Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 35

    పక్కనేవున్న పంచపాత్రలోని నీళ్ళు ఆకులతో తీసుకొని ముకుందరావు నెత్తిన చల్లి "ఇలా కూర్చో నాయనా!" అంది.
   
    భక్తి పారవశ్యంలో ఉన్నా ముకుందరావుకి ఒక్కక్షణం ఆమె కూర్చోమన్నది 'ఆమె విశాలమైన తొడమీదనా! ఆమె పక్కనా!' అన్నది అర్ధంకాలేదు.
   
    "ఎక్కడ కూర్చోవా"లన్నట్టు ఆమె మొహంలోకి అయోమయంగా చూశాడు.
   
    అంబులంబ స్వాములమ్మ ప్రక్కనే నుంచున్న ప్రధమ శిష్యురాలు శరీరంలో అన్నీ ఎండిపోయి బొంగులావున్నా కంచు కంఠంతో "అమ్మగారి కాళ్ళ ముందు కూర్చో" అంటూ ఖంగున చెప్పింది.
   
    అంబులంబ స్వాములమ్మ కాళ్ళముందు ధబేల్ మంటూ కూర్చుండిపోయాడు ముకుందరావు.
   
    ముకుందరావు తల నిమురుతూ "నీకష్టం నాకు తెలుసు నాయనా!" అంది అంబులంబ స్వాములమ్మ.
   
    ఏదో మాట్లాడాలని చూశాడుగాని ముకుందరావు నోరు పెగల్లేదు. ఈ లోపలే అంబులంబ అంది. "నీకు పెళ్ళయి పదేళ్లయింది. ఇంత వరకు సంతానంలేదు. అవునా!"
   
    తను చెప్పకుండానే తనెందుకు ఇక్కడి కొచ్చాడో దివ్యదృష్టితో తెలుసుకున్నందుకు ముకుందరావుకి కళ్ళ నీళ్ళ పర్యంతమయింది. ఇంత వరకు సంతానంలేదు. అవునా!"
   
    తను చెప్పకుండానే తనెందుకు ఇక్కడి కొచ్చాడో దివ్యదృష్టితో తెలుసుకున్నందుకు ముకుందరావుకి కళ్ళ నీళ్ళ పర్యంతమయింది. ఏదో చెప్పబోయాడుగాని నోరు పెగల్లేదు.
   
    "ఇది ఈ జన్మ పాపంకాదు. పూర్వజన్మ పాపం ఈ పాపం పోయి నీకు పుత్రుడు కలిగే యోగం ఉంది. కాకపోతే దానికి కొంత తంతంగం ఉంది" అంటూ ముకుందరావు చేతిని ఆప్యాయంగా ఊరడింపుగా నిమిరింది.
   
    "మీరేం చెప్పినా చేస్తాను. అది ఎంత కష్టమైనా సరే. ఒక్క పుత్రుడు కావాలి. ఇటు కట్టుకున్న ఇల్లాలు అటు లోకం నన్ను 'గొడ్డు మోతువాడ'ని ఎత్తి పొడుస్తున్నది నేను గొడ్డుమోతువాడ్ని కాదని ఒక మగ నలుసుకి తండ్రినని అనిపించండి చాలు. జన్మ జన్మలకి మీ నామస్మరణ చేసుకుంటాను" అంటూ నంగి నంగిగా ఇంకా ఏదో మాట్లాడాడు ముకుందరావు.
   
    "ఈ ఏడాదిలోగా పండంటి కొడుకుని కంటావ్ నా దీవెనెప్పుడూ వృధాకాదు మూడ్రోజులపాటు నేను చెప్పినట్టు నిష్టగా పూజ చేస్తూ రాత్రింబవళ్ళు ఇక్కడే వుండాలి. పుత్రకామేష్టి పరమేష్టి యాగం నీ ఒక్కడిచేత చేయిస్తాను. నీ కోరిక సిద్దిస్తుంది" అని వివరంగా చెప్పింది అంబులంబ స్వాములమ్మ.
   
    ముకుందరావు అన్నింటికి గొర్రెలాగా తలవూపి అక్కడ శెలవు తీసుకొని ఇంటికొచ్చి భార్యతో అన్ని విషయాలు పూస గుచ్చినట్టు చెప్పాడు.
   
    ఇలాంటి స్వాములమ్మ మీద నమ్మకంలేని మలయవంతి "యాగానికి ఎంత డబ్బు కావాలందేమిటి?" వ్యంగ్యంగా అడిగింది.
   
    "డబ్బు అవసరమేమీ లేదు నేను తీసికెళ్ళవలసింది పదహారు టెంకాయలు మాత్రమే. యాగానికి కావలసినవన్నీ వాళ్ళే సమకూరుస్తారట. యాగమంటే చాలామంది కూర్చుని ఎక్కువ ఖర్చుతో కూడినపని. కాని ఇది ఒక్కడ్నే కూర్చుని చేసే పుత్రకామేష్టి యాగం. అందువల్ల ఖర్చు వుండదు. నా కడుపున ఒక్క కాయకాస్తే ఆమె నిర్మించబోయే గుడికి మనకి తోచిన విరాళమిస్తే చాలు. అదైనా ఇష్టమైతే ఇవ్వొచ్చు. లేకపోతే బలవంతమేమీలేదు" అంటూ విశదీకరించి చెప్పాడు ముకుందరావు.
   
