"ఆగి ఆగి మెట్లు ఎక్కితే ఆయాసం ఉండదు. ఆయాసం అనిపిస్తే కొద్దిసేపు కూర్చుని రెస్ట్ తీసుకోవడమే. అలా చేస్తే మెట్లు ఎక్కడం సునాయాసంగా ఉంటుంది. అందరం నెమ్మదిగా నడుద్దాం పదండి. మీరటు చూడనట్లు నటిస్తూనే నీడగాడిని ఓ కంట కనిపెట్టి చూడండి" వందన చెప్పింది.
"అలాగే నా కళ్ళు చింతపిక్కల్లాగా ఉంటాయిగాని చాలా చక్కగా...పరిశోధనగా చూడగలను... చూస్తాను..." అంది ప్రమద.
"నా కళ్ళు చీమకళ్ళు...అంతేకాదు...వాసనకూడా పసిగట్టగలను. చూస్తాను వాడి తడాఖా" అంది రాణి.
"నావి ఏనుగుకళ్ళు. నేనును అన్నియును చూడగలను" సుందర సుకుమారి నవ్వుతూ చెప్పింది.
"మీ ముగ్గురూ మీ కళ్ళని జీవరాశితోను...జంతుజాలంతోను పోల్చుకొన్నారు. మరి నా కళ్ళని దేనితో పోల్చుకోను?" వందనాదేవి అడిగింది.
"మనిషి కళ్ళతో పోల్చుకో" అంది ప్రమద.
మొత్తానికి ఎలాగోలా కష్టపడి సుందరిని కూడా లాక్కెడుతున్నట్టే తీసుకొని మెట్లన్నీ ఎక్కి గోమఠేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు నలుగురు.
గోమఠేశ్వరుడి విగ్రహం చూడంగానే పడ్డ శ్రమంతా మర్చిపోయారు. విగ్రహం దగ్గర ఓ అరగంట గడిపి తిరుగు ప్రయాణమయ్యారు.
మెట్లు ఎక్కేటప్పుడున్నంత అవస్థ దిగేటప్పుడు లేకపోవడంతో నలుగురు తేలిగ్గానే కొండ మెట్లు దిగగలిగారు.
15
రూమ్ లోంచి ఒక్కళ్ళూ ఆ పూట బయటికి రాలేదు.
నిన్నటిరోజు చాలాచోట్ల తిరగడం...అన్ని మెట్లు ఎక్కి గోమఠేశ్వరుడిని చూసి రావడంతో నలుగురికి కాస్త కాళ్ళ నొప్పులు చేశాయి. ఉదయంనించి మధ్యాహ్నం దాకా కదలకుండా రూమ్ లోనే ఉండిపోదామని నిర్ణయించుకున్నారు. కాఫీ, టిఫిన్...స్నానం కానిచ్చి మంచాలకి అతుక్కుపోయి పడుకొని కబుర్లు మొదలుపెట్టారు.
"మనమిప్పుడు చేస్తున్నది సాహసయాత్ర అన్నా...అనకపోయినా మనందరం ఇల్లు విడిచి రెండో వారంలో పడ్డాము. అప్పుడే పదిరోజులు దాటిపోయింది. ఈ పదిరోజుల్లో...
"ఏం సాధించాం? అంటావ్ అంతేనా వందనా?" అంది ప్రమద.
"మనం ఏదో సాధించాలని...శోధించాలని బయలుదేరలేదుగదా...సరదాగా జర్నీ...అంతేకదా!" అంది రాణి.
"ఆపండే ఇందాకట్నించి చూస్తున్నాను. మీ మాటలు మహా బోర్ గా వున్నాయ్. మనం ఏదయినా కొత్త విషయాలు మాట్లాడుకొంటే సరదాగా ఉంటుంది" సుందర సుకుమారి అంది.
"సరదాగా కబుర్లు కావాలి...అంతేనా!"
"నోట్లో వేసుకోంగానే కరిగిపోయే మైసూర్ పాకంలాంటి కబుర్లు కావాలంటావ్ అంతేనా సుందరి" ప్రమద అడిగింది.
"సరీగ్గా చెప్పాలంటే అంతే" సుందర సుకుమారి అంది.
కబుర్లు తర్వాత ముందు మంచి ప్రశ్న వేస్తాను. దానికి తగిన సమాధానం చెప్పు సుందరి! నీకస్తమానం తిండి యావకదా! మీ కాబోయే శ్రీవారు పిడికెడు మెతుకులు తినేరకం అనుకో అప్పుడేం చేస్తావ్?" రాణి అడిగింది.
"ఇదీ ఒక ప్రశ్నేనా! ఆయనగారికి పిడికెడు మెతుకులు... రెండు కూరముక్కలు... చిటికెడు చట్నీ... చెంచాడు పులుసు వేసి మిగతాది నావంతు కోటా నేనారగిస్తాను."
"నీకింత తిండియావ ఏమిటని మీ శ్రీవారు మందలించడేమో! అడ్డుపెట్టడమో చేశారనుకో! అప్పుడు నీవేం చేస్తావే సుందరి?" ప్రమద అడిగింది.
"నీవు నీవే నేను నేనే. నాలాగ నీవు తిను...అప్పుడు నీలాగ నేను తింటాను" అంటాను అంతేగాని తిండి మాత్రం మానెయ్యను. తిండి కలిగితే కండ కలదో అన్న మాట గుర్తుచేస్తాను." సుందర సుకుమారి చెప్పింది.
"ఆపండే మీ తిండి గోల. ఇంకేమైనా మాట్లాడండి." విసుగ్గా అంది వందన.
"ఇంకేమైనా అంటే? ఆ...రోజు అనుకున్నాము చూడు ఎవరికి ఎలాంటి భర్తవస్తే బాగుంటుంది? అని... ఆ కబుర్లు చెప్పుకుందామా?" అంది రాణి.
"కొంతలో కొంత బెటర్. సంసారంలో సరిగమలు పలికిద్దాము వందనా! పెళ్ళి... సంసారం... భర్త... వీటిమీద ఏదైనా స్పీచ్ యివ్వవే. నీవు స్పీచ్ యిస్తే బాగుంటుంది" అంది ప్రమద.
"ఓకే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓసారి సుందరి "పెళ్ళి అంటే నూరేళ్ళ పంటే కాదు మంట కూడా" అని ఓ కవిత చదివింది. అది మీకు గుర్తు వుండే వుంటుంది. ఆ మాట అక్షరాలా నిజం. పూర్వం ఆడపిల్లలకి బైట ప్రపంచం తెలిసేది కాదు. తల్లితండ్రుల చాటున కొన్ని కట్టుబాట్ల మధ్య పెరిగేవారు. అత్తగారు దేవత... భర్త దైవం... అత్తవారిల్లు స్వర్గధామం అనుకునేవారు. వంట వండుకుంటు... సంసారం దిద్దుకుంటు ప్రతి ఏడు పండే పంటలా పిల్లల్ని కంటూ ఓ విధంగా చూస్తే నాలుగోడల మధ్యనైనా హాయిగా ఉండేవారు..."