"ఏమిటాలోచిస్తున్నారు సరోజగారూ -" ఆరాటంగా అడిగాడు ప్రభాకర్. "ప్రభాకర్ గారూ - నన్ను క్షమించండి నానుంచి యిలాంటిది ఆశించకండి ప్రభాకరం గారూ. మనం స్నేహితులం. అంతకంటే యింకేం నన్నడగకండి యియ్యలేను" బరువుగా అంది సరోజ. ఆ మాటకి ప్రభాకరం మొహం పాలిపోయింది. కాసేపు సరోజ వంక చూసి నిట్టూర్చాడు.
"గీతతో నా సంబంధం గురించేనా మీకీ అనంగీకారం-" అడగలేక అడిగాడు.
"ఛా-అదిగాదు ప్రభాకరంగారూ-నిజానికి ఆ విషయంలో మీ నిజాయితీని మెచ్చుకున్నాను-ఆ కారణం ఎంతమాత్రం కాదు. నమ్మకండి."
"మరి?" ఆశ్చర్యంగా అడిగాడు. "పోనీ కారణం ఏమిటో అయినా చెప్పండి. నా మనసు సరిపెట్టుకోగలనేమో ఆ కారణం విని-" ప్రాధేయ పూర్వకంగా అడిగినట్లున్నాడు ప్రభాకరం. కారణం చెపితే ప్రభాకరం అపార్ధం చేసికొనే అవకాశం వుండదు. అర్ధంచేసికొన్నాక తనని బలవంత పెట్టడు! సరోజ అందుకే చెప్పదలచింది. బావ సంగతి, అతను చనిపోవడం, ఉద్యోగానికి రావడం, జ్వర పడి కృష్ణమోహన్ యింట్లో చేరడం, అతనికి బావ పోలికలు, సరస్వతమ్మ కూతురిలా తను వుండడం, వారు ఆదరించడం, గీత అయిష్టత అన్నీ టూకీగా చెప్పింది. ప్రభాకరం ఆశ్చర్యంగా విన్నాడు. "మీ బంధువులంటే నిజమనుకున్నాను. ఆశ్చర్యంగా వుంది కృష్ణమోహన్ మీ బావ గారిలా వుండడం" అన్నాడు.
"నిజంగా వారిద్దరి సహృదయతకి, వారు నాపట్ల చూపే ఔదార్యానికి ఎలా బదులు తీర్చుకోగలనో తెలియదు. వెళ్ళిపోతానన్నా వెళ్ళనీయడంలేదు. నావల్ల ఆయన ఎంతో అశాంతికి గురి అవుతున్నా నన్ను వదలడం లేదు. యిది ఏనాటి అనుబంధమో అర్ధంగావటంలేదు."
"అయితే గీతకి మీరు వుండడం ఇష్టంలేదన్నమాట. మిమ్మల్ని ఇన్ని రకాలుగా ఆమె అనుమానిస్తున్నా మీరు తలుచుకుంటే గీత పొగరుఅణచగలిగీ వూరుకుంటున్నారంటే మీ అతి మంచితనానికి, అమాయకత్వానికి చూసి జాలిపడాలో, అభినందించాలో అర్ధంగావడంలేదు సరోజ గారూ."
"దయతల్చి ఆశ్రయమిచ్చారని, వారి స్వవిషయాలలో కలుగచేసుకొనే హక్కు నాకేముంది ప్రభాకరంగారూ- గీత విషయం నేను చెప్పడం తిన్న యింటి వాసాలు లెక్క పెట్టడంగాదూ-ఆయనమీద నాకున్న గౌరవం చేతులారా పాడుచేసుకోవడం అవదూ- నేరాలు చెప్పానని అనుకుంటే యింక ఆ యింట్లో తలెత్తుకు ఎలా తిరగగలను?"
"హుఁ" ప్రభాకరం నిట్టూర్చాడు. సరోజవంక చూస్తూ "ఒక్కప్రశ్న అడుగుతాను ఏమనుకోకండి నిజం చెప్పండి. కృష్ణమోహన్ గారిలో మీ బావని చూస్తున్నారు కాదూ అందుకేకాడు నా కోరిక తిరస్కరించారు?"
