అప్పుడు అకస్మాత్తుగా అర్ధం అయ్యింది సుధకి.
ఈ అఖిల్ కి (ఈ 'గూండాకి' అని ఆమె అనుకోకపోవడం అదే మొదటిసారి) ఆడవాళ్ళంటే సిగ్గో, భయమోగానీ ఏదో వుంది.
ఎందుకనీ?
ఇంత సాహసంగా గూండాలనీ, గన్స్ నీ ఎదుర్కొని ఇన్నివేలమంది ప్రాణాలు రక్షించిన ఈ అఖిల్ కి....
ఆడపిల్లలని చూస్తే భయమా?
మళ్ళీ సుధ పెదిమల మీదికి నవ్వొచ్చింది. తనకి మాటిమాటికే నవ్వొచ్చేస్తోందని కూడా గ్రహించలేదు సుధ.
ఆడభయం వున్న మొగాడు ఆడపిల్లలకి అలుసు....ఏడిపించబుద్ధవుతుంది.
నాలుగడుగులు త్వరత్వరగా వేసింది సుధ. తను కూడా నవాబుగారి పక్కన నడవడం మొదలెట్టింది. ఆలోగానే రెండుసార్లు సూట్ కేసు చెయ్యి మార్చుకుంది.
"మీ సామాను ఏదీ?" అంది నవాబుగారితో ఏమీ తెలియనట్లే.
"ఇదిగో ఈ పిల్లగాడే మోస్తున్నాడు వద్దంటున్నా" అన్నాడు నవాబ్ సాబ్.
"నేను సూట్ కేసు మొయ్యలేకపోతున్నాను. ఇక్కడ వదిలేసి వచ్చేదా?" అంది.
అది విని తప్పనిసరి అయి, తటపటాయిస్తూనే అన్నాడు అఖిల్.... "బరువనిపిస్తే మీ సూట్ కేసు నాకు ఇచ్చెయ్యండి!"
"మీరిప్పటికే గాడిద బరువు మోస్తున్నారు కదా?" అంది నవ్వు కనబడకుండా సీరియస్ గానే మొహం పెట్టి.
"ఇంకో గాడిద బరువు కూడా మొయ్యడం నాకంత కష్టం కాదు" అన్నాడు అతను.
అమ్మో....తెలివితక్కువ వాడేం కాడు! తలుచుకుంటే మాటకి మాట అంటించగలడన్నమాట! అనుకుంది సుధ. అప్పుడు ఇంకొకటి గుర్తొచ్చింది ఆమెకి.
"ఫినాయిల్ తో నోరు కడుక్కో!" అని తను నోరుజారి అన్నదానికి బదులుగా "ఫినాయిల్ తో స్నానం చెయ్యి" అని సలహా ఇచ్చాడు తనకి. రిటార్డ్!
హఠాత్తుగా ఇంకో విషయం కూడా గుర్తుకు వచ్చింది....కొద్దిసేపటి క్రితం అతను తనకి క్షమార్పణ చెబుతున్నట్లు, "వాళ్ళ దగ్గర స్టెన్ గన్ ఉండడంవలన మీతో విరోధం నటించవలసి వచ్చింది" అన్నాడు.
అంటే....నిజంగా తనతో విరోధం లేదా అతనికి?
ఆ విషయం అప్పటికప్పుడే అడిగెయ్యాలనిపించినా అడగలేకపోయింది సుధ.
ఆమె తనకి సూట్ కేసు అందించకపోవడం చూసి అఖిలే అన్నాడు_ "ఫర్లేదు....దాన్ని కూడా నా తలమీద పెట్టెయ్యండి!"
అతను ఇంత బరువున్న ఈ సూట్ కేసుని కూడా మోసుకుంటూ నిజంగా నడవగలడో లేదో చూడాలనిపించింది సుధకి.
ఒంటె ఒంగినట్లు కొద్దిగా ఒంగాడు అఖిల్.
తన సూట్ కేసు అతని తల మీద పెట్టేసింది సుధ. ఆ సూట్ కేసుల మీద చేతులుపెట్టి కూర్చున్నాడు పిల్లాడు.
