అమెరికన్ అల్లుడు
కాత్యాయిని ఈ ఏడాది ఎలాగన్నా కూతురి పెళ్లి చేసేయాలని పట్టుదలగా వుంది.
ప్రతీక్ష ఎం.బి.ఎస్. పరీక్షలయి వస్తుంది. మళ్ళీ యింటర్నల్ షిప్ మొదలయ్యేలోగా ఇండియా వెళ్ళి పెళ్ళి చేసి తీసుకు రావాలని ఆరాట పడ్తోంది. కూతురి పెళ్ళి విషయం భార్య మీద వదిలేశాడు డాక్టర్ మూర్తి.
ఆయనకి ఇల్లు, హాస్పిటల్ తప్ప మరో లోకం లేదు. ఏనాడో యింటి బాధ్యత, పిల్లల బాధ్యత కాత్యాయని మీద వదిలేశాడు అయన. కూతురికి యిరవై మూడు నిండుతున్నాయి. ఇప్పుడు గనక అవకపోతే మళ్ళీ మూడేళ్ళ వరకు హౌస్ సర్జన్సీ అయ్యేవరకు దానికి తీరికుండదు. అని ఆవిడ తొందరపడ్తుంది. ఇండియా నించి అన్నగారు సూచించిన కొన్ని సంబంధాలలో కాత్యాయనికి రెండు మూడు బాగా నచ్చాయి. యిద్దరబ్బాయిలు డాక్టర్లు , ఒకడు ఇంజనీరు. కుటుంబాలు మంచివి. తమ హోదాకి సరిపోయినవి. అబ్బాయిలూ స్మార్ట్ గానే వున్నారు. ఈ మూడింటిలో కూతురికి ఏది నచ్చితే అది చేసేయాలి. అని ఆవిడ ఉద్దేశం. తాము అమెరికన్ సిటిజన్స్ "కనక డాక్టరు చదివిన అబ్బాయిలు యిలాంటి సిటిజన్ షిప్ వున్న అమ్మాయిలని పెళ్ళాడి అమెరికా రావాలని ఆరాట పడ్తుంటారు గనక తన కూతురికి అనేక సంబంధాలు వచ్చాయి - ప్రతీక్ష అందగత్తె కాకపోయినా చక్కని కనుముక్కు తీరు, స్మార్ట్ అండ్ ఇంటిలిజెంట్ గర్ల్ - యిక్కడ డాక్టరు సీటు దొరికిందంటేనే ఆ సంగతి తెలుస్తుంది. తన కూతురి విషయంలో అబ్బాయిలకు తన కూతురు నచ్చడం కాదు తన కూతురు వాళ్ళకూ నచ్చాలి - ముందు తామిద్దరూ వెళ్ళి ఏదో ఒక సంబంధం ఫిక్స్ చేసి ఫోను చెయ్యగానే భర్త, కొడుకు ప్రతీక్ష వచ్చేట్టు ఏర్పాటు చేసి ఇండియాకి టిక్కెట్టు కూడా బుక్ చేసేసింది కాత్యాయిని.
