Previous Page Next Page 
జన్మభూమి పేజి 34

    ఇది తనకి ధైర్యాన్ని, ఆత్మస్థయిర్యాన్నిచ్చింది. ఎమర్జన్సీలో ఇలాంటికేసులు చేయగలనన్న నమ్మకాన్ని పెంచింది. గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు మూడు చోట్ల మూసుకున్నాయి. కాలికి వున్న నరం కత్తిరించి పాడయినచోట కత్తిచింది కొత్తవి అతికించి రక్తప్రసారం జరిగేట్టు చూడాలి.
    ఇదంతా పెద్ద ఆస్పత్రులలో జరిగే ఆపరేషను. ముందు యాంజియోగ్రాము ద్వారా ఎక్కడ రక్తసరఫరా ఆగిపోయిందో గుర్తించి అక్కడ స్థలం గుర్తించి ఆ ముక్క కత్తిరించి కాలి నరంలోంచి ముక్క కోసి అతికించాలి. ఆపరేషన్ అప్పుడు హార్టుకి మిషను ద్వారా కనక్షన్ ఇచ్చి గుండె నడిపిస్తూ జరపాలి ఆపరేషన్.
    ప్రస్తుతానికి ఆ నాళాలు బెలూన్ ద్వారా శుభ్రపరిచి రక్తప్రసరణ జరిగేట్టు చేశారు. రోగి కాస్త కోలుకున్నాక ఏ విజయవాడో, హైదరాబాదో తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించుకోమని చెప్పాలి. ఆపరేషన్ పూర్తయి బయటికి వచ్చి రోగి పరిస్థితి చెప్పగానే అందరూ ఆయన్ని దేముడన్నట్టు చూశారు. అయన భార్య అయితే కాళ్ళు పట్టుకున్నంతపని చేసింది. డాక్టర్ శ్యామల ఆపరేషన్ చేస్తున్నంతసేపు ఆయన నైపుణ్యాన్ని అబ్బురమైన చిత్రం చూస్తున్నట్టు చూసింది. మనసులోనే జోహార్లు అర్పించింది. రోగిని ఆరోజు ఆపరేషన్ రూములోనే శ్యామల పర్యవేక్షణలో ఉంచి యింటికి వెళ్ళి స్నానం, భోజనం అది చేసి మళ్ళీ వస్తానని తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు కేశవరావు.
    "ఏమిటి! ఏమయింది కేసు. ఆపరేషన్ చేస్తున్నారు అన్నారు బతికాడా. ఒక్కరే ఎలా చేశారు? ఎందుకంత రిస్క్ తీసుకున్నారు..." ఆరాటంగా అడిగింది రాజేశ్వరి.
    "రిస్క్ తీసుకోవాల్సిన కేసు కాబట్టి రిస్క్ తీసుకున్నాను. లేకపోతే బతికేవాడు కాదు. ధైర్యం చేశాను కనుక బతికాడు."
    "ఆపరేషన్ కి సరిపడా ఫెసిలిటీస్, మనుష్యులు లేకుండా యిలా రిస్క్ తీసుకుంటే ఏదయినా జరిగితే మీమీదకి రాదూ... బాబూ ఇలాంటి సాహసాలు చెయ్యకండి."
    "బాగుంది! డాక్టరునై వుండి, అందులో ఆ సబ్జెక్టులో ఎక్స్ పర్ట్ నై చూస్తూ ఎలా వూరుకోమంటావు. ఇక డాక్టరు సర్జన్ అన్న పదాలకి అర్థం ఏముంటుంది. వాళ్ళకి ముందే చెప్పి మొదలుపెట్టాను. ఎనీహౌ యిలాంటిచోట ఈ ఆపరేషన్ చెయ్యడంలో థ్రిల్ ఫీలవుతాను. అమెరికాలో అన్ని ఫెసిలిటీస్ మధ్య, మిషనులతోపాటు మిషనుల్లా అందరూ టకటకా ఎవరి పనులు వారు చేసేచోట ఆపరేషన్ ఏం కష్టం. 'ఏ టూ జడ్' యిక్కడ అన్నీ నేనే అయ్యి చేయడం ఇదొక కొత్త ఎక్స్ పీరియన్స్ నాకు."
    "ఏదో అదృష్టం మనిషి బతికాడు. లేకపోతే మీకు చెడ్డ పేరు వచ్చేది. ఇంతకీ ఎవరు వాళ్ళు!"  
    "పక్కవూరిలో మోతుబరి-చేపల చెరువులు, పొలాలు వున్నాయట. డబ్బున్నవాళ్ళు"
    "అయితే డబ్బు తీసుకోండి ఆపరేషన్ కి. ఆస్పత్రి ఖర్చులకి పనికివస్తుంది. ఇదే సిటీలో అయితే ఏ యాభయ్ వేలో తీసుకునేవారుగా."
    "చూద్దాం... ఏమంటారో...ఇస్తామంటే పెట్టెలో వేయమంటాను."
    "ఇస్తామంటే కాదు! డొనేషన్ కావాలి అని అడగండి. మీరడగకపోతే శ్యామలనో, విమలచేతో అడిగించండి. ఉపకారానికి కూడా హద్దుండాలి. బీదవారి దగ్గిర ఎలాగో తీసుకోం. వున్నవాళ్ళ దగ్గిర కాస్తన్నా తీసుకోకపోతే ఎన్నాళ్ళు పెట్టుబడి పెడతారు. మందులు, ఇంజక్షన్ల ఖర్చన్నా రావాలా" రాజేశ్వరి కాస్త ఆవేశంగా అంది.
