ఈ దేశంలో ఆడది
జయంతి బస్సు దిగి గబగబ యింటివైపు అడుగులు వేయడం మొదలు పెట్టింది. ఈరోజు రోజూకంటే గంటాలశ్యం అయిపొయింది. కనుచీకటి పడిపోతుంది. అప్పుడే, పిల్లలు పాపం ఏం చేస్తున్నారో, యింకా రాలేదని బెంగ పడ్తున్నారేమో . మొదటి బస్సు తప్పిపోయింది, రెండో బస్సు వచ్చేసరికి అరగంట పట్టింది. యింటికి తొందరగా చేరాలన్న ఆరాటంతో పరిగెత్తినట్టే నడుస్తుంది జయంతి. పిల్లలు నాలుగున్నరకే రోజూ వస్తారు. ఆమె యిల్లు చేరేసరికి ఐదున్నర ఆరు మధ్య అవుతుంది. స్కూలు వదిలాక రెండు బస్సులు మారి రావాలంటే ముప్పావుగంట తక్కువ పట్టదు. పిల్లల కోసం కటాకటాల వరండాలో హార్లిక్స్ సీసాలో పాలుపోసి, రెండు ప్లాస్టిక్ గ్లాసులు , ఒక నీళ్ళ సీసా , యిద్దరికీ చెరో రెండు బిస్కెట్లు గాని, బ్రెడ్ ముక్కలు గాని ఉదయం వెళ్ళేటప్పుడు పెట్టి వేడ్తుంది. పిల్లలు వీధి తాళం తీసుకుని వరండాలో పెట్టినవి తిని చుట్టుప్రక్కల పిల్లలతో ఆడుకుంటూ వుంటారు.
జయంతి ఇల్లు చేరేసరికి రోజు మాదిరి పిల్లలు ఆడుకోకుండా వరండా ముందున్న మెట్ల మీద కూర్చున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎవరో వ్యక్తీ కూర్చున్నారు. కను చీకట్లో దగ్గరికి వచ్చ్రే వరకు గుర్తుపట్టలేక పోయింది జయంతి. గుర్తు పట్టగానే స్థాణువులా నిలబడిపోయింది. 'అమ్మ వచ్చేసింది నాన్నా అమ్మ వచ్చేసింది . అమ్మా నాన్న వచ్చారు.' పిల్లలిద్దరూ లేచి నిలబడి తల్లి దగ్గరకు పరుగెత్తి సంతోషంగా చెప్పారు. జయంతి కాళ్ళలో శక్తి పోయినట్టు ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయింది. ఈ మనిషి ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు? రెండేళ్ళ క్రితం నిర్ధాక్షిణ్యంగా బాధ్యతారాహిత్యంగా వున్న పాటున చెప్పాపెట్టకుండా తన ఖర్మానికి తనని వదలి వెళ్ళిన యీ మనిషి రెండేళ్ళ తరువాత హటాత్తుగా యిలా ఎందుకు వచ్చాడు? ఆమె శరీరం అంతా కోపంతోనూ, బాధ ఆవేదనతోనూ కంపించింది. "గెటౌట్ , పో బయటకు వెంటనే" అని అరిచిందా అరవలేదు. అరవాలనిపించింది. కానీ నోట్లోంచి మాట రాలేదు. నెమ్మదిగా అతను ముందుకు వచ్చాడు. "జయా నేనే. అలా చూస్తున్నావేమిటి. వచ్చి అప్పుడే గంట అయింది. నీవింత ఆలశ్యంగా వస్తావనుకోలేదు" అన్నాడు. రోజూ భార్య స్కూలు నుంచి వచ్చినప్పుడు పలకరించినంత మాములుగా , రెండేళ్ళ తరువాత వచ్చిన మనిషి పలకరించాడు. ఏం జరగనట్టు అంత నిర్వికారంగా, మాట్లాడుతున్న అతన్ని చూసి తెల్లబోయింది. నెమ్మదిగా కాలు చేయి కూడదీసుకుని మాట్లాడకుండా బ్యాగు లోంచి తాళం తీసి తలుపు తెరిచింది. లైటు వేసింది. ఆ లైటు వెలుగులో గుమ్మానికి అడ్డుగా నిలబడి "ఎందుకు వచ్చారు!" కఠినాతి కఠినంగా ప్రశ్నించింది. అతని వంక తిరిగి, పిల్లలిద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ ప్రశ్నకి ఎదురు చూడనట్టు అతను తడబడి "అదేమిటి..... నిన్నూ పిల్లలని చూద్దామని.....' ఏదో చెప్పబోయాడు.
"చూశారుగా యింక వెళ్ళండి" మళ్ళీ కఠినంగా అంది.
"అదికాదు జయా చూడ్డానికి కాదు.చూడ్డానికేమిటి , నా వాళ్ళున్నారని వచ్చాను. ఏం తప్పా. రాకూడదా, యిలా మాట్లాడుతున్నా వేమిటి?' నవ్వాలని ప్రయత్నించాడు. జయ నవ్వలేదు. తీక్షణంగా అతని వంక చూసింది. "మీవాళ్ళు.....ఎవరూ మీ వాళ్ళు ? మెడలో తాళికట్టి పదేళ్ళు కాపురం చేసిన భార్యని, పసికందులనైనా ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా , భాద్యతారహితంగా, పిరికి పందలా చెప్పనైనా చెప్పకుండా వదలి పారిపోయిన నాడే వాళ్ళు మీ వాళ్ళు కాదు. ఇంకా రెండేళ్ళ తరువాత యింకా మీ వాళ్ళుగా మిగులుతారని ఏం మొహం పెట్టుకు ఆశించి వచ్చారు!"
