Previous Page Next Page 
జన్మభూమి పేజి 35

    ఒక్కొక్క డిపార్టుమెంటులో ఒక్కొక్క వారం గడిపి అవసరానికి సరిపడ నేర్చుకున్నాను. నాకు తెలుసు. యిక్కడ ఏ డిపార్టుమెంటుకి ఆ డిపార్టుమెంటు వుండదు! అన్నీ మనమే చూసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి వూర్లల్లో దెబ్బలు తగుల్చుకుని ఎముకలు విరిగే కేసులు, గైనిక్ కేసులకి సోనియోగ్రఫీ, స్కానింగ్ అవసరం పడొచ్చు. లేకపోతే ప్రతిదానికి ఏ విజయవాడో వెళ్ళమనాలి అని ఈ మూడు ముఖ్యమైనవి కొన్నాను. ప్రాథమిక సూత్రాలు నేర్చుకుని మరీ వచ్చాను. మందులు లేటెస్ట్ మెడికల్ జర్నల్స్ చూసి తెల్సుకుంటున్నాను!"
    రాజేశ్వరి భర్త తన వృత్తిలో ఎంత డెలికేటెడ్ గా పనిచేస్తున్నారో అర్ధం అయి అభినందన పూర్వకంగా చూసింది రాజేశ్వరి.
                                                            *    *    *
    స్కూలు బిల్డింగ్ కొత్తది తయారయింది. అటు రైసు మిల్లు కట్టడం ఆరంభమైంది. స్కూలికి పిల్లలని ఆకర్షించేట్టు కిటికీలకి మంచి రంగులు, గోడలకి మంచి రంగులు వేయించింది రాజేశ్వరి. ఎర్రరంగు బెంచీలు, నీలం రంగు కుర్చీలు గోడలకి రకరకాల పక్షులు, జంతువులు, కాయలు, పళ్ళు, పూలు వుండే చార్టులు తగిలించింది.
    కొత్త బ్లాక్ బోర్డు, ప్రతి గదిలో ఫ్యాను, వరండాలకి ఆకుపచ్చరంగు గ్రిల్స్, హెడ్మాష్టరు ఆఫీసు రూము, దాన్లో బీరువా, పిల్లలకి ప్లే గ్రౌండు, ఆడుకోవడానికి సామాను... సిటీలోని ఏ ప్రయివేటు స్కూలుకి తీసిపోనట్టు తయారయింది. అన్నాళ్ళు కాస్త వున్నవాళ్ళు పక్క టౌను స్కూలుకి పంపే తల్లిదండ్రులు రాజేశ్వరి చదువు చెప్పడం, పిల్లలకి ఇంగ్లీషు నేర్పడం, స్కూలు చూసి ఆ ఏడాది తమ పిల్లలని వున్నచోటే జాయిన్ చేశారు.
    పిల్లలందరికి ఒక జత యూనిఫాం స్కూలు ఇచ్చేట్టు, ఒకటి తల్లితండ్రులు కొనాలని చెప్పింది రాజేశ్వరి. పిల్లలకి క్లాసు పుస్తకాలు శలవుల్లోనే కొనిపించి వుంచింది రాజేశ్వరి. పేరుకి సాంబశివరావు హెడ్ మాష్టారు అయినా ప్రతీది రాజేశ్వరి చూసుకునేది. ఆవిడ చెప్పిందానికి ఊ కొట్టడం, ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేయడం ఆయనపని.
    వాసూ కూడా శలవుల తర్వాత ఒక క్లాసు తీసుకుంటానని తనంతటతానే ముందుకు వచ్చాడు. తను చదువుకునే రోజుల్లోని స్కూలు, యిప్పటి స్కూలుని పోల్చుకోకుండా వుండలేకపోయాడు వాసు. రాజేశ్వరి, కేశవరావులని చూస్తే అతనికి ఆశ్చర్యంగా వుంది. వూరి కోసం ఇద్దరూ ఎంత కష్టపడుతున్నారో ఈ వయసులో.
