Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 35

    దీక్ష చెపుతుంటే అప్పటికే దీక్ష ఏ రంగు బెల్ట్ ధరించిందో గమనించిన వారంతా 'ఈ అమ్మాయి కరాటే విద్యలో ప్రధమశ్రేణిలో వుందన్న మాట అబ్బో!' అనుకున్నారు.

    "బ్రౌన్ బెల్ట్ పొంది ప్రధమశ్రేణిలో వున్నంత మాత్రాన అక్కడితో ఈ విద్య పూర్తయినట్లు కాదు. బ్రౌన్ బెల్ట్ తర్వాత బ్లాక్ బెల్ట్ వుంటుంది. బ్లాక్ బెల్ట్ సాధించటం అంట తేలిక కాదు. నిరంతర విరామ మెరుగని కృషి కావాలి. ఎన్నో ఏళ్ళ సాధన వుండాలి. దాదాపు ముప్పై ఏళ్ళు ఒక వ్యక్తికి వస్తే గాని బ్లాక్ బెల్ట్ సాధించలేడు. అలా రావాలని కూడా లేదు. కాని సాధారణంగా వయసు వచ్చే వరకు సాధన చేస్తే గాని రాదు. అయితే యింతవరకు బ్లాక్ బెల్ట్ అతి చిన్న వయసులో ఒక అమ్మాయి సాధించింది. ఆ అమ్మాయి పేరు సీమా ఓరా, వయసు పద్ధానుగు ఏళ్ళు.

     బ్రౌన్ బెల్ట్ పైది బ్లాక్ బెల్టు. ఇక ఆ బ్లాక్ బెల్టు పైది రెడ్ బెల్టు. ఈ విద్యలో ఎవరు వెళ్ళినా బ్లాక్ బెల్టు సాధించే వరకు వెళతారుగాని రెడ్ బెల్టుని మాత్రం సంపాదించలేరు. రెడ్ బెల్టు సాధించిన వారు ఒక యోగి అయివుండాలి. వయసు అనుభవం వుండాలి. అంతేకాదు ఆయన గురువులని మించిన గురువై వుండాలి.

    చాలామంది కథలు చదివే వుంటారు. సినిమాలు చూసే వుంటారు. వాటిల్లో మనకి దర్శనమిచ్చే కరాటే వీరులని గొప్పగా అనుకోవాలని బ్లాక్ బెల్టు రెడ్ బెల్టు వున్నట్లు చూపుతారు. అదితప్పు. నిజం కాదు. సినిమాలో రిక్షాలాగే హీరో రెడ్ బెల్ట్ వున్న కరాటే వీరుడిని ఒక్కదెబ్బతో మట్టి కరిపించినట్లు చూపుతారు. హాస్యాస్పదం! యింతకు మించి మరొకటి వుండదు.

    రెడ్ బెల్టు యిప్పుడు వున్నది యమగూచి అనే ఆయనకి మాత్రమే. యమగూచి జపాన్ దేశీయుడు. వయసు ఎనభయ్యో పడి. ఆయన బుడకాయ్ సంస్థకి గురువు. వాళ్ళ బుడకాయ్ సంస్థకి గుర్తు బిగించిన పిడికిలి. జపాన్ దేశీయులు ఆయన యమగూచి మనదేశం వచ్చి భారతదేశం పవిత్రత గురించి పద్ధతులు ఆచారాలు యోగం అన్నింటిని మెచ్చుకున్నారు.

    బుడకాయ్ సంస్థ యమగూచి బిగించిన పిడికిలి గుర్తు ఇప్పుడిప్పుడే చాలామందికి తెలుస్తున్నది. అసలు కరాటే గురించి అందరికి తెలిసింది బ్రూస్ లీ వల్ల, బ్రూస్ లీ సినిమావల్ల. కరాటే కూడా హాంకాంగ్ లో బ్రూస్ లీ వల్లనే ప్రచారం పొందింది.

    బోధి ధర్మ అనే బౌద్ధమత భారతదేశ వాసి ఈ విద్యని ప్రారంభించారని అనుకోటం వరకే. పూర్తి ఆధారాలు లేకపోవటం వల్ల ఏ దేశంలో ఈ విద్య మొదలనేది ఎవరూ గట్టిగా చెప్పలేక పోతున్నారు. ఇప్పుడు నాకు తెలిసినంతలో మన దేశంలో శ్రీ.ఆర్.వి.టి. మణి కరాటేలో బ్లాక్ బెల్టు సాధించారు.

    ఈ విద్యకి ఇలా పోరాడే పద్ధతిని కరాటే అంటారు. కరాటేలో వుపయోగించే కర్రని నన్ చాకు అంటారు. నడుముకి చుట్టుకునే బెల్టు రంగులు ఏడు రకాలు. కరాటే నేర్చుకునే వాళ్ళని కరాటేకా అంటారు. కరాటే నేర్చుకునే విద్యార్ధి కరాటేకా అంటారు. గాని మరేరకం విద్య నేర్చుకునే వారిని కరాటేకా అనరు. కర్రని వుపయోగించి పోరాడుతారు కాబట్టి దీనిని కర్రాట అదే కరాటే అని యిందాక చెప్పటం జరిగింది. అది కొందరు మాత్రమే అనుకునే మాట. నన్ చాకుని ఉపయోగించకుండా కేవలం ఉట్టి చేతులనే వుపయోగించి పోరాడే విధానం ఈ కరాటేలో వుంది. అలాంటప్పుడు యిది కర్రాట ఎలా అవుతుంది? అసలు కరాటే అంటే....

    కర (కరములు) అంటే చేతులు, టె అంటే ఆయుధము. వుట్టి చేతులనే ఆయుధముగా వుపయోగిస్తూ పోరాడుతారు కాబట్టి దీనిని కరాటే అన్నారు. ఇదే సరి అయిన పేరు. ఇంతవరకూ మీరంతా ఓపికగా మా ప్రదర్శన చూశారు. నేను చెప్పింది విన్నారు. ఇప్పుడు నేను చాలా కొద్దిగా చెప్పాను. పోరాటం తాలూకా వివిధ పేర్లు వివిధ దేశాల పద్ధతులు. రంగురంగుల బెల్టులలో డాన్ వన్ డాన్ టు అలా టెన్ వరకు వుంటాయి. అలా ఒక రంగులో కూడా స్థానాలు వున్నాయి. దీనినే నెంబరింగ్ అనవచ్చు లేక మార్కులు అనుకోవచ్చు. ఒక దేశంలో డాన్ అనే మాటని మరో దేశంలో క్యూలు అంటారు. అలాగే, బ్లాక్ బెల్ట్ సాధించిన వారు ఈ దేశంలో చాలామందే వున్నారు. కాని బ్లాక్ బెల్ట్ లో ఎక్కువ డాన్ లు సంపాదించినవారు శ్రీమణి. నాకు తెలిసిన విషయం చాలా మటుకు మీ ముందు వుంచాను. ఇంక ఈ విషయం ఇక్కడితో విరమిస్తూ యిందాక సగం చెప్పి వదిలేసిన అనగనగా ఓ అమ్మాయి కథలోకి వచ్చి అసలు విషయం చెపుతాను." 

 Previous Page Next Page