స్ట్రయిట్ గా నిలబడ్డాడు అఖిల్. అద్భుతమైన బాలెన్సింగ్ యాక్టు చేస్తున్నట్లు చకచక నడవడం మొదలెట్టాడు. అతని ఒంట్లో కండరాలు చక్కటి కో-ఆర్డినేషన్ తో కదలడం కనబడింది సుధకి.
"ఏ పర్ ఫెక్ట్ స్పెసిమన్ ఆఫ్ మేల్ బాడీ!" అనుకుంది అప్రయత్నంగానే.
ఆ అమ్మాయి డాక్టరు!
జనం గుంపులు గుంపులుగా విడిపోయి నడుస్తున్నారు. అఖిల్ చుట్టూ వున్న గుంపులో అమ్మాయిలే ఎక్కువ వుండడం గమనించింది సుధ.
అప్పుడు....
హఠాత్తుగా ఆకాశం మేఘావృతం అయ్యింది.
చల్లటిగాలి వీచింది. టపటప పెద్ద పెద్ద చినుకులు పడడం మొదలయ్యాయి. చినుకులకి తడిసిన మట్టి మత్తెక్కించే మధురమైన సువాసన వెదజల్లడం మొదలెట్టింది.
కొద్ది క్షణాల్లోనే వర్షం పెద్దదయిపోయింది. ఒక్కొక్క చినుకూ పడుతుంటే, సుధ చీరె, జాకెట్టూ ఒక్కొక్క అంగుళం చొప్పున తడిసి పోతున్నాయి.
అయిదు నిమిషాలలో ఆమె వళ్ళంతా తడిసిపోయింది. చీరె, జాకెట్టూ ఒంటికి అతుక్కుపోయాయి. అలాంటి స్థితిలో అతను తనవైపు చూస్తాడేమో అనుకోగానే చాలా సిగ్గు అనిపించింది సుధకి.
అప్పటికే మొగాళ్ళలో చాలామంది ఆమె వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు.
ఒక్క అఖిల్ తప్ప! అతను మాత్రం అంత బరువునీ సునాయాసంగా మోస్తూ నడుస్తూనే ఏదో ఆలోచిస్తున్నాడు.
అప్పుడు అనిపించింది సుధకి....
ఎప్పుడు చూసినా ఏదో అలోచిస్తున్నట్లే కనబడతాడు ఇతను. అసలు ఏం ఆలోచిస్తూ వుంటాడు?
ఏమో!
కొద్దిసేపట్లోనే వర్షం తగ్గుముఖం పట్టింది. చల్లగా, ఉల్లాసంగా వుంది వాతావరణం.అప్పుడు కనబడ్డాడు ఒక బిచ్చగాడు. ఒక చెట్టుకింద నిలబడి వున్నాడతను. అతనికి ఒంటిమీద ఉత్త గోచీ తప్ప వేరే ఆచ్చాదన లేదు.
ఎండకి ఎండి, వానకి నానిన అతని శరీరం వణుకుతోంది. అతన్ని చూడగానే గబగబా దగ్గరికెళ్ళాడు నవాబుగారు. తన వంటిమీద వున్న షేర్వాణీ విప్పి అతనికి అందించారు. షేర్వాణీ లోపల లాల్చీ వేసుకుని వున్నాడాయన. ఎలాంటి లాల్చీ అది? ఉత్త చిరుగుల లాల్చీ....నవ్వుతూ బేగంసాహెబా అంది.... "ఇట్లాడే దానధర్మాలు చేసి ఈ స్థితికి వచ్చాం.... చూశావుగా! ఊపర్ షేర్వాణీ అందర్ పరేషానీ అన్నమాట!" నవాబ్ సాబ్ కూడా నవ్వాడు.
బ్రహ్మానందభరితుడయిపోయాడు బిచ్చగాడు. వందనాలు అర్పించాడు.
"అరె! మీరెందుకు ఇస్తారు? నేను నా షర్టు ఇచ్చి వుండేవాడిని కదా?" అన్నాడు అఖిల్.
నవాబ్ సాబ్ చిన్నగా నవ్వాడు.
"వద్దులే! ఇవాళ నా ప్రాణాలు నాకు దక్కాయి. అందుకని అల్లా పేరు మీద బీదవాళ్ళకి ఏమన్నా ఇవ్వదలుచుకున్నను నేను."
