"తిరుగుబోతా?" విజయ అడిగింది.
"అలా కాదు. ఇప్పటివరకు అతను బ్రహ్మచారే. అయితే ఆడపిల్ల కనిపిస్తే చూపుల్ని మరో వైపుకు తిప్పుకోలేడు. ఆడపిల్ల కనిపిస్తే ఆమెను నఖశిఖపర్యంతం చూసేది మగబుద్ధి అతనూ మగవాడు కాబట్టి ఆ బుద్ధి వుంది. గొప్ప సౌందర్యోపాసకుడు గనుక ఆ బుద్ధి మరింత ఎక్కువగా వుంది అతనిలో. స్త్రీలంటే కుతూహలంతో కూడుకున్న గొప్ప ఇంట్రెస్టు ఉంది. నిజానికి ఇది బలహీనత కాదు. సర్వసాధారణమైన విషయం. అయితే మిగిలిన ఏ రకమైన బలహీనత లేకపోవడం వల్ల కాబోలు అందరూ అతనికి ఆడపిల్లల యావ ఉందని అనుకుంటారు" ముగించాడు బ్రహ్మానందం.
"మరి అలాంటి కుతూహలం వున్న వ్యక్తి స్మిత ఆహ్వానిస్తే ఎందుకు వెళ్ళలేదు?" అడిగాడు శ్రీనివాసరావు.
"వెళ్ళుండే వాడే. కానీ ఆరోజు జగ్గారావుతో ముందు ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది. స్మితగారికంటే అమ్మాయిగారు ముఖ్యం కాబట్టి ఆ సాయంకాలం జగ్గారావు దగ్గరకొచ్చి అమ్మాయిగార్ని ఉత్తిత్తిగానే దారిలో అటాక్ చేయమని ఒప్పందం కుదుర్చుకున్నాడు."
శ్రీనివాసరావు నింపాదిగా గుండెల్నిండా గాలి పీల్చుకుని చెప్పాడు. "వాడు ఎంత త్వరగా సక్సెస్ అయ్యాడో అంత త్వరగానే ఓడిపోతాడు. రజని జీవితంలో వాడిముఖం చూడదు. రజని తను ప్రేమించిన వాడిలో ఏ దుర్గుణాన్ని అయినా భరించగలదు కానీ, తనను తప్ప మరో అమ్మాయి మీద ఇంట్రెస్టు చూపించటాన్ని సహించదు. మగవాళ్ళంతా శ్రీరామచంద్రుడిలా, స్త్రీలంతా సీతలా ఉండాలని కోరుకుంటుంది. 'ఒక స్త్రీకి ఒక మగవాడు, ఒక మగవాడికి ఒక స్త్రీ' అన్నది ఆమె ఆదర్శం. నా కూతురి దృష్టిలో నేను ఒక తిరుగుబోతన్న ముద్ర పడకూడదనే నేను ఏకపత్నీవ్రతుడని నమ్మించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటాను. అందులో నేను విజయం కూడా సాధించాను. తన నాన్న ఏకపత్నీవ్రతుడని రజని ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకాన్ని కలిగించడంవల్లే ఈ ఔట్ హౌస్ లో నేనూ, ఈ విజయ స్వర్గ సుఖాలు అనుభవించగలుగుతున్నాం."
"మీరు ఏకపత్నీవ్రతుడని అందర్నీ నమ్మించడానికి ఎందుకు అంత అవస్థపడుతుంటారో తెలిసింది" ముసిముసిగా నవ్వింది విజయ.
శ్రీనివాసరావు ఆమె మాటలను పట్టించుకోకుండా అన్నాడు "మొత్తం అంతా ఆలోచిస్తుంటే ఇది మరీ విచిత్రంగా ఉంది. రజనీకి పవిత్రత అంటే ఇష్టం. అతనికి ఆడపిల్ల అంటే యావ. విభిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయంటే ఇదేనేమో."
"ఎస్ సర్. అయితే అమ్మాయిగారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇక నుంచి ఆ యావను అతను ప్రదర్శిస్తాడా?" తన సందేహాన్ని బయటపెట్టాడు బ్రహ్మానందం.
