"అదేమిటిరా" ఆశ్చర్యంగా అంది సుగుణ. "నీకు వాళ్ళు తెలుసా ఏమిటి? ఎలా తెలుసురా? అబద్దాలేమిటి?" విస్తుపోతూ అంది సుగుణ.
"తెలుసు, బాగా తెలుసు" హేళనగా అన్నాడు.
"ప్రభాకరం గారూ" సరోజ హెచ్చరికగా వారించింది.
"సరోజగాఒరో విన్నారా - వాళ్ళెంతకు తెగించారో అర్ధం అయిందా. బిడ్డని కని తల్లి అయిన గీతని కన్యగా కృష్ణమోహన్ గారితో పెళ్ళికి సిద్దపరిచారంటే....ఇంకా మాట్లాడకుండా వూరుకోమంటారా ఆ బిడ్డని ఎక్కడో ఏ అనాధ శరణాలయంలో పారేసారో, లేదా పీకనొక్కిచంపేశారో..." అని అతని గొంతు వణికింది.
"ప్రభా ఏమిటిరా నీ వంటున్నది. ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదూ, అల్లుడు అమెరికాలో వున్నాడన్నారు. మంగళ సూత్రాలు వేసుకుంది కూడాను."
"మంగళసూత్రాలకి ఏ ముందక్కయ్యా. బజారులో దొరకనిది కాదుగదా?" హేళనగా అన్నాడు ప్రభాకరం. "అవి కొనడానికి డబ్బు లేనివాళ్ళూ కాదు..."
"నిజంగారా .... అమ్మో ఎంత మోసం. ఎంత ఘోరం. అందుకే కాబోలు పిల్లాడు పుడితే సంతోషించిన చిహ్నాలు కనపడలేదు. డాక్టరుగారు వుంచమన్నా మూడో రోజే తీసుకెళ్ళి పోయారు. నిక్షేపంలా వున్నా ఆ బాబు చచ్చి పోయాడంటే మేం ఆశ్చర్యపోయాం కనీసం బాబుకి వంట్లో బాగులేనపుడు డాక్టరుని పిలవనందుకు ఎంతో యిదయ్యాం. హఠాత్తుగా గుడ్లు తేలేశాడంటే నిజమే అనుకున్నాము. అసలు వాళ్ళ వరస ముందునించి అనుమానంగానే వుందిరా. ఈ సంగతి విన్నాక అంతా అర్ధం అయింది ఆ అమ్మాయి వాళ్ళూ నీకెలా తెలుసురా..."
"తెల్సులే ఇదిగో సరోజ వుంటున్న ఆ డాక్టరుగారికి యీ అమ్మాయికి వచ్చే నెలలో పెళ్ళి."
"నిజం! అంటే ముందు ఏదో కాలు జారిన ఫలితం అన్నమాట. గుట్టు చప్పుడు కాకుండా కాన్పుచేసి, ఆ పిల్లాడిని వదిలించుకొని పెండ్లి చేస్తున్నారన్నమాట. అసలు ముందంతా గర్భస్రావానికి ప్రయత్నించే వుంటారు. అది జరగక పోగానే ఏదో వూరువచ్చి ఆ కాలం గడిపారన్న మాట అందుకే ఇంట్లో సామాను, అంత ధనవంతులైనా పనివాలలుకన్పించేవారుగాదు." సుగుణ ఆశ్చర్యంగా చెప్పుకుపోతూంది. ప్రభాకరం గుండెలుమండిపోతున్నాయి. అన్నింటి కన్నా అలా ఆ పిల్లాడిని ఎక్కడ పారేశారో ఏం చేశారో నన్నది తల్చుకుంటే అతని గుండెలెవరో మెలిపెట్టినట్లు బాధపడసాగాడు.
"అందుకే వాళ్ళు అలా అలా గాభరాపడి పరిగెత్తారన్నమాట. పాపం ఆడపిల్ల కలవాళ్ళు ఏం చేస్తారు మరి" సుగుణ నిట్టూర్చి అంది ఆఖర్న.
"అవును ఎలాగో అలాగ కూతురు మచ్చ తుడిచేద్దామని తిరిగి కూతురు జీవితం పచ్చగా వుండాలని తల్లి దండ్రులు ఆరాటపడడంలో తప్పులేదు."
