"బాంబుతో చస్తారో లేకపోతే జనం బారిన పడి చస్తారో తేల్చుకోండి. బాంబు అయితే జాగ్రత్తగా తీస్తే బతికి బయటపడే అవకాశం ఉంది" అన్నాడు అఖిల్.
అన్నదమ్ములిద్దరి మొహాల్లో ప్రేతకళ కనపడింది.
మొహమొహాలు చూసుకుని, తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి పట్టాల వైపు నడిచారు.
రైల్వే ట్రాక్ మీద బాంబు ఉందన్న వార్త అప్పటికే అందరికీ తెలిసిపోయింది. దాదాపు రైలంతా క్షణాల్లో ఖాళీ అయిపోయింది. చేతికందిన సామాన్లు దొరకబుచ్చుకుని జనం దూర దూరంగా పారిపోవడం మొదలుపెట్టారు.
ఇంకా ఇంజను దగ్గర నిలబడి ఉన్నది అఖిల్ ఒక్కడే.
అతనికి కొద్దిదూరంలో సుధా, నవాబ్ సాబ్, బేగం సాహెబ్ నిలబడి వున్నారు.
అన్నదమ్ములిద్దరూ ట్రాక్ ని సమీపించారు. వాళ్ళ చేతులు వణుకుతూ వుండడం అంత దూరం నుంచి కూడా స్పష్టంగా కనబడుతోంది.
కొద్ది క్షణాలసేపు ఆ బాంబు వైపు చూశారు వాళ్ళు. ఆ తర్వాత, దాని విషయం కొద్దిగా అర్ధమైనట్టు తల పంకించి, ఒంగి ఒకేసారి దాన్ని పైకెత్తారు.
అప్పుడు అన్న అన్నాడు పెద్దగా "తమ్మీ! బాంబు ఇసిరి ఆడిమీద పడెయ్యాల. చచ్చూరుకుంటాడు చెత్తనాకొడుకు."
"వీడి ఒళ్ళు వెయ్యి ముక్కలయితే వెయ్యి గోరీలు కట్టిస్తా నా కొడుక్కి" అన్నాడు తమ్ముడు మొరటుగా.
వెనక్కి వెళ్ళిపోయే వ్యవధి కూడా లేదు అఖిల్ కి. అది అత్యంత శక్తివంతమైన బాంబు అని తెలుస్తోందిగానీ అది డిటొనేట్ కావడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో, అది ఎలా పెలుతుందో మాత్రం అతనికి తెలియదు. అందుకని చటుక్కున అన్నాడు_
"అరె! మీ గన్ మాన్ స్టెన్ గన్ని మీమీదే గురిపెడుతున్నాడేమిటి?" అన్నాడు ఆశ్చర్యాన్ని అద్భుతంగా అభినయిస్తూ.
ఉలిక్కిపడ్డారు అన్నదమ్ములిద్దరూ. బాంబుల, హత్యా రాజకీయాల్లో మనిషికి సాటి మనిషి మీదే కాదు, తన సొంత మనిషి మీద కూడా నమ్మకము వుండదు.
ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బు తిన్న తమ గన్ మాన్ తమనే పిట్టలని కాల్చేసినట్లు కాల్చేసినా ఆశ్చర్యం లేదు.
నిజానికి ఆ టైంలో ఆ గన్ మాన్ కిందపడిపోయిన తన స్టెన్ గన్ ని వెదికిపట్టుకుని, ఆ అన్నదమ్ములని కలుసుకోవడానికి వెనక వైపు నుంచి వస్తున్నాడు అంతే!
అన్నదమ్ములిద్దరూ గిరుక్కున వెనక్కి తిరగడంతో బాంబు ఆయువుపట్టు మీద ప్రెజర్ ఎక్కువైంది.
తక్షణం దిక్కులు పిక్కటిల్లే! శబ్దంతో పేలిపోయింది బాంబు. అప్పటికే వెనక్కి పరిగెత్తి సుధా వాళ్ళు ఉన్న చోటికి చేరుకున్నాడు అఖిల్. అయినా కూడా విస్పోటనం తాలూకు షాక్ వేవ్ కి ఆ నలుగురూ కూడా వెనక్కి విరుచుకు పడిపోయారు. వాళ్ళ మీద దుమ్ము, ధూళీ వర్షంలా కురిశాయి.
కొద్దిసేపటి తర్వాత తేరుకుని నెమ్మదిగా లేచి చూశాడు అఖిల్.
సుందోపసుందుల లాంటి ఆ అన్నదమ్ములిద్దరి శరీరాలూ, గన్ మాన్ శరీరం కూడా ముక్కలు ముక్కలై ఆ చుట్టుపక్కలంతా చెల్లాచెదురుగా పడ్డాయి.
