అక్కడికి వెళ్ళాడు తను. దాదాపు స్టాఫ్ అందరూ కూడా అక్కడే వున్నారు. బిక్కుబిక్కుమని కూర్చుని వున్నారు అందరూ. దొంగచూపులు చూస్తున్నారు. గుసగుసగా మాట్లాడుకొంటున్నారు.
ఏదో కుట్ర జరుగుతున్న వాతావరణం కనబడింది అక్కడ.
కొద్ది క్షణాలలోనే తనకి అర్ధమైంది.
ఆ కుట్ర నీర్జాకి వ్యతిరేకంగా జరగబోతోందిట! అందులో తన పాత్ర ఏమిటో తెలియగానే తన పై ప్రాణాలు పైనే పోయాయి!!
నీర్జా హోటల్ సెల్లారులో వర్కర్స్ అందరూ చేరిన కారణమేమిటంటే_
ఆ ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసే ఎంప్లాయీస్ కి వుండడానికి ఒక యూనియన్ అయితే వుంది.
కానీ ఆ యూనియన్ ఊరికే నామ్ కే వాస్తే!
అంతే!
ఆ హోటల్లో పనిచేసే వాళ్ళెవరూ కూడా హక్కుల కోసం, కనీస సౌకర్యాల కోసం నోరెత్తడానికి వీల్లేదు.
చండశాసనురాలు నీర్జా!
ఆమె తమ్ముడు రాజ్ కుమార్ ఢిల్లీకి డాన్! టెర్రిఫిక్ కాంబినేషన్ వాళ్ళిద్దరిదీ.
అనేక సంవత్సరాలుగా అన్యాయాలు అన్నిటినీ భరిస్తూ పనిచేస్తున్న వర్కర్స్ ఇక వుండబట్టలేక తమ కనీస కోర్కెలు వెల్లడిస్తూ ఒక 'ఛార్టర్ ఆఫ్ డిమాండ్స్' తయారు చేశారు. వాటిలో ముఖ్యమైన డిమాండ్స్ మూడే. అత్యంత నిలాసవంతమైన ఆ హోటల్లో పనిచేసే తమకి ఫైవ్ స్టార్ భోజనం కాకపోయినా కనీసం కడుపు నిండేలా తిండి పెట్టాలన్నది మొదటి కోరిక.
జీతాలు సక్రమంగా ఒకటో తారీఖునే ఇవ్వాలని, బోనస్ చెల్లించాలని మిగతా రెండు కోరికలు!
ఛార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేయడమైతే చేశారు.
కానీ ఆ ఛార్టర్ ని తీసుకెళ్ళి నీర్జాకి అందజేసే మొనగాడెవరూ?
పిల్లి మెడలో గంటకట్టే సాహసం ఎవరికి ఉందీ?
ఎవరికి వాడు పక్కవాడివైపు చూస్తూ కూర్చున్నాడు.
అప్పుడు హఠాత్తుగా అన్నాడు చెఫ్.
"ఇంత ఆలోచన ఎందుకూ? అఖిల్ ని పంపిద్దాం."
ఆ మాట వినగానే నోరు తడి ఆరిపోయినట్లయ్యింది అఖిల్ కి.
తన జీతం కోసం అడిగే అవకాశమే ఇవ్వట్లేదు ఈ నీర్జా.
ఇంక అందరి తరఫునా అడగడానికి తను వెళితే ఊర్కుంటుందా?
అసలు ఈ పని తన మీదెందుకు పెట్టాడు చెఫ్?
బహుశా అతనికి తనమీద వున్న వ్యతిరేక భావం వల్లనే అతను తనని ఈ విధంగా ఇంకాస్త ఇబ్బందిలో పడెయ్యదల్చుకున్నాడేమో.
అయి ఉండవచ్చు.
ఒక్కసారి అందరివైపూ చూశాడు అఖిల్.
అక్కడున్న వాళ్ళలో అనేకమంది కష్టజీవులే! దిగులుగా మొహాలు పెట్టుకుని కూర్చుని వున్నారు వాళ్ళు. వాళ్ళలోనే కొందరు గడుగ్గాయిలూ, పని ఎగ్గొట్టి పక్కవాడి మీదకి పెట్టేస్తూండే సోమరిపోతులూ కూడా లేకపోలేదు.
వాళ్ళ డిమాండ్స్ న్యాయమైనవే అనిపించింది అఖిల్ కి.
నిజమే కదా మరి!
నిత్యం ఖరీదైన వంటకాలు వండి, వడ్డించడమే వృత్తిగా గలవాడికి ఆ వంటకాలు రుచి చూసే భాగ్యం లేకపోతే మానే కనీసం కడుపునిండా తిండయినా లేకపోతే ఎలా? కడుపు మండదూ?
