నా బాధ చూడలేక నా గోడు వినలేక ఆ దేవుడు జాలి తలచినట్లు ఒకరోజు హఠాత్తుగా నాన్నగారు వచ్చారు. ఆ సమయానికి ఆయనలేరు. యింట్లో నేను బాత్ రూములో వున్నాను. బాత్ రూములోంచి వచ్చి బట్టలు కట్టుకుంటూ యధాలాపంగా గేటువైపు చూశాను. పనివాడిని నాన్న గారు ఏదో అడుగుతున్నారు. వాడేం చెప్పాడో హతాశులైనట్లు వెనుదిరిగారు.
ఆయన్ని చూడగానే "డాడీ" అని ఒక్క పెద్ద కేక పెట్టి వీధిలోకి పరిగెత్తాను.
నా కేకవిని ఆయన ఆశ్చర్యంగా వెనుదిరిగి నిర్ఘాంత పోయి పనివాడివంక చూశారు.
"డాడీ!" అంటూ ఒక్క ఉదుటున ఆయన గుండెల మీద వాలిపోయి తెలివి తప్పిపోయాను ఆయన చేతుల్లో.
మళ్ళీ తెలివి వచ్చే సరికి సోఫాలో వున్నాను.
నాన్నగారు ఆదుర్దాగా ఆందోళనగా "అమ్మా విజయా, ఏమిటి తల్లీ యిలా అయిపోయావు? ఏం జరిగిందమ్మా" అంటూ ఆరాటంగా అడుగుతున్నారు గుడ్ల నీరు కుక్కుకుంటూ.
వదిలితే మళ్ళీ కనపడరన్నట్టు చిన్నపిల్లలా ఆయన మెడ పెనవైచుకున్నాను.
"డాడీ! నన్నీ నరకంనుంచి తీసికెళ్ళు డాడీ! యిది నరకం డాడీ. యీయన రాక్షసుడు డాడీ" వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాను.
"ఏమిటమ్మా ఏం జరిగింది? నీవింట్లో వుండగానే లేవు, మీ యిద్దరు ఎక్కడికో వూరుకెళ్ళారని చెప్పాడు పనివాడు! నీ నుంచి మూడు నెలలై ఉత్తరాలు లేవు. ఎన్ని ఉత్తరాలు రాశాం తల్లీ. ఎంత కొత్తకాపురం అయినా కన్నతల్లి దండ్రుల్ని మరిచిపోతావా తల్లీ. ఎన్ని వుత్తరాలకీ జవాబులేక మామగారికి రాస్తే నీవు యిక్కడికి వచ్చావని రాసేరు. ఇంక ఉత్తరాలతో లాభంలేదని బయలుదేరి వచ్చాను. మీ అమ్మ నీ కోసం కలవరిస్తూంది. ఏమిటమ్మా. ఏం జరిగిందో చెప్పమ్మా" గద్గదికంగా అన్నారు.
"డాడీ. ఎన్ని ఉత్తరాలో రాశాను నన్నీ నరకంలోంచి తీసి కెళ్ళమని. ఉత్తరాలన్నీ నీ కందకుండా చేశారు. నాకు కాపలా పెట్టి నన్ను బందీని చేశారు. నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండను. నన్ను మన ఇంటికి తీసికెళ్ళు డాడీ" ఏడుస్తూనే ముందునించి జరిగిందంతా టూకీగా చెప్పాను.
నాన్నగారు నోటమాట రానట్టు స్థాణువైపోయారు. ఆ తరువాత కోపం, ఉద్రేకం పట్టలేకపోయారు.
"దౌర్భాగ్యుడు. బంగారులాంటి పిల్లనిస్తే ఇలా కాల్చుకు తిన్నాడా! వాడు మనిషా పశువా? పద నిన్ను ఇక్కడ ఉంచను" అంటూ ఆవేశపడిపోయారు.
ఆయన రాగానే చెడామడా తిట్టారు. పిల్లని తీసి కెడుతున్నాను నీ దిక్కున్న చోట చెప్పుకో. దౌర్భాగుడా, ఇంకెవరిమీదో కసి కోపం నా కూతురి మీద చూపి కాల్చుకుతింటావురా? పువ్వుల్లో పెట్టి పెంచి నీ కప్పగించానురా. దాని బతుకు ఇలా నాశనం చేస్తావా" అంటూ నిప్పులు కురిపించారు. నువ్వేమిటో నీ బతుకేమిటో నలుగురిలో పెట్టి మొహం ఈడుస్తానన్నారు.
