Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 35


    "అల్లారు ముద్దుగా పెంచి ఏభైవేలు ఖర్చుపెట్టి పెళ్ళి చేసి పంపడం ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోడానికి కాదు. మీకూ ఆడపిల్లలున్నారు కాబోలు." అని అమ్మ ఇద్దరు ముగ్గురితో అనగానే ఎదుటపడి ఎవరూ అడగలేదు ఆ తరువాత.
    తొమ్మిది నెలలునిండి పాపా పుట్టింది. నాన్నగారు అన్నట్టుగానే పాపని నన్ను మొహమైనా చూడనివ్వలేదు.
    "వద్దమ్మా-చూసి అనుబంధం పెంచుకుంటే మరింత బాధ పడాలి. ఈ బిడ్డ నీది కాదు. నీ అదృష్టం బాగుండి అతను మనసు మార్చుకుని బిడ్డని ఇస్తే అదృష్టమే. అంత వరకు నీ బిడ్డ కాదనుకో చచ్చి పోయిందనుకో" అంటూ తీసికెళ్ళిపోయారు.
    మర్నాడు వట్టి చేతులతో వచ్చిన నాన్నగారిని చూసి నా మాతృ హృదయం తల్లడిల్లింది. "పాపని ఇవ్వలేదా నాన్నా" కన్నీరు తిరిగింది కళ్ళల్లో.
    'లేదమ్మా. వాడిలో ఏమూలో మానవత్వం ఉండదా అన్న ఆశ మిగిలి వుండేది ఇన్నాళ్ళూ. లేదమ్మా వాడు మనిషి కాదు తల్లీ, రాక్షసుడు. యింక ఆ బిడ్డ నీది కాదమ్మా గుండె రాయిచేసుకో.'
    అందరం బిడ్డ చచ్చిపోయినట్లు దుఃఖించాం. ఎంత నరకమైనా బిడ్డకోసం స్త్రీ భర్తని ఎందుకు భరిస్తుందో అర్ధమైంది నాకు. కంటితో కూడా చూడని పాపపైన ఎందుకింత మమకారం! భగవంతుడు స్త్రీని ఎందుకింత దుర్భలురాలిగా చిత్రించాడో! ఆయనపై అంత అసహ్యం కసివున్నా ఆ రక్తం పంచుకు పుట్టిన బిడ్డపై ఎంత మమకారం!
    నాలుగో రోజు మా అత్తగారు వచ్చారు. ఆవిడ చేతిలో పాపని చూసిన నాకు పోయిన ప్రాణం వచ్చినట్లయింది.
    'ఏ జన్మలో చేసిన పాపమో అలాటి కొడుకుని కన్నాం. యిప్పు డీ పసిగుడ్డుని వేరుచేసిన పాపం మకు వద్దమ్మా విజయా! ఇదిగో నీబిడ్డ' అంటూవడిలో పడుకోబెట్టారు.
    గుండెలకి హత్తుకున్నాను. ఆయన పంతానికి పిల్లని అడిగారు కాని పెంచగలరా!
    తల్లికి తీసికెళ్ళి అప్పగించారుట. యిద్దరూ కొడుకుని తలవాచేట్లు చీవాట్లు పెట్టి ఈ పసిబిడ్డ జోలికికాని విజయ జోలికికాని వెళ్ళావంటే నీవు మాకు కొడుకువి కాదనుకుంటాం అంటూ తెగేసి చెప్పారట.
    ఆవిడ వెంటనే బిడ్డని తీసుకొచ్చారు. వారి సహృదయతకి కళ్ళు చెమర్చాయి.
