పురుషులు కన్నా స్త్రీలు ఎక్కువ మంది యింటి పట్టున వుంటారు. స్త్రీలకి గృహానికి సంబంధించిన పనులు ఎంతఎక్కువో విశ్రాంతి అంత ఎక్కువే. తెల్లారిలేస్తే ఇల్లాలికి వంద పనులు. అ పనుల మధ్య కాస్త తీరిక చేసుకుని కాస్త సాధన చేస్తే శరీరం వజ్రాయుధంగా మారుతుంది. కాలేజీ అమ్మాయిలు, ఇంటి పట్టునున్న పెళ్ళికాని యువతులు, వీళ్ళు ఈ సాధన చేయవచ్చు. పిల్లలు యువతులు తేలికగా ఎన్నో రకాలు నేర్చుకోవచ్చు. పెద్దవాళ్ళు కొన్ని నేర్చుకోవచ్చు. సో, ఉత్త చేతులతో పాముని చంపటం అసాధ్యం అయినప్పుడు చేతిలో కర్రవుంటే దానితో ఎదుర్కొంటాము కదా! అలాగే ఈ విద్య కూడా. దీని పేరు కూడా మీలో చాలామందికి తెలిసిందే. అది కరాటే!" అంటూ దీక్ష కాస్త ఆగింది.
"అవును కరాటే. ఇప్పుడు చూసింది కూడా కరాటేనే." ఎవరికి వాళ్ళే అనుకున్నారు.
ఇంతవరకూ దీక్ష వాళ్ళు ఆలోచించే అవకాశం యివ్వకుండా ప్రదర్శనలు వెంట వెంటనే చూపింది. అ వెంటనే స్పీచ్ మొదలు పెట్టింది. అది కరాటే, అని చెప్పిన తరువాత క్షణకాలం ఆగింది. వాళ్ళు ఆలోచించుకోటానికి. మరీ ఎక్కువ ఆలోచించనిస్తే అదీ మంచిది కాదు. వెంటనే దీక్ష మళ్లీ మొదలు పెట్టింది.
"కరాటే అన్నపేరు మీలో చాలామంది విన్నారు, చూశారు. ఈ కరాటే అన్నపేరు ఎలా వచ్చిందో తెలుసా! కర్రతో ఆట... కర్రతో ఎదుర్కోటం... అందువల్ల కరాటే అన్నారు. దీని పేరు. కరాటేకి వుపయోగించే కర్రపేరు నన్ చాకు.
కరాటే విద్య ఇతర దేశాల నుంచి ముఖ్యంగా చైనా వాళ్ళనుంచి వచ్చింది అంటారు. కరాటే పుట్టుక ఎక్కడ అన్నది ఖచ్చితంగా ఈ రోజుకి ఎవరూ చెప్పలేక పోతున్నారు. కాని కొందరు అనటం మనదేశం యొక్క బౌద్ధమత ప్రచారకుడు అలా అలా దేశాలు మత ప్రచారంకోసం తిరుగుతూ ఆత్మరక్షణకి తను కనిపెట్టిన కరాటేని అందరికి చూపించాడని. అది అలా అలా దేశ దేశాలకి పాకి పోయిందని, మనదేశం యొక్క బౌద్ధమత ప్రచారకుడు ముందుగా చైనా వెళ్ళాడని, అసలు ఈ విద్య మనదే అని కూడా అంటారు.
కరాటేలో వుపయోగించే సన్ చాకులోరకాలు, ఉపయోగించటంలో రకాలు ఇప్పుడు మీరు చూడండి." అంటూ దీక్ష మైకు దగ్గరనుంచి అవతలికి వెళ్ళింది.
దీక్షకి ఒక అమ్మాయి నన్ చాకు అందించింది.
దీక్ష ఒకమ్మాయితో ముందు, ఆ తర్వాత ఇద్దరి ముగ్గురు అమ్మాయిలతో రకరకాల నన్ చాకులతో పోరాడుతూ కరాటే ప్రదర్శించింది.
అది పోరాటం కాదు. కళ్ళముందు ఉరుములు మెరుపులు. ఆ నైపుణ్యం స్పీడు మెలుకువ మాటలతో చెప్పలేనిది.
దీక్ష యింతవరకు ఏ ప్రదర్శనలో పాల్గొనలేదు. స్టేజీ ఎక్కి విద్య వీళ్ళకు యిప్పుడే చూపిస్తున్నది.
ఆశ్చర్యంతో వాళ్ళంతా తలమునకలు అయ్యారు.
నన్ చాకుతో కరాటే పూర్తిచేసిన దీక్ష ఆ తర్వాత కుంగ్ పూ ప్రదర్శించింది. కుంగ్ ఫూ విద్య చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా వుంది. మనిషి కోతిలాగా శత్రువు మీద ఎటాక్ చేయటం. పాములాగా మెలికలు తిరగటం, గద్దలాగా తన్నటం, పులి దూకుడు. మనిషి ఏదో ఒక జంతువు రూపందాల్చి అచ్చం జంతువులాగా ప్రత్యర్ధితో తలపడటం అన్నమాట.
దీక్ష ఈ రెండు విద్యలు వాళ్ళకి చూపి మళ్ళీ మైకుదగ్గరకు వచ్చి స్పీచ్ మొదలుపెట్టింది.
"ఇప్పుడు నన్ చాకుతో కరాటే పోరాటం.పలురకాల జంతువుల పోరాటం తీరులో జూడో చూశారు. ఇప్పుడు కరాటే వాళ్ళు ధరించే రంగు రంగుల బెల్టులు గురించి చెపుతాను. ఈ బెల్టులు గురించి చెపుతాను. ఈ బెల్టులు అనేవి ఏడు. ఈ ఏడు ఏడు రంగులలో వుంటాయి...."
దీక్ష చెపుతుంటే దీక్ష నడుంకి ఏ రకం బెల్టు వుందా అని అందరూ పరిశీలనగా చూశారు. అందాకా వాళ్ళు ఆ విషయం అంతగా పట్టించుకోలేదు. గమనించలేదు.
దీక్ష నడుంకి బ్రౌన్ బెల్ట్ వుంది.
"..... .... ఈ ఏడు రంగుల బెల్ట్ ల వరసక్రమం యిలా వుంటుంది.
ప్రారంభదశలో తెలుపు బెల్ట్, కొంచెం నేర్చుకున్న వారికి లేత నీలం, చాలావరకు నేర్చుకున్న వాళ్ళకి పసుపురంగు. ఈ విద్యలో నిపుణులు అయినవారికి ఆకుపచ్చ రంగు బెల్ట్ యిస్తారు. ఇంతవరకు ఒక ఎత్తు ఆపై ఒక ఎత్తు. ప్రధమశ్రేణి పొందిన వారికి బ్రౌన్ బెల్ట్ వుంటుంది...."