ఆయన మొహం ఎర్రబడగా -నాకేం నష్టం లేదు, పోయేది మీ పరువే" అన్నారు బింకంగా.
"హు - నా కూతురికంతే నాకు పరువు ప్రతిష్ట హెచ్చు కాదురా, నిన్ను కోర్టుకీడ్పిస్తాను. నా కూతురిని ఇంక పంపనే పంపను. పెళ్ళే కాలేదనుకుంటాం" ఆవేశంతో నాన్నగారి వళ్ళంతా చెమట పట్టింది.
"పదమ్మా విజయా. నిన్నింక ఒక్కక్షణం ఇక్కడ ఉండ నీయను. బట్టలు సర్దుకో" అన్నారు.
"విజయ నా భార్య. నా అనుమతి లేనిదే ఆమె నిక్కడనించి తీసికెళ్ళడానికి లేదు. తీసికెడితే కేసు పెడతాను. పోలీసులని పిలుస్తాను" అన్నారు బింకంగా.
"పిలవరా పిలు. ఏ పోలీసులు నన్నాపలేరు. కట్టుకున్న భార్యని నానా హింసలు పెడుతున్నావని నేనూ చెప్పగలనురా, నా ఆఖరి పైసా ఖర్చయ్యే వరకు కోర్టులో న్యాయం కోసం పోరాడుతాను. అంతే గాని నీ చేతిలో దాన్ని ఇంకా వదలను.
"సరే - నీ కూతురి బిడ్డకి తండ్రి అక్కరలేదనుకుంటే అలాగే తీసికెళ్ళండి. నా బిడ్డని నాకు అప్పగించండి కాన్పు అయిన వెంటనే" ఆఖరి అస్త్రం వదిలారు.
ఇది నాన్నగారికి తెలియని విషయం, ఆయన ఒక్క క్షణం తికమకపడి పోయారు. ఆ వెంటనే నిగ్రహించుకున్నారు.
"హు, ఈ వంకతో జయిద్దా మనుకున్నావా. నీ బిడ్డని నీ మొహాన పారేస్తాను. నా కూతురు పిచ్చిదయినా సరే. నీ బిడ్డని నీ కప్పగిస్తాను. ఇంక నోరెత్తకు" కటువుగా అన్నారు.
అన్నట్లుగానే ఆ క్షణాన నన్ను తీసికెళ్ళి పోయారు నాన్నగారు. నా కథ తెలుసుకొని నా శవాకారం చూసి అమ్మ ఒకటే ఏడ్పు. అన్నయ్యలు కంటతడి పెట్టారు. అందరూ కలిసి ఏమయినా సరే నేను మళ్ళీ ఆయనతో కాపురం చెయ్యడం కల్ల అని తేల్చారు.
మా నాన్న మామగారి దగ్గిరకు వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పారు.
వాళ్ళు విచారించి "ఆ దౌర్భాగ్యుడు మా కడుపున చెడపుట్టాడు. వాడి కర్మ అలా వుంది, మీరేం చేస్తారు. ఆ రాక్షసుడికి మీ పిల్లని అప్పగించమని మేము మాత్రం ఎలా చెప్తాం?" అంటూ బాధ పడ్డారు.
అక్కడితో నా వివాహ అధ్యాయం ముగిసింది" శారదా నీ కన్న తల్లిదండ్రులు సంఘ భయంతో చెయ్యలేని పని నా తల్లిదండ్రులు చేశారు. నీ తల్లితండ్రులకి లేని అర్ధ బలం మా నాన్నగార్కి ఉంది. నన్ను ఆదుకోడానికి లోకాన్ని లెక్కచెయ్యలేదు వారు. కన్న కూతురికంటే పరువు ప్రతిష్టలు ఎక్కువ కాదని తృణప్రాయంగా వదులుకున్నారు. నా కారణంగా నా తోబుట్టువుల భవిష్యత్తు పాడవడానికి ఆడ పిల్లలు ఇంక లేరు కనక, నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. ఇరుగు పొరుగు ఎన్నాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకోనిమ్మనుకున్నాం. అడిగిన వాళ్ళకి "ఒక ఆడపిల్ల సంసారం వదులుకుని వూరికే రాదమ్మా - ఆ కాపురం ఎంతో నరకం అయితేతప్ప ఏ ఆడదీ ఇల్లు వదలదు" అని చెప్పింది అడిగిన వారికి.