Previous Page Next Page 
అహల్య పేజి 35


    కల్ప వృక్ష ఛాయల్లో కొద్దిసేపు సేదదీరిన తర్వాత..


    'ప్రభూ!'


    'ఏమిటి దేవీ!'


    'దివిజ గంగలో స్నానాలు చేద్దామా!'


    వింతగా చూశాడు మహేంద్రుడు.


    'అవును ప్రభూ! తమతో జలకేళి వల రాచకేళి కదా!'


    'చమత్కారవతివవుతున్నావు దేవీ!'


    'సకల లోకాల ఏలిక నా చెంతనుండగా ఎవరూ నా సరిరారిక అనుకున్న పిదప దేవేంద్రులవారి అర్ధ సింహాసనం అధిష్టించే మహాభాగ్యం నా ఒక్కదానికే అనుకున్న తరువాత మతి చమత్కృతం కాక మరేమవుతుంది?'


    నవ్వాడు ఇంద్రుడు.


    'ఇవన్నీ సృష్ట్యాది నుంచి ఉన్నవే కదా దేవీ! ఇప్పుడు కొత్తగా సిద్ధించిన విశేషమేముంది దేవీ?'

    
    'చిక్కక చిక్కక ఇన్నాళ్ళకి తమరితో ఏకాంతం చిక్కడం ప్రభూ! ఏ కాంతలూ లేని ఏకాంతంలో తమ సన్నిధి నా పెన్నిధి అనుకుంటే అంతకన్నా ఆనందం కలిగించే విషయం నాకు ఏముంటుంది ప్రభూ?'


    'మనం ఉన్నప్పుడు మరే కాంత రాగలదు దేవీ!'


    'ఏమో! బహు వల్లభులు కదా తమరు!' చమత్కారంగా అంది.


    'అసూయ అయినా అందంగానే ఉంటుంది'


    'ఆడవారికి అసూయ ఆరో ప్రాణం అన్నారట ఎవరో! ఎవతి ఓర్వగలదు ప్రభూ సవతి పోరు. నిజం' అంది.


    'పరమేష్టికి ఒక్క యిల్లాలు. ఈ ఇంద్రుడికి ఒకతే ఇల్లాలు! ఒకటే ఆయుధం! వజ్రాయుధం! ఒకే ఏనుగు! ఐరావతం!'


    'కానీ మీరు పోల్చిన తొలి వేలుపు ఆ పరమేష్టి భార్య ఒకతే. కానీ ఆయనతో కలిసి ఏర్పడిన మూర్తి త్రయంలో మిగిలిన విష్ణువుకూ, శివుడికీ భార్యలిద్దరు కదా స్వామీ! అందుకని త్రిమూర్తులలో ఇద్దరికీ ఇద్దరేసి ఉండగా త్రిలోకాధిపతికి నాకు మాత్రం తక్కువ ఉండాలా? అని మీరు ఆలోచించకపోవడం నా మహద్భాగ్యం కదా స్వామీ!'


    నవ్వేడు ఇంద్రుడు.


    'అచ్చెర మచ్చెకంటులు అహరహం సేవిస్తున్నా, తమకు అన్య కాంతలపై మక్కువ అనీ, కొంగు తాకితే చాలు కొనగోట స్వర్గం నిలిచినట్లు భావిస్తారనీ, గిట్టని వారనుకుంటూ ఉంటారనీ, తమకి నా ధ్యాస - నా ప్రేమ తప్ప మరేమీ అక్కరలేదనీ ఇంద్రసఖి చెవినిల్లు కట్టుకుని చెపుతూ ఉంటుంది ప్రభూ!'


    'ఇంద్రసఖి...'


    'అవును నా కూతురి చెలిమికత్తె ఇంద్రసఖి...'


    'అవునవును! ఇటీవల ఆమె వృత్తాంతమేదయినా చెప్పిందా?'


    'ఏ వృత్తాంతం ప్రభూ?'


    'స్పష్టంగా యిదని కాదు. ఏదయినా అహ! మరేదయినా!'


    'అహ! అంటే గుర్తొచ్చింది. అహల్యని సృష్టించాడట కదూ! ఆ ముది మది తప్పిన ముసలివేలుపు! ఆ బ్రహ్మకి ఏదో రిమ్మ తెగులు పుట్టుకొస్తే పుట్టుకొచ్చి పుట్టించాడనుకోండి! ఆ తంపులమారి నారదుడికేం పోయే కాలం? పోటీ ఏమిటీ? గెలుపేమిటీ? కన్యాశుల్కం ఏమిటీ? చివరికి యీన మోచి నక్కల పాలు చేసినట్లు అడవుల పాలు చేయడం ఏమిటీ?'


    ఇంద్రుడేం అనలేదు. మౌని అయ్యాడు. అహల్య పేరు చెవి సోకగానే ఇంద్రుడి మనస్సు నిండా అహల్య అందమే నిండిపోయింది.


    శచీదేవి ఆగింది. భర్త ముఖం పరిశీలనగా చూసింది.


    'తిరిగి ప్రభువులకు ఏదో ఆలోచన కలిగినట్లుంది. అనవసర ప్రసంగం చేశాను. ఆ బ్రహ్మ ఏంచేస్తే మీకేమిటీ? లీలా విలాసాల వేళ లోక వృత్తాంతం ప్రస్తావించడం నాదే తప్పు! పదండి జల క్రీడలకు దిగుదాం!'


    ఇంద్రుడు కదిలాడు.


    సురగంగలో మునకు వేస్తూ ఇంద్రుడూ శచీదేవీ క్రీడించసాగారు. ఓలోల అనుకుంటూ ఆమె నీటిలో మునిగి ఎక్కడో తేలుతూ ఉంటే ఆమెని అందుకోలేక మునకలు వేస్తూ, తేలుతూ ఉంటే ఆమెని అందుకోలేక మునకు వేస్తూ ఓలలాడటం ప్రారంభించాడు ఇంద్రుడు. అతని మనసు తాత్కాలికంగా గంగా స్నానంలో నిమగ్నమైంది.


                                    24


    అయోధ్యా నగరంలో పుత్రకామేష్టికి కావలసిన సంభారాలన్నీ సమకూర్చబడుతున్నాయి. విశాలమైన యజ్ఞ వాటిక తయారైంది. పందిళ్ళు వేశారు. పచ్చని తోరణాలు ఏపూట కాపూట కొత్త శోభ వచ్చేలా అలంకరిస్తున్నారు.

 Previous Page Next Page