Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 34


    మొదట ఓ రెండు మూడేళ్ళు కాత్యాయనికి వీళ్ళు ఏదో ప్రేమ అనుకుని మోజులోపడి పెళ్ళి చేసుకున్నారు గానీ , వీళ్ళు ఎన్నాళ్ళు కాపురం చేస్తారు, కూతురు తనకంటే తక్కువ చదువు, సంపాదన వున్న మొగుడితో సర్దుకుంటుందా అన్న అనుమానం వుండేది ......... ఓ తల్లిగా కూతురు సంసారం చక్కగా వుండాలని వున్న అంతరాంతరాలలో ఎక్కడో మైక్ తో విడిపోయి మంచివాడ్ని పెళ్ళి చేసుకుంటే బాగానే వుంటుంది.....ఈ రోజుల్లో డైవోర్సులు , అందులో అమెరికాలో యివన్నీ ఎవరు పట్టించుకుంటారు అన్న ఊహ వుండేది అల్లుండంటే వున్న చిన్న చూపువల్ల.
    కాని రోజులు గడుస్తున్న కొద్ది మైక్ మంచితనం, సంస్కారం, ప్రతీక్ష పట్ల అతని ప్రేమ.....ప్రతీక్ష ఆస్పత్రి పనులలో సతమతమవుతుంటే మగవాడ్ని అన్న అహంకారం లేకుండా యిల్లంతా తనే చక్క పెట్టుకుంటూ, వంట దగ్గర నుంచి అన్ని తానే చూస్తూ ప్రతీక్ష ని పువ్వుల్లో పెట్టి పూజించడం చూసి ఆశ్చర్యంతో పాటు మనసులో అభినందించ కుండా వుండలేకపోయింది. మొదట్లో చిన్న ప్లాట్ లో వుండేవారు. తాము ఏది యిస్తానన్నా మర్యాదగా తిరస్కరించి ఒక్కొక్కటి వాళ్ళ సంపాదనతో అమర్చుకుని, నాలుగేళ్ల లో మంచి ఇల్లు, కార్లు అన్ని అమర్చుకున్న వాళ్ళని అభినందించుకుంది కాత్యాయని. పిల్లలు పుట్టుకోచ్చాక మైక్ పగలంతా పిల్లలని ఏ ఆడవాళ్ళు చూసుకోనంత చక్కగా చూసేవాడు. పిల్లలకోసం బేబి సిటింగ్ చేయడానికి ఉద్యోగం మానేశాడు. ఆ యింట్లో ప్రతీక్ష మగాడిలా సంపాదిస్తుంటే అతను ఇల్లు నడిపేవాడు. ప్రతీక్ష రాత్రి యింటికి వచ్చేవరకు డిన్నరు కూడా తినకుండా ఎదురు చూసేవాడు. అలా అని ప్రతీక్ష భర్తని తక్కువ చేయడం నిర్లక్ష్యంగా ప్రవర్తించడం , లోకువగా చూడడం, కాత్యాయని ఎప్పుడూ చూడలేదు. ఉదయం లేచి బ్రేక్ ఫాస్ట్ రెడి చేసి, పిల్లలకి కావల్సినవి తయారు చేసి ఫ్రిజ్ లో పెట్టి వెళ్ళేది ప్రతీక్ష -- రాత్రి యింటికి వచ్చాక పిల్లలని చూసుకునేది. వాళ్ళిద్దరి మధ్య అండర్ స్టాండింగ్, అన్యోన్యత చూసి - ఓసారి ప్రతీక్ష ఇదే ఏ తెలుగబ్బాయినో చేసుకుంటే యింతలా మగాడినన్న యిగో లేకుండా, ఆడపని మగపని అని కాకుండా ప్రతీక్షకి సాయపడేవాడా అనిపించింది. బట్టలు యిస్త్రీ, దగ్గిర నించి, ప్లంబింగ్, కార్పెంటరీ , గార్డెనింగ్ దగ్గర నించి అన్నీ చేసే మైక్ ని చూసి నప్పుడల్లా అదే అనిపించేది కాత్యాయనికి. కూతురికి పురుడు పోయడానికి రావడం పేరుకి మాత్రమే. మిగతాదంతా తనవి కూడా కూర్చోపెట్టి అల్లుడు చేస్తుంటే ఓ మూడేళ్ళలోనే కాత్యాయని అల్లుడి పట్ల అభిప్రాయం మార్చుకుని మైక్ ని మనస్పూర్తిగా గౌరవించడం , అభిమానించడం నేర్చుకుంది.