కూతురి శలవలకి రాగానే రాత్రి ఇండియా ప్రయాణం విషయం ఎత్తింది. ఇన్నాళ్ళూ కూతురెక్కడ ఏ అమెరికన్నో, యింకేవర్నన్నా చేసేసుకుంటుందేమో నన్న భయం కాత్యాయానికి వున్నా మెడిసన్ కాకుండా ఎలా చెయ్యడం అని ఆలోచించింది. చెప్పినా చదువు మధ్యలో కూతురు వప్పుకోదని తెల్సు గనక కూతురు అలాంటి పని యిప్పటివరకు చెయ్యనందుకు దేముడికి నమస్కారం పెట్టుకుంది ------- పిల్లలు అమెరికాలో పుట్టి, పెరిగినా వాళ్ళని ఇండియన్స్ గానే పెంచారు కాత్యాయనీ మూర్తీ ----- యింట్లో తెలుగు మాట్లాడడం, వీలయినప్పుడల్లా పిల్లలని ఇండియా తీసికెళ్ళడం, తెలుగు పాటలు, తెలుసు సినిమా క్యాసెట్లు చూపడం, యింట్లో పూజలు, వ్రతాలు, పండుగలు, పట్టుచీరలు, తెలుగు పిండివంటలు అన్నీ చేస్తూ అమెరికాలో ఉన్న తెలుగు జీవితమే పిల్లలకి చూపించారు --- అయితే అక్కడే పుట్టి అక్కడే చదువుతున్న వాళ్ళకి ఆ బాష, ఆ దేశం, ఆ స్నేహితులు, ఆ ఇన్ ఫ్లూయన్స్ తప్పనిసరి అవుతుంది. గనక పిల్లలు బయట అమెరికన్స్ లాగ, యింట్లో ఇండియన్స్ లాగే ప్రవర్తించేవారు. కూతురికి పెళ్ళీడుకొచ్చాక తమ మాట కాదనదన్న ధైర్యంతోనే కూతురిని సంప్రదించకుండానే పెళ్ళి కొడుకుల వేట మొదలుపెట్టి, పెళ్ళిచూపుల వరకూ ఏర్పాటు చేసింది కాత్యాయని. తల్లి అందించిన ఫోటోలు చూసి, చెప్పింది విని ప్రతీక్ష తెల్ల పోయింది. తన వెనక, తనకు చెప్పకుండానే యిన్ని ప్రయత్నాలు చేసిన తల్లికి తన మనసులో మాట చెప్పే సమయం వచ్చిందని గ్రహించి చెప్పేసింది. కూతురు అతి మాములుగా చెప్పిన మాట కాత్యాయనికి నెత్తిన పెద్ద బాంబు బద్దలయినంత షాకు, ఒక రకం అచేతన స్థితి కల్గింది. కళ్ళు పెద్దవి చేసి, మాటరాక అలా వుండిపోయింది. రెండు నిమిషాలు "ఏమిటి ....నీవు .....నీవు, ఆ మైక్ ని పెళ్ళాడుతావా ----వాడు .....వాడు .....అండర్ గ్రాడ్యూయేట్ , డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో పనిచేసే మైక్ ని పెళ్ళాడతావా .....' నోట్లోంచి మాటలు పెగల్చుకుని అనగల్గింది ఆఖరికి.
"ఏమిటి మమ్మీ .....వాట్స్ రాంగ్ విత్ యూ" చాలా తేలిగ్గా అంది ప్రతీక్ష తల్లి వంక చూసి. "నేనేదో అంతరిక్షానికి వెడతానన్నంత షాక్ అయ్యావు ....మైక్ ని పెళ్ళాడుతానంటే, అతనేదో మనిషి కాదు అన్నంత బెంబేలు పడ్తున్నావు.....వాట్స్ రాంగ్ విత్ హిమ్....".
కాత్యాయని మొఖం కోపంతో ఎర్రబడిపోయింది. మాట వణికింది. "వాట్స్ రాంగా! యింకా అడుగుతున్నావా.....వాడు.....వాడు.....అతను ఇంత చదివి....చదువు సంధ్యలేని, ఓ కొట్లో లెక్కలు రాసేవాడిని .....ఆప్ట్రరాల్ వారానికో వందో రెండు వందల డాలర్లు సంపాదించే వాడిని చేసుకుంటానంటూ యింకా వాట్స్ రాంగ్ అంటావా.....మనం ఇండియన్స్ అతను అమెరికన్ అన్నది అటుంచి, అన్నీ వుండి.....ఓ చదువు సంధ్య లేనివాడిని చేసుకుంటావా ....' కోపంతో మాటలు తడబడ్డాయి.
"ఏమిటి మమ్మీ ....మైక్ ఇంజనీరింగు లు, డాక్టరేట్ లు చదవకపోవచ్చు --- హీయిజ్ పిన్ ఎడ్యూకేటేడ్ , కల్చర్డ్ పెర్సన్, సమ్ హౌ ఐ లైక్ హిమ్ .....గోళ్ళు ట్రిమ్ చేస్తూ నిమ్మకు నీరెత్తినట్టు అంది ప్రతీక్ష.
