Previous Page Next Page 
మధుపం పేజి 34


    ఆ మర్నాడు పది పన్నెండు మంది అడ మగ అమెరికన్లు, ఈ పురాణ కాలక్షేపం విషయం విని ముగ్గురు నలుగురు తెలుగు , తమిళ, కన్నడ దంపతులు వచ్చి చేరారు.
    మైఖేల్ , జాన్, జాఫ్రీ రాంగానే వాళ్ళే సోఫాలని జరిపేసి, తివాచీల మీద అందరూ కూర్చునే ఏర్పాటు చేసి, వెళ్ళేముందు అన్నీ సర్దేసి వెళ్ళేవారు. పదిరోజుల లో వారందరి దృష్టిలో కృష్ణశర్మ హీరో అయిపోయారు.
    "ఏమిటో నేనిలా చెప్పగలుగుతానని ఎప్పుడూ అనుకోలేదు. మొదలుపెట్టగానే ఒదాన్లోంచి ఓ దాన్లోకిలా ఆసువుగా మాటలు దొర్లిపోతున్నాయి" అన్నారు అయన ఆశ్చర్యపోతూ.
    "యునీవర్సిటీ లో లెక్చర్ల అనుభవం వుందిగా నాన్నగారూ - లోకల్ షణ్ముఖ శర్మ అయిపోయారు అమ్మా....." హాస్యం ఆడాడు వేణు.
    "అవునురా వేణూ , మీనాన్నకిన్ని తెలుసనీ ఇంత బాగా చెపుతారని నేను అనుకోలేదు. ఏదో ఎంతసేపు నన్ను తిట్టడం, సాధించడం కమ్మగా ఏపూట కాపూట వేడివేడిగా వందించుకుని సుష్టుగా భోచేయడం తప్ప ఇన్ని వచ్చని తెలీదురా -' సగం ఆశ్చర్యం, సగం హాస్యం మేళవించి అంది వర్ధనమ్మ.
    "అంతేమరి - పెరటి చెట్టు మందుకి పనికిరాడంటారు. మొగుడి విలువ ఇప్పటికన్నా తెలుసుకో "- కృష్ణశర్మ హాస్యం ఆడారు.
    "పోనీలే నన్నగారికింక  తోచలేదన్న బెంగాలేదీ సారి - మన ఇండియాలో మన వేదాలు, పురాణాల గురించి పట్టించుకునే వారు లేరు. ఈ అమెరికన్లు మాత్రం శ్రద్దగా మన వేదాలు, పురాణాల గురించి క్షుణ్ణంగా చదువుతున్నారు. వాళ్ళెం చేసినా క్షుణ్ణంగా శ్రద్దగా చేస్తారు - మన యోగా, మెడిటేషన్ ,ఆయుర్వేదం ఇప్పుడింత పాపులర్ ఇక్కడ. వీళ్ళకిప్పుడు ఇదో క్రేజ్ ...."
    "ఇప్పుడు మన ఇండియాలోనూ పూజలు, పునస్కారాలు, ఎక్కువయ్యాయి. మా చిన్నప్పటి కంటే. ఇదివరకు గుళ్ళు, గోపురాలు, యాత్రలలో అంతా వయసు మీరిన వారే కనపాడేవారు. ఇప్పుడు ఎక్కువ చూసినా యువతే - జీన్ ఫాంట్లేసుకుని అమ్మాయిలు, అబ్బాయిలు ప్రదక్షిణాలు చేస్తున్నారు - ' - వర్ధనమ్మ అంది నవ్వుతూ.
    "అవును మరి. ప్రతివాడికి కోరికలేక్కువాయిపోయాయి. పాపపు పనులు ఎక్కువయ్యాయి. చేసిన పాపాలు  కడుక్కోడానికి గుళ్ళచుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలను కుంటున్నారు. మర్డర్లు చేసేవారు పొద్దుటే బొట్టు పెట్టుకుని, అగరొత్తులు దేముడి పటానికి తిప్పేసి, బోట్లో కత్తులు, కటార్లు, పిస్తోళ్లు దిగేసుకు బయలుదేరుతున్నారు " - కృష్ణశర్మ విరక్తిగా అన్నారు.
    "బాగుంది - అది వాడి "దందా' అన్నమాట' - హాస్యంగా అన్నాడు వేణు.
    