    "అన్నగారూ, వాడు నాకొడుకేగాని - వాడిని నమ్మలేం. మీరు కోర్టుద్వారా మీ అమ్మాయికి వాడికి సంబంధంలేదని విడాకులు పుచ్చుకోండి. తండ్రి తిన్నటివాడు కాడని బిడ్డని తల్లికే అప్పగించాలనికూడా కోరుకోండి. మేమువున్నాం మీ తరపున. ఆయన చెప్పమన్నారు. అమ్మా - విజయా -ఇదో పీడకల అనుకుని - నీవు మళ్ళీ కొత్తజీవితం ఆరంభించు. నీ జీవితం మళ్ళీ చిగురించాలి. ఇది నా కోరిక తల్లీ. ఆ రోజు వస్తే నాకంటే సంతోషించేవారు వుండరు తల్లీ. ఆ శుభదినం వస్తే నాకు కబురుపెట్టు తల్లీ." అంటూ కొంగు నోట్లో దోపుకుని ఏడిచారు ఆమె.
    కరిగిపోయాను. ఆవిడ సహృదయతకి కన్నీటితో ఆవిడ పాదాలని అభిషేకించాను...
    "అబ్బ. అందరికి అలాంటి అత్తగారు వుంటే. అత్తా కోడళ్ళ కథలు రాకపోయేవి గదా"
    శారద నిట్టూర్చి అంది. "తర్వాత..."
    "తరువాత....నాన్నగారూ అదే అన్నారు."
    'అమ్మా. యీ ఏడాది నీ జీవితంలో లేదనుకుని, యిదో పీడకల అనుకుని మరిచిపోయి కొత్త జీవితం ఆరంభించు. పాపని మీ అమ్మ చూసుకుంటుంది. కాలేజీలో చేరు తల్లీ. నీకు ఓపిక వున్నంత వరకు చదువుకో. ఆపై ఏదో ఉద్యోగం చేద్దువుగాని. యిది నీవు నాకు బరువయి నిన్ను పోషించలేక చెప్పే మాట కాదు. నీకు ఏదో వ్యాపకం వుండాలి. నీవు నాకు మరొక మగబిడ్డవి అనుకుని ఆస్థియిస్తాను. అయినా మాతదనంతరం నీవు నీ కాళ్ళమీద నిలబడి నీ బిడ్డని పోషించుకోవాలి. మీ అత్తగారు సహృదయంతో మరో పెళ్ళి చేసుకోమన్నా ఒకసారి పెళ్ళయి బిడ్డతల్లి అయిన స్త్రీని చేసుకోడానికి ముందుకు వచ్చే సహృదయులుండరు. అలాజరిగితే మంచిమాటే. అంతవరకు నీకు ఏదో ఒక వ్యాపకం వుండాలి' అన్నారు.
    మెడిసన్ చదువుతా నన్నాను.
    "మీరు ముందు మెడిసన్ చదవలేదా?" శారద ఆశ్చర్యంగా అడిగింది.
    "ఉహుఁ. బి. ఎస్సీ పాసవగానే పెళ్ళి అయింది. మెడిసన్ లో సీటు సంపాదించాను. కాలేజీకి వెళ్ళడం- వచ్చాక పాపతో కాలక్షేపం. రోజులు తిరిగిపోసాగాయి. తొందర గానే పాత జీవితం గురించి మరిచిపోయి కాలేజీ పిల్లలాగే అయిపోయాను. పాపే లేకపోతే ఆ మిగతా జ్ఞాపకాలు పూర్తిగా తుడుచుకుపోయేవి. నాన్నగారు విడాకులకోసం కోర్టులో కేసువేశారు. భర్త తాగుబోతు, వ్యభిచారి, హింసిస్తున్నాడన్న కారణంతో విడాకులు కోరాను. బిడ్డని యిప్పించవలసిందిగా అర్ధించాను. కొడుకుకి వ్యతిరేకంగా మా అత్తమామల సాక్ష్యం నా పక్షం అవటంతో పాప భారం నాకే అప్పగిస్తూ కోర్టువారు విడాకులు అంగీకరించి నాకు స్వేచ్చనిచ్చారు. ఇదీ విషయం!"

 Previous Page Next Page