                                            *    *    *    *

    ప్రతి ఏడు సమ్మర్ లో ఒక నెల కూతురింట్లో వుండడం అలవాటు కాత్యాయనికి. మూర్తికి - మనవలతో గడపడం కోసం డాక్టరు మూర్తి పనులన్నీ పక్కన పెట్టి వచ్చేవాడు.
    "మమ్మీ- ఇవాళ మా హాస్పిటల్ కి ఓ బర్న్ కేసు వచ్చింది. ఆ అమ్మాయి ఇండియన్, మన తెలుగు పిల్లే - పాపం ముప్పై ఏళ్ళు లేవు. సుయిసైడ్ కమిట్ చేసింది. రాత్రి డిన్నరు టేబిల్ దగ్గిర అంది ప్రతీక్ష . "అయ్యో, ఎవరమ్మాయి , ఎందుకలా చేసింది యిక్కడెం చేస్తుంది , పెళ్ళయిందా ?' ఆరాటంగా ప్రశ్నలు కురిపించింది కాత్యాయని.
    "పెళ్ళి కాక పోవడం ఏమిటి? యిద్దరు పిల్లలు కూడాను. ఆ మొగుడు ఆ రాస్కెల్ ఆమె చావుకి కారణం. అమ్మాయి డాక్టరేట. భర్తతో పడక , ప్రాణం విసిగి సూసైడ్ చేసుకుంది."
    "డాక్టరయివుండి మొగుడితో పడకపోతే డైవర్సు తీసుకోకుండా చావడం ఏమిటి - పిచ్చి పిల్లలా వుంది. అమెరికాలో వుండి, చదువుండి కూడా యిలా చెయ్యడం ఏమిటి?"
    "ఏం చేస్తుంది మమ్మీ - పెళ్ళయిందగ్గర నుంచి కాల్చుకు తినేవాడట. అమెరికాలో వున్న అమలాపురం లో వున్న చాందసుడిలా బిహేవ్ చేస్తూ అడుగడుగునా మగ అహంకారం చూపిస్తూ, తనకంటే ఆమె మంచి ఉద్యోగం, సంపాదన ఎక్కువ అన్న మగ ఇగోతో అనుక్షణం అనుమానాలతో ప్రాణాలు తీసేవాడట. వాడితో మాట్లాడావు, వీడితో నవ్వావు అంటూ యింట్లో చాకిరి అంతా ఆమె చెయ్యాలని నానా రకాలుగా పెట్టె హింసని భరించింది. ఆఖరికి ప్రాణం విసిగి డైవోర్స్ తీసుకుంటానంటే పిల్లలని యివ్వనని , డైవోర్స్ యివ్వనని భయపెడితే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది - డైయింగ్ డిక్లరేషన్ యిచ్చింది చచ్చిపోతూ - వెధవకి జైలు ఖాయం ."
    "ఎవరా దరిద్రుడు --- మన తెలుగు వాడంటున్నావు. మనకు తెలిసినవాళ్ళా?"
    ప్రతీక్ష నవ్వింది. 'ఎవడో కాదు మమ్మీ. నీకు అల్లుడు కావాల్సినవాడు. నా అదృష్టం కొద్ది వాడి పాలపడకుండా తప్పించుకున్నాను. నీవు అపురూపంగా నాకోసం ఎంచిన డాక్టరు పెళ్ళికొడుకు -- వాడ్ని చూడగానే అన్పించింది ఎక్కడో చూసినట్టు, వివరాలు తెలిశాక "మైగాడ్ అనుకున్నాను."
    కాత్యాయని మొహం తెల్లపడింది. కలవరంగా కూతురి వంక చూసింది తల్లి పాలిపోయిన మొహం చూసి ప్రతీక్ష నవ్వుతూ - "ఏమిటి మమ్మీ అలా అయిపోయావు. నీ కూతురు సూసైడ్ చేసుకుందన్నట్టూ - వాడు నీ అల్లుడు కాదుగా, అల్లుడు కాబోయి తప్పిపోయాడు -"
    "అసలు నన్నడుగుతే మన ఇండియాలో ప్రతి అబ్బాయినీ ఓ ఏడాది రెండేళ్ళు అమెరికా పంపాలంటాను. ఇక్కడికి వచ్చి కష్టపడి చదువుకుంటూ తన పని తాను చేసుకుని, వండుకుని తిని "డిగ్నిటీ ఆఫ్ లేబర్" అంటే అర్ధం అయి ఆ "మేల్ ఇగో" చావాలంటే ప్రతి అబ్బాయినీ ఇక్కడ ట్రైనింగ్ కి అన్నట్లు పంపాలి. అడ మగ సమానం అన్నది అర్ధం కావాలంటే యిక్కడోచ్చి వుండాలి. మన కుర్రాళ్ళకి ఉద్యోగానికి ముందు ఓ ఏడాది మిలట్రీ ట్రైనింగ్ , పెళ్ళికి ముందు అమెరికా ట్రైనింగ్ యిప్పిస్తే గాని యీ మగాడి జులుంలు, ఇగోలు వదలవు - యీ విషయంలో మనం అమెరికన్స్ ని చూసి ఎంతన్నా నేర్చుకోవాలి " ప్రతీక్ష అంటున్న మాటలకి అప్రయత్నంగానే తల ఆడించింది కాత్యాయని.

                                                           (అంధ్ర జ్యోతి న్యుజర్సీ పోటీ బహుమతి కధ 1993)***

 Previous Page Next Page