ఉగ్రుడైపోయాడు అధికారి. పక్కనే ఉన్న కర్ర తీసుకొని ఒళ్ళు ఎరక్కుండా బాదాడు. చేతులు నొప్పులు పెడ్తెకర్ర మూలకు విసిరి వగురుస్తూ కుర్చీలో కూలబడి "నఖ్రాలు చేయకు. ఒప్పుకో ఖూనీ చేసిన్నని. బతికిపోతావ్. లేకుంటే లాష్** ఈడనే బొందిలోకి పోతది. మళ్ళా జాగీరు ముఖం చూడవ్" అని, పోలీసు వాళ్ళని పిలిచి 'లేజావ్ తప్తీష్ (ఇంటరాగేషన్- విచారణ) కరో" అని కేక వేశాడు.
పోలీసులు అతణ్ణి లాక్కెళ్ళి గదిలో పారేశారు. నైజాంలో పోలీసులు రక్షకభటులు కారు. రాక్షస భటులు. వారికి ఏకోశానా పిసరంత మనస్సు ఉంటుందని ఎవరికీ నమ్మకంలేదు. ప్రజలను హడలకొట్టడంలో, నేరం చేయనివానితో సైతం నేరం ఒప్పించడంలో వారిని మించినవారు లోకంలో ఎక్కడా ఉండరు. అప్పణ్ణుంచి ఆ రాత్రంతా హింసించారు రఘును.
లాఠీలతో మోకాళ్ళమీదా, మోచేతులమీదా కొట్టారు. గంటల తరబడి కొట్టారు. నానా బాధలు పడ్డాడు. కాని ఒప్పుకోలేదు రఘు.
జనప నులక తెప్పించారు. కాళ్ళనుండి భుజాలవరకు గట్టిగా చుట్టారు. తల మీద నుంచి కుండలతో నీళ్ళు పోయించారు. నీళ్ళు పడుతూంటే నులక బిగుసుకుంటూంది. ఒళ్ళంతా నలిగిపోతూంది. హూనం అవుతూంది. మూలిగాడు. కాని ఒప్పుకోలేదు రఘు.
జనపనార తలకు కట్టి, రెండు చివరలు కలిసే చోట పుల్లలు పెట్టి తిప్పారు. నార తలను బిగుస్తూంది. నరాలు బాధ పెడ్తున్నాయి. డీలాపడిపోయాడు కాని ఒప్పుకోలేదు రఘు.
రాక్షసుడనుకున్నారు రఘును పోలీసులు. నేరాన్ని ఒప్పించడానికి యిన్ని మార్గాలు అవలంబించాల్సిన పని ఎవరి విషయంలోనూ పడలేదు. పోలీసులు విసిగి పోయారు. అధికారికి నివేదించారు. అతడు వారిమీద కస్సుబస్సుమన్నాడు. వారిని పంపి కొత్తవారిని పిలిపించాడు.
కొత్తవారు కొత్తబలంతో కొత్త ఉత్సాహంతో రఘుమీద పడ్డారు. మంచం తెప్పించి దానికోళ్ళు రఘు అరచేతులమీద పెట్టారు. మంచంమీద ఎక్కి ఎగిరారు. భరించరాని బాధపడ్డాడు రఘు. సుమారు స్పృహ తప్పి పడిపోయాడు కాని ఒప్పుకోలేదు.
గోళ్ళల్లో సూదులు గుచ్చారు. రక్తం ప్రవహించసాగింది. మూలిగాడు రఘు, అరచాడు, కేకలు పెట్టాడు, స్పృహ తప్పింది. పడిపోయాడు. తరువాత ఏం చేసినా అతనికి తెలియలేదు. పోలీసుల గుండె పగిలింది. సూపరింటెండెంటు దగ్గరికి పరిగెత్తారు. విన్నవించారు. అతని ప్రాణాలు పైపైనే లేచిపోయాయి. పరిగెత్తిచూచాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. డాక్టరును పిలిపించాడు.
అలా గడిచిందా రాత్రి - కాళరాత్రి.
