శ్రీధరశర్మ చెప్పినదంతా విన్నారు గౌతములు. గంభీరంగా తలూపారు. ఏమీ చెప్పలేదు.
'వెళ్ళి సహాధ్యాయులతో కలిసి విశ్రాంతి తీసుకో! నారాయణ స్మరణం చేస్తూ నిద్రపో! ప్రశాంత చిత్తంతో స్మరించు! కమ్మని నిదుర నీ కనులమీదికి వచ్చేస్తుంది! శ్రీధరా! నీది విశిష్ట జన్మ. అందుకే నిన్ను అయోధ్యాధీశుల సన్నిధికి పంపాను. సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడు నడయాడబోయే ఆ అంతపురంలో తిరుగాడుతూ తరువాతి కాలంలో లక్ష్మీదేవి రూపిణి అడుగిడబోయే ఆ సౌధాలలో తిరుగుతూ నీ జన్మ మరింత పవిత్రవంతం అవుతుంది.'
'ధన్యుణ్ణి గురుదేవా!'
'శుభం! ఈ పుణ్యఫలంగా నువ్వు శ్రీశ్రీశ్రీ భగవాన్ వేదవ్యాస మహర్షుల మహా భాగవతానికి చక్కని వ్యాఖ్యానం రచిస్తావు. ఆ అదృష్టం నీకే దక్కుతుంది. ఈ జన్మలోనో, పై జన్మలోనో అది నీ చేతనే యీ పేరుతోనే పూర్తవుతుంది. ఎప్పుడా అన్నది ఆ స్వామి కటాక్షం. నీవిక భాగవతాన్ని నిత్య పారాయణం చేయి.'
శ్రీధరశర్మ గురువులకు పాదాభివందనం చేసి విశ్రాంతికి వెళ్ళాడు.
23
పరమేష్టి చేతిలోని జపమాల కదులుతున్నది. బ్రహ్మ అంగుళులు దాన్ని కదిలిస్తున్నాయి. నాలుగు ముఖాలా నాలుగు వేదాలూ పఠిస్తున్నాడు బ్రహ్మ. సరస్వతి వీణని పలికిస్తున్నది. వీణ హఠాత్తుగా ఆగింది. చదువుల తల్లి భర్త వైపు చూసింది.
'ఏమి దేవీ! మనసులోని ఏదో ఆలోచన నీ ముఖదర్పణంలో ప్రతిబింబంలా కనిపిస్తున్నది. ఏమా ఆలోచన?'
'ప్రభూ!' మెల్లిగా అన్నది సరస్వతి. కడుపున కనకపోయినా కన్నారా కన్న సంతానం అహల్య! ఏ తల్లికయినా కొడుకుపై కన్నా కూతురిపైనే మక్కువ ఎక్కువ అనడం చతుర్ధశ భువనాల్లోనూ ప్రసిద్ధి! మన మానస పుత్రుడు నారదుడు అన్ని లోకాలూ తిరిగి వస్తుంటాడు. తన చిన్నారి చెల్లెలికి ఆర్షేయ పౌరుషాలకు తగినట్లుగా ముని తల్లజుడైన గౌతమ మహర్షిని ముడిపెట్టాడు.
'మీరు పెట్టిన నియమం, నిబంధన తనేర్పరచినవే కదా! నలుమోముల వేలుపు మానస పుత్రుడు కదా తను. అందుకే నాలుగ శిరస్సులలోని విజ్ఞానం అంతా అతని ఒక్క తలలోనే నిక్షిప్తమైందా అన్నట్లుగ తెలివితేటలు ప్రదర్శిస్తూంటాడు. సామాన్యుడా తను?'
ఆ నారదుడు వెతికి వెతికి గౌతముణ్ణి ఎన్నిక చేసి ధర్మసూక్ష్మం చెప్పి తరుణిని పట్టే తరుణోపాయం చెప్పి గౌతముడ్ని వెంట పెట్టుకుని వచ్చి దగ్గరుండి తమచేత కన్యాదానం చేయించాడు.