ఈ నీర్జా హోటల్లో పరిస్థితి ఇంత దారుణంగా వున్నా, యూనియన్ బలంగా వున్న మిగతా హోటళ్ళలో మాత్రం వర్కర్ల వర్కింగ్ కండిషన్స్ సాధారణంగా బాగానే వుంటాయి.
యూనియన్ అనుకోగానే అఖిల్ కి ఒక విషయం గుర్తు వచ్చింది.
క్రిందటి శతాబ్దంలో-
ప్రపంచం మొత్తం మీద వర్కర్ల పరిస్థితి వరస్ట్ గా వుండేది. అమానుషమైన పరిస్థితుల్లో పని చేయవలసి వచ్చేది వాళ్ళు. బాధ్యతలే తప్ప హక్కులనే మాటే వుండేది కాదు అప్పట్లో.
అనేక దేశాల్లో - ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో అయితే-
పనివాళ్ళ పరిస్థితి పరమ దారుణంగా వుండేది.
బట్టలమిల్లులో పనిచేసే కార్మికులు అర్దరాత్రిదాకా ఒళ్ళు విరిగేలా పనిచేసి అలిసిపోయి ఒక రొట్టెముక్క నోట్లో వేసుకుని పక్కమీద వాలి ఆదమరచి నిద్రపోయేవాళ్ళు. నిద్ర తీరకముందే వాళ్ళని లేపేసి, మళ్ళీ పనిలోకి తోలేసేవాళ్ళు. డ్యూటీలో నుంచి దిగిన ఇంకో బ్యాచ్ వచ్చి ఖాళీ అయిన ఆ పక్కగుడ్డల మీదే వాలి నిద్రపోయేది. అలా నిరంతరంగా శ్రమ దోపిడీ జరిగిపోతూ వుండేది.
ప్రాణాలు వున్న మనుషులకీ, ప్రాణాలు లేని మెషిన్లకీ తేడాలేని దుర్దినాలు అవి.
అలాంటి నేపథ్యంలో ఒక మే నెల మొదటి తారీఖున అప్పటికే సహనం చచ్చి సహం చచ్చివున్న కార్మికులు తమ కనీస హక్కుల కోసం తిరగబడ్డారు. కాల్పులని ఎదుర్కొన్నారు. అలా ఆ పేదల రక్తంతో తడిసిన బట్టలే ఎర్రజెండాలుగా రూపుదిద్దుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కార్మికోద్యమం వేళ్ళూనింది. 'మేడే' కార్మికులకి మరపురాని రోజయ్యింది.
ఫలితంగా కార్మికులకు నిర్దిష్టమైన పనిగంటలు ఏర్పడ్డాయి. కనీస వేతనాలు, కొన్ని సౌకర్యాలు, సెలవు దినాలు మొదలయినవి లభించాయి.
హక్కులూ, బాధ్యతలూ రెండూ తెలిసిన పౌరులు వుండే దేశాల్లోని కార్మికులకి ఇది ఒక వరం కాగా హక్కులే తప్ప, బాధ్యతలను గుర్తుంచుకోని ప్రజలు వుండే భారతదేశం లాంటి దేశాలకి మాత్రం ఆశా జనకంగా ఉండవల్సిన ట్రేడ్ యూనియనిజమ్ ఆశనిపాతంలాగా మారింది. కార్మికోద్యమాలు కల్పించిన 'పనిభద్రత, (జాబ్ సెక్యూరిటీ) వర్కర్లకి మానసిక స్థయిర్యాన్ని, కలిగించి పని సామర్ధ్యాన్ని ఉత్పత్తిని పెంచేబదులు 'ఇంక మనల్నెవడూ పీకలేడు' అన్న ధీమాని కలిగించి, విశృంఖలత్వాన్ని, పనిపట్ల నిర్లక్ష్య భావాన్ని పెంచింది. జవాబుదారీతనం అన్నది లేనేలేకుండా పోయింది. ప్రభుత్వ శాఖలకు సంబంధించినంతవరకూ ఇది మరీ నిజంగా మారింది.
ఉదాహరణకు హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషనే వుంది. దాన్లో పనిచేసే సిబ్బంది ప్రజలకు సేవచేసే మాట దేవుడెరుగు. ప్రజలు కట్టే పన్నులన్నీ (అంటే మునిసిపల్ కార్పోరేషన్ ఆదాయం దాదాపు ముప్పయ్ అయిదుకోట్ల రూపాయల పైచిలుకూ కూడా!) కార్పోరేషన్ సిబ్బంది జీతభత్యాల క్రిందే ఖర్చవుతుందని ఒక అంచనా! అయినా కూడా నిజానికి కార్పోరేషన్ ఇచ్చే జీతభత్యాలు కార్పోరేషన్ సిబ్బందికి 'ఎక్స్ ట్రా ఇన్ కమ్' మాత్రమే!