అక్కడ జాగీరులోనూ అల్లకల్లోలంగా వుంది. రఘు అరెస్టు వార్త తెల్లవారకముందే ఊరంతా ప్రాకింది. జనం ఉద్రిక్తులైనారు. గుంపులు గుంపులుగా స్టేషన్ కు వెళ్ళారు కాని అప్పటికే బండి వెళ్ళిపోయింది. తెల్లవారితే నాగేశ్ గ్రామ ముఖ్యుల సమావేశం ఏర్పాట్లు చేశాడు. సమావేశంలో నాగేశ్ చాలా ఉద్రేకంగా మాట్లాడాడు. ఈ అన్యాయాన్ని సహించరాదన్నాడు. దౌర్జన్యాన్ని దౌర్జన్యంతో హింసతో ఎదిరించాలన్నాడు. భీముడు ఏడ్చాడు. రావఁడు రఘు వచ్చేదాక తాసిల్దార్ యింటికి వెళ్ళనన్నాడు. పనిపాటల వాళ్ళంతా అదే ప్రతిజ్ఞ చేశారు. వీరయ్యగారు ప్రశాంతంగా మాట్లాడినా పదునుగా మాట్లాడారు. జానకి సహితం మాట్లాడింది. ఆమె మాటల్లో ఆవేదన కనిపించింది. అన్యాయాన్ని ఎదిరించాలి. కాని, అన్యాయంతో కాదంది. నిప్పును నిప్పుతో చల్లార్చ లేమంది. అందుకు నీళ్ళు కావాలంది.
_________________________
**పీనుగు.
గ్రామంలో హర్తాళ్ జరపాలనే నిశ్చయం జరిగింది. ఒక్కడూ దుకాణం తెరవలేదు. ఊరు పాడుపడ్డట్టయింది. అసలే భయం భయంగా ఉన్నాడు తాసిల్దార్. ఆనాడు మాలిష్ లేదు. కేకలు వేయడం, మొత్తుకోవడం సాగించాడు. గిర్దావర్ను,అమీన్ను తిట్టిపోశాడు. ఇంట్లో వాళ్ళందరి మీద అరచాడు. అతనికి విరేచనాలు పట్టుకున్నాయి. అది రఘు మంత్రాల ప్రభావం అని వణికిపోయాడు. అసలు విషయం తెలియపరుస్తానన్నాడు. అమీను మీద రంకెలు వేశాడు. అమీను కాళ్ళు కడుపులు పట్టుకొని బ్రతిమలాడాడు. తన భార్యా బిడ్డల్ను చూడమన్నాడు. వేడుకున్నాడు. గిర్దావరు లోలోపల సంతోషించాడు. తురకలు తన్నుకుంటున్నారు. మంచిదే ననుకున్నాడు. తన మాట విననందుకు తగిన శాస్తి జరిగిందనుకున్నాడు. అయినా మొసలి కన్నీళ్ళు కార్చాడు.
ఆనాటి పత్రిక రావడంతో ఊళ్ళో ఉద్రేకం పెరిగింది. అంతా తాము చూచిందే అయినా పత్రికలో వార్త వారికి కొత్త అనుభూతిని యిచ్చింది. వేలమందికి తమ విషయం తెలిసిందనిపించింది. దేశం తమవెంట ఉందనిపించింది.
వడ్డెరగూడెం ఊరేగింపు తీసింది. భీముడు జండా పట్టుకొని ముందు నడుస్తున్నాడు. జానకి, నాగేశ్ అతని వెనుక ఉన్నారు. నాగేశ్ నినాదాలిస్తున్నాడు. హరిజన వాడ ఊరేగింపులో చేరింది. ఒక్కొక్కరూ ఊరంతా ఊరేగింపులో చేరింది.
జనార్ణవం
జనసాగరం
సాగిపోతూంది
పొంగిపోతూంది.
"తాసిల్దారు దౌర్జన్యం"
"నశించాలె!"
"రఘు గారినీ"
"విడుదల చేయాలె!"
గొంతు చించుకొని నినాదాలిస్తున్నారు. దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయ్. తాసిల్దార్ అంటే వణికి చచ్చే జనానికి ఎంత ధైర్యం వచ్చేసింది! ఎంత ఉద్రేకం వచ్చింది! ఈ దాడి అతని యింటిమీదికే!
