శని నవ్వి , "పరమేశ్వరా మంది మాగధులతో సుఖంగా కైలాసంలో పార్వతీదేవితో ఉండాల్సిన నీవు ఎక్కడో అడవి చెట్టు తొర్రలో ఆకలి దప్పులతో రోజంతా గడపవలసి రావడం నా ప్రభావం కాదంటావా?" అని ఎదురు ప్రశ్నించేసరికి ఈశ్వరుడు తెల్లబోయి తలదించుకున్నాడు."
వింటున్న అందరూ చప్పట్లు కొట్టారు. పిల్లలిద్దరూ "తాతయ్యా, భలే కధ చెప్పావు" అన్నారు.
"నిజంగా ఈ కధలన్నీ మనకిన్నీ విషయాలు చెపుతున్నాయి " - ప్రశంసగా అన్నాడు మైఖేల్.
"అదే బాబూ , మన పురాణ పురుషులు , మునులు, ఋషులు, పామరులకి సయితం అర్ధం కావడానికి ఇలాంటి జీవిత రహస్యాలను కాచి వడబోసి కధలుగా తయారు చేసి మనకిచ్చారు. మా వేమన , సుమతి శతకాలు చిన్న పదాలలో ఎంత అనుభవం, ఎంత నీతి, ఎన్ని మానవతా విలువలు పొందు పరిచాయి. మా చిన్నతనంలో రోజుకో పద్యం కంఠతా పట్టించేవారు.'
సుమతీశతకం, వేమన శతకాల పద్యాలు రోజుకి మూడు నాలుగు చదివి తాత్పర్యం చెపుతుంటే స్కూలు పిల్లల్లా విని అవి వారి భాషలో రాసుకుని మర్నాడు కంఠతా పట్టి వినిపించే వారి శ్రద్దాసక్తులకు పొంగిపెయేరు కృష్ణశర్మ.
"మాకు గాయత్రి మంత్రం నేర్పరూ ...." మైఖేల్, జాఫ్రీ , ఇంకా నలుగురయిదుగురు అడిగారు.
"గాయత్రి మంత్రం పరమ పవిత్రమైనది. ఉపనయనం చేశాక నాన్నగారు దగ్గరుండి విధిగా ఉదయం గాయత్రీ జపం చేయించేవారు. ఇందులో ఆధ్యాత్మికత పాటు ఆరోగ్య రహస్యమూ వుంది. ఉదయ సూర్యుడి లేత కిరణాలు శరీరానికి కావాల్సిన 'డి' విటమిన్ అందిస్తుంది. దినం ప్రారంభానికి మనసు లగ్నం చేసి చేసే గాయత్రి జపం, మనసు నిర్మలంగా వుంచడంలో సాయపడ్తుంది. అంతేకాక 'ఓంకార' శబ్దంలో వచ్చే శబ్ద తరంగాలు మెదడుని ప్రభావితం చేస్తాయి. మాట ఉచ్చారణ మేరుగుపడ్తుంది. ఇపుడు గాయత్రి తో పాటు , ప్రాణాయామమూ కలిపి ఒకేసారి చేస్తే సమయం కలిసి వస్తుంది. ఉచ్చ్వాస నిశ్వాసాల పట్ల నియంత్రణ ఏర్పడుతుంది" అంటూ ముందు కాగితం మీద గాయత్రి రాయించి, తరువాత ఊపిరి బిగపట్టి గాయత్రి మంత్రం జపించడం , ఊపిరి వదిలి మళ్ళీ ఊపిరి బిగపట్టి గాయత్రి చేయడం పద్దతి - ముక్కు మూసుకుని ఎలా చెయ్యాలో వివరించారు.
అందరూ ఆయన్ని అనుకరించి నాలుగైదు సార్లు చేశారు.
"రోజుకి ఐదారుసార్లతో ప్రాణామాయం ఆరంభించి గాయత్రి 108 సార్లు జపించాలి. కనక రోజు రోజుకి పెంచుకుంటూ పొతే ఉచ్చ్వాసనిశ్వాసాల మీద మీకు ఎంతో నియంత్రణ వచ్చి ఆరోగ్యం బాగుపడ్తుంది.'
'సార్ మీరు ఇంత గొప్పగా విడమర్చి మాకు అర్ధమయ్యే భాషలో , చెప్పబట్టి మాకు అన్నీ వివరంగా తెలుస్తున్నాయి. మీ పురాణాలలో గొప్పతనం, నీతి చదివిన దానికంటే సహేతుకంగా, విమర్శనా పుర్వకంగా మా సందేహాలు తీర్చారు .... మీ నోట నీతినియమాలు , ఆచార్య వ్యవహారాల వెనక ఉన్న నిగూడార్దాలు తెలిసేయి" - అందరూ ముక్త కంఠం తో అన్నారు.
