సాయంత్రం ప్రభాకరం యింట్లో ఫలహారం చేసి, ప్రభాకరం, అతని అక్క సుగుణ బలవంత పెడితే, సరోజ వారిద్దరితో కలిసి సినిమాకి వెళ్ళింది. సుగుణ సరోజని చూసి చాలా సంబరపడి మెచ్చుకుంది. ముగ్గురూ కలిసి నడిచి సినిమాకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ సినిమా ఎంజాయ్ చేశారు.
ఇంటర్వెల్లో లైట్లు గప్పున వెలిగాయి. ముందు వరుసలో కూర్చున్న గీతని, ఆమె తల్లి తండ్రులని చూసి ఉలిక్కిపడింది సరోజ - అదే సమయంలో ప్రభాకరం చూశాడు. వీళ్ళగొంతులు విని గీత వెనక్కి తిరిగి చూసి గతుక్కుమంది. వెనక్కి తిరిగిన గీతని, ఆమె ప్రక్కన కూర్చున్న తల్లితండ్రులని సుగుణచూసి చటుక్కున ఏదో గుర్తువచ్చి సంతోషంగా ముందుకు వంగి గీత భుజం మీద చెయ్యివేసి ఆప్యాయంగా "ఏమ్మా! మీరీ వూర్లో వుంటున్నారా? మరిచిపోయావా? గుర్తులేనా?" అంటూ పలకరించింది. గీత మొహం వెల వెల పోయింది. వెనక్కు తిరిగిన రంగారావు, అన్నపూర్ణల మొహం పాలిపోయింది. ప్రభాకరం, సరోజని, సుగుణని చూస్తూ ఒక్కక్షణం అచేతనులయ్యారు.
"ఏమండీ అలా చూస్తున్నారు. మరిచిపోయారా అప్పుడే? మా నర్సింగ్ హోములో..."
"మీరు...మీ రెవరు?" రంగారావుగారు గాభరాగా అన్నాడు. ఆయన నుదురంతా చెమటపట్టింది.
"అదేమిటండీ! నేను నర్స్ సుగుణని, మా కమలా దేవి నర్సింగ్ హోములో మీ అమ్మాయికి-" సుగుణ ఏదో చెప్పబోయేంతలో రంగారావు "క్షమించాలి-మీరు ఎవరినిచూసి ఎవరను కుంటున్నారో. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు నేను-" తుంచేసినట్లు అని ఆయన మొహం తిప్పేసుకున్నాడు. ఆ తిరస్కారానికి సుగుణ మొహం చిన్నపోయింది.
సరోజ ప్రభాకరం తెల్లపోతూ మొహాలు చూసుకున్నారు. అంతలో లైట్లు ఆరిపోయాయి. సినిమా మొదలయింది. లైట్లారాగానే గీత రంగారావు భార్య ముగ్గురూ లేచి బయటికి వెళ్ళిపోయారు. అది చూసి సరోజ, ప్రభాకరం మరింత ఆశ్చర్య పోయారు. "అక్కా-నీకు వాళ్ళు తెలుసా?" నెమ్మదిగా అడిగాడు ప్రభాకరం. "తెల్సురా...వాళ్ళ అమ్మాయికి మా నర్సింగ్ హోమ్ లో పురుడుపోశాను. యింతలో ఎలామరిచిపోయారు నన్ను, నేనెవరో తెలియదన్నారు." నొచ్చుకుంటూ అంది.
ప్రభాకరం ఆ మాట విని చకితుడయి పోయాడు సరోజ దిగ్భ్రాంతితో చూసింది.
"ఎవరూ...ఆ అమ్మయికా నీవు పురుడుపోసావు?" నమ్మలేనట్టు అడిగాడు.
"అవునురా....పురుడు పోసాను - కొడుకు పుట్టాడు....బాగా డబ్బున్న వాళ్ళు - నాకు, మా డాక్టరుకి బాగా ఫీజు ముట్టచెప్పారు. అల్లుడు ఫారెన్ లో వున్నాడట. యిప్పుడీ వూరు వచ్చినట్లున్నారు..." సరోజ, ప్రభాకరం మొహం లోకి చూసింది. ఆ కొద్దిపాటి వెలుగులోనే అతని మొహం నల్లగా మారడం గమనించింది.
"అక్కా....ఆ పిల్లాడు....ఆ పిల్లాడు...." ఏమడగాలో తెలియలేదు ప్రభాకరంకి.
"ప్చ్-పాపం నాలుగు రోజుల తర్వాత పోయాడురా. పండులా వుండేవాడు. ఎలా పోయాడో నా కాశ్చర్యం. నర్సింగ్ హోమ్ లో వున్న మూడు రోజులు నిక్షేపంలా వున్నాడు మూడోరోజు యింటికి తీసికెళ్ళారు. నాలుగో రోజు పోయాడట హఠాత్తుగా..."
సరోజ, ప్రభాకరం అర్ధవంతంగా చూసుకున్నారు. వీళ్ళ మాటలు విని అందరూ చిరాగ్గా తలలు తిప్పి చూశారు. దాంతో అప్పటికి యింకేం మాట్లాడలేదు ఎవరూ. ఆ తర్వాత ప్రభాకరం యింక సినిమా చూడలేక పోయాడు-అతని మనసంతా అల్లకల్లోల మయింది- సరోజ కూడా ఆ మాట విని ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. తన కెందుకు అని ఎంత మనసు సరిపెట్టుకుందామన్న ఆమె మనసంతా పాడయింది.
సాయంత్రం ప్రభాకరం యింటికి వెళ్ళి కాసేపు సరదాగా కబుర్లు చెప్పి వచ్చేద్దామనుకున్న సరోజ-ప్రభాకరం బలవంతం మీద వాళ్ళతో సినిమాకి బయలుదేరక తప్పలేదు. యిలా సినిమాకు రావటం, అటు గీతవాళ్ళు రావడం - ప్రభాకరం అక్కే గీతకి కాన్పు చేయడం- పచ్చి నిజం బైటపడడం, అంతా ఏదోసినిమాలా వుందనిపించింది. ఛా... ఈ సినిమాకి రాకపోయినా బాగుండేదేమో!- ఇలాంటి నిజాన్ని దాచుకోడం కృష్ణమోహన్ కి అపకారం చేస్తున్నట్లా-ఉపకారం చేస్తున్నట్లా?
ఎవరి ఆలోచనలో వారుండగానే సినిమా పూర్తయింది. ముగ్గురూ నడవసాగారు. "అక్కా ఆ అమ్మాయికి ఎన్నాళ్ళ క్రితం కాన్పు అయింది?" సుగుణ ఒక్కక్షణం ఆలోచించి "ఎంతరా మహా అయితే రెండేళ్ళయిందేమో, అందుకే నా కాశ్చర్యంగా వుంది. అంత తొందరగా నన్నెలా మర్చిపోయారో....గుర్తు అన్నా రాలేదు-పైగా నేనెవరో తెలియనే తెలియదంటున్నారు-"నొచ్చుకుంది.
"గుర్తు రాకపోవడం కాదక్కా. నీవెవరో తెలియక కాదు...నీ వెవరో గుర్తు తెచ్చుకోడం వాళ్ళ కిష్టంలేదు. నీవు వారిని గుర్తించడం అంతకన్నా యిష్టంలేదు గుర్తిస్తే వాళ్ళమాటలు అన్నీ అబద్దాలని తెలుస్తాయని తెలియనట్లు నటించారు"కసిగా అన్నాడు ప్రభాకరం.