నినాదాలు తాసిల్దార్ గుండెల్లో తూట్లు పడేశాయి. అసలే వళ్ళు నొప్పులు. అంధుపై విరేచనాలు. ఇప్పుడు పిడుగు విరుచుకుపడింది. తలుపులన్నీ వేయించాడు. లోపలి గదిలో కూర్చున్నాడు. చమటలు పడ్తున్నాయి. వణికిపోతున్నాడు. అమీను ప్రాణాలు లేచిపోయాయి. గిర్దావరు మూత్రం చేసుకున్నాడు. పంచె పైకి దోపుకొని దొడ్లోకి ఉరికాడు.
జనం తాసిల్దార్ ఇంటిముందుకు వచ్చేసింది. నినాదాలు, కేకలు, అరుపులు, తిట్లు, సాపెనలు, బూతులు.
"తాసిల్దార్ బయటికిరా!"
"తాసిల్దార్ బతకవురా?"
జనంలో ఉద్రేకం ఎక్కువ అవుతూంది. ఉర్రూత లూగుతున్నారు. నాగేశ్ కు శివం ఎత్తింది, సమ్మెటల్తో తలుపులు బద్దలు కొట్టమన్నాడు. వడ్డెర్లు సమ్మెటల్తో ముందు కురికారు. తాసిల్దార్ తల బద్దలు కొడ్తామన్నారు.
పరిస్థితి విషమిస్తూందని గ్రహించింది జానకి. పైట నడుముకు చుట్టుకొని పరిగెత్తింది. దర్వాజాకు అడ్డంగా నుంచుంది. "ముందు నా తల పగలాలె. తరవాత తలుపు? మనం మనుషులమా? రాక్షసులమా? చావటం, చంపటం, ఎంతమందిని చంపుతారు? ప్రాణానికి విలువ తెలియనివారు ప్రజా ఉద్యమాలు నడిపిస్తారట! ఆగండి అడుగు ముందుకువేస్తే ముందు నన్ను చంపండి."
చండికలా ఉంది జానకి. కళ్ళు రక్తం కక్కుతున్నాయి. ముఖం నిప్పులు ఉముస్తూంది. రెండు చేతులు చాచి దర్వాజాకు అడ్డంగా నిలిచింది. నఖశిఖ పర్యంతం వణికిపోతూంది.
జనం వెనక్కు తగ్గారు. చిత్తరువులా నుంచుండిపోయారు. కనీసం ఊపిరి పీల్చుకోకుండా విన్నారు ఆమె మాటలు. ముగిస్తే శ్వాస వదిలారు. అంతా నిశ్శబ్దం చీమ చిటుక్కుమంటే వినవచ్చేట్లుంది.
కొన్ని లిప్తలు అలా గడిచాయి.
"తాసిల్దారు రావాలె" వెనుక నుంచి ఎవరో అరచారు. ఇద్దరు ముగ్గురు అతన్ని అనుసరించారు. వెనుక నుంచి ఎవరో రాయి విసిరారు. అది జానకి నొసట తగిలి రక్తం మరకతో రాలిపోయింది. నొసట రక్తం టపటపా రాలింది. అయినా ఆమె చాచిన చేతులు దించలేదు. శిలా ప్రతిమలా అలాగే నుంచుంది. చలించలేదు.
నాగేశ్ అమాంతంగా ఆమె ముందుకు ఉరికి నుంచున్నాడు. భీముడు సమ్మెటతో జనంలోకి ఉరికాడు. భీముణ్ణి పట్టుకున్నాడు రావఁడు.
నాగేశ్ ను పక్కకు నెట్టి జానకి కేక పెట్టింది. "రక్తం చూసినరు. చాలు. ఇది నాకు తగిలిన గాయం కాదు. రఘుకు తగిలింది. అతని క్షేమం కోరితే అందరూ ప్రశాంతంగా వెళ్ళిపోండి."
"అవును వెళ్ళిపోండి" అన్నాడు నాగేశ్ తలవంచుకొని.
"వెళ్ళిపోండి" అని కేకవేశాడు భీముడు.
"ఊఁ పోండి" అన్నాడు రావఁడు.
జనం మంచులా కరిగిపోయింది.
పై పంచె చించి జానకికి కట్టుకట్టాడు భీముడు.
మేడమీద నుంచి ఇదంతా చూస్తున్న రుక్మిణి నిట్టూర్చి మేడమెట్లు దిగింది.