    డబ్బు ఖర్చుకాని పనంటే మలయవంతికి ఏదైనా ఇష్టమే పదహారు టెంకాయలు మాత్రమే ఖర్చు మూడ్రోజులు భర్త ఇంట్లో ఉండడు. అంటే ఆరుపూట్ల భోజనం మిగులు. అన్నీ ఆలోచించి లెక్కలు వేసిన మలయవంతి "మీ ఇష్టాన్ని కాదంటమెందుకు? కానీండి" అంది.
   
    ముకుందరావు అప్పటికప్పుడే కడుపొచ్చి తొమ్మిది నెలలూ మోసి మగబిడ్డని కన్నంత ఆనందమనిపించింది.
   
    అంబులంబ స్వాములమ్మ ఆశ్రమంలో మూడురోజులూ ఉండి పుత్రకామేష్టి పరమేష్టి యాగం పగలంతా చేస్తూ రాత్రిళ్ళు ఒళ్ళెరుగని నిద్రపోతూ మొత్తానికి మూడురోజులూ గడిపేశాడు ముకుందరావు.
   
    అంబులంబ స్వాములమ్మ అక్కడున్న ఆమె శిష్యురాళ్ళు అంతా ఆడవాళ్ళు ఘోటక బ్రహ్మచారిణిలు. కొందరు గిట్టనివాళ్ళు నాస్తికులు ఆమె గురించి లేనిపోని కథలల్లి ప్రచారంకూడా చేశారు.
   
    "మగవాళ్ళకి మత్తుమందు లాంటివి ఇచ్చి వాళ్ళతో సుఖాలు పొందుతూ స్వాములమ్మల్లాగా నాటకాలాడుతున్నారని..."
   
    ఈ దేశంలో ఏ రసమున్నా లేకపోయినా భక్తి రసానికి మాత్రం కొదవలేదు. నాస్తికులు నలుగురు భక్తులు వేలమంది ఉండటంవల్ల స్వాములమ్మలమీద ఎలాంటి కధలల్లినా ఎవరూ పట్టించుకోకుండా కొట్టి పారేశారు.
   
    ముకుందరావు చేసిన పుత్రకామేష్టి పరమేష్టియాగం ఫలితంగా అతనికి నెల తిరక్కుండానే కడుపొచ్చేసింది. తొమ్మిది నెలలు తిరక్కుండానే ఓ మగబిడ్డకి తండ్రయిపోయాడు. అంబులమ్మ స్వాములమ్మ ప్రసాదంవల్ల పుట్టడంవల్ల వాడికి కాస్త ఆ అంబ పోలికలుకూడా వచ్చాయ్.
   
    ఒక శుభ ముహూర్తాన బారసాలచేసి "అంబారావ్" అని వాడికి పేరు పెట్టారు.
   
    వాడికి మాటలొచ్చే ముందు ముందుగా అమ్మ....అత్త....నాన్న ఇలాంటివేమీ రాలేదు. "అంబో అంబో" అన్నమాట వచ్చింది.
   
    పుత్రుడి నోటివెంట ఆ పలుకు విని ముకుందరావు పిత్రుహృదయం పులకించిపోయేది.
   
    మొత్తానికి అంబులంబ స్వాములమ్మ దయవల్ల ముకుందరావు ఒక బిడ్డకి తండ్రయ్యాడు.
   
    "ఇదంతా అంబులంబ మహిమ." అని ముకుందరావు అన్నప్పుడల్లా ఆఫీసులోవాళ్ళు, ఇరుగు పొరుగు నోళ్ళు నొక్కుకొని చెవులు కొరుక్కుని ముసి ముసి నవ్వులు నవ్వుకొనేవాళ్ళు.
   
    ఎవరెలా నవ్వుకుంటేనేమి? ఎవరెలా చస్తేనేమి? గొడ్డుమోతు వాడిలాగ మిగలకుండా ముకుందరావు ఒక మగబిడ్డకి తండ్రయ్యాడు. అతనికి అంతకన్నా ఇంకేం కావాలి?
   
                                                                              *    *    *    *
   
    పరిమళరావు నెల తప్పాడు.
   
    పరిమళరావుకి దివ్య హారతికి పెళ్ళయి సరీగా ఎనిమిదేళ్ళు అయింది. వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం.
   
    ఈ ఎనిమిదేళ్ళలో దివ్యహారతి ఇద్దరు ఆడపిల్లలని యీజీగా కనేసిలోకం దృష్టిలో గొడ్రాలు కాకుండా పిల్లల తల్లి అయింది.
   
    పాపం పరిమళరావు మాత్రం పిత్రుత్వానికి నోచుకోక లోకం దృష్టిలో గొడ్డుమోతువాడిగా మిగిలిపోయాడు.
   
    దివ్యహారతిది విశాల హృదయం, పైగ ప్రేమ వివాహం అందువల్ల వాళ్ళ మధ్య విడాకుల ప్రసక్తి వచ్చేది కాదు. భర్తని మాటలతో హింసించేది కాదు.

 Previous Page Next Page