                                           *    *    *    *
    "వేదభూమి అన్నపేరు ఎలా వచ్చింది ? ఇండియాలోనే వేదాలు ఎందుకు పుట్టాయి ?" మైఖేల్ సందేహం బైట పెట్టారు.
    "ఓసారి త్రిమూర్తులు ఈ వేదాలు ఎక్కడ పరిరక్షింపబడతాయి. ఎక్కడ ప్రచారం జరగాలి. మునులు, ఋషులు వేదాలు పఠించడానికి అనువైన ప్రదేశం కోసం అన్వేషించి అన్వేషించి ఆఖరుకి ఒక జంతువుని భూమ్మీదకి పంపి అది ఎక్కడ నడయాడుతుందో అదే తగిన చోటు అన్న నిర్ణయానికి వచ్చారు. ఆ జంతువు భూ ప్రపంచం అంతా తిరిగి ఇక్కడ ఆగింది. అదే అనువైన ప్రదేశం, ఋషులు, మునులు వేదపఠనాలు చేస్తూ యజ్ఞ యాగాదులు చేసే భూమి యిదే వేదభూమి అనుకున్నారట."
    ఆ వివరణకి అందరూ సంతృప్తిగా తలలాడించారు.
    "కర్మ సిద్దాంతం నమ్మాలా! చావు పుట్టుకల మర్మం అంతా భగవంతుని చేతిలో వుందని నమ్మాలా? భగనిర్ణ ప్రకారమే జరుగుతాయా?" - జాన్ అడిగాడు ఓరోజు.
    కృష్ణశర్మ నవ్వారు - "బాబూ అంత లోతుగా అలోల్చించి ఖచ్చితంగా చెప్పగలిగే జ్ఞానం లేదు నాకు. సైన్సు ఇంత వృద్ది చెందినా చావు పుట్టుకల మర్మం ఇంకా మనిషి చేతిలోకి రాలేదు గదా. అంచేత సృష్టికర్త రహస్యం భగవంతుని చేతిలో వుందనే నమ్మాలి. దీనికి ఓ చిన్న కధ చెపుతా. ఓరోజు యమధర్మరాజు ఇంద్రుడితో పనిపడి ఇంద్రలోకం వచ్చాడట. లోపలికి వెళ్ళబోతుంటే అతని దృష్టి అక్కడ చిన్న పురుగులో నూకలో ఏరుకుతినే చిన్న పక్షి మీద పడింది. యముడు కాస్త ఆశ్చర్యపడి , సాలోచనగా చూసి లోపలికి వెళ్ళాడు. ఆ పక్కనే చెట్టు మీద వాలి వున్న పెద్ద గద్ద అది చూసి యమధర్మరాజు పాపపు దృష్టి ఈ చిన్న ప్రాణి మీద పడింది. ఈ చిన్న పక్షిని కాపాడాలి అనుకుని, ఆ పిట్టని తన భుజాల మీద ఎక్కించుకుని వాయువేగంతో కొన్ని యోజనాల దూరంలో ఓ పెద్ద అడవిలో ఓ చెట్టు తొర్రలో ఆ పక్షిని ఎవరికి కనపడకుండా దాచిపెట్టి వెళ్ళిపోయింది. యముడు పని ముగించుకుని బయటికి వచ్చి ఆ చిన్న పక్షి కోసం అటు ఇటు వెతికి చూసాడు. ఇంద్రుడు ఏం చూస్తున్నావని అడిగితె - 'ఇంద్రా, ఇందాక లోపలికి వస్తుంటే చిన్నపక్షి కనిపించింది. కొన్ని క్షణాలలో ఎక్కడో యోజనాల అవతల దానికి మరణం రాసిపెట్టి వుంటే ఈ సమయంలో ఇక్కడెందుకు వుందా అని ఆశ్చర్యపడ్డాను ' అన్నాడు. అక్కడ ఆ చెట్టు తొర్రలో ఉన్న పాము పక్షిని చంపి తింది. అంటే అర్ధం అయిందా మీకు - ఎక్కడో అది చావాల్సి వుంటే దానిని రక్షించి సాయం చేసానని అనుకోని డేగ దాని చావుకు కారణభూతురాలైంది. అంటే మృత్యువు ఎప్పుడు ఎలా , ఎందుకు వస్తుందో తెలియదు కదా."
    ఈ కధ విని అంతా ఆశ్చర్యానందాలతో చప్పట్లు కొట్టారు.
    "గుడ్ గుడ్ ఎంత అద్భుతమైన సంఘటన. ఇంత చిన్న కధలో ఎంతటి భావం ఇమిడి ఉంది "- జెఫ్రీ అన్నాడు.
    "గ్రహాల ప్రభావం మానవుల మీద ఎంత వుంటుంది? రోజులు బాగాలేవు, గ్రహాలు బాగాలేవు అంటారు. నిజంగా ఆ ప్రభావం ఉంటుందా?' మరోరోజు మరొకరి సందేహం.
    "సైన్సు ప్రకారం చూసినా నమ్మాలి కదా బాబూ! పౌర్ణమి , అమావాస్యల నాడు చంద్రగ్రహ ప్రభావం సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువ అవుతున్నదని సైన్సు చెబుతుంది. సముద్రం మీదే ప్రభావం ఉన్నప్పుడు మనిషి మీద ఎందుకుండకూడదు. -గ్రహస్థితిని బట్టి మంచి చెడులు జరుగురుగుతున్నాయన్నది కొంతవరకు నమ్మాలేమో - ఇవన్నీ ఇంక నిరూపింపబడలేదు. కాని డానికి ఓ కధ చెపుతాను వినండి. అన్ని గ్రహాలలో శనిగ్రహానికి అందరూ భయపడతారు. శని పట్టిందంటే ఆ ప్రభావం చెడుగా ఎక్కువ, అప్పుడపుడు మంచి జరుగుతూందంటారు. ఓరోజు శనీశ్వరుడు తన ప్రభావం నించి మానవులే కాదు దేవతలూ తప్పించుకోలేరని సవాలు విసిరాడు. అది విని ఈశ్వరుడు నవ్వి ...." నీ ప్రభావం నామీద చూపిస్తావా , నన్నేం చెయ్యలేవు" అని ఈశ్వరుడు ప్రతి సవాల్ విసిరాడట. 'సరే రేపు సూర్యోదయం నించి సూర్తస్తామయం లోగా నా ప్రతాపం చూపిస్తాను - ' అని శని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు. శని నుంచి తప్పించుకోడానికి ఏం చెయ్యాలా అని అలోచించి శివుడు అతనికి కనపడకుండా ఎక్కడో కొన్ని యోజనాల దూరంలో ఉన్న అడవిలో, ఓ చెట్టు తొర్రలో దాగి కూర్చున్నాడు రోజంతా. సూర్యాస్తమయం అయ్యాక తిరిగి కైలాసం చేరుకుని  అప్పటికే అక్కడ ఉన్న శనిని చూసి నవ్వి, 'ఏది నన్నేం చెయ్యగలిగావు -' అని సవాల్ విసిరాడు.

 Previous Page Next Page