తరువాత కాత్యాయని ఎంత గొడవ చెయ్యాలో అంత చేసింది. నెత్తి నోరు కొట్టుకుంది. "నీకిదేం ఖర్మ, రాత అంటూ బెంబేలు ఎత్తిపోయింది.....మంచిగా చెప్పింది------ అరిచింది-----తిట్టింది . ముందేందుకు చెప్పకుండా దాచావు అని ఎగిరింది. "ఏదో నీ ఫ్రెండు సుజాన్ అన్నయ్య చిన్నతనం నించి అంతా ఫ్రెండ్స్ , కల్సి తిరుగుతున్నారు అనుకున్నాం గాని, నీవింత పనిచేస్తావా, ఆ పనికిమాలిన వాడిని కట్టుకుని ఏం సుఖపడ్తావే, అమెరికన్ అయినా పోనీ చదువు ఉద్యోగం వున్నవాడైతే పోనీ అనుకునేవాళ్ళం, మన స్టేటస్ ఏమిటి, వాడు మా అల్లుడవుతే తల ఎలా ఎత్తుకు తిరగగలమే.....పోనీ మా సంగతి అలా వుంచు', నీవెలా బతుకుతావే ........ ఇన్నాళ్ళు యీ విషయం దాచి మమ్మల్నిలా మోసం చేస్తావా , ఎన్నాళ్ళ నించే యిదంతా జరుగుతుంది ....." ఆగకుండా అరించింది కాత్యాయని. తల్లి అరిచినంత సేపూ వూరుకుంది . "మమ్మీ --నీవెంత అరిచినా నా నిర్ణయం మారదు ----- నాకు మైక్ అంటే చిన్నప్పట్నించి యిష్టం . అతను అట్టే చదువుకోకపోవచ్చు -----కాని అతనంత వెల్ మేనర్డ్ మగాడ్ని నేనింతవరకు చూడలేదు ------వాళ్ళు మనంత గొప్పవాళ్ళు కాకపోవచ్చు ------కాని సంస్కారం గౌరవ మర్యాదలున్న కుటుంబం. అతను నేనంటే ప్రాణం యిస్తాడు. అతనట్టే సంపాదించలేడు నిజమే, కాని డాక్టరునయి నే సంపాదిస్తాను కనక మా సంసారానికేం లోటుండదు. ఇన్నాళ్ళు మీకెందుకు చెప్పలేదంటే నా మెడిసన్ అయ్యాక గాని పెళ్లి చేసుకోం, మీరెలాగూ అంగీకరించరు. అప్పుడు నాకు ఆర్ధిక స్వాతంత్యం వుంటుంది కనక పరవాలేదని ఆలోచించాను. నీవు నాకు సంబంధాలు చూస్తున్నట్టు చెప్పి వుంటే అపుడే వద్దని చెప్పేదాన్ని అంచేత నన్ను బ్లేమ్ చేయకు" అని చెప్పదలచింది అయిపోయినట్టు అక్కడి నించి వెళ్ళిపోయింది ప్రతీక్ష. రాత్రి భర్త చేత చెప్పించింది. తల్లి తండ్రి ఎన్ని విధాలుగా చెప్పినా ప్రతీక్ష పట్టుదల విడవలేదు ---- ఆఖరికి కూతురి అబీష్టానికి తల ఒగ్గక తప్పలేదు ఆ తల్లి తండ్రికి.
* * * *
ప్రతీక్ష పెళ్ళయి ఆరేళ్ళు అయింది. నాలుగేళ్ళ కూతురు, రెండేళ్ళ కొడుకు- పిల్లలిద్దరు తండ్రి రంగుతో, పోలికలతో చాలా అందంగా వుంటారు. మనవలంటే ప్రాణం కాత్యాయనికి. ప్రతీక్ష డాక్టరయి రెండు చేతులతో సంపాదిస్తుంది. బోస్టన్ లో నాలుగు బెడ్ రూముల ఇల్లు కింద బేస్ మెంట్, గార్డెను, రెండు కార్లు, స్వేమ్మింగ్ ఫూల్, దేనికీ లోటు లేదు ప్రతీక్ష కి -----కూతురు కాపురం చూసి యిప్పుడు కాత్యాయనికి ఏ బాధ లేదు.