Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 36

    పిత్రుత్వానికి నోచుకోలేదని... తను గొడ్డుమోతు వాడిలాగానే మిగిలిపోతానేమోనని....ఎన్నోసార్లు పరిమళరావు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే దివ్యహారతి భర్త కన్నీరు తుడిచి "మీరు బాధపడుతుంటే నేను చూడలేను ఊరుకోండి" అనేది వూరడింపుగా.
   
    అంతేకాదు-
   
    "డాక్టర్ హృదయంగారి దగ్గరికి వెళదాం పదండి. అదేదో కొత్త పద్దతుల ద్వారా ఎవరి జీన్స్ అన్నా మీలో ప్రవేశపెట్టి బిడ్డ తండ్రిని చేస్తారు" అనేది విశాల హృదయంతో దివ్యహారతి.
   
    వెంటనే మహా చీదరింపుగా ముఖంపెట్టి "నా కడుపులో పడే బిడ్డకి నీవు తల్లివి కావాలి కాని, ఏదారిన పోయే దానమ్మో ధర్మం చేసిన జీన్స్ నాకెందుకు" అనేవాడు పరిమళరావు.
   
    ఎందరో డాక్టర్లకి చూపించుకోవటం జరిగింది. అన్ని పరీక్షలు జరిపి "నీలో లోపం లేదని" తేల్చి చెప్పేశారు.
   
    ఏ పుట్టలో ఏ చీమ వుందోనని.....పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి నానా పూజలు చేసి వచ్చారు. సంతాన స్వాములమ్మ వస్తే ఆమె దర్శనం చేసుకొని... రోజూ చిటికెడు నోట్లో వేసుకుని, చంచాడు పొట్ట మీద రాచుకునే విధంగా.... మంత్రించిన విబూధిని అరకిలో పొట్లం ఆరొందలు పెట్టి సంతన స్వాములమ్మ దగ్గర కొనుక్కువచ్చి వాడటం జరిగింది.
   
    విభూది మొత్తం కర్చయింది. పిల్లాడు పుట్టలేదు. పింగు పుట్ట లేదు.
   
    ఇంకా తన కడుపున పిల్లకాయ కాయదు అని పూర్తి నిరాశచెందిన వేళ, పెళ్ళయి సరీగ ఎనిమిదేళ్ళు పూర్తయిన శుభ ముహూర్తంలో నెలతప్పాడు పరిమళరావు.
   
    దివ్యహారతి, పరిమళరావుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
   
    ఆ రోజు-
   
    కడుపులో గిర్రున తిప్పి భళ్ళున వాంతి అయింది పరిమళరావుకి నోరు చేదుగా వుండటం, వళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా వుండటం, మనసు తిక్క తిక్కగా వుండటం, నోట్లో లాలాజలం పులుపు కోరటం...
   
    ఈ లక్షణాలన్నీ భార్యకి చెప్పాడు పరిమళరావు.
   
    "అదే" అంది దివ్యహారతి.
   
    అదే అంటే అదేదో పెద్ద రోగం అనుకున్న పరిమళరావు ఖంగుతిని కంగారుపడి "అదేం రోగం" అన్నాడు.
   
    "అర్ధం కాలేదా?"
   
    "ఉహూ!"
   
    "నీవు తండ్రివి కాబోతున్నావు. తల్లిగా నా పరువు నిలబెట్టావు" అంటూ భర్త బుగ్గమీద తమాషాగా చిటిక వేసి గుడ్ న్యూస్ వినిపించింది దివ్యహారతి.
   
    సిగ్గుతో నలభయ్ ఆరు వంకరలు తిరిగారు పరిమళరావు.
   
    ఆ తర్వాత డాక్టర్ హృదయంగారి దగ్గరకు వెళ్ళి అన్ని రకాల చెకప్ లు చేయించుకుని వచ్చింది. కడుపేనని నిర్ధారణ చేసుకొని టానిక్ లు వగైరాలు బోలెడు కొనుక్కువచ్చారు.
   
    "నీకు నిన్న తమ్మున్ని మీ డాడీ మరికొన్ని నెలల్లో యివ్వబోతున్నాడు" అంటూ పెద్ద కుమార్తె కామినితో చెప్పింది దివ్యహారతి.
   
    "మరి నాకో" అంది అక్కడే వున్న రెండున్నరేళ్ళ చిన్న కూతురు యామిని.
   
    "ఈ ఏడు గిఫ్ట్ గా మీ డాడీ అక్కకి తమ్ముడిని ఇస్తారు. పైఏడు నీకు గిఫ్ట్ గా మరో తమ్ముడిని మీ డాడీ నీకిస్తారు. సరేనా?" అంది దివ్యహారతి బుజ్జగింపుగా.
   