"దందేముంది లే బాబూ, నాకు తెలిసింది నలుగురితో పంచుకున్నాను. నేను చెప్పిన వాటిల్లో నా నిర్వచనం చెప్పాను. అది సరి అయిందో కాదో తెలియదు. ఈనాడు పిల్లలకి మంచి చెడు , నీతి అవినీతి , పాపం పుణ్యం గురించి కధలుగా చెప్పి వారి మానసిక వికాసానికి తోడ్పడడం మీలాంటి యువత చెయ్యాలి. సమాజంలో పెరిగిపోతున్న హింస, దౌర్జన్యం, విధ్వంసాలు పెరిగిపోతున్న తరుణంలో పసి మనసులలో చిన్నప్పటి నించి పాపభీతి కలిగించాలి. మన శతకాలు, నీతి కధలు విరివిగా చెప్పి దయ, క్షమాగుణాలు పెంచాలి. మన సంస్కృతీ మనకిచ్చిన వరాలు భావితరాలకి చెప్పవలసింది మీరే. ఈ కంప్యుటర్ యుగంలో సమయం తీసుకుని మీ పిల్లలని సన్మార్గం వైపు నడిపిస్తే అదే నాకు మీరిచ్చే నిజమైన గురుదక్షిణ -" అన్నారు ఆవేశంగా. అందరూ ఆయనతో ఏకీభవిస్తూ తలలూపారు.
* * * *
మర్నాడు ఉదయం ఆరుగంటలకి కృష్ణశర్మ స్నానం చేసి గాయత్రికి కూర్చోగానే వేణు స్నానం చేసి పట్టుపంచె కట్టుకుని తండ్రి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు.
"నాన్నగారూ ఇవాళ నుంచి నేను గాయత్రి చేస్తాను. ఒకసారి అంతా సరిగా చెప్పి, ప్రాణామాయం చూపించండి - " అన్నాడు.
కృష్ణశర్మ మొహంలో వెలుగు .
శరత్ పరుగెత్తుకుని వచ్చి "నేనూ స్నానం చేశాను. నాకూ గాయత్రి చెప్పండి తాతగారూ ' అన్నాడు.
"ముందు ఉపనయనం అవాలి నాన్నా , ఆ తరువాత మీ నాన్న నీకు చెపుతాడు లేరా !"
'అలా అయితే ఇప్పుడే ఉపనయనం చేసేయండి ."
వేణు నవ్వి "నాన్నగారూ జనవరి తరువాత మంచి ముహూర్తం చూసి చెప్పండి వీడికి వడుగు చేద్దాం."
కృష్ణశర్మ ఆనందంగా తల ఊపాడు.
* * * *
ఆరాత్రి కూతురింటికి హ్యూస్టన్ ప్రయాణం. అక్కడ నెల రోజులుండి ఇండియా ప్రయాణం. ఆరోజు ఆదివారం.
ఉదయం శిష్యులందరూ వచ్చి అందరూ గురువుగారికి పాదాభివందనం చేసి, పూలమాలలు వేసి, శాలువ కప్పి పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పి ఆఖరున అందరూ కలిసి అయన చేతికి ఓ కవరు అందించారు.
"ఏమిటిది?"- కృష్ణశర్మ కవరు తెరుస్తూ అడిగారు.
డాలర్లు ..... నోట్లు !
మైఖేల్ ముందుకు వచ్చి వినయంగా, "చాలా చిన్న గురుదక్షిణ. అందరం కలిసి మా సంతోషం కోసం ఇస్తున్నదాన్ని మీరు కాదనకండి" అన్నాడు.
కృష్ణశాస్త్రి నవ్వి నోట్లు లేక్కపెట్టారు. ఐదువేల డాలర్లు. మళ్ళీ నోట్లు కవరులో పెట్టి మైఖేల్ కి అందించి, "వద్దు బాబూ , ఏదన్నా డబ్బుతో విలువకడితే దాని ప్రభావం పోతుంది - విలువ తగ్గుతుంది. నాకు కృతజ్ఞతలు చూపాలంటే నేను చెప్పింది మీ పిల్లలకు నేర్పండి - మన సంస్కృతీ , మన విలువలు ఆచరించినపుడు దొరికే అనందం ముందు ఆ డబ్బు విలువ ఏపాటి" అంటూ నమస్కారం చేశారందరికి.
"కాని మా సంతోషం ....' - ఏదో చెప్పబోయారు కొందరు.
అయన చేత్తో వారిస్తూ అంతలోనే ఏదో గుర్తు వచ్చినట్టు మైఖేల్ చేతిలో కవరందుకున్నారు.
వేణు తెల్లబోయాడు.
కృష్ణశర్మ అందరి వంక తిరిగి , "ఈ డబ్బు నేను తీసుకుంటాను. మీరందరూ అంగీకరిస్తే ఓ మంచి పనికి వినియోగిద్దామన్న ఆలోచన వచ్చింది నాకు. ఇండియాలో సంస్కృత పాఠశాలల్లో చదవడానికి ముందుకొచ్చే బీద విద్యార్ధులకి స్కాలర్ షిఫ్ లు ఇచ్చి చదివిస్తాను. మన సంస్కృతం బతికించుకుందాం. అందువల్ల వేదాన్ని రక్షించుకుందాం. మన వేదభూమిని ముందు తరాల వారికి మిగిల్చి అప్పగిద్దాం. ముందు తరాల వారికి వేదాల పాఠాలని చెప్పే సంస్కృత పండితులని తయారు చేయడానికీ డబ్బు ఉపయోగిద్దాం! ఏమంటారు?"
అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు.
"మీరాపని చెయ్యడానికి ముందుకు వస్తే మేము చందాలు పోగు చేసి ప్రతి సంవత్సరం పంపిస్తాం -" మైఖేల్, జాన్, జాఫ్రీ .... ముందుకు వచ్చి వినయంగా నమస్కారం చేసి అన్నారు.
"తప్పకుండా నేను ఉన్నన్ని రోజులు ఆ బాధ్యత నేను తీసుకుంటాను -" మనస్పూర్తిగా అన్నారు కృష్ణశర్మ.
***