    "ఓకే...ఓకే బాబా! నిన్ను తీసుకెళ్ళి అక్కడ టేబుల్, కుర్చీ వేసి కూర్చోపెట్టి ఎడ్మినిస్టేటివ ఆఫీసర్ అని పేరుపెడ్తాను. డబ్బు వసూళ్ళు నీవు చూద్దువుగాని" హాస్యంగా అని 'పద టిఫెన్ కూడా తినలేదు. ఆకలి దంచేస్తుంది. స్నానం చేసి వస్తున్నా వడ్డించు...'
                                                          *    *    *
    ఆ ఆపరేషన్ తో కేశవరావుగారి పేరు చుట్టుపక్కల గ్రామాలన్నీ పాకిపోయాయి. అంతేకాక ఆ తర్వాత వారంరోజులకి పురుడుకాక ఆఖరి క్షణంలో తీసుకొచ్చిన గర్భిణీకి సిజేరియన్ చేసి తల్లి బిడ్డని క్షేమంగా బతికించిన సంగతి తెలిసి ఆయనకీ పేషంట్లు పెద్ద సంఖ్యలో రావడం మొదలుపెట్టారు. సిజేరియన్ శ్యామల చేస్తుంటే ఆయన అసిస్ట్ చేశారు.
    "ఏమిటో యిది గమ్మత్తుగా అన్పిస్తుంది నాకు. అమెరికాలో ఉండిపోతే యిలాంటి సంఘటన ఊహించను కూడా ఊహించలేకపోయేవాడిని. గైనిక్ ఆపరేషన్ కి హార్ట్ సర్జన్ అసిస్ట్ చేయడం...వింటే మా వాళ్ళంతా ఏమంటారో...." ఆపరేషన్ చేస్తున్న శ్యామలతో అన్నారు.
    "నిజం సార్ - మీలాంటి గొప్ప సర్జన్ ప్రక్కన నిలబడి నాకు అసిస్ట్ చేయడం నేనూ ఊహించలేని, కలలో కూడా అనుకోని సంఘటన... ఐ యామ్ రియాక్ట్ గ్రేట్ ఫుల్ టూ యూ సర్... నాలాంటి ఓ అనామకురాలికి యింత గౌరవం దక్కింది" అంది మనస్పూర్తిగా శ్యామల.
    "ఏయ్... డోన్ట్ బి ఫూలిష్... నేను సరదాగా అన్నాను. యిద్దరం డాక్టర్లం- పేషంట్లని బతికించే ప్రయత్నం చేయడం మన కర్తవ్యం. ఇలాంటి వూరిలో సకల సదుపాయాలుంటాయని మనం ఎక్స్ పెక్ట్ చెయ్యలేము గదా. వున్నంతలో మనం మన ప్రతిభ చూపాలి. అదే మనకు తృప్తినిస్తుంది" అన్నారు.
    హార్ట్ ఆపరేషన్ అయిన పేషంట్ డొనేషన్ అంటూ పదివేలు యిచ్చారు! సిజేరియన్ ఆపరేషన్ అయిన అమ్మాయి తాలూకు అట్టే వున్నవారు కాదు. "బాబూ మీ రుణం మేము ఏం యిచ్చి తీర్చుకోగలం..." అంటూ బాధపడ్డారు.
    "ఏమిచ్చినా ఆ పెట్టె ఊ, ఆ అనదు. ఏదయినా సంతోషంగా పొట్టలో దాచుకుంటుంది. మీరు నాకు రుణపడినట్లు బాధపడిపోతుంటే తృణమో పణమో ఏదో వేసి రుణ విముక్తులు అవ్వండి" అన్నారు కేశవరావు నవ్వుతూ. వాళ్ళు ఒక నూరు రూపాయల నోటు తీసి నమస్కారం చేశారు.
    పేషెంట్లు ఎక్కువైనకొద్ది ఆయన యింకో గంట ఎక్కువ కూర్చోవలసి వచ్చింది. నిజంగా డాక్టరు శ్యామల ఎంత శాంతంగా, ఓర్పుగా అన్నీ తనే అయి ఆస్పత్రి అంతా చూసుకోవడం ఆయన తన అదృష్టం అనుకున్నారు. విమల, శ్యామల ఆస్పత్రిలోనే వుండిపోవడం ఆయనకి పెద్ద భారం దిగినట్లయింది.
    "అవునూ! మీరేమిటి సర్వాంతర్యామిలా ప్రతి సబ్జక్టులోనూ ఎక్స్ పర్ట్ అయిపోయారు. అటు స్కానింగ్, ఇటు ఎక్స్ రేలు అన్నీ ఆపరేట్ చేసేస్తున్నారు. ఫిజిషియన్ లా మందులిచ్చేస్తున్నారు. ఏమిటి ఎలా మేనేజ్ చేస్తున్నారు." ఓ రోజు ఆశ్చర్యంగా అడిగింది రాజేశ్వరి. కేశవరావు గర్వంగా తలెగరేసి మరేంటనుకున్నావు నేనంటే 'ఆల్ ఇన్ వన్' అయిపోయాను యిక్కడికి వచ్చి" తమాషాగా అంటూ నవ్వారు.
    "అదికాదు. అవన్నీ ఆపరేట్ చేయడం డైగ్నస్ చేయడం ఎలా?"
    "ఏయ్, నన్ను అంత తక్కువ అంచనా వేయకు! మొన్న అమెరికాలో ఆఖర్న రెండు నెలలు నేనేం చేశాననుకున్నావు. స్కానింగు, ఎక్సరే, సోనియాగ్రఫీ...ఇవన్నీ పరికరాలు కొంటున్నప్పుడే గుడ్డిగా కొనేశాననుకొన్నావా. అవన్నీ ఎలా ఆపరేట్ చెయ్యాలో క్షుణ్ణంగా నేర్చుకున్నాను.

 Previous Page Next Page