారు ఒక్కరేకాదు, రాజకీయ రంగం సాంతం కదలివచ్చింది. రఘును చూచి వీరయ్యగారి గుండె చెరువైంది. దుఃఖం గొంతుదాకా వచ్చింది. ముఖం మళ్ళించుకొని దూరంగా వెళ్ళిపోయారు. రఘు గ్రహించాడు కళ్ళు తుడుచుకున్నాడు.

 

    వచ్చిన నాయకులు రఘూను పరామర్శించారు. సానుభూతి వ్యక్తపరచారు, సానుతాపం వెల్లడించారు. అనేక సలహాలిచ్చారు. అదను దొరికింది అణచివేయాలన్నారు. పోలీసువారి దుర్మార్గాన్ని బట్టబయలు చేయాలన్నారు. అన్ని విధాలా సహాయం చేస్తామన్నారు.

 

    రఘు మౌనం వహించాడు.

 

    పెదవి కదలించలేదు.

 

    ఇంతలో పోలీసు నాజిమ్ వచ్చాడు. నైజాంలో నాజిమ్ రావడం మామూలు కాదు. అందులోనూ ఆస్పత్రికి! నాయకులంతా మంచం చుట్టూ చేరారు. నాజిమ్ మంచం పక్కన కూర్చున్నాడు. అతను ఎన్నో ప్రశ్నలడిగాడు. అన్నింటికి తనకు తెలియదనే సమాధానం చెప్పాడు రఘు. నాయకుల గుండెలు మండాయి. నాజిమ్ కు ఆశ్చర్యం కలిగింది. కాస్త గట్టిగా అడిగాడు.
________________________
*శిక్షించు.    

 

    వ్యక్తి మీద నాకు ద్వేషం లేదు. వ్యవస్థ అతణ్ణి దుష్టుణ్ణి చేస్తున్నది. పరిస్థితుల ప్రభావంవల్ల అలాంటి వ్యవస్థలోని ఒక భాగం నన్ను హింసించింది. వ్యక్తిగా అతడు పశ్చాత్తాపపడ్డాడు. శాసనం పశ్చాత్తాపాన్ని ఎరుగదు. మనిషిగా నేను దాన్ని గుర్తించకుండా ఉండలేను. ఇంతకు మించి నేనేమీ చెప్పదలచలేదు." అని ఉర్దూలో చెప్పాడు రఘు.

 

    రఘులోని క్షమాశక్తి, అతని ధ్వనిలోని నిశ్చలత్వం నాజిమ్ హృదయాన్ని స్పందింపజేశాయి. 'రఘు సాబ్ ఆప ఆద్మీ నహీఫరిప్తేహో" అని సలామ్ చేసి వెళ్ళిపోయాడు.

 

    రఘు నిర్ణయం ఎవరికీ నచ్చలేదు. జానకికి తప్ప. అక్కడ చేరిన నాయకులకు ముందు దిగ్ర్భాంతి కలిగింది. తరువాత మండిపోయింది. రఘును తలా ఒకరీతిగా అన్నారు. కొందరు చీవాట్లు పెట్టారు. కొందరు తిట్టారు. కొందరు బెదిరించారు. వీరయ్యగారు బాధపడ్డారు. నాగేశ్ ఒక మూలన నుంచోని కుమిలిపోయాడు.

 

    నిమిషంలో ఈ వార్త జనంలో పాకింది. వారికి ఏమీ అర్థంకాలేదు. కాని రఘు విషయంలో అపారం అయిన గౌరవం ఏర్పడింది. ఆస్పత్రికి ఒక జాతరసాగింది. అక్కడ జనం వత్తిడి పెరిగింది. రఘుకు విశ్రాంతి లేకుండా అయింది. పూలదండలు, పండ్లరాసులు సర్దలేక సతమతం అవుతూంది జానకి.

 

    మన దేశంలో మనిషి ఇట్టే దేవుడై పోతాడు!  

 

    పత్రికలు రఘు పటాల సహితంగా వార్తలు ప్రకటించాయి. ఉన్నవీ లేనివీ రాశాయి. రఘు ప్రభావాన్ని పెంచేశాయి. జాగీరు జనం అవిచూచి పొంగిపోయారు. రఘు తమ పాలిట రాముడనుకున్నారు. జానకిని సీత క్రింద జమకట్టారు. జాగీరు సాంతం కదిలింది. జిల్లా కేంద్రానికి తరలింది. ఆస్పత్రిలోనే బసచేసింది.

 

    వారం రోజులకుగాని రఘు మనిషి కాలేదు. జాగీరుకు బయలుదేరాడు. స్టేషనులో జనం కిటకిటలాడింది. రఘుకు వీడ్కోలు చెప్పడానికి కూడింది. రఘు రైలు పెట్టెలో కూర్చున్నాడు. మొహతమీమ్ పరుగెత్తుకొని వచ్చాడు. రఘును వెతుక్కుంటూ పెట్టె దగ్గరికి చేరాడు. అతడు మామూలు దుస్తుల్లో ఉన్నాడు. రఘుకు నమస్కరించాడు. తాను పదవికి రాజీనామా చేశానని చెప్పాడు. రఘు ముఖం అమాంతంగా వెలిగింది. మాజీ మొహతమీమ్ చేయి అందుకున్నాడు. చేయి కలిపి ఊపుతుండగా రైలు కదిలింది. చేతులు విడిపోయాయి.

 

    మజీ మొహతమీమ్ సజలనయనాలతో కనిపించినంతసేపూ బండిని చూచాడు.

 

    బండి జాగీరు స్టేషనుకు చేరింది. ప్లాటుఫారం జనంతో నిండిపోయింది. ఇసుక వేస్తే రాలకుండా ఉంది. బండి ఆగడంతో జయ జయ ధ్వానాలు లేచాయి. వాటితో దిక్కులు పిక్కటిల్లాయి. తాసిల్దారు గుండెలో చిల్లులు పడ్డాయి.

 

    భీముడు రఘూను భుజాలమీద ఎత్తుకున్నాడు. వీరంగం వేస్తూ ఆటలాడాడు. హరిజనులు డప్పులు మ్రోగించారు. ఊరేగింపు సాగింది. స్టేషన్ మాస్టర్ రఘును అభినందించాడు. కరోడ్గిరీ జవాను సలామ్ చేశాడు. వీధులగుండా సాగింది ఊరేగింపు. కొందరు రఘుకు పూలదండలు వేశారు. కొందరు హారతులిచ్చారు. కొందరు ముఖాన కుంకుమ దిద్దారు. అంతా అతనిని ఆశీర్వదించారు. అందరి ఆశీస్సులూ అందుకున్నాడతను.

 Previous Page Next Page