రైలు ట్రాక్ చాలా మేర ధ్వంసం అయిపోయింది. అంతకంటే ఎక్కువ నష్టం జరగలేదు.
అల్లంత దూరంలో ఎక్కడో ఆగి అద్భుతమైన ప్రదర్శన ఏదో చూస్తున్నట్లు నిలబడిపోయిన జనం, బాంబు పేలిపోగానే రిలీఫ్ గా ఫీలవుతూ పెద్దపెట్టున హర్షధ్వానాలు చేసి, చప్పట్లు చరిచారు. నవ్వులూ, అరుపులూ, కేరింతలూ వినబడ్డాయి. దూరంగా వెళ్ళిపోయిన ఆ జనం అంతా సంతోషాతిరేకంతో తిరిగిరావడం మొదలెట్టారు.
మరునిమిషంలో అక్కడ ఇసకవేస్తే రాలనంత మంది పోగయిపోయారు.
వాళ్ళలో కొంతమంది అఖిల్ చేతులుపట్టుకు ఊపేస్తున్నారు. కొంతమంది అతన్ని భుజం మీద తట్టి అభినందిస్తున్నారు. ఇంకొంత మంది పిల్లా పెద్దా కూడా వంగి అతని కాళ్ళకి దణ్ణం పెడుతున్నారు.
ఆ గందరగోళంలోనే స్లీవ్ లెస్ టాప్స్, జీన్సూ వేసుకుని వున్న ఒక అందమైన అమ్మాయి, ఉత్సాహం పట్టలేక అఖిల్ మెడచుట్టూ చేతులు వేసి, అతని బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టింది. జనంలో నుంచి నవ్వులు_సంతోషం.
ఆ అమ్మాయి అఖిల్ ని వదలడంలేదు. మెడచుట్టూ చేతులు వేసి అలా వేళ్ళాడుతూనే "రియల్ లైఫ్ హీరో అంటే మీరే! ఇవాళ మీవల్లే కొన్ని వేలమంది ప్రాణాలు రక్షింపబడ్డాయి" అంది తమకంగా.
అతని మొహం ఎర్రబడింది.
"థాంక్స్!" అని అస్పష్టంగా గొణిగి, కష్టం మీద ఆ అమ్మాయి కౌగిలి వదిలించుకున్నాడు.
అది చూసిన నవాబ్ సాబ్, బేగంసాహెబ్ మొహాల్లో నవ్వు కనబడింది.
సుధ కూడా ఇదంతా కళ్ళార్పకుండా చూస్తూనే వుంది. ఆమెకి అనిపించింది. ఇంతమంది ప్రాణాలు కాపాడి, జనం చేత నీరాజనాలు పట్టించుకుంటున్న ఇతనేనా మారణహోమానికి మాస్టర్ ప్లానులు వేస్తుంటాడని తను అపార్ధం చేసుకున్న గూండా?
ఓ అమ్మాయి తన అభిమానాన్ని ఆపుకోలేక పబ్లిగ్గా కావలించుకుని ముద్దు పెట్టుకుంటున్న ఇతన్నేనా ఇంతగా అసహ్యించుకుంటున్నది తను?
ఆమె అలా డైలమాలో వుండగానే, అఖిల్ అందరికీ వినబడేలా పెద్దగా అన్నాడు_
"ట్రాక్ ధ్వంసమైపోయింది. దేవుడి దయవల్ల మనం మాత్రం బతికి బయటపడ్డాం. హైదరాబాద్ ఇంకో ముప్పయ్, నలభై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వుండదు. ఆ కనబడే రోడ్డు దాకా నడిచివెళితే హైదరాబాద్ వెళ్ళే పద్ధతి ఏదో ఒకటి కనబడకపోదు. ఏమీ దొరక్కపోయినా, నడిచి వెళ్ళిపోవడం కూడా అసంభవమేమీ కాదు."
అక్కడే వున్న గార్డు కూడా అది కరెక్టే అన్నాడు. ఎక్కడ టెలిఫోన్ కనబడితే అక్కడ నుంచి తమ హెడ్ క్వార్టర్స్ కి కబురు పంపిస్తానన్నాడు.
"సరే! ఇక మనం బయల్దేరొచ్చు!" అన్నాడు అఖిల్. అంటూనే కంపార్టుమెంటులోకి ఎక్కి, తన సామానూ, నవాబుగారి సామానూ బయటికి తెచ్చాడు అఖిల్.
సుధ సూట్ కేసు మాత్రం కంపార్టుమెంటులోనే వుండిపోయింది. కంపార్టుమెంటులోకి ఎక్కడానికి ప్రయత్నించింది సుధ.
రైలు ప్లాట్ ఫారం మీద ఆగి వున్నప్పుడు రెండు మెట్లు ఎక్కితే చాలు. కంపార్టుమెంటులోకి వెళ్ళిపోతాం.
