Previous Page Next Page 
రుధిర మందారం పేజి 36

    నేను నవ్వాను. "చూడమ్మాయ్! నీకు పెళ్ళి అంటే ఇష్టం లేక కాదు. నీ ఆలోచన అంతా మీ ఇంటి గురించే అవునా! మీ ఇంటి పరిస్థితులు తెలియక కాదు. నా ఉద్దేశ్యం...
    "దయచేసి నా మాట వింటారా!" నా మాటలకి అడ్డు తగిలి అంది.
    "చెప్పు!"
    "మనం రెండు వీధులు దాటితే పార్క్ వస్తుంది. అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం. బజారులో ఇలా నుంచుని మాట్లాడితే బాగుండదు.
    "అవును పార్క్ కెళదాం అదే మంచిది. కాదంటే హోటల్ కి వెళ్ళి ఫామిలీ రూమ్ లో కూర్చుని మాట్లాడుకోవచ్చు."
    "నాకు అలా ఇష్టం లేదు."
    "నీకెలా ఇష్టం అయితే అలా!"
    దీప్తి నా వేపు గుర్రున చూసింది.
    నేను ముఖం పక్కకు తిప్పుకున్నాను.
    మరి కాసేపటిలో ఇరువురం పార్కుకి వచ్చాము.
    ఈ సమయంలో పార్క్ లో ఎవరుంటారు! నిశ్శబ్దంగా వున్న పార్క్ లో గుబురుగా వున్న క్రోటన్స్ పక్కన కూర్చున్నాము.
    "ఇంక చెప్పండి" అంది దీప్తి.
    "ఏమిటి!"
    "మీ విషయం. మీకెందుకు నా పెళ్ళి మీద ఇష్టం కలిగిందో అదీను!"
    నేను పెళ్ళిళ్ళ పేరయ్యలాంటి వాడిని అంటూ కధ కల్పించి చెప్పాను.
    "అయిందా చెప్పటం?" వ్యంగ్యంగా అడిగింది ఆమె.
    "ఆ__"
    "నేను పాలు తాగే పసిపాపను కాను. మీరెవరు నన్నెందుకు వెంటాడుతున్నారు చెప్పండి!"
    "అబ్బెబ్బే అలాంటిదేమీ లేదు. కేవలం పెళ్ళి విషయం..."
    "అబద్ధం."
    "అబద్ధం అని ఎలా చెప్పగలుగుతున్నారు?" అడిగాను.
    "ఒకసారి అమ్మాయ్ అంటూ మరోసారి అండీ అంటూ మాట్లాడుతున్నారే అది చాలు" అంది దీప్తి.
    "నా నోట్లోంచి మాట రాలేదు."
    "మీరెవరు! నన్నెందుకు వెంటాడుతున్నారు?"
    "ఇప్పుడు చెప్పినా మీకు అర్ధం కాదు. వకటిమాత్రం నిజం. మీరు ఆపదలో ఉన్నారు. నేను మీ శ్రేయోభిలాషిని."
    "నేను ఆపదలో వున్నానా! జోక్ బాగుంది" అంటూ నవ్వింది ఆమె.
    "మీరు నవ్వితే అందంగా వున్నారు. అంతవరకూ నిజం. కానీ మీరు నవ్వక్కరలేదు. నాకు అంతా తెలుసు.
    "అంతా అంటే?"
    "అంతా అనే పోనీ మొత్తం అందాం!"
    "మీరు ఎవరు?" దీప్తి అనుమానంగా చూస్తూ అడిగింది.
    "చెప్పానుగా శ్రేయోభిలాషినని"
    "శ్రేయోభిలాషికి ఓ వూరూ పేరూ వుండవా?"
    "ఎందుకుండవు? వుంటాయి."
    "అదే చెప్పండి."
    "దానికి సమయం కావాలి."
    "మంచిది! అందాకా మా ఇంటి వేపుకి రాకండి. వస్తే మర్యాదగా వుండదు. మీరెవరో నా కనవసరం. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. మరోసారి మీరు నా విషయంలో జోక్యం కలిగించుకున్నారా. మీ..."చటుక్కున మాట ఆపుచేసి లేచింది దీప్తి.
    "మీ...అదేదో పూర్తిచేసి పొండి" నేనూ లేస్తూ అన్నాను.      
    "సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. బై"
    దీప్తి వెళ్ళబోతుంటే చటుక్కున దీప్తి చెయ్యి పుచ్చుకున్నాను. దీప్తి గించుకుంది.
    "ప్లీజ్! నేను చెప్పేది విను. నాకు తెలుసు నీవు ఎంత ప్రమాదంలో వున్నదీను. నాకు తెలిసినంతలో యీ విషయం నీకూ తెలుసునని పైకి బుకాయిస్తున్నావనీను...నేను మీ ఇంటికి వచ్చిపోవటం వల్ల నీకు నష్టం లేదు. కాదు కూడదంటే నా మార్గం నాకు వుంది." 
    "దీప్తి! కొందరు నేరం చేసి నేరస్తులవుతారు. మరికొందరు ఏ నేరం చేయకుండానే నేరస్తులవుతారు. మరో కొందరు నేరస్తుల బెదిరింపుల వల్ల బలవంతానా నేరస్తులు అవుతారు. నీవు మూడోరకం నేరస్తురాలివి."
    "మీరెవరు?" అంది దీప్తి.
    దీప్తి కళ్ళల్లో భయం రెపరెపలాడటం గమనించాను.
    "అది ప్రస్తుతం అప్రస్తుతం. వకే వక్కరోజు టైము యిస్తున్నాను. రేపు సాయంత్రం నిన్ను కలుసుకుంటాను. అప్పుడు వివరంగా మాట్లాడుకుందాము. వక్కవిషయంలో నీవు నన్ను నమ్మితే చాలు."
    "ఏమిటి?"
    "నేను నీ శ్రేయోభిలాషివని."
    దీప్తి మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లు అనిపించింది. నన్ను మాత్రం గుచ్చి గుచ్చి చూసింది.
    "మరోసారి రేపు కలిసి మాట్లాడుకుందాం బై..." దీప్తి చెయ్యివదిలేసి చెప్పాడు.
    దీప్తి కోపంగా లేచి నన్ను వదిలి వెళ్ళిపోదామనుకున్నది. స్థాణువులా యింకా అక్కడే నిలబడింది.
    నేను చకచక అడుగులు వేస్తూ పార్క్ లోంచి బైటికి వచ్చాను.
    ఇష్...ఇష్...
    ఆ కోడ్ నాకు తెలుసు చటుక్కున ఆగిపోయాను.
    ముష్టివాడు నా ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. నా ముందు చెయ్యి చాచాడు.
    దీప్తి కోసం నేను నియమించిన మా డిపార్టుమెంటులో అతను ఈ వేషంలో వున్నాడు. జేబులోంచి డబ్బులు తీస్తున్నట్లుగా చేయిపెట్టి "క్విక్" అన్నాను అది మా కోడ్.
    "దీప్తి వెనుకనే యిరువురు వ్యక్తులు వెన్నంటి వచ్చారు. పార్క్ బయట ఆగిపోయారు. మీ యిరువురూ పార్క్ లోకి వెళ్ళటం చూశారు బహుశా వకతను మిమ్మల్ని వెంటాడవచ్చు."
    "గుడ్, వాడి కళ్ళు నేను కప్పుతాను, నీవు దీప్తిని వెంటాడు అన్నాను.
    యీ సంభాషణ మా యిరువురికి మాత్రమే వినపడేటంత నెమ్మదిగా చాలా క్విక్ గా చెప్పుకున్నాము.

 Previous Page Next Page