అతనంత సూటిగా అడిగేసరికి సరోజ తడబడి పోయింది. సిగ్గుతో మొహం ఎర్రబడింది. తలదించుకుని గాభరాగా "అబ్బే...అలా ఎందుకనుకుంటున్నారు. ఆయన ఎక్కడ నేనెక్కడ?- అంత అత్యాశ నాకు లేదు-" ఆమె మొఖ కవళికలని గమనించుతూ నవ్వాడు ప్రభాకరం. "అర్ధం అయింది లెండి....అంతస్థులు, తాహతులు గురించి మీరు ఆలోచిస్తారుగాని మీ మనసు మీ మాట వింటుందా....వినదని నాకు తెలుసు-సరోజగారూ మీ బావ లాంటి మనిషి కనిపించి - ఆ మనిషి మరొకరి సొత్తు అని చూస్తూంటే మీకేం బాధగా లేదు..."
సరోజ ఆ ప్రసక్తిని సిగ్గుపడింది. "మీ రేమిటి మాట్లాడుతున్నారు నా కలాంటి ఉద్దేశాలు వున్నాయని మీ రెందు కనుకుంటున్నారు...?"
"మీ రబద్దం ఆడినా మీ మొహం అబద్దం ఆడదు లెండి....సర్లెండి కారణం ఏదయితేనేం నేను దురదృష్ట వంతుడిని. పోనీ యీ కారణంగా మన స్నేహం పాడుచేసుకోవద్దు....ఈ విషయం మరిచిపొండి" మనస్ఫూర్తిగా అన్నాడు. అతని సహృదయతకి సరోజ మనసు ఆర్ద్రమయింది. కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. ఎంత మంచి మనసు! ఇలాంటి వ్యక్తిగా గీత కాలదన్నుకుంది? డబ్బు మహిమ!
సరోజ లేనింటి పిల్ల. తనకీ, ఆమెకి పొత్తు కుదురుతుందని, యిన్నాళ్ళూ లేమి కారణంగా పెళ్ళి కాకుండా వుండిపోయిన ఆమె, ఈ అవకాశం తను యిచ్చినందుకు సంతోషంగా అంగీకరిస్తుందని, కృతజ్ఞతతో తనని మనసు లోనే మెచ్చుకుంటుందని ప్రభాకరం ఆశించాడు. ఆ నిబ్బరంతోనే అక్కగారికి తన మనసులో మాట చెప్పేడు. సరోజ జవాబు విని హతాశుడైనా ఆ నిరాశని పైకి కనపరచలేదు. సరోజ లాంటి సామాన్యురాలితో తన జీవితం హాయిగా గడచి పోతుందను కున్నాడు. ఆ కోరిక తీరే అవకాశం లేదని తెలియగానే కృంగిపోయింది అతని మనసు. కాని పైకి నవ్వుతూనే మాట్లాడాడు.
"సాయంత్రం ఆఫీసు కాగానే నేను తీసికెడతాను మా యింటికి. వెళ్ళిపోకండి" ప్రభాకరం లంచ్ బ్రేక్ టైము అవగానే తన సీటుకి వెళ్ళబోతూ అన్నాడు.
"రమ్మంటారా యింకా-" సరోజ కాస్త బిడియంగా అంది.
"దీనికి దానికి ఏం సంబంధం సరదాగా మాయింట్లో టీ తీసుకునేందుకు రావడానికేం...మా అక్క మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది....రేపు మళ్ళీ వెళ్ళిపోతుంది."
"సరే అయితే తప్పకుండా వస్తాను. ఆవిడే వూర్లో వుంటుంటారు?"
"మా అక్క నర్సుపని చేస్తూంది. ఓ ప్రైవేటు నర్సింగ్ హోములో విశాఖపట్నంలో - చిన్నప్పుడే నాకు అమ్మ, నాన్న పోయారు. అక్కయ్యే అష్టకష్టాలు పడి నన్ను పెంచి పెద్దచేసి చదివించింది. మా బావకూడా సహృదయుడు అవడంవల్ల ఏదో ఒక డిగ్రీవరకు చదువుకో గలిగాను. ఇంకా వారికి బరువు కాకుండా ఉద్యోగం చూసుకున్నాను. నన్నో యింటివాడిని చేస్తే తన బాధ్యత తీరిపోతుందని అక్క ఆరాటం-" ప్రభాకరం చెప్పు కొచ్చాడు.
* * *