"అదే వీక్ నెస్ గొప్పతనం. తన పక్కన రంభలాంటి పెళ్ళామున్నా పక్కింట్లో కోతిలా ఉండే అమ్మాయిని కాంక్షతో చూడడం బలహీనత. ఆ బలహీనత అంత సులభంగా పోదు. సిగరెట్లు తాగితే ఆరోగ్యం చెడుతుందని సిగరెట్ల పెట్టె మీద ముద్రించి వున్నా ఎవరైనా సిగరెట్ తాగడం మానేస్తున్నారా! అలా మానక పోవడాన్నే వీక్ నెస్ అంటారు. దాన్ని మనం వుపయోగించుకుని రజనికి అతనంటే అసహ్యం కలిగించాలి" చెప్పాడు శ్రీనివాసరావు. ఆయన ఆలోచనల్లానే ముఖమూ వికృతంగా మారుతోంది.
"అమ్మాయిగారి మనసుని మార్చాలంటే మనమేం చేయాలి?" విజయ ప్రశ్నించింది.
"చెపుతాను" అని ఏం చేయాలో చెప్పాడు శ్రీనివాసరావు.
సరేనన్నట్టు తలవూపారు బ్రహ్మానందం, విజయ.
* * * * *
సాయంకాలం ఆరున్నర గంటలవుతోంది. చీకటి వెలుగుదొంగలా మెల్లగా ప్రవేశిస్తోంది. పచ్చి మూర్ఖుడికి సృష్టి రహస్యం చెబుతున్నట్టు సముద్రం అదేపనిగా ఘోషిస్తోంది. పశ్చిమాన అస్తమించిన సూర్యుడు ఇంకా కొన వూపిరితో కొట్టుమిట్టాడుతున్నట్టు సంధ్య కాంతి. తూర్పున అప్పుడే పుట్టిన చంద్రుడు ఇంకా గాలి కొట్టని పెట్రోమాక్స్ లైట్ వత్తిలా ఉన్నాడు.
బీచ్ లో చచ్చిపోయిన తిమింగలాల్లా వున్న నల్లటి పడవలు. ఒక పడవలో రజని, నరేష్ కూర్చుని ఉన్నారు.
వాళ్ళు సముద్రం కేసి చూస్తూ మాట్లాడుకుంటున్నారు. దూరంగా దేవతలు సముద్రంలో వదిలిన కార్తీక ప్రమిదల్లా నౌకల దీపాలు మిణుకు మిణుకుమంటున్నాయి. బీచ్ రోడ్డంట అప్పుడప్పుడు పోతున్న కార్లు సముద్రమంటే విసుగేసి అలా వ్యాహ్యాళికి బయల్దేరిన చేపపిల్లల్లా ఉన్నాయి.
"రజనీ!" నరేష్ పిలిచాడు.
"ఊఁ!" ఆమె పలికింది.
"సముద్రాన్ని చూస్తే మనిషి ఎంత అల్పుడో గుర్తొచ్చి దిగులేస్తుంది" అన్నాడతను.
"నిజమే! సముద్రం ఎంత పెద్దదో! ఎప్పుడూ అలుపు లేకుండా పైకెగసే కెరటాలు. భూమినీ, ఆకాశాన్నీ కలిపేసే నీలిమ. వూహించలేనంత నీళ్ళు. ఇదీ ప్రకృతిలో ఒక భాగమేననుకుంటే మనిషి చాలా అల్పుడనిపిస్తుంది" అంది రజని ఏదో ట్రాన్స్ లో వున్నట్టు.
"అక్కడ కనిపించే చందమామ, ఈ సముద్రం, ఈ నీళ్ళు, ఈ ఇసుక - యివన్నీ చూస్తుంటే మనిషి జీవితం ఎంత తక్కువో తెలుస్తుంది. ఇంత అల్పమైన మనిషికి ఎన్ని ఆవేశాలు! కోపం, కసి, ప్రేమ, అభిమానం, అనురాగం, ద్వేషం. వేటికవే ఐడెంటికల్. ఇలాంటప్పుడు అవన్నీ చాలా బుద్భుదప్రాయమైనవిగా తోస్తాయి."
"వూఁ!" అంది ఆమె.
"సముద్రాన్ని చూస్తూ ప్రకృతిలో సమైక్యత చెందడం చాలా సులభం. ఎందుకంటే ఇది తన స్వరూపంతో మనిషిని చాలా భయపెడుతుంది. ఆ భయంలోంచి సమైక్యత పుడుతుంది" అతనన్నాడు.
"అవన్నీ చెప్పి నన్ను మరింత భయపెట్టకు. ముచ్చటగా మూడోసారి ఏకాంతంగా కలుసుకున్న ప్రేమికులం మనం. అరవయ్యేళ్ళ వయసులో మాట్లాడుకోవాల్సిన మాటలను మనం ఇప్పుడే మాట్లాడుకోవటం ఏం బాగాలేదు."