"సరోజగారూ మీరూ అలాగే అంటారా. గీత చేసింది తప్పులేదని సమర్ధిస్తున్నారా? అయితే నీతి, నియమాలకి విలువ ఏమీ లేదా?" ప్రభాకరం అన్నాడు ఆశ్చర్యంగా.
"ఆమె చేసింది తప్పు కాదని నేనడంలేదు ఆ స్థితిలో ఏ తల్లిదండ్రులున్నా అలానే ప్రవర్తిస్తారు అంటున్నాను ప్రభాకరంగారూ..."
"కాని-కాని-ఆ పసిబిడ్డని అలా ఎక్కడో పారేయడం, అది కూడా సమర్ధిస్తారా..." అతని గొంతు పలికింది.
"హు-అక్రమ సంతానాన్ని తన బిడ్డగా ఏ తల్లి చెప్పుకుని యీ సమాజంలో బ్రతకగలదు ప్రభాకరం గారూ. మీరు ఆకాశంలో వాస్తవాన్ని గమనించడంలేదు, గీతే కాదు మరో సీత అయినా చేసేది అంతే!" సరోజ మాటలని సుగుణ కూడా సమర్ధించింది "అవునురా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు లాంటిది - ఎవరో మోసంచేసిపోయిన పాపఫలాన్ని ఏ మొహం పెట్టుకు లోకానికి చూపగలదు - ఎంత చదివినా, ఎంత చూస్తున్నా ఈ ఆడపిల్లలు ఇలా మగాడి చేతుల్లో మోసపోవడం మామూలు కథే అవుతూంది....ఏ నీచుడో చేసిన మోసానికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది?"
"అక్కయ్యా..." ఆవేశంగా ఏదో చెప్పబోయాడు..కాని చెప్పలేకపోయాడు.
మాట్లాడుకుంటూండగానే యిల్లు చేరారు "భోజనం చేసి వెళ్దువుగాని సరోజా!" అభిమానంగా అంది సుగుణ "వద్దండీ - యిప్పటికే ఆలశ్యం అయింది. ఇంట్లో చెప్పి రాలేదు - వాళ్ళు నా కోసం గాభరా పడ్తారు. నే వెళ్తానండి యింక. ప్రభాకర్ గారూ రిక్షా చూసి పెట్టండి!" అంది సరోజ.
"వక్కర్తివే వెళ్ళద్దు - ప్రభాకరం సైకిల్ మీద దిగబెడ్తాడు-" అంది సుగుణ.
సరోజ ఫరవాలేదన్నా వినకుండా ప్రభాకరం సైకిల్ మీద, సరోజ రిక్షాతో నడిచి యింటికి చేర్చాడు. గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్ళింది సరోజ. చెప్పకుండా వెళ్ళినందుకు సరస్వతమ్మ, కృష్ణమోహన్ ఏం అనుకుంటున్నారోనని బిడియపడింది సరోజ. సరోజ రావడం కృష్ణ మోహన్ మేడమీదనించి చూస్తున్నాడన్న సంగతి ఆమెకి తెలియదు.
సావిట్లో కూర్చుని చదువుకుంటున్న సరస్వతమ్మ సరోజని చూసి "సరోజా ఏమిటమ్మా చెప్పకుండా చెయ్యకుండా ఎక్కడికి వెళ్ళావు - ఇంకా రాలేదు రాలేదని ఎంత 'గాభరా పడ్డానో - ఆఖరికి గీత వచ్చి నిన్ను సినిమాలో చూశాననే వరకు మా ఆరాటం తగ్గలేదు - ఫోనన్నా చెయ్యకపోయావా అమ్మా."
"గీత చెప్పారా" ఆశ్చర్యంగా అంది సరోజ.
"ఊ. ఎనిమిది గంటలవేళ వచ్చింది. తరువాత అబ్బాయి చెప్పాడు నీ వెవరో స్నేహితులతో వెళ్ళావని."
"ఫోను చేద్దామనుకున్నానండి - సినిమాలో ఆఫీసు రూం మూసేసి వుంది - చుట్టుపక్కల ఫోన్ లేదు. ఎంత రానన్నా బలవంతపెట్టి తీసికెళ్ళారు." బిడియంగా అంది సరోజ.