    హాయిగా అమెరికాలో సుఖాల మధ్య లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఇక్కడకొచ్చి ఇంత శ్రమపడడం ఏమిటి అన్పించేది. పూర్వం ఇంగ్లీషువారి కాలంలో మిషనరీస్ యిలాగే దేశం వదిలి పరాయి దేశంలో విద్య, వైద్య వ్యాప్తి కోసం అనేక శ్రమలకోర్చి, ఎక్కడ వుంటే అక్కడ ఇమిడిపోయి వారి భాష నేర్చుకుని వారి సేవల ద్వారా ప్రజలని ఆకట్టుకునే మిషనరీస్ గురించి విన్నాడు.
    వారి సేవా పరాయణ వుంటే కాస్త స్వార్థం వుంది. క్రిష్టియానిటీ వ్యాప్తికి వారు అసంధాలు ఆచరించారు. కాని వీరు నిస్వార్థంగా తమ సంపాదన ఖర్చుపెట్టి ఇదంతా చేస్తుంటే...వాసుకి సిటీలో ఉండి ఉద్యోగం చెయ్యాలన్న ఆలోచన మంచులా రోజురోజుకి కరిగిపోసాగింది.
    శ్యామలని కలిసే వంకతో ఒక్కడూ వెళితే బాగుండదని రేణూని వెంటబెట్టుకుని అలా సాయంత్రాలు వాక్ కి వెడదాం అంటూ తీసుకెళ్ళేవాడు. రాజేశ్వరి రాత్రి స్కూల్లో శ్యామల కూడా మానవదేహం, రోగాలు, ఆరోగ్యము, ఆహారం గురించిన పాఠాలు చెప్పేది. రాజేశ్వరి కొన్ని విషయాలు ఓ అరగంట, శ్యామల ఒక గంట చెప్పేవారు. వాసూ మగవాళ్ళ చేత ఇంగ్లీషు మాటలు, వాక్యాలు రాయించేవాడు.
    రోజు మొత్తంలో శ్యామల, వాసూ ఎక్కువసేపు కల్సివుండడంతో వారిమధ్య స్నేహం ఆరంభమయింది. వాసూకి చదరంగం బాగా వచ్చు. రాత్రిపూట కేశవరావుగారితో చదరంగం ఆడడం నిత్యకృత్యం అయింది. శ్యామల రాజేశ్వరి ఇద్దరూ టీ.వీ చూస్తూ అక్కడే కూర్చునేవారు. ఒక్కొక్కసారి 'వాసూ దోసెల ఫలహారం చేస్తున్నాను. రెండు తిని వెళ్ళు. శ్యామలా నీవూనూ' అనేది రాజేశ్వరి.
    మొత్తంమీద ఈసారి అతనికి కాలక్షేపం అవడమేకాదు, వూరు మీద యింటరెస్ట్ పెరిగింది. థాంక్స్ టు అంకుల్ అండ్ ఆంటీ అనుకున్నాడు. వాసూ వచ్చిన దగ్గరనుంచి రంగాకి కాస్త రెస్టు దొరికింది. రేణూకి టెన్త్ పరీక్షలయ్యాయి. పక్కవూరిలో కాలేజీ లేదు. ఏ గుడివాడో, విజయవాడో, లేదంటే హైదరాబాదు పెద్దకూతురి దగ్గరకో పంపించాలి. మెట్రిక్ చదివింది యికచాలు మానిపించేద్దామా అనిపించింది.
    "ఏమిటి రేణూని చదువు మాన్పించటమా- కనీసం డిగ్రీ అయినా లేకుండా చదువు ఆపడం ఏమిటి రంగా. అలాంటి పిచ్చి ఆలోచనలు మాను. యిక్కడ కాలేజీ లేకపోతే గుడివాడ, లేకపోతే విజయవాడ హాస్టల్లో పెట్టు. డబ్బు లేదంటే నేనిస్తాను. అంతేకాని చదువు మాన్పించడానికి వీలులేదు. రాజేశ్వరి దెబ్బలాడింది.
    "ఇప్పటికీ యింకా ఆడపిల్లకి చదువు చాలులే అనుకునే స్థితిలోనే మనం ఉంటె ఎలా...? రేణు వచ్చి ఏడుపుమొహంతో చెప్పగానే రంగాని పిలిచి చివాట్లు వేసింది.
    "అదికాదు అత్తయ్యా-ఆ హాస్టల్స్ అవి సరిగా వుండవు. ఆడపిల్ల గదా. పై వూరికి ఎలా..."