ఆయన మాటల్లో అపశృతి వినిపించింది సుధకి. తన ప్రాణాలు దక్కినందుకా? అంటే....భార్య ప్రాణాలకు విలువే లేదా ఏమిటి?
ఆమె భావాలని అర్ధం చేసుకున్నట్లు అన్నాడు నవాబ్ సాబ్....
"నాకు నా బేగమే పంచప్రాణాలు....ఆమెకి ఏదన్నా అయితే నా ప్రాణాలు నాకు దక్కేవి కావు. అవునా బేగం?" అన్నాడు చిరునవ్వుతో.
"నాకు మాత్రం?" అంది ఆమె మెల్లిగా.
కొద్దిక్షణాలు మౌనం....
తర్వాత అన్నాడు నవాబ్ సాబ్....
"ఇది గుర్తుందా బేగం.... ఈ కవిత...." అంటూ రాగయుక్తంగా చదివాడు.
"ప్రియా!
నా ప్రియా!!
నేను ఎప్పుడు మరణించినా, ఎక్కడ మరణించినా కూడా....
ఆ అవసాన దశలో,
నా మడిలో నీ రూపూ,
నా పెదిమలపై నీ పేరూ వుండి,
నా మొహం నీవు వున్న దిక్కుగా_
తిరిగి వుంటే చాలు!
నా జీవితం ధన్యమైనట్లే!"
ప్రియా!
నా ప్రియా! అన్నాడు ఆర్ద్రంగా ఆమె వైపు చూస్తూ.
బేగంగారి కళ్ళలో నీటిపొర కనబడింది.
"ఊర్కోండి! అవన్నీ చిన్ననాటి మాటలు. ఇప్పుడింక మనం పెద్దాళ్ళమైపోయాం. ఇదిగో! ఈ సుధా, అఖిల్ లాంటి పిల్లలు పాడుకోవాల్సిన పాటలివి. మన కోరిక అలా కాకుండా, చనిపోయేటప్పుడు మనసులో అల్లా పేరూ, పెదిమల మీద అల్లా నామం వుండి, మనం మక్కావైపు తిరిగి వుంటే చాలు. మన జన్మ ధన్యమైపోయినట్లే" అంది.
అదే క్షణంలో - ఛక్ మని ఆకాశంలో మెరుపు మెరిసింది. అది సూటిగా సుధ గుండెని తాకి తాపాన్ని రేకెత్తించినట్లయ్యింది.
ఎంతో అన్యోన్యంగా వున్నారు ఈ వృద్ధ దంపతులు. ఎంతటి ఆర్ద్రత!
ఈ లెక్కన మనిషికి మనిషి తోడు లేకపోతే మానవజన్మకు సార్ధకత లేదా?
సన్నటి సెగ సుధ మనసులో వ్యాపించడం మొదలెట్టింది.
అనుకోకుండా అఖిల్ వైపు చూసింది ఆమె. ఆతను ఇదంతా పట్టించుకుంటున్నట్లు కనబడలేదు. ఇంకా పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నట్లే కనబడుతున్నాడు. ఎప్పుడూ ఆలోచన్లే!
ఇప్పుడు ఈ క్షణంలో అతను ఏం ఆలోచిస్తూ వుండి వుంటాడో? అఖిల్ సరిగ్గా ఆ క్షణంలో-
నీర్జా గురించి ఆలోచిస్తున్నాడు. నీర్జా గురించి ఆలోచించడం అదో రకం అలవాటుగా మారిపోయింది అతనికి.
ఆలోచించి ఆలోచించి ఆ ఆలోచన్లే ఒక వ్యసనంగా మారిపోయినట్లయ్యింది కూడా! క్షణం తీరిక దొరికితే చాలు.... నీర్జా గురించిన ఆలోచనలు తనని చుట్టుముట్టేస్తాయి.
కొద్దిరోజుల క్రితం.... నీర్జా హోటల్లో.... తను ఆ రోజుకి డ్యూటీ పూర్తి చేశాక.... మళ్ళీ చెఫ్ దగ్గరనుంచి పిలుపు వచ్చింది.
కానీ చెఫ్ కిచెన్ లో లేడు. సెల్లార్ లో వున్నాడుట.