ఇవన్నీ తమకి తెలీదని- పునరుక్తి దోషానికి వెరవకుండా చెప్పడం లేదు. అఖిల ప్రాణి కోటిని సృష్టించడం లోనూ, వారి వారి తలరాతలు రాయడంలోనూ క్షణమైనా తీరికలేని తమకు మన కుమారుడిని గురించి ఆలోచించడం మరిచిపోయి ఉంటారని గుర్తు చేస్తున్నాను.
కుమారుడు నారదుడు ఆగమ్మ కాకిలా తిరిగిన చోట తిరక్కుండా, సకల లోకాలూ తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మచర్య దీక్షా వ్రతుడు. అఖిల సృష్టి మన సంతానం అనుకుని తృప్తిపడుతూ ఉండటం వల్ల నారదుడికి పెళ్ళీ, సంసారం, పిల్లలూ లేరనే బాధ కాస్త తగ్గినా, వేదన వేదనగానే ఉంటుంది కదా!
కానీ అహల్య విషయం అలా కాదు కదా స్వామీ! ఆడపిల్ల అడవి పిల్ల అయిపోయింది. కానక కన్న సంతానం కానకే అంకితమైంది.
అల్లుడు గారు అఖండ మేధాశాలి అయినా ఆయన నిర్మించిన న్యాయ సూత్రాలు జగద్విఖ్యాతం.
ఆయన జీవితం అవశ్యమనుసరణీయం. ఆయన ధర్మనిష్ట అప్రమేయం! అనన్య సామాన్యం! అప్రతిమానం!
కానీ నా కుమార్తెను అక్కడ ఎలా ఉన్నదీ, ఎలా జీవిస్తోంది, ఏం చేస్తోంది, ఎలా కాలక్షేపం అవుతున్నది అన్నది మీరు విచారించారా?
నా ముంజేతి చిలుక ద్వారా కొన్ని విషయాలు తెలిశాయి. ఎవరో ఎక్కడో ఏమిటో అనుకుంటూ ఉంటే అహల్య అనే మాటలు విని మన అమ్మాయి కథ కదా అని మరింత శ్రద్ధతో విని నాకు మనవి చేసింది.
అమ్మాయికి అంజన జన్మించింది. ఆ పిల్లకి ఎనిమిదేళ్ళు రాగానే అష్టవర్షాభవేత్ కన్యా అనే అజనాభ దేశ సంప్రదాయం ప్రకారం, అందునా ఆంద్ర దేశ సంప్రదాయం ప్రకారం పెళ్ళి చేశారట అంజనకి!
మన చిన్నారికి అప్పుడెప్పుడో విశ్వామిత్రమహర్షి బ్రహ్మోపదేశం చేశాడట! గౌతములు అహల్యకు చదువు సంధ్యలు నేర్పించారట! చాలా శాస్త్రాలూ అభ్యసించిందట అమ్మాయి. ఇవే కాక ఇంకెన్నో విశేషాలు అవన్నీ తమ చెవులకు వినవస్తున్నాయా? ఎనిమిది చెవులున్నా వినిపించినా వినిపించుకోనట్లే ప్రవర్తిస్తున్నారా తమరు!
బ్రహ్మ చెముడని ఆంధ్ర దేశంలో అంటారని నారదుడు చెప్పాడులే! ఎంత మొర పెట్టినా వినిపించుకోని వ్యక్తి విషయంలో అలా అంటారట! తమకు గుడి కట్టించి పూజించకపోయినా నుడి కడలిలో తమ నామధేయం సొగసుగా వినిపిస్తూనే ఉంటుంది. బ్రహ్మసౌచం, బ్రహ్మ యజ్ఞం, బ్రహ్మశ్రీ, బ్రహ్మర్షి బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ జెముడూ యిలా ఎన్నెన్నో...
'వాణీ!' ఆమె మాటలకు అడ్డొస్తూ పిలిచారాయన. ఏమిటన్నట్లు ఉంది సరస్వతీదేవి చూపు.
బ్రహ్మ చెప్పసాగాడు.
* * * *