ప్లాట్ ఫారం బయట ఆగి ఉన్నప్పుడు అలా కాదు. అరడజను మెట్లు ఎక్కినంత శ్రమపడాల్సి వస్తుంది. చాలా శ్రమపడే ఎక్కింది సుధ. సూట్ కేసు తీసుకుంది. దిగేటప్పుడు బేగంగారు చెయ్యి ఆసరా అందించారు. అఖిల్ మాత్రం అసలు ఆమె వేపు చూడటమేలేదు. అప్పటికే అతని రెండు చేతుల్లో రెండు సూట్ కేసులు వున్నాయి. నెత్తిమీద ఇంకో సూట్ కేసు వుంది. రెండు భుజాలకీ నాలుగు బ్యాగులు వేళ్ళాడుతున్నాయి. అది చాలనట్లు, అతని మెడమీద అటో కాలూ, ఇటోకాలూ వేసి ఓ పిల్లాడు కోతిపిల్లలా కూర్చుని వున్నాడు.
నడక మొదలయ్యింది. అఖిల్ చుట్టూ జనం అందరూ హిస్టీరికల్ గా వున్నారు. కొందరు నవ్వుతున్నారు. కొంతమంది ఏడుపుగొంతుతో ఏదో చెబుతున్నారు. మృత్యుముఖం దాకా వెళ్ళి వెనక్కి వచ్చామనే భావన వాళ్ళ మానసిక స్థితిని చిత్రంగా మార్చివేసింది.
సూట్ కేసు పట్టుకొని వాళ్ళ వెనకే నడిచి వస్తోంది సుధ. ఆమె మెదడు బ్లాంక్ గా అయిపోయినట్లు వుంది. తను ఇంతవరకూ సత్యాలని నమ్మినవి అసత్యాలుగా, అసత్యాలు అనుకున్నవి సత్యాలుగా కనబడుతున్నా ఆమె మనసు ఆ నిజాలని పూర్తిగా అంగీకరించలేకపోతోంది.
స్థబ్దంగా వుంది ఆమె మనసు.
అయిదు నిమిషాలు కాకముందే, సూట్ కేసు పట్టుకున్న ఆమె చెయ్యి లాగేస్తున్నట్లు అయ్యింది.
చెయ్యి మార్చుకుంది సుధ.
అయిదు నిమిషాల్లో ఈ చెయ్యిలాగడం మొదలైంది.
మళ్ళీ చెయ్యి మార్చుకుంది. ఈసారి అరనిమిషంలోనే ఈ చెయ్యి లాగడం మొదలైంది. సూట్ కేసు వంద టన్నుల బరువు వున్నట్లు అనిపిస్తోంది.
ఇలా ఎన్ని కిలోమీటర్లు నడవాలీ? ఇంకా ముప్పయ్ కిలోమీటర్లా, నలభై కిలోమీటర్లా? మళ్ళీ సూట్ కేసు చెయ్యి మార్చుకుంటూ అనుకుంది సుధ.
పోనీ, ఈ సూట్ కేసులోని చీరెలూ అవీ తీసిపారేస్తే? బరువు తగ్గుతుందిగా?
చీరెలు అవీ అన్నీ తీసిపారేసినప్పుడు ఇక ఈ సూట్ కేసు మాత్రం ఎందుకూ? అసలు దాన్నే వదిలేస్తే పోతుందిగా.
అలా అనుకోగానే అప్రయత్నంగానే ఆమెకి నవ్వు వచ్చింది. అతి అరుదయిన చిరునవ్వు! అనుకోకుండా అదే క్షణంలో ఆమె వేపు తిరిగాడు అఖిల్. అత్యంత మనోహరంగా వున్న ఆమె చిరునవ్వుని చూశాడు. ఆ అరక్షణంలోనే అనిపించింది అతనికి.
"ఆ నవ్వు చూస్తుంటే చాలు........ఆకలి దప్పికలు వుండవేమో అసలు" అని.
అదేక్షణంలో అతనికి గుర్తుకు వచ్చాయి కూడా తన కజిన్ సిస్టరూ, ఆమె ఫ్రెండూ కలిసి పెట్టిన కఠిన పరీక్షా, సుభద్ర చేసిన అఘాయిత్యమూ- అల్లరీ....
ఉలిక్కిపడి చూపులు మరల్చుకున్నాడు అతను.
ఈ లోపల....
ఇందాకటి జీన్సు అమ్మాయి వచ్చి అఖిల్ ని ఆనుకున్నంత దగ్గరగా నడుస్తూ అతనితో ఏదో చెబుతోంది. గాభరాగా మూడు ముక్కల్లో జవాబు చెప్పి, నవాబుగారి దగ్గరకెళ్ళిపోయి, ఆయన పక్కన నడవడం మొదలుపెట్టారు అఖిల్.