సిబ్బంది అసలు రాబడి వాళ్ళు ప్రతిదానికీ గుంజే లంచాలద్వారానే వస్తుంది. ప్రజలు తమ ఖర్చులు తగ్గించుకుని పసిపిల్లల పాలఖర్చు, అన్నంలో అదనపు ఖర్చు తగ్గించుకుని కడుపు కాల్చుకు కట్టిన పనులన్నీ కార్పోరేషన్ సిబ్బందికి ఎక్స్ ట్రా ఇన్ కమ్ అన్నమాట! తాంబూలంతో పాటు దక్షిణ కూడా ఇచ్చినట్లు!
ఇదేమిటని అడిగేవాళ్ళు లేరు. అడిగితే సమ్మెలు, ధర్నాలు, దౌర్జన్యాలు! అవినీతికి అరాచకం తొడవుతుంది! ప్రభుత్వంతో సంబంధమున్న దాదాపు ప్రతి సంస్థ స్థితిగతులూ ఇలాగే ఉన్నాయి.
అంటే మంచి వర్కర్స్ అసలుండరని కాదు.
నిజాయితీపరులనే వాళ్ళే లేకుండా దేశం గొడ్డుపోయిందని కూడా కాదు.
ఇంకా అలాంటివాళ్ళు అక్కడక్కడా నూటికీ కోటికీ ఒకళ్ళుండ బట్టే యింకా ఈ మాత్రంగా ఉంది ఈ దేశం.
కానీ వాళ్ళు మైనారిటీ!
ఇప్పుడిప్పుడే ట్రేడ్ యూనియన్లని రౌడీగ్యాంగుల లెవెల్ కి తీసుకెళుతున్నారు బాంబేలో దత్తాసామంత్ లాంటి యూనియన్ లీడర్స్! హత్యా రాజకీయాలకి దారి చూపిస్తున్నారు.
ఈ లెక్కన ఈ జాడ్యం దేశమంతటా వ్యాపించి విశ్వరూపం చూపించటానికి యింకెన్నో రోజులు పట్టదు.
కానీ ఇప్పుడు ఈ హోటల్ వర్కర్స్ డిమాండ్స్ మాత్రం నూటికి నూరుశాతం న్యాయమైనవే. వాళ్ళు అడుగుతున్న పద్ధతి సక్రమం అయినదే.
చెఫ్ మళ్ళీ అంటున్నాడు స్థిరంగా.
"అఖిల్ వెళ్తాడు నీర్జా దగ్గరికి. అతనికి ఇవ్వండి ఛార్టర్ ఆఫ్ డిమాండ్స్"
ఎవరో ఒకతను వచ్చి ఒక పేపర్ అఖిల్ చేతిలో పెట్టాడు. దాన్ని అందుకుని యాంత్రికంగా లేచాడు అఖిల్.
కలలో నడుస్తున్నట్లు నెమ్మదిగా నడుస్తూ వెళ్ళి నీర్జా ఛాంబర్స్ ముందు ఆగాడు.
"ఏం కావాలి?" అన్నాడు అక్కడున్న బోయ్ రుడ్ గా.
"మేడమ్ తో మాట్లాడాలి" అన్నాడతను.
అతను అఖిల్ వేపు ఎగాదిగా చూసి లోపలికెళ్ళాడు.
మరునిమిషంలో బయటికి వచ్చి "మేడమ్ రమ్మంటున్నారు" అన్నాడు.
ఆశ్చర్యం కలిగింది అఖిల్ కి. నీర్జా తనకి యింత సులభంగా ఇంటర్వ్యూ ఇస్తుందనుకోలేదు అసలు!
సంకోచిస్తూనే లోపలికి వెళ్ళాడు.
తనని చూడగానే స్మైల్ చేసింది నీర్జా.
ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. తను మాట్లాడుతూనే తనని కుర్చీలో కూర్చోమన్నట్లు తన పంకించి సైగ చేసింది.
అనుకోని ఈ మర్యాదలకి ఆశ్చర్యపోతూ కుర్చీలో కూర్చున్నాడు తను.
తన సెక్రటరీవేపు చూసి కళ్ళతోటే ఏవో ఇన్ స్ట్రక్షన్స్ జారీ చేసిందామె.
సెక్రటరీ వినయంగా వంగి 'ఎస్ మేడమ్' అన్నాడు. తర్వాత బయటికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చి ఒక కవరు నీర్జా టేబుల్ మీద పెట్టాడు.
అప్రయత్నంగానే దానివేపు చూశాడు అఖిల్.