    "ఏం! ఎంతమంది ఆడపిల్లలు బయట వుండి చదవడంలేదు. పాడయ్యేవారు ఎక్కడున్నా పాడవుతారు. రేణు తెలివైంది. మంచిపిల్ల. దాన్ని బాగా చదివించాలి. ప్రతి ఆడపిల్లకి తన కాళ్ళమీద తను నిలబడగలిగే చదువుండాలి రంగా. అప్పుడు గాని వాళ్ళకి పరిస్థితులని ఎదుర్కొని నిలబడగలిగే ఆత్మస్థయిర్యం రాదు. ఈ రోజుల్లో పెళ్లికి కూడా ఆడపిల్ల చదువు, ఉద్యోగం పెద్ద ఎసెట్. నీవు పిచ్చి ఆలోచనలు మాని విజయవాడ వెళ్ళి అప్లికేషన్స్ అవి తీసుకొచ్చి పెట్టించు. హైదరాబాదు వాళ్ళక్క యింట్లో వుండేకంటే  విజయవాడ హాస్టల్లో నయం- దగ్గరుంది! రెండు రోజులు శలవులు కల్సివచ్చినప్పుడు వచ్చిపోతూ వుంటుంది." రాజేశ్వరి సలహా ఇచ్చింది. రంగాకి అవుననక తప్పలేదు.
                                                           *    *    *
    ప్రెసిడెంటు, మునసబు, కరణం, రాజేశ్వరరావు, రంగా, వాసు అంతా నాలుగురోజులు కూర్చుని వూరి మొత్తం వరి పొలాలని ఏ ఏ రైతులు ఏ పొలాల్లో పనిచేయాలి అన్న విషయం నిర్ణయించి రైతులందరిని పిలిచి పని అప్పగించారు.
    వారి పని పర్యవేక్షించడానికి రంగా, మునసబుగారు వుంటారు. వారికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు, మందులు అన్నీ పంచుతారు. ఆరుగురు రైతులని ఒక గ్రూపు కింద విభజించారు. దాన్లో చిన్న, పెద్ద రైతులుండేట్లుగా పేర్లు రాసారు. ఆరుగురు రైతులు ఏభై ఎకరాల పొలం చూసుకోవాలి. అలా వూరిలో వున్న రైతులందరినీ గ్రూపులుగా విభజించి, మొత్తం పొలాలు అన్ని గ్రూపులకి అప్పగించారు. అందరికీ ఒకేరకం విత్తనాలు సప్లయి చేస్తారు. పొలం దున్నడానికి ఏ గ్రూపుకి ముందు ట్రాక్టరు ఇవ్వాలన్నది చీటీలు తీసి వరసగా అందరి పొలాలు దున్నిస్తారు. వెనక ముందు అన్నది, నీది నాది అని లేకుండా అందరూ అన్ని పొలాలని సమానంగా పండించాలి అన్న సహకారసేద్యం సూత్రం అమలుపరచడానికి అన్ని సన్నాహాలు చేశారు.
    పొలానికి నీరు వదలటం కూడా వరసక్రమంలోనే వుంటుంది. హెచ్ ఎమ్ టి కంపెనీవారు ట్రాక్టరు, కంబైన్డ్ హార్ వెస్టండ్ 5911 మిషను ఆర్డరు ప్రకారం మరోవారం రోజులలో వూరు చేరుతుందని, అవి ఉపయోగించాల్సిన పద్ధతులు వారి మనిషి వచ్చి చూపుతాడని రాశారు.
    "రంగా మనకి ఒక ట్రాక్టరు డ్రైవరు కావాలిగా, యెవరన్నా వున్నారా-"
    "చౌదరిగారి ట్రాక్టరు తాలూకు వెంకట్రావని వున్నాడు. కాని ఒక్కడెలా సరిపోతాడు. రెండింటికి ఇద్దరుండాలిగా - అతనికి చెప్పు ఎవరన్నా వుంటే తీసుకురమ్మని."
    "చెప్పు. అసలింతకీ మనం చౌదరిని యింకా అడగలేదుగా ఆయన ట్రాక్టరిస్తాడా మనకు."

 Previous Page Next Page