"జయా! నేను నిన్ను కట్టుకున్న మొగుడిని. వాళ్ళు నా పిల్లలు అని మర్చిపోయినట్లున్నావు. గుమ్మంలోకి వచ్చిన మనిషితో మాట్లాడవలసిన తీరు యిదేనా, మంచి మర్యాద లేకుండా యిలా నిలబెట్టి ' కోపం ధ్వనించింది అతని గొంతులో. "మంచి మర్యాద....అవి మానవత్వం వున్న మనుషులకి. అవి మర్చిన మీలాంటి అధములకి కాదు. భర్త అంటే భరించే వాడు. భరించకుండా భారం భార్య మీద మోపి పారిపోయిన వాడు భర్తేలా అవుతాడు. మీకు నాకు యింక ఏ సంబంధం లేదు. దయచేసి మీరు వెళ్ళొచ్చు. రెండేళ్ళనాడే మీరు నాకు లేనివారితో సమానం, వెళ్ళండి. మా ఖర్మానికి మమ్మల్ని వదలి దయచేసి వెళ్ళండి. మాకు మీకు యింకే సంబంధం మిగలదు "వెళ్ళండి......వెళ్ళిపొండి' అరిచింది జయ. అతని మొహం ఎర్రబడింది. కళ్ళల్లో అవమానం, క్రోధం, ఆడదాని చేత , కట్టుకున్న పెళ్ళాం చేత అంత అవమానపడటం అతని అహంకారం మీద దెబ్బ తీసింది. "నీవు సంబంధం లేదంటే పోవడానికి యిదెం బొమ్మల పెళ్ళి కాదు! నీవు నేను విడాకులు పుచ్చుకునే వరకు నేను నీ మొగుడినే. వీళ్ళు నా పిల్లలే. నా హక్కుని లేదనేటందుకు నీకు హక్కు లేదు." గర్వంగా యిప్పుడెం చెపుతావు అన్నట్టు తల ఎగరేశాడు. జయంతి అతని వంక తిరస్కారంగా చూసింది.
"రవీ, స్వర్ణా మీరిద్దరూ అంటీ యింటికి వెళ్ళి కాసేపు ఆదుకోండి నేను పిలిచేవరకు" అంది పిల్లలిద్దరితో . పిల్లలిద్దరూ బయటికి వెళ్ళాక "మిస్టర్ సూర్యారావు ఒక ఆడదాని మోజులో కట్టుకున్న దాన్ని వదలి పిల్లలని వదలి వెళ్ళిన నీవు ఆ ఆడది తన్ని తగలేస్తేనో లేక ఆ మోజు తీరగానే మళ్ళీ భార్య దగ్గిరకి చేరడానికి సిగ్గు లేదూ నీకు, నీవు ఒక మగవాడివయితే మళ్ళీ నా దగ్గరికి రావు. నన్ను బెదిరించి నీ జులుం సాగించాలనుకోకు. ఎటువంటి పరిస్థితిలోనూ నేను నిన్ను భర్తగా అంగీకరించను, అండర్ స్టాండ్. అంచేత నీ హక్కులు నీవు పొందాలనుకుంటే కోర్టు కెక్కు అంతేగాని, యీ గుమ్మంలో నిలబడి నన్ను బెదిరించాలని మాత్రం చూడకు. నీవు చేసిన పనికి నా హృదయంలో ఓ సున్నితపు పొర చిరిగిపోయింది. ఈ రెండేళ్ళు నేపడిన కష్టాలతో, సమస్యలతో, బాధలతో నా హృదయం బండబారింది. ఇప్పుడు వంటరిగా యీ లోకంలో ఏ యిబ్బందినైనా ఎదుర్కోగల మనస్తైర్యం సంపాదించుకున్నాను. అంచేత యిక నీ బెదిరింపులకి బెదరను . ఒక ఆడది కట్టుకున్న భర్తని, తన పిల్లలు తండ్రిని యింతలా ఎహ్యించుకుని యిలా మాట్లాడిందంటే ఆమెని ఆ భర్త ఎంతలా దెబ్బ తీసాడో, ఎంత మోసం చేసి ఆమెని గాయపరిచాడో ఎవరికన్నా అర్ధం అవుతుంది. నీకు అర్ధం కాక వచ్చావో, అర్ధమయి వేరే దారి లేక వచ్చావో నాకనవసరం. పోయిన మనశ్శాంతి యిప్పుడిప్పుడే పొందుతూ శాంతిగా బతుకుతున్న నా జీవితంలోకి మళ్ళీ రావాలని ప్రయత్నించకు. వెళ్ళు ప్లీజ్ గో ఎవే...." తీవ్రంగా అంది. ఆమె మొహంలో కనపడిన స్థిర నిశ్చయానికి , ధైర్యానికి అతను మనసులో కాస్త జంకాడు.