    "ఉహూ నాకిప్పుడే కావాలి తమ్ముడు" అంటూ యామిని కాళ్ళు నేలకేసి తప తప బాదుతూ రాగం తీసింది.
   
    "అలాగే తల్లీ అలాగే" కూతురుతో అని భర్తవేపు తిరిగి "చూశారుగా దీని గోల! ఒకేసారి ఇరువుర్ని కనేయండి. నా పిల్లలిరువురురికి చెరో తమ్ముడు వుంటారు ఆడుకోటానికి" అంది సరదాగా చిలిపిగా భర్త వేపు చూస్తూ.
   
    పరిమళరావు సిగ్గుపడిపోయాడు.
   
    "ఇద్దరి కిద్దరయితే బాగుంటుంది. నా కిద్దరు అక్కడితో పులిష్టాపు పెట్టాను. మీరు ఇద్దరినీ కని పులిస్టాపు పెట్టండి" అంది దివ్యహారతి.
   
    "ఈ గండం గట్టెక్కితే...." నసిగాడు పరిమళరావు.
   
    "ఎందుకు భయపడతారు! కొత్త కాబట్టి మీకలా వుంది. లోకంలో ఎంతమంది మగవాళ్ళు కంటంలేదు" అంటూ ఓ పక్క భరోసా ఇస్తూ ముద్దు ముద్దుగా మందలించింది దివ్యహారతి.
   
    ఆ సాయంత్రం ముందు అనుకున్న ప్రకారం ఇరువురు ఆఫీసుల నుంచి తొందరగా ఇంటికి వచ్చారు. ఇరువురు చెరోచోట పనిచేస్తున్నారు. అయినా వాళ్ళకి ఏ విషయంలోను ప్రాబ్లం లేదు.
   
    పిల్లలిద్దరిని పక్కింటి ఆంటీ దగ్గర వదిలి ఇరువురు కలసి బజారుకి వెళ్ళారు.
   
    ముందుగా హోటల్ కి వెళ్ళి స్వీట్లు, హాట్లతో కాఫీ తీసుకున్నారు. అక్కడ్నించి బయల్దేరి రెడీమేడ్ షాపు కెళ్ళారు.
   
    మగవాళ్ళ కోసం మొదట్లో కొత్తరకం సాధనాలేమీ ఉండేవి కావు. కడుపుతో ఉంటేచాలు నానా ఇబ్బందులకి గురయ్యేవాళ్ళు ఈ మధ్యనే భీమల్ కంపెనీవాళ్ళు ఎలాస్టిక్ స్పాంజి ఏరో ప్యాంట్స్ కొత్తరకంవి తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేశారు.
   
    ఆ ప్యాంటు మొదటి నెల దగ్గర్నుంచి తొమ్మిదో నెల వరకు ధరించడానికి వీలుగా కడుపులో బిడ్డకి దెబ్బ తగలని విధంగా పొట్ట మీద స్మూత్ గా ఉండేలా తయారు చేశారు. ఆ ప్యాంట్ విధానం ఎట్లాంటిదంటే ఎంత పొట్ట లావుగా ఎదిగితే అంతవరకు సాగుతుంది. ప్యాంట్ విప్పేస్తే మామూలుగా అయిపోతుంది.
   
    మామూలు వాళ్ళు ధరించవచ్చు. కాని.....వాటి మీద తమాషాగా అబ్బాయి బొమ్మ కుట్టి వుండటం వలన ఆ ప్యాంట్ ధరించిన వాడు వుట్టివాడు కాదని త్వరలోనే తండ్రి కాబోతున్నాడని తెలియజేస్తుంటాయ్.
   
    "మీకిష్టమైన రంగు లెంచుకోండి" అంది దివ్యహారతి.
   
    పరిమళరావు మూడు రంగుల్లో మూడు ప్యాంట్ లు తీసి వాటికి డబ్బివ్వబోయాడు.
   
    "నా సంతోషాన్ని కాదనవద్దు. నా డబ్బులతో కొనిపెడతాను పరిమళ్" అంటూ దివ్యహారతి ఆ మూడు ప్యాంట్ లకు తనే డబ్బు ఇచ్చింది.
   
    పరిమళరావు సంతోషించాడు.
   
    అక్కడ్నించి బయలుదేరి చాలా షాపులు తిరిగారు. పుట్టబోయే పిల్లవాడు ఆడుకోటానికి ఆట వస్తువులు, బలానికి టానిక్కులు అవసరానికి పనికివచ్చే డెలివరీకి సబంధించిన మరికొన్ని వస్తువులను కొనుక్కొని ఇంటికి వచ్చారు.

 Previous Page Next Page